6, సెప్టెంబర్ 2021, సోమవారం

రామా నిన్నే నమ్మి

రామా నిన్నే నమ్మి రక్షించ మంటిని
స్వామీ సర్వాత్మనా శరణము జొచ్చితి

నానాయోనుల బుట్టి నానాబాధల నొంది
యినాటికి స్వామి నేను నరుడ నైతి
దీని పిమ్మట పొందగానైన జన్మల
నేను నరుడనొ చీమనో నక్కనో పులినో

రామా నిన్నుదలచ రాబోవు భవమున
నేమైన తెలివడి యెసగునో తెలియదే
స్వామీ నీస్పృహలేని జన్మ మెందులకయ్య
నామొర లాలించి నన్ను రక్షించరా

శక్తికొలది నామజపము చేయుట కన్న
యుక్తి నెఱుగను నాదు భక్తిని గమనించి
ముక్తినొసగ వయ్య పుట్టువు లికవద్దు
భక్తవరద రామ భవబంధమోచన