15, సెప్టెంబర్ 2021, బుధవారం

హాయిగ శ్రీహరి నామముచేయుట యందే దృష్టిని నిలుపవయా

హాయిగ శ్రీహరి నామముచేయుట యందే దృష్టిని నిలుపవయా
మాయనుగెలిచే మార్గ మదొకటే మానక నామము చేయవయా

ఘనసాగరమగు సంసారంబును కష్టపడుచు నీదేవయ్యా
మనుజులు దాటగరానిని దీనిని మరినీ వెటు దాటెదవయ్యా
మును పిటులే పదివేలజన్మములు మునుగుచు తేలుచు నీదితివే
కనుగొన నెక్కడి వాడవక్కడే గడబిడ పడుచు నుంటివిగా
 
మాయాకల్పితసంసారాంబుధి మానవుడీదుట దుష్కరమే
ఏయుపాయమున దాటెద నోయని యెందుకు చింతించేవయ్యా
మాయయె మటుమాయమైన నిక మాయాసంసారము లేదే
మాయాగజమును హరినామాంకుశ మర్దనతో మరలించవయా

హరేరామ యని హరేకృష్ణ యని యన్నివేళలను పలుకవయా
పరాత్పరుడు శ్రీ హరికరుణించును పధ్ధతి యిదియే తెలియవయా
హరినామముచే మాయతొలగి నీకాత్మానందము కలుగునయా
నిరతము శ్రీహరినామము పలికే నరునకు మోక్షము తథ్యమయా