18, సెప్టెంబర్ 2021, శనివారం

ఎవరు పొగడితే నేమి యెవరు తిట్టితే నేమి

ఎవరు పొగడితే నేమి యెవరు తిట్టితే నేమి
అవధరించి నీవు మెచ్చే వదిచాలు నాకు

పాడమనెడు వాడ వీవు పాడుటయే నావంతు
పాటను సృష్టింతు వీవు పాడి వినిపింతు నేను
పాట నీది భావము నీది పలుకుగొంతుకే నాది
పాటలోని పదములు నీవి పలుకు భాగ్యమే‌ నాది

తనువు నీవిచ్చిన దాయె దాని గొప్ప నీదేగా
మనసు నీచిచ్చిన దాయె మరి యదియు నీదేగా
వినుము రసన నీవిచ్చినదే వినిపించు పాట నీదే
కనుగొన నీ యుపకరణముగా నుండు భాగ్యము నాది
 
ఎన్ని జన్మంబుల నుండి యిట్లు నడచుచున్నదో
సన్నుతాంగ రామచంద్ర చాలదా యీభాగ్యమే
నిన్ను గూర్చి కలుగు పాట నిక్కమైన మంత్రమని
పన్నుగ లోనెఱిగి నేను పరవశించి పాడగా