23, సెప్టెంబర్ 2021, గురువారం

చాలదా నీనామము సంసారమును దాట

చాలదా నీనామము సంసారమును దాట
చాలదా యదే నీ సన్నిధికి చేర్చగ

చాలునుగా దుడుకు కామజ్వరమును తొలగించగ
చాలునుగా లోభమాత్సర్యముల త్రుంచగ
చాలునుగా మదమోహసమితి నుక్కడగించ
చాలునుగా క్రోధాగ్నుల శమియింప జేయగ
 
తాపత్రయమును బట్టి తరుముటే చాలదా
పాపసర్పగారుడమై వరలు నది చాలదా
ఆ పంచమలము లింక యణగునది చాలదా
చూపు బ్రహ్మంబుపైన సొక్కునది చాలదా

చాలు గదా శ్రీరామచంద్ర నీనామమే
చాలు గదా మేలుగా సంరక్షజేయగ
చాలు గదా దుర్భరభవచక్రమును త్రుంచగా
చాలు గదా స్వస్వరూపసంస్మరణ మీయగా