మొదటి శ్లోకం | వెనుకటి శ్లోకం | తదుపరి శ్లోకం |
1
శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం
న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి
అతస్త్వామారాధ్యాం హరిహరవిరించాదిభిరపి
ప్రణంతుం స్తోతుం వా కథమకృతపుణ్యః ప్రభవతి
శ్రీశంకరభగవత్పాదులు అనుగ్రహించిన దివ్యస్తోత్రాల్లో సౌందర్యలహరి ఒకటి. దీనిలో అమ్మవారిని స్తుతిస్తూ నూఱు శ్లోకా లున్నాయి.
ఒక్కొక్కసారి ఒక్కొక్క శ్లోకాన్ని గురించి చెప్పుకుందాం.
ఏ పని చేయాలన్నా దానికి తగిన శక్తి మనకు కావాలి. లేకపోతే మనం అసలు కదలటం కూడా చేయలేం. ఎందుకంటే కొంచెం కదలాలన్నా దానికీ ఎంతో కొంత శక్తి వినియోగించక తప్పదు కదా. అందుకే శక్తిహీనుడు చొప్పకట్టలా పడి ఉంటాడు. అసలు అతడిలో చైతన్యమే ఉండదు.
అసలు లోకంలో ఏ క్రియాకలాపం జరగాలన్నా దానికి పరమేశ్వరుడి అనుగ్రహం కావలసినదే. అందుకనే ఒక సామెత పుట్టింది తెలుగులో. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదూ అని.
ఈ చీమ అనేది ఎంతటి జీవి చెప్పండి? అది కుట్టటానికి కూడా పాపం అది ఎంతో కొంత శక్తిని వినియోగిస్తుందన్నది పక్కన పెడితే, అలా ఓ చీమ కుట్టటం వల్ల మనకి కలిగే కష్టం ఏమంత చెప్పుకోదగ్గది కానే కాదన్నది విషయం. ఐతే అంత చిన్న పనికీ ఆ చీమకు శివుడి ఆజ్ఞ ఐతే కాని కార్యం లేదు.
ఇక్కడ శ్రీశంకరులు చమత్కారంగా ఈ శ్లోకంలో ఎలా ప్రార్త్ఝిస్తున్నారో అమ్మని చూడండి.
అమ్మా, ఈ శివుడున్నాడే, ఆయన నీతో కూడి శక్తియుక్తుడు అనిపించుకుంటే గాని తనంతట తానుగా ఏమీ చేయలేడమ్మా .మరి శివుడికి కూడా పిపీలికాది బ్రహ్మపర్యంతం అందరికీ ఆజ్ఞలు జారీ చేయాలంటే కూడా తగినశక్తి కావాలిగా? నీవు ప్రక్కన ఉండి సాయపడబట్టి ఆయన ప్రపంచాల్ని సృష్టిస్తున్నాడు. అంతే. అంతే. లేకపోతే కొంచెంగా నైనా ఏ విషయంలోనైనా స్వయంగా స్పందించటానికీ ఆయనకు కుదరదు సుమా.
అమ్మా అటువంటి నిన్ను త్రిమూర్తులూ తదితర దేవతాగణాలూ నిత్యం ఆరాధిస్తుంటే వారి చేత నీవు లోకాలన్నింటినీ నిర్వహింపజేస్తున్నావు. అంటే వారికి నీ సాన్నిద్యం ఉండబట్టి వారికి నిన్ను స్తుతించేందుకూ పూజించేందుకూ సామర్థ్యం కలిగింది.
అమ్మా, నా సంగతి ఏమని చెప్పనూ? నేనేమీ పుణ్యం చేసుకున్న వాడిని కాదే! నీకు మ్రొక్కటానికీ నిన్ను స్తుతించటానికీ నాకు సమర్థత ఎక్కడిదీ?
ఇలా ప్రారంభం చేస్తూ అమ్మా నేను తగినంత సమర్థత లేకపోయినా సాహసించి నిన్ను స్తుతిస్తున్నానూ అనుగ్రహించూ అని చమత్కారంగా ప్రార్థిస్తున్నారు.
శ్రీశంకరులు ఇలా అమ్మవారిని గురించి స్తోత్రం శివశబ్దంతో ప్రారంభం చేస్తున్నారు.
ఈ శ్లోకానికి పారాయణం పన్నెండు రోజులు, రోజూ వేయిసార్లు చొప్పున. నైవేద్యం త్రిమధురం అంటే బెల్లం, కొబ్బరి, అరటిపళ్ళ కలిపిన మిశ్రమం. ఫలితం కార్యసిధ్ధి, సకలశ్రేయోవృధ్ధి. |
ఈ రోజు నిజంగానే బ్లాగులో ఉన్నందుకు ఆనందిస్తున్నాను. గొప్ప కార్యం తలపెట్టేరు. దిగ్విజయమస్తు. ఆనందం మాటలలో చెప్పలేనిది. అమ్మగురించి నవరాత్రులలో...అబ్బో ఆనందః ఆనందః ఆనందః...
రిప్లయితొలగించండిఆయన చమత్కారం అబ్బో మాలాంటివారేం తూచగలరు .... అమ్మవారి వైభవం గురించి సౌందర్యలహరి మొదలు పెడుతూనే "శివ" అన్నారు, ముందు ఆయన పేరు తలవగానే "మా ఆయన్నే కదా ముందు తలచారు " అని అమ్మ పొంగిపోయి అనుగ్రహించేస్తుందని శివనామంతో మొదలెట్టి చమత్కరించారు... మళ్ళీ ఒక మంచి విషయంపై వ్యాస పరంపర మొదలెట్టినందుకు ధన్యవాదాలండీ...
రిప్లయితొలగించండినమస్కారం
రిప్లయితొలగించండిమీ మీద నాకు కోపం వస్తోంది గురువు గారు. ఇంకా వదిలేసినవి పూర్తి చేయలేదు. (శివ ధనుర్భంగం అయిపోయిందా? పూర్తిగా చూసినట్టు గుర్తు లేదు). మరి పూతన ఖంఢిక ఏమైందో? చూసి చూసి మెయిల్ పంపిద్దాం అనుకుంటున్నాను.
అశ్వయుజ మాసం వస్తూనే ఇది మొదలుపెట్టడం బావుంది కానీ పాతవి అసంపూర్తిగా వదలడం ఏమీ బాగా లేదు. పూర్తి చేయరూ?
డీజీగారూ, మీ కోపం నాకు సంతోషం కలిగించింది. నాబోటి వాడిని కొంచెం ముల్లుకఱ్ఱతో అలా అలా తడుతూ ఉండాలండోయ్. తప్పదు. శివధనుర్భంగం ఇంకాపూర్తికాలేదు. అది ఈ వారాంతంలో పూర్తవుతుందని ఆశిస్తున్నాను. ఏమిటో ఇంకా అసంపూర్తి వ్యవహారాలు చాలానే ఉన్నాయి. కొంచెం వేగం పెంచాలి. కాని వేతనజీవులం కావటంతో
తొలగించండిచ. సమయమమూల్యమై దొఱుక జాలని వస్తువు రీతి నుండగం
దుములముగా ననారతము ద్రోసుకవచ్చెడి కార్యభారమున్
తమరికి గూడ వేద్యమగు దాని నటుంచగ రోజురోజుకుం
గ్రమముగ బుధ్ధివేగమును రూపరుచున్నది యేమిజేయుదున్
ఐనా, యథాశక్తి ప్రయత్నిస్తాను.
🙏🙏🙏
తొలగించండి🙏🙏🙏
తొలగించండిపద విభజన ప్రతి పదార్థాలు ఇవ్వండి🙏🙏🙏
రిప్లయితొలగించండిపద విభజన ప్రతి పదార్థాలు ఇవ్వండి🙏🙏🙏
రిప్లయితొలగించండి