29, సెప్టెంబర్ 2021, బుధవారం

రామ సార్వభౌమ సుత్రామ నీవు కాక

రామ సార్వభౌమ సుత్రామనుత నీవు కాక
నామీద జాలిజూపు నాథుడెవ్వడు

సదాచార పరుడగాను సత్యవర్తనుడ గాను
మదాంధులతోడ దిరిగి మందబుధ్ధినై
సదా దుడుకు పనులజేయు శఠుడనైతి
నిదానించి రామచంద్ర నీవేయిక రక్షించుము

చేసిన పుణ్యంబు లేదు చేయని పాపంబు లేదు
మోసములకు మేరలేదు మోహాంధుడనై
నాసరి లేరనుచు తిరిగి నాశనమైతి
దాసుడను రామచంద్ర దయామయా రక్షించుము

భక్తులతో కలసితిరిగి భక్తినటన జేయుచు నే
భక్తులనే భ్రమపెట్టిన పాపినైతిని
భక్తినటన చేసిచేసి భక్తుడనే నైతినిరా
భక్తవరద రామచంద్రప్రభో వేగ రక్షించుము