27, సెప్టెంబర్ 2021, సోమవారం

పట్టుబట్టి నీసేవా భాగ్యము నడుగక

పట్టుబట్టి నీసేవా భాగ్యము నడుగక
వట్టి ధనము లడుగు వాడను కాను
 
పడరాని పాట్లు పడి బడసిన నరజన్మ
చెడు కలి బారిని పడకుండ చక్కగ
నడుపు దైవమ వీవు నాతండ్రీ నే
నడుగరాని వడిగి నిన్నాయాస పెట్టను

కోరి నిను హృదయాన కుదురుగ నిలుపుకొని
ఆరాధించెడు నా కన్యవస్తువు లేల
నా రామచంద్రస్వామి నాతండ్రీ నిను
కోరరానివి కోరి కోపింపజేయను

పరమాత్మ నీవు నావాడవైనది చాలు
నిరతము నీపాద నీరేజముల సేవ
కరుణించ వేడుదును కొరగాని చిల్లర
వరము లిమ్మని నిన్ను బాధింపజూడను