18, సెప్టెంబర్ 2021, శనివారం

నీ తప్పు లేమున్నవీ శ్రీరామ

నీ తప్పు లేమున్నవీ శ్రీరామ
నా తప్పులే యున్నవి
 
నీపాదసీమలో నిలచియుండెడు నాకు
నాపాట నీముందు నగుచు పాడెడు నాకు
భూపతనమును నిటుల పొందనేలా
ఆపసోపములతో అలమటించగ నేలా

నను నేను మరచి మాయను బొందగా నేల
నిను నేను మరచి నేలను నిలువగా నేల
నను నీవు పిలచినను విన నదేమీ
నినుజేర నిపుడింత పనవుచుందు నయ్యా

తప్పాయె తప్పాయె దయజూప రావయ్య
రప్పించుకొనవయ్య రక్షించి రామయ్య
ఇప్పుడు నినుగూర్చియే‌ పాడేను
చప్పున స్వస్థితి సమకూర్చుమో‌ అయ్య