1, సెప్టెంబర్ 2021, బుధవారం

ఏమైపోయారు మేధావులు


ఈరోజున మనస్విని బ్లాగులో నపుంసక నాయాళ్లు  అన్న ఘౌషుద్దీన్ షేక్ గా కవితను చూసాక స్పందించాలని అనిపించింది. ఆయన ఆ కవితలో వర్తమాన సామాజిక పరిస్థితుల పట్ల సూటిగా తమ ఆవేదనను వెలిబుచ్చుతూ ఏమైపోయారు మేధావులు అని ప్రశ్నించారు.

మేధావులు ఏమైపోయారు అన్న అనుమానం అక్కరలేదండీ మనకు. మేధావులు సురక్షితంగానే ఉన్నారు. 

కొందరు మేధావులు తమతమ మేధస్సులకు పనిచెప్పుతూ‌ చుట్టూ ఉన్న సమాజాన్ని దాని మంచిచెడ్డలను గమనించేందుకు ఏమాత్రమూ తీరిక లేకుండా ఉంటారు. సాధారణంగా వాళ్ళు అనునిత్యమూ సిధ్దాంతాల గురించి పనిచేస్తూ ఉంటారు. సిధ్దాంతాలను విశ్లేషిస్తూ కొత్తకొత్త సిధ్ధాంతాలను తయారుచేస్తూ ఉంటారు. వాళ్ళకు ఈ నిర్మాణకార్యక్రమంలో ముడిసరుకు అంతవరకు ఉన్న సిధ్ధాంతాలు కాగా వారి ఉత్పత్తి కొత్తకొత్త సిధ్ధాంతాలు. చిన్నచిన్న సిధ్ధాంతాల మీద వీళ్ళు అహరహం పనిచేస్తూ కొత్తసిధ్ధాంతాలను గుర్తించే పరిశ్రమలో భాగంగా వెలువరించే విశ్లేషణలూ వ్యాఖ్యానాలూ అసలు సిధ్ధాంతాల కంటే వేల రెట్టు జటిలంగానూ చిత్రంగానూ‌ ఉంటాయి తరచుగా.  ఈతరహా మేధావుల లోకంలో సిధ్ధాంతాలూ వాటిమీద వ్యాఖ్యానాలూ ఈసామాగ్రిని అందిచిన మహానుభావులూ తప్ప మరేమీ ఉండదు. సామాన్యప్రజలూ వారిలోకవ్యవహారాలూ కష్టనషష్టాలూ అన్నీ కూడ వీరి ప్రపంచంలో ఆటలో పావుల స్థాయిలో‌ ఉంటాయి. ఒక తమాషా ఏమిటంటే యవజ్జీవం ఇలా సిధ్ధాంతాల వెనుకబడి పరిశోధిస్తూ కూడా ఈమేధావుల్లో ముప్పాతికమువ్వీసం మంది కొత్తగా కనిపెట్టి చచ్చేది ఏమీ ఉండదు.

మరి కొందరు బుధ్ధిమంతులు సిధ్ధాంతాలు చదువుకుంటూ వాటిని ప్రపంచానికి ఒప్పచెప్తూ బ్రతుకుతూ ఉంటారు. వారి దృష్టిలో అదే మానవజీవితపరమార్ధం. వీరి చిలుకపలుకులు వింటూ జనం వీరిని అసలుసిసలు మేథావులు అని నిత్యం భ్రమపడుతూ ఉంటారు. కాని వీళ్ళు వట్టి చిలుకలే.

మనకు తరచుగా మరొకరకం మనుషులు తగులుతూ ఉంటారు. వాళ్ళు మేధావుల నోట లేదా తాము మేధావులని అనుకుంటున్న చిలుకల నోట విన్న చదివిన ముక్కలు ప్రమాణవాక్యాలన్న భ్రమతో వాటి ముక్కున పెట్టుకొని వీలైన చోటల్లా వాటిని ఉటంకిస్తూ అమాయక జనం మధ్యలో తామూ‌మేధావులమే అని అనిపించుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ఎత్తిపోతలవీరుల వలన వాతావరణ కాలుష్యం మినహా మరేమీ ఉండరు.

అమాయక జనం ఈ మేధావుల్నీ చిలుకలనూ ఎత్తిపోతలవీరుల్నీ విడివిడిగా గుర్తించలేక వీళ్ళంతా మేధావులూ అని నమ్మేస్తూ ఉంటారు. 

మొదట చెప్పుకున్న సిసలైన సిధ్ధాంతం గాళ్ళు మానవ ప్రపంచంలో కాక సిధ్ధాంతప్రపంచంలో మాత్రమే‌ బ్రతుకుతున్నారు కదా. వాళ్ళకు తమ చుట్టూ ఏమి జరుగుతున్నదో తెలియదు. 

చిలుకపలుకుల బుధ్ధిమంతులకు చుట్టు ఉన్న ప్రపంచం తెలుసును. మరి వాళ్ళముందే కదా తమ పాండిత్యప్రతాపాలు చూపుకొనేది వీళ్ళు. ఐతే వాళ్ళు తెలివితక్కువ పనులు చేస్తారా? సమయానికి తగు మాటలు మాట్లాడతారు. ఏపరిస్థితుల్లో ఏసిధ్ధాంతాలు వల్లించాలో అన్వయం చేయాలో వీరికి కొట్టినపిండి. తమ పేరు ప్రఖ్యాతులను వివాదాలద్వారా ధ్వంసం చేసుకోవాలని వీళ్ళు ఎన్నడూ అనుకోరు. వారు ఏవిషయంలో ఐనా సానుకూలంగా మాట్లాడినా వ్యతిరేకంగా మాట్లాడినా తమకు అలా మాట్లాడటం పేరుప్రఖ్యాతులు రావటమో ఇనుమడించటమే‌ జరిగే పక్షంగా ఉంటేనే అలా చేస్తారు. ఒక్కోసారి కొందరు తాత్కాలికంగా తమ విశ్లేషణలూ వగైరా ద్వారా ఇబ్బందులు ఎదురుకున్నా వాళ్ళకు దీర్ఘకాలికంగా ప్రయోజనం కలుగుతుందన్న అవగాహన ఉండే ఉంటుంది - లేకపోతే అలా మాట్లాడరు.

ఇక ఎత్తిపోతల రాయుళ్ళు ఏమి ఎక్కడ ఎత్తిపోసినా అదేదో చుట్టు ఉన్న వాళ్లలో కొంచెం ఉన్నతంగా అవగాహన ఉన్నవారిలా కనిపించటం కోసం అలా చేస్తారు కాని అప్పుడప్పుడు బోల్తాపడుతూ చీవాట్లు తింటూ‌ ఉంటారు. వీళ్ళు మనసమాజంలో మహా చురుగ్గా ఉంటారు. వీళ్ళలో మనం పత్రికల్లో వ్యాసాలు వ్రాసే ప్రముఖుల నుండి సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేసే వారి వరకు అన్ని రకాల మనుషుల్నీ చూడవచ్చును.
 
సిధ్ధాంతలోకాల్లో బ్రతికేవాళ్ళకి ఏమీ‌ పట్టదు. సరే, చిలుకపలుకుల వాళ్ళు కాని ఎత్తిపోతల వాళ్ళు కాని కోరి ఇబ్బందులు తెచ్చుకోరు కదా జనంలో ఉన్నామని చెప్పి. అవసరానికి తగ్గ తాళం వేస్తూ బ్రతుకుతూ ఉంటారు.  

నిజమే నేటి భారతంలో కేంద్రంలో ఐనా ఏదైనా రాష్ట్రంలో ఐనా సరే అసహనంతో వ్యవహరించటం చూస్తున్నాం అధికారపక్షాలను. అలాగే అవకాశవాదంలో అధికారంలో లేని పక్షాలూ తామూ ఏమీ‌ తీసిపోలేదన్నట్లే మాట్లాడుతున్నాయి. వ్యతిరేకగళం పైన పాదం మోపి వ్యవహరించే రాజకీయాలను చూస్తూ మేధావులు జాగ్రతతో మాట్లాడుతున్నారు. వాళ్ళకు మేధస్సును ప్రదర్శించుకోవటం ముఖ్యం కాని ఆత్మహానికి సిధ్ధమై నిజాలను మాట్లాడటం కాదు కదా.

ఈ పై మూడు రకాల మేధావులూ సరైన వాళ్ళు కాదన్నట్లు అంటున్నాను కదా, ఇక పనుకొచ్చే‌ మేధావులే ఉండరా అంటే తప్పకుండా ఉంటారు. వాళ్ళు సమాజం కోసం తమకృషిని తాము చేస్తూనే ఉంటారు. కాని సమాజంలో కుహనామేధావుల్లా నోరుపెట్టుకొని బ్రతకటం వాళ్ళ విధానంగా ఉండదు. వాళ్ళు కార్యరంగంలో ఉంటారు. చేతల మనుషులే‌ కాని వాళ్ళు మాటల మనుష్యులు కారు. ఐతే సమాజానికి నిత్య జీవనంలో వినోదం తప్ప విజ్ఞానం అంత ముఖ్యంగా కనిపించదు. కాబట్టి నిజంగా ప్రయోజనకరమైన కార్యరంగంలో ఉండే మేధావులను గుడ్డి సమాజం గుర్తించలేదు. కాని అమాయకంగా కుహనామేధావులను మాత్రం ఏదో గొప్పవాళ్ళనుకొని వాళ్ళకు లేని విలువలను ఆపాదించి చెడుతూ ఉంటుంది.

అదీ సంగతి.

2 కామెంట్‌లు:

  1. మేధావులేం ఐపోలేదు. ఎవరి రోటి దగ్గర ఆ రోటి మేధావులు, ఆ రోటీ పాట పాడుతూనే ఉన్నారు. ఆ పాటలు మీదాకా రాలేదో! లేక మీ ట్యూన్ కి తగినట్టు లేవో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను చెప్పిన మాట కూడా ఆదే. మీరు టపా చదవకుండా మాట్లాడితే ఎలా?

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.