6, సెప్టెంబర్ 2021, సోమవారం

అందమైన కొమ్మవు నీ వందుకేమి సందియము

అందమైన కొమ్మవు నీ వందుకేమి సందియము
సందియము లేదు నీవు జగదేకసుందరుడవు

పుత్తడిని వెన్నెలతోడ పుటము వేసి నిన్ను చేసె
నత్తగారు భూదేవియని యనిపించును నాకు
నెత్తావులన్నియు గూడ నేర్పుమీర రంగరించి
మత్తకాశిని నిన్ను మాయత్తగారు చేసిరేమో

బావగారి మేని నీలివర్ణ మప్పు గొనిన శశివో
జైవాతృకుని చలువ భావించు హరివో
నీవనుచు నిర్ణయింప నేరరయ్య భూమిజనులు
నీవా శ్రీహరివే నని నేను నిర్ణయించితిని

సీతా వెన్నెలవే నీవు శీతాంశుడను నేనే
నీ తలపు బాగున్నది నేనొక మాటందును
సీతారాములంటే లక్ష్మీనారాయణు లందును
మాతండ్రి యట్లే పలికె మనపెండ్లి చేయునాడు