12, అక్టోబర్ 2023, గురువారం
రాబోయే రోజుల్లో
8, అక్టోబర్ 2022, శనివారం
భవిష్యదర్శిని. ప్రపంచ రాష్ట్ర సమితి
తేదీ 2029 మార్చి 26.
ఈరోజున ప్రపంచం అంతా గొప్ప హడావుడిగా ఉంది.
ఈరోజు ఉదయమే భారత రాష్ట్ర సమితి పార్టీ ఒక గొప్ప తీర్మానం చేసింది.
భారత ప్రధాని మరియు భారాస సిధ్ధాంత కర్త కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆలోచన ప్రకారం భారాస పార్టీని అంతర్జాతీయ రాజకీయ పార్టీగా మార్చటం జరిగింది.
ఈమేరకు భారాస సర్వసభ్యసమావేశంలో నిర్ణయించారు.
హైదరాబాద్ నగరంలోని ప్రధానమంత్రి నివాసం ప్రగతి భవన్లో బ్లహ్మాండమైన భారాస సర్వసభ్యసమావేశం జరిగింది.
సభాద్యక్షులు చంద్రశేఖర రావు గారు అద్భుతమైన ప్రారంభోపన్యాసం చేసారు. ప్రపంచపరిస్థితులు ఏమీ బాగోలేవు. అస్తమానం ఏవేవో దేశాలు గిల్లికజ్జాలతో ప్రపంచశాంతిని భంగపరుస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసారు.
ఇలా ఐతే ప్రపంచం త్వరలోనే నాశనం అవుతుంది. అమెరికా చైనా రష్యా లాంటి పెద్దదేశాలూ బుధ్ధిలేకుండా ప్రవర్తించటం ఏమిటని ఆ దేశాలను చంద్రశేఖర రావు గారు నిలదీశారు.
యుధ్ధాలను నివారించవలసిన ఐక్యరాజ్య సమితి ఆచరణలో సంపూర్ణంగా విఫలం ఐనదని అది ఇంక కాలంచేసిందని నేనే ప్రకటిస్తున్నాను అన్నారు
బాగా ఆలోచించి తాను ఒక మంచి నిర్ణయం తీసుకున్నాననీ దాని ప్రకారం భారాసను అంతర్జాతీయ పార్టీగా మార్చటం యావత్తు ప్రపంచానికీ అతిముఖ్యమైన అవసరం ఆనీ అన్నారు.
భారాస ఏర్పాటు చేసినప్పుడు కూడా ఎందరో ఏవేవే అన్నారనీ తుదకు భారాస ద్వారానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణా మధ్యన, అలాగే చాలా రాష్ట్రాల మధ్య వివాదాలూ సానుకూలంగా పరిష్కరించబడ్డాయనీ అదేవిధంగా ప్రరాస ద్వారా దేశాల మధ్య వివాదాలు కూడా బ్రహ్మాండంగా పరిష్కారం చేసెయ్యవచ్చును అనీ ఆసత్తా తమ సొత్తు ఆనీ అన్నారు.
క్రమంగా అన్ని ముఖ్యదేశాలలోనూ మన పార్టీని అధికారంలో నిలబెట్టటం ద్వారా యుధ్ధాలను నివారించి ప్రపంచంలో శాంతినీ సుస్థిరతనూ నెలకొల్పవచ్చు అనీ చంద్రశేఖర రావు గారు వక్కాణించారు.
అందుకే ఇక ఆలస్యం చేయకుండా వెంటనే భారాస పార్టీని ప్రపంచ రాజ్య సమితిగా మార్చుతూ సభవారు తీర్మానం చేయాలని ఆదేశపూర్వకంగా సూచించారు.
తెలంగాణా రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల తారక రామారావు గారు తీర్మానాన్ని ప్రతిపాదించారు.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కవిత గారు ఆ తీర్మానాన్ని బలపరిచారు.
మహారాష్ట్ర గవర్నర్ సంతోష్ రావు గారూ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి హరీష్ రావు గారూ కూడా ఆ తీర్మానాన్ని బలపరచారు.
అనంతరం సభాద్యక్షులు ప్రధానమంత్రి శ్రీ కల్వకుర్తి చంద్రశేఖర రావు గారు భారాస పార్టీని అంతర్జాతీయ రాజకీయ పార్టీగా ప్రకటిస్తూ తీర్మానాన్ని సభవారు ఏకగ్రీవంగా ఆమోదించారని ప్రకటించారు. దాని కొత్త పేరు ప్రపంచ రాజ్య సమితి అని వెల్లడించారు.
త్వరలోనే జరుగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తమపార్టీ అభ్యర్థి నిలబడబోతున్నాడని ప్రకటించారు. అమెరికా దేశంలో భారతీయులు ఎంతో సంఖ్యాబలం కలిగి ఉన్నారనీ, వారిలో తెలుగు వారు అందునా మన తెలంగాణా వారు అత్యధికులు అనీ అన్నారు. వారంతా కలిసికట్టుగా ప్రచారం చేస్తే మన పార్టీ వాడు అమెరికా అద్యక్షుడు కావటం తథ్యం. దానిని ఆపే మొనగాడు పుట్టలేదు - పుట్టబోడు అనీ కరతాళధ్వానాల మధ్యన సగర్వంగా అన్నారు.
ఈవార్త వెలువడిన వెంటనే అమెరికాలో భారతీయుల సంబురాలు అంబరాన్నంటాయి. ఆస్ట్రేలియా నుండీ మరికొన్ని దేశాల నుండీ కూడా తమ దేశాల్లోనూ ప్రరాస తప్పకుండా అధికారం చేపట్టాలని కోరుతూ తీర్మానాలు వెల్లువెత్తుతున్నాయి.
తమ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చును. మాది ఫ్రీ కంట్రీ అని అమెరికా అద్యక్షులు వ్యాఖ్యానించారు.
రష్యా ఈవిషయంలో స్పందించటానికి ఆసక్తి చూపలేదు. చైనా మాత్రం ఇదంతా ఒక తమాషా అని కొట్టిపారేసింది. ఆస్ట్రేలియా స్పందన ఇంకా తెలియరాలేదు. వారూ స్వాగతిస్తున్నారనే వినబడుతోంది.
ఐక్యరాజ్య సమితి కాలంచేసింది అనటాన్ని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తప్పు పట్టారు.
ఐతే ఐక్యరాజ్య రాజ్యసమితిలో భారత ప్రతినిధి భారతప్రధాని వ్యాఖ్యలను సమర్ధించారు. ప్రపంచానికి భారతదేశం నాయకత్వం వహించే సమయం ఆసన్నం అయినదనీ చంద్రశేఖర రావు తప్ప నేడు ప్రపంచశాంతి సుస్థిరతలను నెలకొల్పగల మహానాయకుడు ఎవరూ ముల్లోకాల్లోనూ లేరని భారతప్రతినిధి ఉద్ఘాటించారు.
ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా అంతా ఈ సమాచారాన్ని గురించిన చర్చలతో హోరెత్తిపోతోంది.
ప్రపంచాన్ని ఏలబోయేది మనమే అంటూ హైదరాబాద్ నగరంలో వేలాది పెద్దపెద్ద కటౌట్లు వెలిసాయి. ప్రధానరహదారులూ గల్లీలు అని తేడా లేకుండా విశేషంగా ర్యాలీలు సందడి చేస్తున్నాయి.
దునియాకీ నేతా కేసీఆర్ అన్న నినాదంతో తెలంగాణాయే కాదు దేశం అంతా దద్దరిల్లుతోంది. ఈనినాదం ప్రపంచాన్ని చుట్టేస్తోందని వార్తలు జోరందుకున్నాయి.
9, సెప్టెంబర్ 2022, శుక్రవారం
కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఐతే?
- భారతీయ జనతా పార్టీ తాను కేంద్రంలో అధికారంలో ఉండటమే కాక ఇతరరాష్ట్రాలలో కూడా అధికారాన్ని హస్తగతం చేసుకుందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అవసరం అనుకుంటే అడ్డదారుల్లో కూడా ఇతరపార్టీల ప్రభుత్వాలను కూల్చి మరీ అధికారాన్ని లాక్కుంటోంది. అది నైతికం కాదు.
- ఏవో రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఏమి తంటాలు పడితే నేమీ? అది తెలంగాణాలోకూడా అధికారంలోనికి రావాలని ఎత్తులు వేస్తోంది. అదెలా సహించటం? తెలంగాణాపై తమ తెలంగాణా రాష్ట్ర సమితి పార్టీకి తప్ప మరెవరికీ హక్కు లేదే? ఉండరాదే? ఉండనివ్వమే! ఎలా ఊరుకోవటం? దీనికి విరుగుడుగా భారతీయ జనతా పార్టీని జాతీయ స్థాయిలో దెబ్బకొట్టటమే మందు కదా.
- దేశంలో కాంగ్రెసు పార్టీ కూడా ఒకప్పటి పెద్దపార్టీ కాని నేడు అది దీనావస్థలో ఉంది. అది కోల్పోతున్న ఓట్లబ్యాంకులను భారతీయ జనతా పార్టీ కొల్లగొడుతోంది. ఆ పని తామే చేయవచ్చు కదా తమ జాతీయ పార్టీతో? భారతీయ జనతా పార్టీ వారిని ఇంకా బలపడ నీయటం ప్రమాదం కదా?
- బంగారు తెలంగాణాని సాధించటం అనేకర్తవ్యం పూర్తి అయింది. దాన్ని పరిపాలించే బాధ్యతను తమ తెలంగాణా రాష్ట్రసమితి స్వీకరించి దిగ్విజయంగా నడిపిస్తోంది. ఆ పంథాలో కొనసాగటానికి తన వారసులు ఉంటే చాలు. తనకు జాతీయ రాజకీయాల్లో కూడా విజయపతాకం ఎగురవేసే అవకాశం ఉన్నప్పుడు చూస్తూ కూర్చోవటం ఎందుకు?
- కేంద్రం తెలంగాణానూ ఆంధ్రానూ సమానంగానే చూస్తున్నాం అంటోంది. అదెలా ఒప్పుకోవటం. తెలంగాణానే కదా ఎవరైనా పెద్దగా చూడవలసింది.
- కేంద్రం నుండి తాము అడుగుతున్నవి అరకొర గానే అందుతున్నాయి. అదే, కేంద్రంలోనూ తమదే అధికారం ఐతే తమకు కావలసిన వాటిని హాయిగా ఏ ఇబ్బందులూ లేకుండానే పొందవచ్చును కదా. ఎన్నో కొత్త ప్రాజెక్టులని ఏఆడ్దంకీ లేకుండా కట్టుకోవచ్చును. ఇతర రాష్ట్రాల - ముఖ్యంగా ఆంద్రా వారి - ప్రాజెక్టులను సులభంగా అడ్డుకోవచ్చును.
- ఆంద్రతో వైరం ఉందంటే ఉంది. లేదంటే లేదు. అక్కడ తమ ఆశీర్వాదంతో ఏర్పడ్డ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తోంది. కాని ఎంతైనా రాష్ట్రప్రయోజనాలు అంటూ తరచూ అడ్డుపడుతూనే ఉంది. ముందుముందు వచ్చే ప్రభుత్వాలు అంధ్రాకు కాని మరింతగా సహాయపడవచ్చును. అప్పుడు తెలంగాణాలో తమ పట్ల నిరసనలు రావచ్చును కదా. అందుచేత ఆంద్రావారికి చెక్ పెట్టేందుకు సరైన దారి, కేంద్రంలో తామే అధికారాన్ని అందుకోవటం.
- తమ వారికి ఎంత కాలం రాష్ట్రంలో చిన్నా చితకా పదవులు ఇస్తూ సంతోషపెట్టటం? కేంద్రంలో అధికారాన్ని పొందితే అప్పుడు తాను ప్రధాని, తన వాళ్ళను అనేక పెద్దపదవుల్లో పెట్టవచ్చును. ఉదాహరణకు కేటీఆర్ గారికి తెలంగాణాను అప్పచెప్పవచ్చు. హరీష్ రావును ఎక్కడికన్నా గవర్నర్ హోదాలో పంపవచ్చును. కవితను కేంద్రంలో హోం వంటి ముఖ్యశాఖకు మంత్రిని చేయవచ్చును. ఇంకా సంతోష్ వగైరాలున్నారు - వాళ్లకూ మంచిపదవులే ఇవ్వచ్చు, రాష్ట్రంలో ఉన్న అధికారంతో ఎంతమందికని మంచిస్థాయి కల్పించటం కుదురుతుంది?
ఇలాంటివే మరొక కొన్ని కారణాలు ఉండవచ్చును నాకు ఇంకా తట్టనివి.
ఏదైతేనేం కేసీఆర్ గారు కేంద్రంలో అధికారం కోసం ప్రయత్నం మొదలు పెట్టారు. శుభం.
ఒకవేళ కేసీఆర్ గారు కాని ప్రధాని ఐతే అప్పుడు జరిగే పరిణామాలు కొన్ని పైన సూచించన దాన్ని బట్టి తెలుస్తూనే ఉన్నా మరికొంతగా బేరీజు వేదాం.
- ఎప్పటిలాగే దేశపరిపాలన ఐనా సరే హైదరాబాదులోని కేసీఆర్ గారి ప్రగతిభవన్ నుండే జరుగుతుంది. ఒకవేళ ఆ భవనం చాలదూ అనుకుంటే మరొక కొత్త భవనం వెలుస్తుంది ఆయన ఫార్మ్‌హౌస్‌లో. అంతే కాని ఆయన ఢిల్లీలో కూర్చుని పనిచేయరు.
- చిన్న చితకా పార్టీలన్నీ కేసీఆర్ గారు ఏర్పరచి అధికారంలోని తెచ్చిన పార్టీలో విలీనం అవుతాయి.
- కాంగ్రెసు పార్టీ కూడా కేసీఆర్ గారు ఏర్పరచి అధికారంలోని తెచ్చిన పార్టీలో విలీనం కాక తప్పదు - కొంచెం మొరాయించినా.
- భారతీయ జనతా పార్టీ అక్రమాల మీద విచారణ మొదలవుతుంది.
- వైకాపా వారు కేంద్రంలో అధికారం పంచుకుందుకు అంగీకరిస్తారు.
- మజ్లిస్ పార్టీ వారు కేంద్రంలో అధికారంలొ ముఖ్య భాగస్వామ్యం వహిస్తారు.
- కేసీఆర్ గారితో చేతులు కలిపి భారతీయ జనతా పార్టీని మట్టికరిపించిన ఇతర పార్టీలలో కొన్నింటికి సహాయ మంత్రుల వంటి చిన్నచితకా పదవులు దక్కుతాయి. కొన్నింటిని కేసేఆర్ గారు చెత్తబుట్టలో వేసేస్తారు.
- మరిన్ని పరిశ్రమలు తెలంగాణాకు వస్తాయి. తెలంగాణా వారు వద్దన్నవి మాత్రమే యితరరాష్ట్రాలకు దక్కుతాయి.
- భారతదేశ చరిత్రను కాంగ్రెసు వారు కంగాళీ చేసారని ఆరోపించిన భారతీయ జనతా పార్టీ మొదలు పెట్టింది చరిత్రను పునర్లిఖించే ఉద్యమాన్ని. అది కొనసాగుతుంది. అతే మరో కోణంలో. అందులో కాంగ్రెసు చేర్చిన కహానీలూ భాజపా చేరుస్తున్న కహానీలూ అన్నీ ఎగిరిపోతాయి. కొత్త చరిత్రను - తెలంగాణా ఎలా భారతస్వాతంత్రాన్ని తెచ్చిందీ అన్న కోణంలో ముందు ముందు చదువుతాము.
- సర్దార్ వల్లభాయి పటేల్ దుర్మార్గుడు అని ఋజువు చేసే కార్యక్రమం మొదలౌతుంది. ఆయన హైదరాబాదు మీద్ చేసిన దురాక్రమణను గురించిన కథనాలు జాతీయమీడియాలో ప్రముఖంగా చర్చిస్తారు.
- నిజాం దొరల కీర్తిని చాటటం కోసం అనేక కార్యక్రమాలు మొదలౌతాయి.
- స్వాతంత్రోద్యమంలో కేసేఆర్ పూర్వీకులు చేసిన త్యాగాల కథలు వెలుగులోనికి వస్తాయి.
- హరీష్ రావో మరొక కేసీఆర్ దగ్గర బంధువో ఆంధ్రాకు గవర్నర్ అవుతారు.
- పార్లమెంట్ సమావేశాలు అప్పుడప్పుడూ కొద్ది రోజుల పాటు జరుగుతాయి. ఊరికే ఎక్కువ రోజులు సాగతీసి ప్రజాధనం దుర్వినియోగం చేయరు.
- ఒకటి రెండు దఫాలు కేసేఆర్ గారు ఎన్నిక చేసిన వ్యక్తులు రాష్ట్రపతులూ ఉపరాష్ట్రపతులూ అవుతారు. దరిమిలా అధికారం కేటీఆర్ గారికి ఒప్పచెప్పి కేసీఆర్ గారే రాష్ట్రపతి పదవిని అలంకరించి దానికి వన్నె తెస్తారు.
- కేసేఆర్ భజన సంఘాల నాయకులు మేధావులుగా గుర్తింపు పొంది అనేక కీలక మైన పదవుల్లో జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారు.
- మళ్ళా భారతదేశానికి అమెరికా లాగా అధ్యక్ష తరహా ప్రజాస్వామ్యమే మంచిది అన్న చర్చ మెల్లగా మొదలౌతుంది.
ఇంకా చాలా జరుగవచ్చును. వేచి చూడండి!
1, ఆగస్టు 2022, సోమవారం
మనం పాడుకోవలసిన కొత్తపాటలు. నేర్చుకొని తరించండి.
ప్రపంచవ్యాప్తంగా నీరాజనాలు అందుకుంటున్న ఆధునిక భారతదేశపు పాట.
ఏం చేసినా మా మోదీ గొప్ప.
ఏం చేయకపోయినా మా మోదీ గొప్ప.
ఎలా చేసినా మా మోదీ గొప్ప.
ఎలా చేయకపోయినా మా మోదీ గొప్ప.
అసలు మా మోదీ ఏం ఆలోచించినా గొప్పే.
మా మోదీ ఏమి ఆలోచించకపోయినా గొప్పే.
ఎట్టిపరిస్థితుల్లోనూ మా మోదీ మాత్రమే గొప్ప.
అసలు గొప్ప అంటేనే మా మోదీ.
మా మోదీ కారణంగా మీరు బాగుపడితే ఆయనదే గొప్ప.
మా మోదీ కారణంగా మీరు చెడిపోయినా ఆయనే గొప్ప.
నోరు నొవ్వంగ మా మోదీ ఘనతను అనునిత్యం స్తుతించి తరించటమే గొప్ప.
జై మోదీ.
జై జై మోదీ.
జై భారత్.
భూలోకస్వర్గంగా మారిపోయిన బంగారు తెలంగాణా పాట
ఏం చేసినా మా కేసీఆర్ గొప్ప.
ఏం చేయకపోయినా మా కేసీఆర్ గొప్ప.
ఎలా చేసినా మా కేసీఆర్ గొప్ప.
ఎలా చేయకపోయినా మా కేసీఆర్ గొప్ప.
అసలు మా కేసీఆర్ ఏం ఆలోచించినా గొప్పే.
మా కేసీఆర్ ఏమి ఆలోచించకపోయినా గొప్పే.
ఎట్టిపరిస్థితుల్లోనూ మా కేసీఆర్ మాత్రమే గొప్ప.
అసలు గొప్ప అంటేనే మా కేసీఆర్.
మా కేసీఆర్ కారణంగా మీరు బాగుపడితే ఆయనదే గొప్ప.
మా కేసీఆర్ కారణంగా మీరు చెడిపోయినా ఆయనే గొప్ప.
నోరు నొవ్వంగ మా కేసీఆర్ ఘనతను అనునిత్యం స్తుతించి తరించటమే గొప్ప.
జై కేసీఆర్.
జై జై కేసీఆర్.
జై తెలంగాణా.
అభివృధ్ధి పరుగులు పెడుతున్న నవ్యాంధ్ర పాట
ఏం చేసినా మా జగన్ గొప్ప.
ఏం చేయకపోయినా మా జగన్ గొప్ప.
ఎలా చేసినా మా జగన్ గొప్ప.
ఎలా చేయకపోయినా మా జగన్ గొప్ప.
అసలు మా జగన్ ఏం ఆలోచించినా గొప్పే.
మా జగన్ ఏమి ఆలోచించకపోయినా గొప్పే.
ఎట్టిపరిస్థితుల్లోనూ మా జగన్ మాత్రమే గొప్ప.
అసలు గొప్ప అంటేనే మా జగన్.
మా జగన్ కారణంగా మీరు బాగుపడితే ఆయనదే గొప్ప.
మా జగన్ కారణంగా మీరు చెడిపోయినా ఆయనే గొప్ప.
నోరు నొవ్వంగ మా జగన్ ఘనతను అనునిత్యం స్తుతించి తరించటమే గొప్ప.
జై జగన్.
జై జై జగన్.
జై ఆంధ్రా.
గమనిక: ఈపై పాటలు మాత్రమే పాడుకోవలెను. ఇతరత్రా పాటలుపాడువారు దేశద్రోహులూ రాజద్రోహులూ అత్మద్రోహులూ ఐపోతారు తస్మాత్ జాగ్రత జాగ్రత జాగ్రత.
22, జూన్ 2022, బుధవారం
మరి మన వెంకయ్యనాయుడు గారి సంగతేమిటీ?
ఊరికే అన్నాను లెండి.
లేకపోతే మన వెంకయ్య నాయుడు గారేమిటీ, మతి లేని మాట కాకపోతే!
అర్థరాత్రి అడ్డగోలు విభజన సందర్బంలో ఆయన గారు ఆంధ్రప్రాంత ప్రజలందరి తరపునా వకాల్తా పుచ్చుకొని ఎంతో దీనంగా వినమ్రంగా మరియు ఎంతో కచ్చితంగా ప్రజలు అడుగుతున్నారు అని చెప్పి సాధించినట్టి ఆంధ్రప్రదేశానికి ప్రత్యేకహోదా అనే తాయిలం తాలూకు అతీగతీ ఏమన్నా అయన మళ్ళా పట్టించుకున్న దాఖలా ఐతే ఏమన్నా ఉందా?
తన పార్టీ పట్ల వినయవిధేయతలు అంటే అలా ఉండాలీ అని అందరూ శబాసో శబాసు అనే విధంగా ఆవిషయంలో ఎంతో చక్కగా మౌనం దాల్చారు కదా వెంకయ్య గారు?
అన్నట్లు ఆయన్ను మనం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అని కదా అనాలి మర్చిపోయాను. అసలు ఆ విషయం గురించే కదా ఈవ్యాసంలో చెప్పదలచుకున్నది. ఐనా మర్చిపోయాను.
అదే లెండి, వెంకయ్య నాయుడు గారు... తప్పు తప్పు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఆంధ్రప్రదేశానికి తమ పార్టీ వారు ఒక ఊరడింపుగా సాధించి పెట్టిన ప్రత్యేకహోదా అన్నదాని విషయం ఎంత గమ్మున మర్చిపోయారో అలాగే నేనూ మర్చిపోయానన్నమాట.
అయనకు అసలు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు అని అనిపించుకోవటం సుతరామూ ఇష్టం లేదట. నిన్నమొన్ననే ఆవిషయం ఒక పత్రికలోని ఒక వ్యాసరాజంలో చదివి తెలుసుకున్నాను.
అయ్యా వెంకయ్య నాయుడు గారూ, ఎందరో ఉపరాష్ట్రపతులు దరిమిలా రాష్ట్రపతులుగా పదోన్నతిని పొందినట్లు మన ఘనమైన చరిత్ర చెబుతున్నది కదా. ఆవిషయం దృష్టిలో పెట్టుకోండి. అసలు ఆఉద్దేశంతోనే మీకు ఉపరాష్ట్రపతి పదవిని ఇవ్వజూపుతున్నది మన పార్టీ అని ఆయనకు అప్పట్లో చక్కగా నచ్చజెప్పిన పిదపనే ఆయన మెత్తబడి, అలాగా ఐతే ఓకే అనేసారట.
మరిప్పుడు అదేమిటీ ఆ పార్టీ కాస్తా ఒక ద్రౌపదినో దమయంతినో తెచ్చి ఆవిడ గారు కాబోయే రాష్ట్రపతి గారు అని ప్రకటించేసిందీ?
అంటే ఆ పార్టీ వారు వెంకయ్య నాయుడు గారిని అవసరానికి వాడుకొని వదిలేసారా అని మనకు అనుమానం రావచ్చును కదా?
అదేమిటండీ, వారికేం అవసరం అని మీరు అడుగుతారు కదా. నేనూ చెప్పాలి కదా? మీకు మాత్రం తెలియదా? ఆమాత్రం తట్టదా యేమి కాని, కేంద్రంలో అధికారంలోనికి వచ్చిన ఆపార్టీ వారికి ఆంధ్రావారికి ప్రత్యేకహోదా ఇచ్చి తమ మాట నిలబెట్టుకొనే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు. మరి ఆ ప్రత్యేకహోదాకోసం పట్టుబట్టి మరీ సాధించుకొని వచ్చిన వెంకయ్య నాయుడు గారు గోలచేయరా? నా మాట పోతే ఎలా? మన పార్టీ మాట తప్పితే ఎలా? అంధ్రాకు హోదాకు ఇవ్వకపోతే ఎలా అని? మరేమో తమకు అలాంటి ఉద్దేశం ఏకోశానా లేదు. మళ్ళా వెంకయ్యగారు ఏతలనొప్పినీ తేకుండా చూడటమూ ముఖ్యమే. అందుచేత అయన్ను ములగచెట్టు ఎక్కించి ఉపరాష్ట్రపతి పదవిని కట్ట బెట్టారు. ఆయన ఇంక రాజకీయాలకు దూరం కాక తప్పదు కదా. ఆంధ్రాకు ప్రత్యేకహోదా వంటి చిన్నాచితకా విషయాలను అస్సలు పట్టించుకోకూడదు కదా. అందుకని వారా పాచిక విసిరారు. అది కాస్తా చక్కగా పారింది.
ప్రత్యేకహోదా అనే పాచికతో ఆంధ్రావారిని బుజ్జగించి దిగ్విజయంగా తెలుగుగడ్డను నిస్సిగ్గుగా చీకటికొట్లో చిదిమేసారు. ఉపరాష్ట్రపతి పదవి అనే పాచికతో వెంకయ్య నాయుడు గారి నోరు మూయించారు. అలా అంటే బాగుండదేమో లెండి. వారిని నోరెత్తకుండా చేసారు. ఇలాకూడా బాగుందదేమో. వెంకయ్య గారు మౌనం వహించేలా చేసారు. ఇలా బాగున్నట్లుంది కదా!
ఇప్పుడు రాష్ట్రపతి పదవికి వెంకయ్య గారి పేరును కూడా పరిశీలించినట్లు తోచదు.
ఇంకా ఉపరాష్ట్రపతిగానే ఉన్నారు కదా వెంకయ్య గారు, ఏమీ ఈవిషయంలో బహిరంగంగా మాట్లాడకూడదేమో కదా !
ఇంక వారు తమ శేషజీవితాన్ని కూడా ఇంతే హుందాగా అంటే మౌనంగా గడిపివేయాలేమో. మళ్ళా రాజకీయాల్లోనికి వస్తున్నా అంటే ఛండాలంగా ఉంటుంది కదా! బాగోదు మరి.
తన స్వంత పార్టీ తనను వాడుకొని వదిలేసిందని ఆయన మనస్సులో ఎంత గుడుసుళ్ళు పడినా ఏమీ లాభం లేదు.
ఇక్కడ ప్రతిపక్షాలకు ఒక బ్రహ్మాండమైన అవకాశం లభించింది. కాని వాళ్ళంతా దద్దమ్మల్లా ఆలోచించి ఎవరో సిన్హా గారిని కాబోలు పోటిలోనికి దించారు. దించారు అనటం ఎందుకంటే ప్రతిపక్షాల అభ్యర్ధికి గెలిచే అవకాశం లేదు కాబట్టి.
ఒకరకంగా గెలిచే అవకాశం లభించింది. వాళ్ళు గమనించుకోలేదు. అందుకే దద్దమ్మల్లా అలోచించారు అనటం.
ప్రతిపక్షాలన్నీ కలిసి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారినే తమ ఉమ్మడి అభ్యర్ధిగా రాష్ట్రపతి పదవికి పోటీలోనికి దించవలసింది.
అప్పుడు అధికారపార్టీ ఇరుకున పడేది. అధికారపార్టీ ఓట్లు చీలిపోయే పరిస్థితి వచ్చేది. వెంకయ్య గారిని ప్రతిపక్షాలు అన్నీ కలిసి అధికారపార్టీనుండి చీలివచ్చిన ఓట్ల సహాయంతో సులభంగా గెలిపించగలిగేవి.
బంగారం లాంటి అవకాశం.
పోటీలోనికి దిగటానికి వెంకయ్య గారు ఒప్పుకొనే వారా అని మీరు అడగవచ్చును. గెలిచే అవకాశం ముంగిట్లోనికి వచ్చినప్పుడు, స్వంతపార్టీ చేతుల్లో భంగపడ్డ నాయుడు గారు, ఒప్పుకొనే వారే అని నమ్మవచ్చును.
తన ప్రస్థానంలో చివరి మజిలీలో ఉన్న వెంకయ్య గారు ఈఅవకాశాన్ని ఎందుకు జారవిడుచుకొనే వారూ? ఇంత మోసం చేసిన పార్టీ ఇంకా ఏదో తవ్వి తన తలకెత్తుతుందన్న ఆశ యేమన్నా అయనలో ఉంటుందా ఏమన్నానా?
నిజంగా వెంకయ్య నాయుడు గారు చిత్తశుధ్ధితోనే ఆంధ్రాకోసం ప్రత్యేకహోదా అని ఆనాడు అడిగి ఉన్న పక్షంలో ఆవిషయంలో ఇప్పుడు ఆయన ప్రతిపక్షాల వద్ద హామీ అడిగి మరీ పోటీకి దిగే అవకాశం కూడా అయనకు లభించి ఉండేది.
ఇంత ఉభయతారకమైన అవకాశాన్ని ఆయన జారవిడుకోవటానికి చిన్న పిల్లవాడు కాదు కదా!
ఒకవేళ వెంకయ్య గారు రాష్ట్రపతి పదవికి అభ్యర్ది ఐన పక్షంలో ఆంధ్రాకు ప్రత్యేకహోదా అంశంలో ఆయన పట్టుపట్టే అవకాశం ఉంది కాబట్టి, మహా ఐతే, తెలంగాణా ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు చచ్చినా వెంకయ్య గారి అభ్యర్ధిత్వాన్ని ఒప్పుకోను అనవచ్చును. కాని అయనకు ఉన్న ఓట్లు బహుపరిమితం కాబట్టి అదేమంత ప్రతిబంధకం కానే కాదు. ఆసంగతి ఆయనకూడా ఒప్పుకోక తప్పని పరిస్థితి ఉంటుంది. అదీ కాక, ప్రత్యేకహోదా సంగతి తరువాత ఆలోచించవచ్చును, ముందు అధికారపార్టీ అభ్యర్ధిని ఓడించేద్దాం అని చెప్పి అయనా ఒప్పుకోవచ్చును కూడా. ఆలోచించండి.
ఇప్పటికైనా మించిపోయింది లేదు.
ప్రతిపక్షాలు అన్నీ కలిసి వెంకయ్య గారిని నిలబెట్టినా -- లేక -- అయన స్వతంత్ర అభ్యర్ధిగా పోటిలోనికి దిగేలా ప్రోత్సహించి మద్దతు ఇచ్చినా సరిపోతుంది.
అంతరాత్మ సాక్షిగా ఓటు వెయ్యండి అని పిలుపునిస్తే చాలు కదా!
ఈ మాట - అదే అంతరాత్మ సాక్షి - అన్నది ఇలాంటి సందర్భంలోనే పూర్వం నిన్నట్లు మీకు గుర్తుకు వస్తోందా?
చాలా సంతోషం.
1, సెప్టెంబర్ 2021, బుధవారం
ఏమైపోయారు మేధావులు
ఈ పై మూడు రకాల మేధావులూ సరైన వాళ్ళు కాదన్నట్లు అంటున్నాను కదా, ఇక పనుకొచ్చే మేధావులే ఉండరా అంటే తప్పకుండా ఉంటారు. వాళ్ళు సమాజం కోసం తమకృషిని తాము చేస్తూనే ఉంటారు. కాని సమాజంలో కుహనామేధావుల్లా నోరుపెట్టుకొని బ్రతకటం వాళ్ళ విధానంగా ఉండదు. వాళ్ళు కార్యరంగంలో ఉంటారు. చేతల మనుషులే కాని వాళ్ళు మాటల మనుష్యులు కారు. ఐతే సమాజానికి నిత్య జీవనంలో వినోదం తప్ప విజ్ఞానం అంత ముఖ్యంగా కనిపించదు. కాబట్టి నిజంగా ప్రయోజనకరమైన కార్యరంగంలో ఉండే మేధావులను గుడ్డి సమాజం గుర్తించలేదు. కాని అమాయకంగా కుహనామేధావులను మాత్రం ఏదో గొప్పవాళ్ళనుకొని వాళ్ళకు లేని విలువలను ఆపాదించి చెడుతూ ఉంటుంది.
19, ఆగస్టు 2021, గురువారం
ప్రజాస్వామ్యం నవ్వులపాలౌతున్నదట కొత్తగా
ప్రజాస్వామ్య వ్యవస్థను మన ఘనతవహించిన రాజకీయనాయకులు ఏనాడో నవ్వులపాలు చేసేసారు. ఇప్పుడు కొత్త ఏముంది?
చిన్న రాష్ట్రాల సిధ్ధాంతం అంటూ నాటకాలాడి తెలుగుగడ్డను రెండు ముక్కలు చేయటానికి భాజపా వారు ఆడిన నాటకం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యంపాలు చేయలేదా?
నాటకం కాకపోతే తెలుగుగడ్డను అడ్డదిడ్డంగా ఆదరాబాదరాగా రెండుముక్కలు చేసిన తరువాత తామే కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు మిగిలిన చిన్న రాష్ట్రాల డిమాండ్లకు ఎందుకు పాతరవేసారో?
నాటకం కాకపోతే ఏదో ఆంధ్రాకు న్యాయం చేయటానికి తెగ తసతహలాడుతున్నట్లు మాటలాడి తాము కేంద్రంలో అధికారంలోనికి వచ్చి నాలుకలు ఎందుకు మడతవేసి ఆంధ్రాకు అక్షరాలా తీరని ద్రోహం చేసినట్లో.
నాటకం కాకపోతే కేంద్రంలో అధికారం చేతికి రాగానే తమకు మిత్రపక్షంగా ఉన్న పార్టీని వేధించి దూరంపెట్టి ఆంధ్రాలో ఎదగాలని ప్రయత్నం చేసి ఇంకా అవకాశం కోసం అంగలార్చటాన్ని ఏమంటారో.
తమ కుచేష్టలు ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేయలేదా?
ఇప్పుడు ఆనాటకాల వెనుకనున్న ఒక పెద్దాయన తన మాట సభలో ఎవరూ వినటం లేదని ప్రజాస్వామ్యం ఇప్పుడు కొత్తగా ఎన్నడూ లేనట్లు నవ్వులపాలౌతోందని విచారం వెలిబుచ్చటం ఏమిటీ?
చీకటిగదిలో రాష్ట్ర విభజననాటకం ప్రజాస్వామ్యాన్ని నవ్వులపాలు చేసిననాడు తమకు చీమకుట్ఞినట్లు లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి ఎంత ఆదుర్దా!!
4, డిసెంబర్ 2020, శుక్రవారం
సెటిలర్స్
సెటిలర్. ఈ మాటకు అర్ధం నాకు తెలుసుననే అనుకుంటున్నాను. ఇదే కదా? "తన స్వస్థలం విడచి పరాయి ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకున్న వ్యక్తి" అని.
ఈ మాట విన్నప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది.
ఇదేదో తప్పుమాట అని కాదు. ఈమాటను తెలుగువాళ్ళు అన్వయిస్తున్న విధానం వలననే నాకు మనస్తాపం కలగతున్నది.
ఈ మాటను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో అనో లేదా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో అనో నా బాధ కాదు. తెలుగువాళ్ళే సాటితెలుగువాళ్ళ పట్ల ఎంత అవమానకరంగా ఎలా వాడుతున్నారో అని నా బాధ.
మన తెలుగువాళ్ళలో కూడా తోలుమందం మనుష్యులు కోకొల్లలుగా ఉన్నారు. కాని వాళ్ళతోపాటే నాలాంటి కొంచెం సున్నితమనస్కులు కూడా ఉన్నారు. తోలుమందం జనాభాకైతే పట్టించుకోకుండా కించిత్తూ బాధపడకుండా ఉండే హక్కు ఎలాగైతే ఉందో, నాలాంటి వారికి కొద్దో గొప్పో బాధపడే హక్కు కూడా అలాగే ఉంది. తోలుమందం జనాభాకు మౌనంగా మాటల్ని భరించే హక్కు ఎలా ఉందో (అదీ ఒక హక్కేనా అని ఎవరికన్నా అనుమానం వస్తే మంచిదే!), నాలాంటి వారికి భరించలేక తమ అభిప్రాయాన్నీ నిర్మొగమాటంగా చెప్పే హక్కూ అలాగే ఉంది. అందువలన ఒకరి అనుమతి అవసరం లేదు నా అభిప్రాయ ప్రకటనకు.
పాలపొంగు ఒకటి తెలుగుప్రజల రాష్ట్రాన్ని ఎలా రెండుముక్కలు చేసిందో అందరమూ చూసిందే. దరిమిలా ఒక తెలుగురాష్ట్రం (ప్రస్తుతానికి) రెండుగా మారి, తెలుగువారికీ రెండు రాష్ట్రాలు ఏర్పాటై, తమకు ఒక్క రాష్ట్రమేనా అని విచారించే అమృతహృదయులకు ఎలా ఊరట చేకూర్చిందో అందరికీ తెలిసిందే.
ఒకటి చివరకు రెండు ఐన తెలుగుప్రాంతంలో ఏర్పడిన ప్రభుత్వాలు చివరకు ఎలా అభివృధ్ధిపథంలో దూసుకొని పోతున్నాయో కూడా మనందరికీ బాగా అవగతం అవుతూ ఉన్నదే.
ఈ విషయంలో నాకు విచారించటానికి వ్యక్తిగతంగా కారణం ఏమీ లేదు. కాని చిక్కల్లా ఆ మహర్దినం దాకా స్వరాష్ట్రంలోనే ఉన్నవాడిని కాస్తా హఠాత్తుగా నా చిరనివాసప్రాంతంలోనే పరాయి వాడిని ఐపోవటమే. అలా ఐపోయానని నేను అనుకొనటం మానటం అంత ముఖ్యమైన సంగతి కాదు. నేను అలా పరాయివాడినీ అని ఘడియకు ఒకసారి గుర్తుచేసే సహృదయవాక్యాలను తట్టుకోవటం ఎంత కష్టంగా ఉంటుందీ అన్నదే ముఖ్యమైన సంగతి.
కాని ఈరాష్ట్రంలోనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణానికి ముందే వచ్చిన వాళ్ళు మాత్రమే తెలంగాణా వారిగానూ మిగతా వారంతా పరాయి వారుగానూ తెలంగాణా రాష్ట్రప్రభుత్వాధినేతయే చేసిన ప్రకటనలు ఎంతమందికి ఇంకా గుర్తున్నాయో నాకు తెలియదు. ఈకొద్ది సంవత్సరాలలోనే అదేదో గత త్రేతాయుగం నాటి సంగతి కదా ఇప్పుడెవ్వరికి పట్టింది అన్నట్లు మర్చిపోగల వాళ్ళకు ఒక నమస్కారం. అది నావల్ల కాదు. కానే కాదు. ఎందుకో చెప్పనివ్వండి.
నేను నలభైయేడేళ్ళ క్రిందట పొట్టచేత్తో పట్టుకొని వచ్చాను హైదరాబాదు నగరానికి. అప్పటికి అదింకా నిర్వివాదంగా తెలుగువాళ్ళ స్వరాష్ట్రానికి ముఖ్యపట్టణం. అందుచేత నేను అప్పట్లో నాస్వరాష్ట్రరాజధానికి ఉద్యోగనిమిత్తం వచ్చాను కాని ఏదో పరాయి ప్రాంతానికి ప్రవాసం పోలేదు. నేను వచ్చింది నా పొట్టపోసుకుందుకే కాని ఏదో తెలంగాణా ప్రజల పొట్టకొట్టి ఇంద్రుణ్ణో చంద్రుణ్ణో ఐపోయి పెత్తనం చేదామని కాదు. ఆ వచ్చింది కూడా భారతప్రభుత్వం అధీనం లోని సంస్థకు కాని ఇక్కడి ఏదో ప్రైవేట్ కంపెనీకి ఐనా కాదు.
నేను వచ్చిన కొద్ది కాలానికే నా కుటుంబం అంతా, మా నాన్నగారి నిర్యాణానంతరం, నా దగ్గర ఉండటానికి వచ్చారు. అందరం ఇక్కడే ఉన్నాం అప్పటినుండి. నాసోదరసోదరీమణులంతా ఈ హైదరాబాదులోనే చదువుకున్నారు. మా చెల్లెళ్ళందరినీ హైదరాబాదు వాస్తవ్యులకే ఇచ్చి వివాహాలు చేసాం.
పందొమ్మిది వందల యాభైఆరు నవంబరు కన్నా ముందుగానే దీర్ఘదర్శనులై మా తాతగారు హైదరాబాదు వచ్చి స్థిరావాసం ఏర్పరుచుకొన లేదు కాబట్టి మేమంతా పరాయి వాళ్ళం అన్న తెలంగాణా ప్రభుత్వం మాట ఎలా సబబు అని మాకు అనిపిస్తుంది చెప్పండి?
ఈ రెండురాష్ట్రాలు ఏర్పడినప్పటినుండీ నాకు 'సెటిలర్' అన్న బిరుదు ఇస్తానంటే నేనెలా ఒప్పుతాను చెప్పండి?
ఆంధ్రాప్రాంతం నుండి హైదరాబాదుకు వచ్చి అర్ధశతాబ్దం కావస్తున్నది. అక్కడివారికి ఇప్పుడు దాదాపుగా పరాయివాడిని. ఇక్కడి వారికి కూడా నేనొక 'సెటిలర్'ను అనగా పరాయివాడికి. చాలా బాగుంది. ఇదెక్కడి న్యాయం?
మా ఆఖరు తమ్ముడు ఇక్కడే జన్మించాడు. ఇక్కడే చదువుకున్నాడు. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు వాడికీ ఒక కుటుంబం ఉంది. వాళ్ళంతా కూడా 'సెటిలర్స్' అనటం అసహజం అభ్యతరకరం కాదా?
నాలాంటి వారు ఈహైదరాబాదులో కొల్లలు. ఎవరి కథ వారిది. వాళ్ళంతా పొట్ట చేతపట్టుకొని ఉద్యోగాల కోసం వచ్చినవారే.
అంద్రాప్రాంతం నుండి వచ్చిన వారంతా దుష్టులు అని అ తెలంగాణా ఉద్యమం రోజుల్లో తిట్టిపోసింది చాలు. ఒక పెద్దమనిషి, నా స్నేహితులే లెండి, అవసరం ఐతే ఆంద్రావారంతా చచ్చిపోయి ఐనా తెలంగాణా రావలసిందే అని చెప్పారు. ఉద్యమం వేడి అట. వేడి! ఎంత చక్కని మాట.
ఆంద్రావాళ్ళు బిర్యానీచేస్తే పేడలా ఉంటుంది అని వెక్కిరించి వెకిలిగా నవ్వులు చిలికించిన పెద్దమనిషి ఓట్ల అవసరం రాగానే ఆంధ్రావాళ్ళమీద కొంచెం ప్రేమ ఒలికించేమాటలూ మాట్లాడారు అనుకోండి. అంతమాత్రం చేత ఆ గుండెల్లో ప్రేమను చూడటం నావల్ల కాదు.
సరే జరిగిందేదో జరిగిపోయింది. రాజకీయాల్లో బోలెడు జరుగుతూ ఉంటాయి. వాటికి ఎవరూ ఏమీ చేయలేరు.
కాని ఇంకా అంధ్రప్రాంతం వారిని 'సెటిలర్స్' అంటూ వేరుగా చూడటం సమంజసమా? ఆప్రాంతం నుండి వచ్చి ఈతెలంగాణాలో స్థిరపడిన కుటుంబాలు మరొక ఐదువందల యేళ్ళైనా సెటిలర్స్ అనే పిలవబడుతారా?
ఈహైదరాబాదులో అంధ్రప్రాంతం నుండే కాక భారతదేశంలోని అనేక ప్రాంతాలనుండి వచ్చి 'సెటిల్' ఐన కుటుంబాలు కొల్లలు. కాని చూస్తుంటే వారెవర్నీ 'సెటిలర్స్' అన్నట్లు కనిపించదు. ఆంద్రప్రాంత నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన ఈ సాటి తెలుగువాళ్ళే తెలంగాణావారికి పరాయి వారు, 'సెటిలర్స్' అన్నమాట. భారతదేశంలోని ఏయితర ప్రాంతనుండి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారూ తెలంగాణా ద్రోహులు కారు. సాటి తెలుగువారైన ఆంధ్రాప్రాంతం వారే తెలంగాణాద్రోహులు (పుట్టుకచేతనే ఆంధ్రాప్రాంతం వారు తెలంగాణాద్రోహులు అన్నమాటనూ రాజకీయులు అనగా విన్నాను.). కాబట్టి సాటి తెలుగువారికి ద్రోహులు అని నిత్యం గుర్తుచేయటానికి వారిని మాత్రమే సెటిలర్స్ అంటారన్నమాట.
ఎన్నికలూ వగైరా అవసరాలు వచ్చినప్పుడు ఓట్లకోసం అంధ్రప్రాంతం వాళ్ళకి మెరమెచ్చు మాటల చెప్పే ఈరాజకీయులు 'ఆంధ్రానుండి వచ్చినవాళ్ళూ మావాళ్ళే' అంటూ ఉండటం విన్నదే. ఆమాటల్లో ఉన్న నిజాయితీ గురించి మేధావులు అనబడే కొందరు ఎంతో చక్కటి విశ్లేషణలు అందిస్తారనటంలో సందేహం లేదు. కాని అవన్నీ పైపై మాటలే అన్నసంగతి మాత్రమే అసలు నిజం.
నేను అమెరికాలో కొన్నేళ్ళు ఉండి వచ్చాను. ఎందరో అమెరికాలో సెటిల్ అయ్యారు మన తెలుగువాళ్ళు. కాని అక్కడ సెటిల్ ఐనా మన వాళ్ళని ఎవరూ అక్కడ 'సెటిలర్స్' అనరు.
ఏదో నాగోడు నేను చెప్పుకున్నాను. ఎందరు ఏకీభవిస్తారో, ఎవరు ఏకీభవించరో అన్నది వేరే విషయం. సత్యం కళ్ళముందే ఉంది. అటు ఆంధ్రకూ ఇటు తెలంగాణకూ చెందని రెండింటికీ చెడిన రేవడులే ఈ సెటిలర్స్ అన్నదే ఆనిజం.
ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను. నేను కూడా ఎంతో మంది సాటి తెలుగువారిలాగే ఆ అమెరికాలోనే సెటిల్ అయ్యుంటే ఈఅవమానకరమైన సెటిలర్ టైటిల్ నా నెత్తి మీద ఉండేది కాదు కదా అని.
19, ఆగస్టు 2020, బుధవారం
ముచ్చటగా మూడు రాజధానులు.
రాష్ట్రానికి మూడు రాజధానులా అని ఆశ్చర్యపోయిన వాళ్ళ, పోతున్న వాళ్ళ, ఇంకా ఇంకా పోబోతున్న వాళ్ళ సంఖ్యే చాలా ఎక్కువగా ఉందని అనిపిస్తోంది.
అలాగే కొంపములిగిపోతోంది అని విచారపడుతున్న వాళ్ళ, విచారంలో కూరుకుపోతున్న వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువగానే ఉన్నట్లుంది.
అలాగే ఈవిషయంలో ఆశ్చర్యం అనే మెదటి అంకం దాటి ఆగ్రహం అనే ద్వితీయాంకంలో గంతులేస్తున్న వాళ్ళ సంఖ్యా, ఆ అంకంలో ప్రవేశించ బోతున్న వాళ్ళ సంఖ్యా కూడా బాగానే ఉంది.
ఏదైనా అహితం మీదికి వస్తే మనుష్యస్వభావం మొదట అదంతా అబధ్ధం అలా జరిగి ఉండదు, అలా కాదులే అంటూ నిరాకరణకు దిగుతుంది. ఆ తరువాత మెల్లగా పరిస్థితిని ఆకళింపు చేసుకున్న పిదప ఆవేశపడటం, ఆగ్రహపడటం. ఆ తరువాత పరిస్థితి ఇలా రాకుండా ఉండవలసినదనీ దానికి గాను ఇలా జరిగి ఉండవలసినదనీ అలా జరిగి ఉండవలసినదనీ వాపోవటం. ఆ తరువాత నైరాశ్యంలో కూరుకు పోవటం. చిట్టచివరికి జరిగిందేదో జరిగింది, ఎలాగో అలా సర్దుకుపోదాం అనో ఇదీ మనమంచికే వచ్చింది అనో మనస్సును కుదుటపరచుకోవటం జరుగుతుంది.
అసలెందుకు అశ్చర్యపోవటం. ఆందోళన పడటం, ఆగ్రహపడటం వంటివి మూడు రాజధానుల విషయంలో అంటే ఇది ఆంధ్రులు ఊహించనిది కాబట్టి, అది ఆ జనంలో ఒక విపత్తుగా భావనకు వచ్చింది కాబట్టి.
నిజానికి అనుకోనివి జరగటం, నష్టపోవటం, దుఃఖపడటం వటివి ఆంద్రులకు జాతిసహజమైన లక్షణాలు. ఇందులో కొత్తగా వచ్చినది ఏమీ లేదు. ఇది అటువంటి సాధారణమానవులు అనుకోని మరొక ఉపద్రవం ఐతే మాత్రమేం, అది ఆంధ్రులకు ఆనవాయితీగా వచ్చే చిక్కుల్లో మరొకటి. అంతే.
ఆంద్రులు అని ఉన్నారు చూడండి. వారికి ప్రథాన జాతి లక్షణం ఏమిటో తెలుసునా? అనైక్యత. వాళ్ళలో ఎన్నడూ ఐకమత్యం అన్నది లేదు. ఇద్దరు ఆంధ్రులు ఒక చోట చేరితే అక్కడ మూడు పార్టీలు కనిపిస్తాయి. ఆ ఇద్దరూ చెరొక పార్టీ, ఆ యిద్దరూ కలిసి పేరుకు మరొక పార్టీ. ఇంత గొప్పది వీళ్ళ ఐక్యత.
ఎప్పటికప్పులు చిక్కులు కొని తెచ్చుకోవటం అన్నది వీరి అద్భుతమైన అనైక్యతావరసిధ్ధికి ఫలంగా లభించిన మరొక చక్కని లక్షణం.
ఒకప్పుడు ఉమ్మడి మదరాసు రాష్ట్రంగా తెలుగువారు అరవలతో కలిసి ఒకే రాష్ట్రంగా ఉన్నారు. తరువాత అరవలూ ఆంధ్రులూ వేరు వేరు రాష్ట్రాల క్రిందకు వచ్చారు. ఆ విడిపోతున్న సందర్భంలో మదరాసు ఎవరిదీ అన్న ప్రశ్న వచ్చింది. అది చెన్న(ప్ప)పట్టణమూ - చెన్నపురీ అక్కడ తెలుగువారమే ఎక్కువ సంఖ్యలో ఉన్నాం అది మాదే అని ఆంద్రులూ అలా వీల్లేదు మదరాసు మాదే అని అరవలూ చాలా గట్టిగానే గొడవ పడ్డారు. మన ఆంధ్రావారిలో రాజకీయనాయకులు మాత్రం ఎంత కాదన్నా ఆంధ్రా రక్తం ప్రవహిస్తున్న మహామహులే కదా. వాళ్ళలో ఉన్న అద్భుతమైన అనైక్యత అన్నది అరవలకే లాభించింది. ఫలితాంశంగా కట్టుబట్టలతో ఆంధ్రులు బయటకు వచ్చారు. నిర్వేదంతో మన ఆంధ్రాడబ్బులతో మదరాసులో రోడ్లు వేసి వచ్చాం - మనకు చిప్పమిగిలింది అనుకున్నారు.
ఒకసారి దెబ్బతింటే బుధ్ధిరావాలి కాని అలా వస్తే ఆంధ్రులు ఎందు కయ్యారూ?
తెలంగాణా వచ్చి ఆంధ్రాలో కలిసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ రాష్ట్రం ఏర్పడింది. దానికి దారితీసిన కారణాలూ వగైరా ఇప్పుడు చర్చించి ఉపయోగం ఏమీ లేదు కాని, ఆ కారణాల్లో అప్పటి హైదరాబాదు సర్కారు వారి తీర్మానం కూడా ఒక కారణం అన్నది మాత్రం నిజం. పదేళ్ళూ దాటాయోలేదో ప్రత్యేక తెలంగాణా పోరు మొదలు. దానికి రిపార్టీగా కాబోలు జై ఆంద్రా ఉద్యమం మొదలైంది. ఇదేమిటీ అనకండి. ఐకమత్యంగా ఉంటే తెలుగువాళ్ళు ఎలా అవుతారు, ముఖ్యంగా అంద్రులు? చివరికి ఇందిరమ్మ గారు చచ్చినా తెలంగాణా ఆంధ్రా విడదీయం అని తేల్చి పారేసారు. కాని మరొక కొన్ని దశాబ్దాల తెలంగాణా ప్రతేకవాదం చేసిన ఒత్తిడి చివరికి ఫలించి అత్తగారు ఇవ్వనన్న ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని కోడలు గారు సోనియమ్మ తన స్వలాభం లెక్కలు బాగా వేసుకొని మరీ ఇచ్చింది.
ఫలితం? మరలా ఆంధ్రులు హైదరాబాదును వదులుకొని ఈసురో మంటూ రోడ్డున బడ్డారు. ఒకప్పుడు మద్రాసులో కాసులు క్రుమ్మరించి చెడ్డది మరచి హైదరాబాదుకు ఆంధ్రాసొమ్ములు తరలించి దెబ్బతిన్నాం అని ఆంధ్రులు అనవచ్చును కాని దానికి తెలంగాణా వారిని తప్పుపట్టలేరు కదా?
ఆరోజుల్లో వాళ్ళు వచ్చి మాతో కలిస్తే మేం ద్రోహం చేసామంటున్నా రిప్పుడు అని ఆంధ్రావాళ్ళు వాపోయి లాభం లేదు. ఆ కలయికకు కారణమైన రాజకీయ కుట్రలని ఏవున్నాయో అవన్నీ అంధ్రారాజకీయవాదులే చేసారు కాబట్టి మోసగాళ్ళు ఆంద్రావాళ్ళే అంటున్నారు ఈరోజున తెలంగాణా నాయకులు.
జరిగిందేదో జరిగింది. యధావిధిగా కొత్త రాజధానికోసం వేట ఆట మొదలైంది. వినూత్మ ఆంధ్రాకు మొదటి ముఖ్యమంత్రి గారు రాష్ట్రం మధ్యలో రాజధాని ఉండాలీ, అది అంతర్జాతీయ నగరం ఐతే ఆంధ్రా అభివృధ్ధి చెందుతుందీ అంటూ అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసారు. పైగా అది అభివృధ్ధిచెందటానికి మార్గాలంటూ ఏవేవో స్కీములూ చెప్పారు.
ఎన్నికలొచ్చాయి మరొకసారి.
అధికారం చేతులు మారింది.
అధికారంలోనికి వచ్చిన వారి దృక్పథం వేరేగా ఉంది.
ప్రత్యేక తెలంగాణా ఉద్యమం మొత్తానికి ఫలించిందా లేదా? అ తెలంగాణా ఇలా వచ్చింది లెండి, అలా వచ్చింది లెండి అని ఏదేదో మాట్లాడి లాభం లేదు. వచ్చిందా లేదా అన్నదే ముఖ్యం. క్రియా సిధ్ధి ర్భవతి మహతాం నోపకరణే! అంటే ఇదే. ఫలితం దేని మహత్తు వలన వచ్చింది అన్నది కాదు ఫలితం రావటంలోనే మహత్తు ఉంది.
ప్రత్యేక రాయలసీమ ఉద్యమం అంటూ ఒకటి ఉంది అని మర్చిపోతే ఎలా ఆంధ్రులు? ఎవరికన్నా గుర్తుందో లేదో రాయలసీమను కర్ణాటకలో కలపండి అని ఒక అభిప్రాయమూ ఆప్రాంతపు నాయకులు వినిపించారు ఈమధ్యనే.
జరిగిన అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఐనా దీనిని గురించి నేడే ఆలోచించటం మంచిది. ఆంధ్రులు ఎంతో గొప్ప వారు. వారిలో కొందరు ఆంధ్రావిభన కోసం ఉద్యమాలు చేసి తీరుతారు. ఎవరి కారణాలు వారికుంటాయి.
మరలా ఎన్నోసారి రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రులు ఏర్పాటు చేసుకోవటం, అభాసు పాలు కావటం జరగాలి?
అసలీ ఆంధ్రరాష్ట్ర ఇలా ఇంకెన్ని సార్లు ముక్కలు చెక్కలు కావాలి? ఎవడికి తెలుసు? ఆంధ్రుల అద్భుతమైన అనైక్యత గురించి ఆలోచించుకోవాలి ముందు అని మన నాయకులకు ఎందుకు తోచదు?
గతప్రభుత్వానికి తోచీతోచనట్లు తోచినట్లు అనిపిస్తున్నది. అందుకే వివిధప్రాంతాల్లోను వివిధరకాలుగా అభివృధ్ధి కార్యక్రమం అంటూ ఆ ప్రభుత్వం మాట్లాడేది.
ఈకొత్త ప్రభుత్వం ఈవిషయంలో కొంచె ఎక్కువ స్పష్టతతో ఉన్నట్లు అనుకోవచ్చును. ఒకే చోట రాజధాని అంటే అది మద్రాసు హైదరాబాదుల వారసత్వానికి దారితీసి తీరుతుందని వారికి గట్టి నమ్మకం కుదురినట్లే భావించవచ్చును.
అందుకనే ఆంధ్రరాష్ట్రం మూడు ప్రాంతాల్లోనూ మూడు రాజధానులు ఏర్పాటు చేయవలసిందే అన్న పట్టుదల మీద ఉన్నారు. చివరికి ఈ విషయం కోర్టుకు ఎక్కినా సరే వారు నిన్నగాక మొన్న స్వాతంత్ర్యదినోత్సవం నాడు కూడ తమ ఆశయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ఎలాగోలా న్యాయవ్యవస్థనూ దారికి తెచ్చుకోవాలన్న వారి ఆకాంక్ష కొంచెం భయంకరమైనదే కాని అలా చేసి ఐనా వారు మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నారని అంటే అది సత్యదూరం కాకపోవచ్చును. అంత పట్టుదలతో ఉన్నారు వారు.
ఎలాగూ మరిన్ని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలను ఆంధ్రులు దిగ్విజయంగా చేయబోతారన్న దివ్యదృష్టి ఎలాగూ ఉన్న మన ఆంధ్రాప్రభుత్వం వారికి వాటిలో ప్రత్యేకకోనసీమరాష్ట్రం కోసం జరిగే ఉద్యమం కూడా ఉంటుందన్న స్పృహ తప్పకుండా ఉంటుందని నమ్మవచ్చును.
అందుచేత రాబోయే , అదేలెండి ఏదో ఒక నాటికి రాబోయే కోనసీమరాష్ట్రం అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని పనులు చేయాలి. కేవలం కోనసీమతో అంటే మరీ చిన్నది అవుతుంది కాబట్టి ఉభయగోదావరీజిల్లాలను కలిపి ప్రత్యేక రాష్ట్రంగా మునుముందు ఏర్పడేందుకు దోహదపడాలి. ఆ కొత్త రాష్ట్రానికి కూడా ముచ్చటగా మూడు రాజధాని నగరాలుండాలి. కాకినాడ, రాజమండ్రి, మరొక ఎంపిక చేసిన ముఖ్యనగరమూ వెరసి మూడు నగరాలూ రాజధానులుగా ఉండాలి. రాజమండ్రి వాణిజ్య రాజధాని అందాం. కాకినాడ పారిశ్రామిక రాజధాని అందాం. మరొక నగరానికి తగిన పోర్టుఫోలియో కేటాయిద్దాం. ఈవిధంగానే ఆంధ్రాలో ముందుముందు పుట్టబోయే ప్రత్యేకరాష్ట్రాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రాజధాని కేండేట్ నగరాలను ఇప్పటినుండే నిర్మాణం చేస్తూ పోవాలి.
ఇప్పటికే ఆంధ్రావారి ఆదర్శవంతమైన బహుళరాజధానుల సిధ్ధాంతం ఇతర రాష్త్రాల వారినీ ఆకర్షిస్తోందని వార్తలు వస్తున్నాయి. తమిళనాడులో మదురైని రెండవ రజధానిగా చేయమని అడుతున్నారట.
ఈ ముచ్చట ఇలా కొనసాగితే, యావద్దేశంలోనూ రాష్ట్రాలూ - రాజధానులూ అన్న అంశం విద్యార్ధులకు మంచి పాఠ్యాశం అవుతుంది.
దేశానికేం కర్మం! యావత్ప్రపంచానికీ ఈ బహుళరాజధాని వ్యవస్థ ఆదర్శప్రాయం కావచ్చును.
18, జులై 2020, శనివారం
వరవరరావు గారు దయార్హులా?
అవును. నిజమే. ఇంతవరకూ విరసంనాయకుడు వరవరరావు గురించి కాని అసలు విరసం అనబడే సంస్థ గురించి కాని నేను ఎన్నడూ ప్రస్తావించలేదు నా బ్లాగులో. ఈ లేఖ నన్నూ వ్రాసేలా కదిలించింది కదా. అందుకే ఆ వార్తాకారుడు అన్నది నిజం అంటున్నది.
సమగ్రత కోసం, కేవలం ఈవ్యాసంయొక్క సమగ్రత కోసమే సదరు వార్తావ్యాసాన్ని యథాతధంగా ఇక్కడ ముందుగా చూపుతున్నాను.
విరసం నేత వరవరరావును కాపాడాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి లేఖ రాశారు. ఎమర్జెన్సీ సమయంలో వరవరరావుతో తనకున్న అనుబంధాన్ని లేఖలో గుర్తుచేశారు. ఎంతో బరువెక్కిన హృదయంతో రాసినట్లు అనిపిస్తున్న.. ఈ లేఖ ఎవరినైనా కదిలించేలా ఉంది.‘‘
వరవరరావు నిర్బంధం, అనారోగ్యం గురించి మీకు తెలిసే ఉంటుంది. అనారోగ్యంతో ఆసుపత్రిలో ఆయన బందీగా ఉన్నారంటే హృదయం చెమ్మగిల్లుతోంది. 48 సంవత్సరాల క్రితం నాలో రాజకీయ ఆలోచనల అంకుర్భావ దశలో నాకు లభించిన ఎందరో గురువులలో ఆయనా ఒకరు. నలభై ఆరు సంవత్సరాల క్రితం ఎమర్జెన్సీ బాధితులుగా మీరు, నేను ఇరవై ఒక్క నెలలు ముషీరాబాద్ జైల్లో ఉన్నప్పుడు ఆయన మన సహచరుడు. సాహచర్యం భావజాలంలో కాదు గానీ, కటకటాల వెనుక కలిసి ఉన్నాము, రాజకీయ సిద్ధాంతంలోనూ, జనక్షేమంకై నడిచే మార్గంలోనూ ఎవరి భావాలు వారివే. కానీ మనం మనుషులం. శరీరం మంచానికి కట్టుబడే 81 సంవత్సరాల వయసులో, అందులోనూ అనారోగ్యంతో ఉన్న ఆయనపైన ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఎంతో ఉంది. యాభై మూడు సంవత్సరాలుగా అడవులలో ఆయుధాలు పట్టుకుని తిరిగే సాయుధులు సాధించలేని విప్లవం మంచం పట్టిన వృద్ధుడు సాధించగడా ?. ఈ స్థితిలో ఆయన ఇంకా నిర్బంధంలో ఉంచడం అవసరమా? రాజకీయాలతో సంబంధం సంబంధం లేకుండా మానవాళి మంచికి ఎన్నో కార్యక్రమాలు చేసిన మీరు దయతో ఆలోచించండి. రాజ్యం ఇంత కాఠిన్యమా, న్యాయం ఇంత సుదూరమా అని ఏ మేధావి ఈ దేశంలో భావించకూడదు. అహింసయే పరమ ధర్మం, శత్రువులు సైతం క్షమించాలి, వేదాంత వారసత్వ భారతదేశపు ఉప రాష్ట్రపతి అయిన మీరు... వరవరరావు విడుదల విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని సజల నయనాలతో విన్నవించుకుంటున్నాను. అనారోగ్యంతో అడుగులు తడబడుతూ నిస్సహాయంగా ఉన్న ఓ సిద్ధాంతం నిబద్ధ వృద్ధుడిని ప్రజాస్వామ్యవాదులులైన మీరు సానుభూతితో కాపాడమని కోరుకుంటున్నాను’’ అని భూమన కరుణాకర్‌రెడ్డి కోరారు.
ఇప్పుడు ఈ పైన చెప్పబడిన లేఖ గురించి నా అభిప్రాయాలు వ్రాస్తున్నాను. ఒకవేళ ఈ లేఖయే అసత్యం ఐన పక్షంలో ఈ వ్యాసం అనవసర ప్రయాస అవుతుంది.
"శరీరం మంచానికి కట్టుబడే 81 సంవత్సరాల వయసులో, అందులోనూ అనారోగ్యంతో ఉన్న ఆయనపైన ప్రభుత్వం దయ చూపాల్సిన అవసరం ఎంతో ఉంది." అన్న వాక్యం చదివారా? వృధ్ధుడైన కారణంగానూ, అనారోగ్యంతో ఉన్న కారణంగానూ ప్రభుత్వం ఆయన పైన దయ చూపాలని అంటున్నారు. గత యాభైమూడు సంవత్సరాల కాలంలో అడవుల్లో నుండి సాయుధవిప్లవం నడిపించిన యోధులు ఎంతో మందిని చంపారు. వారిలో వృధ్ధులూ అనారోగ్యంతో ఉన్నవారూ లేరా? ఎన్నడైనా సరే ఆ విప్లవకారులు దయ అన్నది ఎవరిపైన ఐనా చూపించారా? వారు ఎవరినైనా చంపటానికి పెద్దగా కారణం ఎప్పుడూ అవసరం పడలేదు కదా. కేవలం విప్లవవ్యతిరేకులనో పోలీసు ఇన్ఫార్మర్లు అనో మరొకటనే అనుమానం కొంచెం వచ్చినా చాలు. అవతలి వ్యకి ఎంత అవధ్యుడు ఐనా సరే చచ్చినట్లు చావవలసిందే. అంతే కద. ఎన్నడూ అలాంటి దయలేని కిరాతక విప్లవహత్యలను ఖండించని వాడూ పైగా ఆ హత్యలకు సిధ్ధాంతాల ముసుగులు వేసి సమర్ధించే సంస్థకు చెందిన వాడూ, నాగరికసమాజంలో రచయిత ముసుగులో ఆయుధమున్ ధరింప అని కగ్గముగా నొకపట్ల ఊరకే సాయము సేయువాడ అన్నట్లు అడవివీరుల పక్షాన పనిచేసి చేసి జైలు పాలైన పెద్దమనిషి పట్ల ప్రభుత్వం ఎందుకు దయ చూపాలి? ఆయన ఎప్పుడన్నా కొంచెం విచక్షణా దయా చూపమని తమ విప్లవవీరులకు సందేశం ఇచ్చారా నిజాయితీగా?
"ఈ స్థితిలో ఆయన ఇంకా నిర్బంధంలో ఉంచడం అవసరమా?" ఎన్నడైనా విచక్షణా దయా అనేవిలేకుండాఏదో ఒక ముద్రవేసి కిట్టనివారిని విప్లవంపేరిట అక్షరాలాహత్యలుచేయటం అవసరమా అని ఈమేథావి వరవరరావుగారు తమ విప్లవమిత్రుల్ని ప్రశ్నించారా నిక్కచ్చిగా నిజాయితీగా? వ్యతిరేకుల్ని ఎలాగన్నా ఎంత క్రూరంగా అన్నా చంపటం సబబే అన్న విప్లవవిధానం సరైనదే ఐన పక్షంలో రాజ్యం కూడా అటువంటి దయారహితుల్ని ఎంతకాలం అంటూ కనికరం చూపకుండా కఠిన నిర్భంధంలో ఉంచటం అత్యవసరమే అని వేరే చెప్పాలా?
"రాజ్యం ఇంత కాఠిన్యమా, న్యాయం ఇంత సుదూరమా అని ఏ మేధావి ఈ దేశంలో భావించకూడదు." చక్కటి అభిప్రాయం. తప్పకుండా ఒప్పుకోవలసిందే. ఏకాఠిన్యాన్నీ అన్యాయాన్నీ కుంటిసాకులకు హతమారిపోయిన మనుష్యుల పట్ల ఎంతమాత్రం చూపని వారిపై రాజ్యం ఎందుకని మృదువుగా వ్యవహరించాలి? అటువంటి వారికి మిక్కిలిగా సత్కారం చేసి వారుకోరిన న్యాయం అందించాలని రాజ్యంఎందుకు ఆలోచించాలి? రాజ్యపౌరులపట్ల అది ద్రోహం కాదా? తమని నిష్కారణంగా కూడ చంపిపారేసే వ్యక్తుల్నీ వారికి సైధ్ధాంతిక నైతిక రాజకీయ సామాజిక మద్దతును అందించే వారిని దయగా చూడటం అంటే రాజ్యప్రజలను ప్రమాదంలో బ్రతకమని చెప్పటం కాదా? అదెలా సమర్ధనీయం?
"అహింసయే పరమ ధర్మం, శత్రువులు సైతం క్షమించాలి" అహా ఎంతటి గంబీరోపదేశం. ఇక్కడ ఒక చిన్న పొరపాటు దొర్లింది. నిజానికి లేఖకుని ఉద్దేశం "అహింసయే పరమ ధర్మం, శత్రువును సైతం క్షమించాలి" అని సులభంగానే తెలుస్తున్నది. హింసయే పరమధర్మం. శత్రువును ఎలాగైనా చంపితీరవలసిందే అని నిత్యం జపించే వారిని సమర్ధించే వ్యక్తి పట్ల ఈ మహోపదేశాన్ని ఎలా అమలుచేయటం? "తుపాకి గొట్టం నుండే రాజ్యాధికారం వస్తుంది" అన్న నినాదం మనసా వాచా కర్మణా నమ్మే వారికి సైధ్దాంతిక గురుస్థానంలో ఉన్నారు కదా ఈ విరసం వారూ వారి తాలూకు వరవర రావు గారూను? అందుచేత ఈ గంభీరధర్మపన్నాలు వారి పట్ల వర్తింప జేయరాదు. చేయరాదు కాక చేయరారు. భారతంతో శ్రీకృష్ణుడు నిర్వచించిన ఆతతాయిలు అనే పరిధిలోని వారు ఈ విప్లవకారులూ వారి తాలూకు వారూను. నిష్కారణంగా హత్యలకు తెగబడే వారు ముమ్మాటికీ ఆతతాయిలే. ఆతతాయిలు వేరే యితరకారణాల వలన అవధ్యులు ఐనా సరే, ఆతతాయిలు కాబట్టి అవశ్యం వధ్యులు. అశ్వత్థామ అందుకే బ్రాహ్మణుడూ, గురుపుత్రుడూ, తపస్వీ కూడా ఐనా సరే వధ్యుడైనాడు. అందుచే వృధ్ధుడు, అనారోగ్యవంతుడూ, మేథావి వంటి సాకులు వరవరరావు పట్ల దయనూ అహింసనూ చూపటానికి ఎంతమాత్రమూ ప్రాతిపదికలు కావు. సరే అయన స్వయగా తుపాకీ పుచ్చుకొనీ కత్తిపుచ్చుకొనీ హత్యలు చేయలేదంటారా? నివారణదక్షుడై కూడా అటువంటి హత్యలను ఉపేక్షించాడు, పైగా ప్రోత్సహించాడు. శ్రీకృష్ణుడు సారపు ధర్మమున్ అన్న పద్యంలో చెప్పినట్లు "దక్షు లెవ్వార లుపేక్ష సేసిరది వారల చేటగు" అన్నది సత్యం. అందుచే వరవరరావు గారు దయాపాత్రులు కానేకారు.
"అనారోగ్యంతో అడుగులు తడబడుతూ నిస్సహాయంగా ఉన్న ఓ సిద్ధాంతం నిబద్ధ వృద్ధుడిని ప్రజాస్వామ్యవాదులులైన మీరు సానుభూతితో కాపాడమని కోరుకుంటున్నాను". ప్రజాస్వామ్య వారులైన వారు ఆ ప్రజాస్వామ్యంపట్ల కించిత్తు నమ్మకం కూడా లేని వారిని దయచూడాలి అన్న మాట ఒకటి వినటానికి బాగుంది. నిజంగా హత్యలు చేస్తున్నప్పుడు తాము హత్యచేస్తున్న వారు తమ వృత్తినిబధ్ధతో పోలీసుపని చేస్తున్నవారైనప్పుడు ఇలా ఆలోచించి ఎన్నడైనా వారిని కాపాడాలని దయతో ఆలోచించారా ఈ విప్లవం వాళ్ళూ వాళ్ళ విరసం గురువులూ? ఎన్నడూ అనారోగ్యంతోనో మరొక కారణంగానో నిస్సహాయంగా ఉన్నవారిని వీళ్ళు దయాదాక్షిణ్యాలు చూపి చంపకుండా వదిలారా? లేదే?
"రాజకీయ సిద్ధాంతంలోనూ, జనక్షేమంకై నడిచే మార్గంలోనూ ఎవరి భావాలు వారివే" అంటూ వరవర రావు గారు కూడా జనక్షేమంకోసం నడిచిన వారని సెలవిచ్చారు. ఈ విప్లవమార్గం జనక్షేమం కోసం ఐన పక్షంలో అది ఎటువంటి జనక్షేమం చెప్పండి? తుపాకీ గొట్టం ద్వారానే వాళ్ళు రాజ్యాధికారం సంపాదించుకోవాలని తాపత్రయ పడుతున్నారు. ఇక్కడ జనం కాని జనక్షేమం ప్రసక్తి కాని లేదు. తమ మార్గంలో నడిచే వారూ, తమ మార్గానికి అడ్డురాని వాళ్ళూ, తమ మార్గానికి అడ్డువచ్చే వాళ్ళూ అని వారి దృష్టిలో జనం మూడు తెగలు. ఆ మూడో రకం జనం, అంటే అడ్డు వచ్చే వాళ్ళ పట్ల వారి సిధ్ధాంతం చెప్పే విధానం అటువంటి వారిని ముళ్ళపొదల్లాగా నరికి పారెయ్యటమే. ఇది సుస్పష్టమే. కర్మ కా వీరి తుపాకీలు వీరికి రాజ్యాధికారాన్నే ఇస్తే జరిగేది ఏమిటి? అప్పుడు అడ్డూ అదుపూ ఉంటుందా వీరికి? అడ్డు చెప్పే సాహసం ఎవరికైనా ఉండటం వీలేకాదు కదా? అప్పుడు వీరు రెండవరకం జనం అంటే తమకు వ్యతిరేకులు కాకపోయినా అనుకూలురు కూడా కాని వారి పనీ పడతారు. కేవలం తమకు అనుకూలురైన వారికే బ్రతికే హక్కు ఉంటుంది వారి రాజ్యంలో. ఈవిషయంలో డొంకతిరుగుడు ఏమీ లేదు. కచ్చితంగా అదే నిజం. ఆపుడు వారు ఎవరిపైన ఐనా దయా దాక్షిణ్యమూ చూపుతారా చెప్పండి. నమ్మలేక పోతున్న వారి కోసం ఒక ఉదాహరణ. తియాన్మన్ స్క్వేర్ వద్ద చైనా విద్యార్థులను కమ్యూనిష్టు చైనా ప్రభుత్వం ఎలా పురుగుల్ని చంపినట్లు చంపి పారేసిందో గుర్తు తెచ్చుకోండి. ముక్కుపచ్చలారని పసివాళ్ళే అని అక్కడి కమ్యూనిష్టు ప్రభుత్వం వా కనికరం ఏమన్నా చూపారా? విప్లవం లేదా కమ్యూనిజం లెక్క ప్రకారం వ్యతిరేకులు అందరూ వర్గశత్రువులు - వావటం తప్ప వారికి మరొక నిష్కృతి లేదు. వారికి మరొక శిక్షలేదు. అక్కడ దయాదాక్షిణ్యాలు లేవు. విచక్షణ అన్న మాట ఊసే లేదు. ఇప్పుడు ఆలోచించండి. ఇటువంటి ఆతతాయి సంస్థలకు చెందిన వ్యక్తులపైన ధర్మం పేర అహింస పేర దయాదాక్షిణ్యాలు చూపటం పాములకు పాలు పోయటం మాత్రమే అవుతుంది కదా.
నాకు వరవర రావు గారితోగాని, కరుణాకర్ గారితో గానీ వ్యక్తిగతంగా పరిచయం లేదు. వ్యక్తిగత రాజకీయ శత్రుత్వ మిత్రత్వాల వంటివేమీ లేవు. కేవలం ప్రస్తుతం ఉన్న పరిస్థితి గురించి నా అభిప్రాయం వ్రాసానంతే.
27, జనవరి 2020, సోమవారం
అమరావతికి ఊపిరి?
ఆవిడ ఆ టపాను 24న వ్రాసినా, నేను మూడు రోజుల తరువాత నేడు 27న మధ్యాహ్నం దాకా చూడలేదు.
అమరావతి గురించీ, సందు చూసుకొని కొన్ని అరాచకశక్తులు చేస్తున్న అనవసర కులనిందల గురించీ ఆవిడ చాలా బాధపడుతున్నారు.
అక్కడ ఆవిడ బ్లాగులో నేను వ్యాఖ్యలను ఉంచలేను. అది వేరే విషయం.
కాబట్టి విడిగా నా స్పందన ఇలా నా బ్లాగు ముఖంగా వ్రాస్తున్నాను.
ఆవిడ అన్నది నిజం.
ఈరోజుల్లో వార్తల పేరుతో కనవచ్చేవీ వినవచ్చేవీ జుగుప్సాకరంగా ఉంటున్నాయి.
మన తెలుగుబ్లాగుల్లో ఐతే అంతా సో-కాల్డ్ పచ్చ బేచ్ v ఇన్ ఫాక్ట్ పిచ్చి బేచ్.
యుధ్ధవాతావరణం భీతావహంగా ఉంది.
నేను వార్తాపత్రికలు చదవటం మానివేసాను,
నేను వార్తల ఛానెళ్ళను విసర్జించాను.
నేను యూట్యూబులో వస్తున్న విశ్లేషణలను చూడటం లేదు.
నేను బ్లాగుల్లో వస్తున్న రొట్టనూ దూరం పెడుతున్నాను, వీలైనంత వరకూ.
నేను నా మొబైల్ నుండి వార్తల ఆప్ లను అన్నింటినీ తొలగించాను.
ఇవన్నీ చేసి కొద్ది రోజులు అయింది.
జరిగేది ఎలాగూ మనకు తెలియక పోదు కదా. పెద్ద ఇబ్బంది లేదు.
ప్రజలు గొప్ప మెజారిటీ ఇచ్చి తెచ్చుకున్న ప్రభుత్వం ఇది.
అందుచేత ప్రజలకు పర్యవసానాలను అనుభవించక తప్పదు.
జరిగే వన్నీ మంచికని అనుకోవటమే మనిషి పని అన్నాడు కవి.
అలా అనుకోలేదని వాళ్ళు పెరుగుట విరుగుట కొరకే అనుకుంటారేమో మరి.
నిజానికి చాలా మంచి జరుగుతోందని కూడా కొందరు అంటున్నారు.
ఇంగ్లీషు వాడిది, People get the government they deserve అని ఒక మంచి సామెత ఉంది.
అలా ఉంది పరిస్థితి అచ్చంగా.
ఈ తెలుగువాళ్ళని దేవుడే రక్షించాలి.
ప్రస్తుతం అకారణంగానో సకారణంగానో తెలుగువాళ్ళు తమను తామే బాగా శిక్షించుకుంటున్నారు.
ఇది నా అభిప్రాయం.
అందరికీ నా అభిప్రాయం నచ్చాలని లేదు.
(విషయం లేకుండా వీరావేశంతో ఎవరన్నా వ్యాఖ్యానిస్తే, అది వాళ్ళిష్టం. అది అచ్చు వేయటమా మానటమా అన్నది నా యిష్టం అని అందరూ గమనించగలరు.)
29, డిసెంబర్ 2019, ఆదివారం
అమరావతి విధ్వంసం తగదు పై వ్యాఖ్య
ఆంధ్రా అనేది ఒక తమాషా బజార్
దీన్ని ఒక తమాషా కేంద్ర ప్రభుత్వం ఏర్వాటు చేసింది
అదీ ఒక తమాషా రాష్ట్ర విభజన నాటకంతో
ఒక రాష్ట్ర ప్రభుత్వం అమరావతిని రాజధాని అంది
ఒక తమాషా కేంద్రప్రభుత్వం గుప్పెడు మట్టిని బహుమానంగా ఇచ్చింది
కొన్నాళ్ళపాటు ఆపసోపాలతో రాజధాని నిర్మాణం నడిచింది
మరొక రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది
అమరావతి కాదు అనేక రాజధానులు అంది.
రేపు మరొక ప్రభుత్వం వస్తుంది
అన్ని రాజధానులేమిటి అంటుంది
అప్పటికి ఉన్నవి అన్నీ మట్టి కొట్టుకొని పోతాయి
అమరావతి వెనక్కి వస్తుంది వీలైతే
లేదూ మరొక రాజధాని పేరు వినిపిస్తుంది.
ఆభోగం అంతా మరలా ప్రభుత్వం మారే వరకే
లేదా ఆంధ్రా మళ్ళా ముక్కలయ్యే వరకే
అప్పుడు తమాషా మళ్ళా మొదలౌతుంది
ఒకటో రెండో మూడో రాజధాని లేని రాష్ట్రాలు వస్తాయి
రాజధాని వెదుకులాటలు మొదలౌతాయి
ఒకటి కన్న ఎక్కువ తమాషాలు అన్నమాట
జనం చూస్తూనే ఉంటారు తమాషాలను
అంత కన్నా ఓట్లేసి మునగటం కన్నా ఏం చేయగలరు పాపం.
[ నేటి వనజవనమాలి బ్లాగు టపా అమరావతి విధ్వంసం తగదుపై నా స్పందన.]
15, నవంబర్ 2019, శుక్రవారం
బోధనామాధ్యమం గురించిన రగడ
మీరు గూగుల్‍లో language of instruction in israel అని శొధిస్తే నాకు మొట్టమొదటగా కనిపించినది
Search Results
Featured snippet from the web
Israel's development of cutting-edge technologies in software, communications and the life sciences have evoked comparisons with Silicon Valley.[544][545] Israel ranks 5th in the 2019 Bloomberg Innovation Index,[68] and is 1st in the world in expenditure on research and development as a percentage of GDP.[65] Israel boasts 140 scientists, technicians, and engineers per 10,000 employees, the highest number in the world (in comparison, the same is 85 for the U.S.).[546][547][548] Israel has produced six Nobel Prize-winning scientists since 2004[549] and has been frequently ranked as one of the countries with the highest ratios of scientific papers per capita in the world.[550][551][552] Israel has led the world in stem-cell research papers per capita since 2000.[553] Israeli universities are ranked among the top 50 world universities in computer science (Technion and Tel Aviv University), mathematics (Hebrew University of Jerusalem) and chemistry (Weizmann Institute of Science).[391]
ఇందులోని విషయాలను తీసుకొని మనదేశం ఇజ్రాయెల్‍తో పోలిస్తే ఎక్కడ ఉన్నదో ఒక్కమాటు ఆలోచించండి.
తరువాతి పేరా మొదటి వాక్యం చూడండి. In 2012, Israel was ranked ninth in the world by the Futron's Space Competitiveness Index.[ అని! అంటే అంతరిక్షపరిశోధనారంగంలో అది ప్రపంచంలోనే తొమ్మిదవ స్థానంలో ఉంది అని. మొదటిపది స్థానాలు ఇలా ఉన్నాయట.
- United States 99.67
- Europe 50.11
- Japan 48.76
- Russia 45.29
- China 41.85
- Canada 39.10
- India 28.64
- South Korea 15.22
- Israel 9.30
- Australia 5.22
అసలు Science and technology in Israel అని ఒక పూర్తి వికీ పేజీయే ఉంది. అక్కడ మరిన్ని వివరాలు దొరుకుతున్నాయి.
ఇజ్రాయెల్ చాలా చిన్నదేశం. అక్కడ హిబ్రూలో చదువుకోవటానికి ఎవ్వరూ 'ఇంగ్లీషులో చదువుకోకపోతే బ్రతుకులేదు' వంటి కుంటి సాకులు చెప్పటం లేదు. అక్కడ సైన్సును హిబ్రూ భాషలో బోధించటమే కాదు అక్కడి శాస్త్రజ్ఞ్లులు ఆభాషలో పరిశోధనాపత్రాలూ ప్రకటిస్తున్నారు. ఎవ్వరూ సిగ్గుపడటం లేదు (మనలా!)
ప్రపంచవ్యాప్తంగా రష్యన్, జర్మను, ప్రెంచి, స్పానిష్, జపనీస్, చైనీస్ చివరికి బుల్లిదేశం భాష ఇటాలియన్‍లో కూడ పరిశోధనాపత్రాలు వెలువడుతున్నాయి.
మనకు తెలుగులో చదువుకుంటే కొంపమునిగిపోతుందన్న భావన ఉండటమే కాదు దాన్ని ప్రభుత్వాలూ బలమైన రాజకీయపార్టీలూ కూడా ప్రచారం చేస్తున్నాయి.
ఆడలేక మద్దెల ఓటిది అన్నట్లుగా మన తెలుగు భాష స్థాయిని పెంచుకోవటం మనకు చేతకావటం లేదు కాబట్టి అసలు మన వెధవాయలకు అలాంటి సదుద్దేశం ఏకోశానా లేదు కాబట్టి, ఇంగీషు భాష ప్రాణాధారం అన్న వాదన చేస్తున్నాం అన్నమాట.
మరిన్ని వివరాలూ సమర్ధనలతో ఇంకా పెద్దగ్రంథమే వ్రాయవచ్చును కాని ఇది చాలనుకుంటున్నాను.
7, నవంబర్ 2019, గురువారం
ఆర్టీసీ సమ్మె - రంగనాయకమ్మ
ఆ వ్యాసంలో రంగనాయకమ్మగారు మార్క్సు కనిపెట్టిన ‘అదనపు విలువ సిద్ధాంత కోణం’ నుండి ఒక ఉదాహరణను ఇస్తూ మరీ పరిశీలించి చూసారు. కాని అదనపు విలువను ఆవిడ లెక్కలు వేసిన విధానం అంత సమగ్రంగా ఉన్నట్లు తోచదు.
ముందే ఒక సంగతి చెప్పాలి. నేను ఆర్ధికశాస్త్రవేత్తను కాను. కనీసం ఆ శాస్త్రం చదువుకున్న వాడిని ఐనా కాను. నేను కమ్యూనిష్టును కానీ కమ్యూనిష్టు పార్టీలకూ వారి సిధ్ధాంతాలకు సానుభూతిపరుణ్ణి కానీ కాను. అలాగని కమ్యూనిజం అయ్యేది మరొకటయ్యేది దేనినీ గ్రుడ్డిగా వ్యతిరేకించే వాడినీ కాను.
అలాగే మరొక సంగతీ చెప్పాలి. రంగనాయకమ్మ గారి 'ఆండాళ్ళమ్మ గారు' నేను మొదటగా చదివిన ఆవిడ రచన. భలే బాగుందనిపించింది. విషవృక్షం చదివాను. అస్సలు నచ్చలేదు. 'మాట్లాడే తెలుగే వ్రాస్తున్నామా' అని ఆవిడ వ్రాసిన వ్యాసం నచ్చింది - ఆలోచింప జేసింది. అందుచేత ఆవిడపట్ల నాకేమీ గ్రుడ్డి వ్యతిరేకత లేదు.
ఇక నేను చెప్పదలచుకున్న విషయాలలోనికి సూటిగా వస్తున్నాను.
మీకొక దుకాణం ఉందనుకుందాం. అది ఏదన్నా కావచ్చును. బట్టలదుకాణం, కిరాణాదుకాణం, ఫాన్సీషాపు లేదా మరొకటి. మీ స్వంత దుకాణం.
వస్తువుల ధరలను మీరు ఎలా నిర్ణయిస్తారు అన్నది ఇక్కడ ఆలోచిస్తున్న సంగతి. లాభానికి అమ్మాలి అన్నది సరే, చిన్నపిల్లవాడి నడిగినా ఆ మాట చెప్పగలడు. కాని ఎంత లాభానికి అంటే కొంచెం ఆలోచించి చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే అనేక విషయాలను పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది కాబట్టి.
సరుకులు కొనటానికి పెట్టుబడి పెట్టాలి. అలాగే సరుకులు నిలువచేయటానికీ, ప్రదర్శించటానికీ కూడా తగిన సదుపాయాల కోసం పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులన్నాక అంతా మీరు మీ ఆస్తిపాస్తులనుండే పెట్టలేరు. కొంత పెట్టుబడి అప్పుగా వస్తుంది. మీ సొమ్ము ఐనా ఇతరుల సొమ్ము ఐనా అది బ్యాంకు వడ్డీ కన్నా తక్కువగా ఆర్జిస్తూ ఉండే పక్షంలో దుకాణం దండగ. కాబట్టి పెట్టుబడులు వెనక్కి రాబట్టుకోవటానికి లాభార్జన తప్పదు.
మీ దుకాణానికి అద్దె కట్టాలి. షాపు అన్నాక మీ యింట్లోనే నిర్వహించటం అస్తమానూ కుదరదు. అది బజారులో ఉండాలి మరి. మీ యిల్లు వేరొక చోట ఉంటుంది.
మీ పనివాళ్ళకు జీతాలివ్వాలి. షాపు అన్నాక మీరొక్కరే గళ్ళాపెట్టె దగ్గరా, తూకాల దగ్గరా, సామానుల దగ్గరా అన్నిచోట్లా ఉండలేరు కదా. వచ్చే గిరాకీలు అందరినీ మీరొక్కరే సమర్ధించుకుంటూ నడపలేరు కదా. అందుకని వివిద కార్యకలాపాలకోసం పనివాళ్ళ అవసరం ఉంటుంది. అది దుకాణం స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. అందరికీ తగినంత జీతం సమయానికి అందిస్తూ ఉండకపోతే దుకాణం నడవదు.
దుకాణం ఉంది అంటే దానికి కొన్ని హంగులూ అవసరాలూ ఉంటాయి. విద్యుత్తు కావాలి కదా కనీసం లైటింగు నుండి శీతలీకరణాదులకోసం. ఈ బిల్లులు అన్నీ చెల్లవలసింది దుకాణం ఆర్జించే సొమ్మునుండే.
దుకాణంలో సరుకు అమ్మేసి దాన్ని మూసివేయరు కదా. మార్కెట్టును బట్టి ఎప్పటికప్పుడు కొత్త సరుకును కొని దుకాణంలో ఉంచాలి. అది నిత్యనూతనమైన కర్చు. దానికి అవసరమైన సొమ్మును దుకాణమే సమకూర్చాలి.
దుకాణం పెట్టింది ఎందుకు? ముందు మీరు సుఖంగా సదుపాయంగా సకుటుంబంగా బ్రతకటానికి. మీరు ఎవరిదగ్గరన్నా ఉద్యోగంలో ఉంటే అందుకు కావలసిన సొమ్ము మీకు అందే జీతం సమకూర్చుతుంది. మరి మీది ఒక దుకాణం ఐనప్పుడు ఆ సొమ్మును సమకూర్చవలసిన బాధ్యత ఆ దుకాణానిదే కదా. అంటే పనివాళ్ళకే కాదు దుకాణం మీకూ పోషణకు సొమ్ము ఇవ్వాలి.
దుకాణం నడపటంలో కొన్ని ఒడిదుడుకులకు సిధ్ధం కావాలి. వాటి గురించిన అవగాహన దుకాణం పెట్టే ముందే ఉండాలి మీకు. వాటి గురించి కూడా అలోచించాలి దుకాణం నడపటంలో.
ప్రకృతి విపత్తుల గురించి ఆలోచించి దుకాణానికి బీమా చేయించాలి. అది ఊరికే రాదు. అ బీమా కిస్తీలు కూడా దుకామే భరించాలి.
మీకే ఏదన్నా కారణం వలన దుకాణం నడపటానికి విరామం ఇవ్వవలసి వస్తే? దానికి కారణం మీకో మీ యింట్లో ముఖ్యసభ్యులకో అనారోగ్యం కావచ్చును. లేదా సకుటుంబంగా ఏదన్నా ఊరు కొన్నాళ్ళు తప్పని సరిగా వెళ్ళవలసి రావచ్చును. అప్పుడు దుకాణం నడవకపోతే చాలా నష్టాలు వస్తాయి. అవన్నీ భరించే బాధ్యత దుకాణానిదే.
వస్తువుల ధరలు స్థిరంగా ఉండవు, ఉండాలని ఆశించటం తప్పు కూడా. అవి పెరిగితే ఆనందమే. మీకు మంచి లాభాలొచ్చేస్తాయి. కాని ఒక్కొక్కసారి దుకాణంలో సరుకు నింపిన కొద్దికాలానికే సరుకు ధర పడిపోతే, నష్టం వస్తుంది. దాన్ని దుకాణమే భరించాలి.
అలాగె ఒక్కొక్క సారి బజారులోనికి కొత్తరకం సరుకు వచ్చి మీదగ్గర ఉన్నదానికి అస్సలు గిరాకీ లేకపోవచ్చును. అప్పుడు దానిని ఐనకాడికి తెగనమ్ముకోవాలి. రూపాయి వస్తువును పావలాకు కూడా ఎవరూ కొనని పరిస్థితీ రావచ్చును . అలాంటి విపత్తును తట్టుకొనే శక్తి దుకాణానికి ఉండాలి.
మీ దగ్గర ఉన్న సరుకు పూర్తిగా అమ్ముడయ్యేలోగా ఎన్ని జాగ్రతలు తీసుకొన్నా కొంత సరుకు పాడైపోవచ్చును. ఆ నష్టం గురించి దుకాణదారుడికి అవగాహన ఉండాలి. అలా వచ్చే నష్టం దుకాణం తట్టుకోవాలి తప్పదు.
మీ ఉద్యోగస్థులకు జీతాలిస్తున్నారు సరే. కాని అవసరమైనప్పుడు వారికి ద్రవ్యసహాయం చెయ్యవలసి ఉంటుంది. పావలా కూడా అడ్వాన్సు ఇవ్వను దిక్కున్నచోట చెప్పుకో పో అనే వాడి దగ్గర ఉద్యోగులు ఎక్కువకాలం ఉండలేరు - ఉండరు. అందుకని అటువంటి అవసరాలకు సొమ్ము దుకాణం ఆదాయంలోనుండే కేటాయించాలి.
వ్యాపారలావాదేవీల నిమిత్తం తిరుగుళ్ళు ఉంటాయి. అవి సరుకుల ఖరీదుల్లో చేరవు. కాని అవసరమైన కర్చులే. అవన్నీ కూడా దుకాణం ఆదాయంలో నుండే వెచ్చించాలి.
మీ ఉద్యోగులకు ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగితే మీకు బాధ్యత ఉంటుంది. సొమ్ము కర్చవుతుంది. అదంతా మీ దుకాణం చూసుకోవలసిందే.
వ్యాపారం అన్నాక విస్తరణ అన్నమాటా వినిపిస్తుంది. వినిపించాలి కూడా. చిన్నదుకాణం పెద్దదవుతుంది. పెద్దదుకాణం మరొక చోటికి కూడా విస్తరించుతుంది. ఒకటికి నాలుగో పదో బ్రాంచీలూ ఏర్పడుతాయి. మరి ఇదంతా ఉత్తినే కలగనగానే జరిగేది కాదు. సినిమాల్లో ఐతే నాలుగుసార్లు రింగులురింగులు తిరుగుతున్నట్లు చూపితే ఐపోతుంది. కాని నిజజీవితంలో వాస్తవిక జగత్తులో అంత వీజీ కాదు కదా. ఎంతో శ్రమపడాలి. ఎన్నో చోట్ల ముందుచూపుతో అవసరమైన పెట్టుబడులూ పెట్టాలి. కొత్తకొత్తవి సొంత బిల్డింగులు కట్టుకోగలగాలి. ఇదంతా బోలెడు డబ్బుతో కూడిన వ్యవహారం కదా. ఈడబ్బంతా ఎవరూ ఇవ్వరు. మీ దుకాణమే సమకూర్చుతూ పోవాలి.
ఒక్కోక్క సారి సాధ్యమైతే కొత్తవ్యాపారాలూ మొదలుపెట్టాలి, ఎప్పుడూ ఒకే వ్యాపారం మీద కూర్చో కూడదు. మార్కెట్ బాగా మారిపోతే, మీ వ్యాపారం బాగా నడవక మూతబడుతుంది. కాబట్టి కాస్త నిలద్రొక్కుకున్నాక వీలును బట్టి క్రొత్త వ్యాపారాల్లోనికి వెళ్ళటానికి యత్నించాలి. దానికి కావలసిన పెట్టుబడులూ వగైరా మీ దుకాణం సమకూర్చాలి సింహభాగం.
ఇప్పటికి చాలును.
ఇలా వ్యాపారం అన్నాక అనేకానేక అంశాల ప్రభావంతో నడిచే వ్యవహారం కాని రంగనాయకమ్మ గారు చెప్పినంత సింపుల్ విషయం కాదు.
ఏ వ్యాపారంలో అన్నా సరే జీతగాళ్ళు సంస్థకు అదనపు విలువలను సమకూర్చుతారు. వ్యాపారం నడవాలంటే అది తప్పదు కాక తప్పదు. అదంతా యాజమాన్యం తినేస్తోంది అనుకోవటం అన్నిటా సరైన ఆలోచన కాదు.
ఆవిడ చెప్పిన ఉదాహరణనే తీసుకుంటే ఆర్టీసీ సంస్థకు ఉన్న అన్ని కర్చులూ ఈ అదనపు విలువనుండే కదా చెల్లించవలసింది?
ఆర్టీసీ వారు కొత్తబస్సుల్ని కొనాలంటే, ఉన్న బస్సుల మరమ్మత్తులూ వగైరాలకూ సొమ్ము అందులోనుండే రావాలి.
బస్సుకొక డ్రైవరూ, కండక్టరూ సరిపోతారా నిజంగా?
సంస్థ నిర్వహణకు అవసరమైన యాజమాన్యసిబ్బంది సంగతేమిటీ? తిన్నగా బస్సులో కనిపించని కార్మికుల సంగతేమిటీ? ఇలా బోలెడు మంది ఉంటారు కదా వారినీ సంస్థ పోషించాలి కదా?
జాగ్రతగా ఆలోచిస్తే సంస్థ నిర్వహణ వేరూ బస్సు నిర్వహణ వేరూ అన్నది తెలుస్తుంది.
అందుచేత పైపై లెక్కలు వేసి బోలెడు మిగులుతోందీ, యాజమాన్యం బొక్కేస్తోందీ అనటం సబబు కాదని అనుకుంటాను.