28, నవంబర్ 2019, గురువారం

షట్పదలు


జిలేబీగారు షట్పదలను కెలికారు.
ఈ షట్పదలను గురించి వ్రాయటం కొంచెం అవసరం అనిపించి వ్రాస్తున్నాను.

జిలేబీగారి షట్పదాసమరోత్సాహం గురించి చెప్పాలంటే దానికి కారణం శరషట్పద. అది వారి మాటల్లో "భలే బాగుంది. నో యతి‌ నో ప్రాసల ఝంఝాటపు ఝంకృతి" కావటమే అని తెలుస్తున్నది.  జిలేబీ గారి షట్పదను తిలకించి తరిద్దాం

షట్పద మొనరిం
చునొక్కొ ఝంకా
రమ్మున్ జిలేబి శరషట్పద
మిదియె సుమా సుల
భమైనది నేర్వ
గా ప్రాసయతులు లేవు సుమా

ఇలా షట్పదను వ్రాయాలంటే "రెండు నాల్గు మాత్రలు, రెండు నాల్గు మాత్రలు, మూడు నాల్గు మాత్రలు ఒక రెండు మాత్రలు.. రిపీట్ మాడి." అని సంబరపడిపోయారు. కాని షట్పద యొక్క నాడిని పట్టుకోవటానికి ఆట్టే ప్రయత్నించలేదు. చివరికి షట్పద మాడి చచ్చిందని చెప్పకతప్పదు.

ఈ శరషట్పదను గురించి ఛందం పేజీలో కొంత సమాచారం ఉంది. అది ఈ క్రింద చూపుతున్నాను జనసౌలభ్యం కోసం
.

శర షట్పద పద్య లక్షణములు
జాతి(షట్పదలు) రకానికి చెందినది. 4 నుండి 14 అక్షరములు ఉండును. 6 పాదములు ఉండును. ప్రాస నియమం లేదు

ఒకటవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును. రెండవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును. మూడవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.
నాలుగవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును. ఇదవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును. ఆరవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.

ఈ లక్షణాలను ఉటంకిస్తూ జిలేబి గారి వరూధిని బ్లాగులో శర్మ గారు కొంచెం వివరణ కావాలని అడిగారు.

అన్నట్లు ఆ ఛందం పేజీ వారు ఎక్కడి నుండి తెచ్చారో కాని ఈ క్రింది ఉదాహరణను ఇచ్చారు శరషట్పదికి

  శ్రీతరుణిరొ నే
  శ్రీరఘురాముడ
  చేరి కవాటము తీవే
  ఖ్యాతిగ శ్రీరఘు
  రాముడవైతే
  కోతుల జేరగదోయీ

పై వివరాలను గురించి కొంచెం ఆగి చర్చిద్దాం. ముందుగా షట్పదల గురించి వివరంగా తెలుసుకుందాం.

షట్పదలు కన్నడ ఆంధ్ర ఛందస్సులు రెండింటిలోనూ కనిపిస్తాయి. కన్నడంలో వీటికి ప్రాచుర్యం ఉంది - ముఖ్యంగా భామినీషట్పదకు. ఐతే తెలుగులో వీటికి కవిజనామోదం లేదు. ఎవరూ తమ కావ్యాల్లో వాడింది లేదు. కేవలం తెలుగులాక్షణికులు సమగ్రత కోసం షట్పదలను కూడా తమ పుస్తకాల్లో ప్రస్తావించటమూ వివరించటమూ చేసారంతే.

ఈ షట్పదులు పదఛ్ఛందాలు. మాత్రాఛందస్సులులతో నడుస్తాయి. అందుచేత, కవులు - అంటే ముఖ్యంగా మన తెలుగుకవులు గమనించవలసిన సంగతి ఒకటి ఉంది. ఈ షట్పదులు గేయగతులు కలిగి ఉన్నాయన్నది. ఐనా సరే, మన తెలుగులాక్షణికులు తమ పుస్తకాలలో వీటికి గణవ్యవస్థను గురించి నిర్దేశించటానికి దేశిగణాల సహాయంతో ప్రయత్నం గట్టిగా చేసారు. కన్నడంలో ఈ షట్పదలకు మాత్రాఛందస్సుల్లోనే లక్షణాలు చెప్పబడ్దాయి.

మల్లియ రేచన తన కవిజనాశ్రయంలో షట్పదకు ఇచ్చిన లక్షణం చూడండి

ఇంద్ర + ఇంద్ర
ఇంద్ర + ఇంద్ర
ఇంద్ర  + ఇంద్ర + చంద్ర
ఇంద్ర + ఇంద్ర
ఇంద్ర + ఇంద్ర
ఇంద్ర  + ఇంద్ర + చంద్ర

ఇలా 6 పాదాలకు లక్షణం. ఇక్కడ మొదటి మూడు పాదాలు పూర్వఖండం, చివరి మూడు పాదాలూ ఉత్తరఖండం. అని స్పషంగా మనకు కనిపిస్తున్నది పై లక్షణ సౌష్టవాన్ని బట్టి.  రేచన కూడా మూడు పాదాల త్రిపద లక్షణం చెప్పి, దానిని రెట్టించితే అది షట్పద అని చెప్పాడు.

కాని ప్రాస ఎలాగు అన్నది అయన చెప్పిన విధానం చూస్తే పద్య లక్షణం ఇలా ఉంటుంది.

ఇంద్ర + ఇంద్ర + ఇంద్ర + ఇంద్ర
ఇంద్ర  + ఇంద్ర + చంద్ర
ఇంద్ర + ఇంద్ర + ఇంద్ర + ఇంద్ర
ఇంద్ర  + ఇంద్ర + చంద్ర

ఇలా షట్పదను సంప్రదాయిక చతుష్పాత్తుగా భావించి ప్రాస నియమం యథావిధిగా పాటించాలి అని రేచన ఉద్దేశం అన్నమాట.

ఈ అభిప్రాయాన్ని అతడు ఇచ్చిన ఉదాహరణ బలపరుస్తున్నది. లక్షణపద్యంగా రేచన ఇచ్చిన షట్పదను చూడండి

త్రిదశేంద్రగణములు
వెలయ నిర్మూడిడి
కదియ నంత్యంబున జంద్రు గూర్చి
తుది యిట్లుగా మది
జెప్పిన నదియ ష
ట్పదమగు మల్లియ రేచనాఖ్య

ఈ పద్యాన్నే చతుష్పాత్తుగా పైన చెప్పిన విధంగా వ్రాస్తే, ప్రాస యుక్తంగా ఇలా ఉంటుంది.

త్రిశేంద్రగణములు వెలయ నిర్మూడిడి
దియ నంత్యంబున జంద్రు గూర్చి
తుది యిట్లుగా మదిజెప్పిన నదియ ష
ట్పమగు మల్లియ రేచనాఖ్య

వావిళ్ళ వారు ప్రచురించిన కవిజనాశ్రయంలో కూడా ఇలాగే ఉన్నది.

కవిజనాశ్రయకారుడి దష్టిలో షట్పద అంటే త్రిపదకు రెట్టించిన లక్షణం. నాలుగు పాదాలు కానిదే పద్యం కాదన్న ఉద్దేశంతో షట్పదను నాలుగు పాదాలుగా వ్రాసి ప్రాసనుంచాలని రేచన ఉద్దేశం కావచ్చును.

మధ్యేమార్గంగా నాకీ ఉపాయం తోస్తున్నది. విజ్ఞులు ఆలోచించాలి.

త్రిదశేంద్రగణములు
    వెలయ నిర్మూడిడి
కదియ నంత్యంబున జంద్రు గూర్చి
తుది యిట్లుగా మది
    జెప్పిన నదియ ష
ట్పదమగు మల్లియ రేచనాఖ్య

సీసపద్యంలో మనం ఒక ఆధునిక విధానం చూస్తున్నాం. ప్రథాన భాగం నాలుగుపాదాలనూ రెండేసి ముక్కలుగా వ్రాస్తున్నాం. పూర్వార్థం నాలుగు ఇంద్రగణాలు ఒక భాగం వ్రాసి,  ఉత్తరార్థం రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలను కొంచెం ఎడమిచ్చి క్రిందుగా వ్రాస్తున్నాం. కాని పూర్వకాలం ప్రతుల్లో మొత్తం 8గణాలనూ బారుగా వ్రాయటం చేసేవారని గమనించవచ్చును. అందుకని మనం షట్పదలో 2,5 పాదాలను కూడా కొంచెం ఎడమిచ్చి వ్రాస్తే ప్రాస చక్కగా కనిపిస్తూ ఉంటుంది.

మల్లియరేచన వివేచన చూసాం కదా. ఒక్క రేచన తప్ప మిగిలిన లక్షణకారులు మొత్తం ఆరు పాదాలుగా షట్పదను భావించి ప్రాసను పాటించారు.

షట్పదుల్లో ప్రాస విషయం గురించి ముచ్చటించున్నాక యతి నియమం గురించి కూడా చెప్పుకుందాం.

షట్పది లోని పొట్టిపాదాలకు రెండేసి ఇంద్రగణాలు మాత్రం ప్రమాణదైర్ఘ్యంగా ఉంది. అంటే ఈపాదాల నిడివి మాత్రల్లో 8 నుండి 10 వరకూ వస్తుందంతే. అక్షరసంఖ్యను గమనించినా 6 నుండి 8 అక్షరాలు మాత్రమే. ఇంత చిన్నపాదాలకు యతి స్థానం నిర్దేశించటం సంప్రదాయం కాదు. అందుచేత పొట్టిపాదాలను వాటిమానాన వాటిని వదిలి వేయవచ్చును.

షట్పదలోని రెండు పొడుగుపాదాలైన 3వ మరియు 6వ పాదాలకు చెరొక చంద్రగణమూ అదనంగా ఉంది. చంద్రగణాలను గురించి కొంచెం ఆగి పరిశీలిధ్ధాం. మొత్తం మీద ఈ రెండుపాదాలూ తగినంత అక్షర మరియు మాత్రాదైర్ఘ్యాలను కలిగి ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చును. అందుచేత కొందరు లక్షణ కారులు అంటే విన్నకోట పెద్దన, అనంతుడు చంద్రగణం ప్రారంభంతో యతిమైత్రిని పాటించారు. వీరు ఇలా యతిని పాటించటం కేవలం వారి ఉదాహరణల్లో యాదృఛ్ఛికం కావచ్చును. ఎందుకంటే యతిమైత్రి పాటించాక పాదం నిడివి ఒక్కగణం మాత్రమే కద.

అప్పకవి షట్పదికి నిర్యతి అన్నాడు. అనంతుడు దీన్ని వళ్ళుదొఱగ వ్రాయాలి అన్నాడు. ఇలా ఇద్దరూ యతి లేదనే చెప్పారు. కన్నడంలో కూడా యతి నియమం లేదు. తెలుగులో యతినియమం లేని పద్యం ఇదొక్కటేను!

ఇకపోతే చంద్రగణం గురించిన చర్చ ఒకటి మిగిలింది. దీర్ఘపాదాలు రెండూ చంద్రగణంతో ముగుస్తాయి కద. మన చర్చకు సంబంధించనంత వరకు చంద్రగణం అంటే 6 లేదా 7 మాత్రల ప్రమాణం కలది అని చెప్పుకుంటే సరిపోతుంది.

చంద్రగణం అనే కాదు మనం ఇప్పటిదాకా లక్షణకారులు ఇంద్రగణం అన్నదానిని గురించి కూడా ఒక ముఖ్యమైన ముక్క తప్పకుండా చెప్పుకోవాలి. నిజానికి ఇంద్రగణాలుగా షట్పదల్లో గణాల వాడుక లేనే లేదు. అవన్నీ మాత్రాగణాలు. గణం కొలత 3, 4 లేదా 5 మాత్రలు. కొన్ని రకాల షట్పదల్లో ఒకగణం బదులుగా గణద్వయం ఉంటుంది అంటే 4 + 4 లేదా  3 +4 వగైరాగా దీర్ఘగణాలుగా. అందుచేత లక్షణం పుస్తకాలు చూసి ఇంద్రగణాలూ చంద్రగణాలు అంటూ ప్రయత్నిస్తే షట్పదలు రావు.

మరొక ముఖ్య విషయం. షట్పదలయ్యేది మరొక దేశి చందస్సు అయ్యేది  కూడని పనులు కొన్ని ఉన్నాయని గమనించాలి.

గణసంకరం పనికిరాదు.  4 మాత్రల గణాలు రెండు అన్నామనుకోండి. మొత్తం 8 మాత్రలు కదా అని 5 + 3 మాత్రలుగా వచ్చేలా వ్రాయకూడదు.  ఉదాహరణకు రాజకుమారుడు అన్నది నప్పుతుంది కాని రాకుమారకుడు అన్నది నప్పదు.

ప్రవాహగుణం వర్జించాలి. పాదాలు కొత్త మాటలతో మొదలు కావాలి. అంటే పాదం చివర మాట పూర్తికావాలి కాని తరువాయి పాదంలోనికి విస్తరించకూడదు.

ఇంకా కొన్ని ఇలాంటి నియమాలున్నాయి కాని ముఖ్యంగా ఈపై రెండూ గుర్తుపెట్టుకోవాలి. ఈ నియమాలు తేటగీతి ఆటవెలది కందం వంటి వాటికీ వర్తిస్తాయి, ఇక్కడ షట్పదలకూ వర్తిస్తాయి.

కన్నడంలొ 6 రకాల షట్పదలున్నాయి.  తెలుగులోనూ అవే. వాటి గురించి చర్చించకుండా ఈవ్యాసం సంపన్నం కాదు. అందుకని వాటిని పరిశీలిద్దాం. ఈ చర్చకు మనం మాత్రాఛందస్సులను వాడుతున్నాం అని గమనించండి.

శరషట్పద.

4 + 4
4 + 4
4 + 4 + 4 + 2
4 + 4
4 + 4
4 + 4 + 4 + 2

ఇక్కడ సాధారణగణాలన్నీ 4 మాత్రల గణాలు. దీర్ఘపాదాలు 4 + 2 = 6 మాత్రల గణంతో ముగుస్తాయి.

ప్రసిధ్ధమైన భగగోవింద స్తోత్రం చూడండి

భజగోవిందం
భజగోవిందం
గోవిందంభజ మూడమతే
సంప్రాప్తే స
న్నిహితే కాలే
నహినహి రక్షతి డుకృన్కకరణే

దీన్ని స్ఫూర్తిగా తీసుకొని శ్రీశ్రీ వ్రాసినది చూడండి

మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరోప్రపంచం పిలిచిందీ
పదండి ముందుకు
పదండీ త్రోసుకు
పోదాం పోదాం పైపైకీ

ఈ రెండింటిలో ప్రాస గురించి అడక్కండి. సంస్కృతంలో ప్రాసనియమం ఎలాగూ లేదు. శ్రీశ్రీది ఆధునిక కవిత్వం కాని పద్యకవిత్వం కాదు కాబట్టి యతిప్రాసల పట్టింపు లేనేలేదు!

రామదాసు గారి ప్రసిధ్ధకీర్తన ఒకటి తారకమంత్రము కోరిన దొరకెను అన్నది చూడండి.

తారక మంత్రము
కోరిన దొరికెను
ధన్యుడ నైతిని ఓ రన్నా
మీరిన కాలుని
దూతల పాలిటి
మృత్యువు యని మది నమ్మన్నా

ఇది కూడా శరషట్పద ఛందంలో ఉన్న గేయమే. ఐతే ప్రాసనియమం పాటించలేదు.  గేయాల్లో ప్రాసనియమం ఐఛ్ఛికం కదా. కాని మనం శరషట్పదను పద్యరూపంగా వ్రాసినా దాని గేయపు నడకకు అన్యాయం చేయకూడదు. పద్యం అన్నాక దానికి ఉన్న ప్రాసనియమం మరువకూడదు.

కుసుమషట్పద

5 + 5
5 + 5
5 + 5 + 5 + 2
5 + 5
5 + 5
5 + 5 + 5 + 2

ఇక్కడన్నీ పంచమాత్రాగణాలు. అన్నీ ఇంద్రగణాలు కావాలని గమనించండి. దీర్ఘపాదాల్లో చివరిది 7మాత్రల గణం కావాలి - వీటిని పంచమాత్రా ఇంద్రగణం పైన గురువుగా సాధించాలి.

అనంతుడి ఛందో దర్పణంలోని ఉదాహరణ చూడండి.

మెఱయంగ నిద్ద ఱి
ద్దఱు సురేంద్రులు మూడు
తెఱగులన్‍ శశిగూడ నర్దంబులన్‍
నెఱిగ్రాలగా వళ్ళు
దొఱగ షట్పద రీతి
వఱలు జక్రి పదాబ్జ వర్ణనంబుల్

ఇది కొఱకరాని కొయ్యలా ఉంది కదూ.  ఒక ఆధునిక కవితను చూడండి

స్వప్నాలలో నన్ను
స్వర్గాల తేలించి
ఆనందమున ముంచివేసావురా

భోగషట్పద

3 + 3 + 3 + 3
3 + 3 + 3 + 3
3 + 3 + 3 + 3 + 3 + 3 + 2
3 + 3 + 3 + 3
3 + 3 + 3 + 3
3 + 3 + 3 + 3 + 3 + 3 + 2

ఇక్కడ ఒక్కొక్క గణం స్థానంలోనూ  3+ 3 అని ఆరు మాత్రల కాలవ్యవధిని వాడాలి.

కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చును కాని ఇది తెలుగులో మంచి ప్రచారంలో ఉన్న షట్పద గేయ విధానం.

భద్రాచల రామదాసు గారి సాహిత్యంలో చూడండి

రామచంద్రాయ జనక
రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహితమంగళం

అన్నది భోగషట్పద నడకలో ఉంది.  మీకు గణవిభజనకు కుదరటం లేదు కదూ?

ఒక్క విషయం. రామదాసు గారిది గేయం. పద్యం కాదు. గేయంలో నడక కోసం అవసరమైన చోట అక్షరాల/మాటల మీద కాలవ్యవధిని పెంచటం కుంచించటం చేస్తాం. తప్పులేదు. ఇప్పుడు కాలవ్యవధానంతో చూదాం.

రామ।  చం।  ద్రాయ।  జనక।
రాజ।  జామ।  నోహ।  రాయ।
మామ।  కా।  భీష్ట।  దాయ।  మహిత।  మంగ।  ళం

ఈ పాట అందరికీ సుపరిచితమే కాబట్టి ఒక్కసారి పాడుకొని చూడండి. ఈకుసుమషట్పద నడక చక్కగా తెలుస్తుంది.

మరొక ఉదాహరణ

తులసి।  నింట।  నుంచు।  వార్ని
తులసి।  పూజ।  జేయు।  వార్ని
తులసి।  యందు।  భక్తి।  యుంచి।  కొలుచు।  వారి।  నీ

భామినీ షట్పద

3 + 4 + 3 + 4
3 + 4 + 3 + 4
3 + 4 + 3 + 4 + 3 + 4 + 2
3 + 4 + 3 + 4
3 + 4 + 3 + 4
3 + 4 + 3 + 4 + 3 + 4 + 2


ఇక్కడ గణప్రమాణంగా 3 + 4 అని విభజన చూడండి. ఈభామినీషట్పద కన్నడంలో కన్నడకస్తూరి అన్న పేరు పొందిన ఛందం. 3 +4 = 7 మాత్రల ప్రమాణం కాలం ఉన్న మాటలు తెలుగులో అంత సహజం కావు. కాని 7 మాత్రలూ ఒకే మాట కానవసరం లేదు. కాని 7 మాత్రలకు ఒకసారి పదం విరగటం జరగాలి.

ఒక ప్రసిధ్ధమైన గేయం దీనికి మంచి ఉదాహరణ.

గుమ్మడేడే గోపిదేవీ
గుమ్మడేడే కన్నతల్లీ
గుమ్మడిని పొడసూప గదవే అమ్మ గోపెమ్మా

ఇది కూడా విభాగం చేసి చూపితే కొంచెం స్పష్తపడుతుంది.

గుమ్మ।  డేడే।  గోపి।  దేవీ
గుమ్మ।  డేడే।  కన్న।  తల్లీ
గుమ్మ।  డిని పొడ।   సూప గదవే।   అమ్మ గోపె।  మ్మా

పరివర్ధిని షట్పద

ఇది శరషట్పదకు రెట్టింపు పొడుగు పాదాలతో ఉంటుంది

4 +  4 + 4 + 4
4 +  4 + 4 + 4
4 +  4 + 4 + 4 + 4 + 4 + 2
4 +  4 + 4 + 4
4 +  4 + 4 + 4
4 +  4 + 4 + 4 + 4 + 4 + 2

ఇక్కడ 4 +  4 = 8 మాత్రల కాలం ఒక గణప్రమాణం. దీర్ఘపాదాల్లో చివరి 2 మాత్రలూ ఒక గురువు. ఒక్క విషయం గమనించండి 4 + 4 అన్నారు. 5 +  3 అని విడదీయ కూడదు 8 మాత్రల్ని. అంటే 4 మాత్రల ఇంద్రగణాలనే వాడాలి. ఇక్కడ చంద్రగణం అంటే రెండు ఇంద్రగణాల పైన ఒక గురువు అన్నమాట.

వార్ధక షట్పద

5 + 5 + 5 + 5
5 + 5 + 5 + 5
5 + 5 + 5 + 5 + 5 + 5 + 2
5 + 5 + 5 + 5
5 + 5 + 5 + 5
5 + 5 + 5 + 5 + 5 + 5 + 2

దీని వైనం కుసుమషట్పదకు రెట్టింపు అన్నమాట. ఇక్కడ అన్నీ 5 మాత్రల ఇంద్రగణాలనే వాడాలి. ఇక్కడ చంద్రగణం అంటే 5 మాత్రల ఇంద్రగణం పైన ఒక గురువు అన్నమాట.


ఇంకా కొన్ని షట్పద విశేషాలున్నాయి. తలషట్పద, జలషట్పద,  విషమషట్పద, ప్రౌఢషట్పద అంటూ.  వాటి గురించి ప్రస్తుతం చర్చించటం లేదు.  ఈవ్యాసం పాఠకుల్లో ఎవరికనా అసక్తి ఉంటే వాటిని వివరిస్తాను.

అలాగే షట్పదల నడకలూ వగైరా గురించి కూడా వ్రాయదగిన సామాగ్రి కొంత ఉంది. ఐతే క్లుప్తంగా ఒక్క విషయం చెప్తాను. ముందే మనవి చేసినట్లుగా షట్పదలు గేయఛందస్సులు. అందుచేత పాడటానికి అందగా ఉండేటట్లుగా వ్రాస్తే వాటికి సార్ధకత వస్తుంది. కేవలం మాత్రలు కిట్టించి ఇదిగో షట్పద అనేస్తే అది ఒక సర్కస్ ఫీట్ అవుతుందేమో కాని అదొక షట్పద మాత్రం కాదు.

ఇప్పుడు షట్పదల యొక్క స్థూలస్వరూపం గురించి మనకు చక్కగా బోధపడి ఉండాలి. ఈ షట్పద యొక్క నిర్మితి ఇలా ఉంటుంది

X + X
X + X
X + X + X + U
X + X
X + X
X + X + X + U

ఇక్కడ U అంటే ఒక గురువు. X అంటే ఒక మాత్రాగణం. అది 4,5,6 ఇలా ఎంతైనా ఉండవచ్చును.

ఈ షట్పదలకూ రగడలకూ మంచి దగ్గరచుట్టరికం ఉంది.

భోగషట్పద అన్నది హాయప్రచార రగడ. ఇది త్రిస్రగతిలో త్రిమాత్రలతో నడుస్తుంది
శరషట్పద అన్నది మధురగతి రగడ. ఇది చతుర్మాత్రలతో నిర్మితమై చతురస్రగతిలో నడుస్తుంది.
కుసుమషట్పద అన్నది ద్విరదగతి రగడ. ఇది పంచమాత్రాప్రమాణమై ఖండగతిలో నడుస్తుంది.
భామినీషట్పద అన్నది హరిణగతి రగడ. ఇది  4 + 3 మాత్రల మిశ్రమగణంతో నిర్మితమై మిశ్రగతిలో నడుస్తుంది.

మనం శరషట్పదకు రామదాసస్వామిగారి కీర్తన  తారకమంత్రము కోరిన దొరకెను అన్నది ఒకటి ఉదాహరణగా చెప్పుకున్నాం కదా.  దానిని మరొక సారి చూదాం.

తారక మంత్రము
కోరిన దొరికెను
ధన్యుడ నైతిని ఓ రన్నా
మీరిన కాలుని
దూతల పాలిటి
మృత్యువు యని మది నమ్మన్నా

ఇందులో మీకు యతిమైత్రి కనిపించటం లేదు కదా. కాని మనం దీనిని రగడగా వ్రాస్తే అది ఇలా ఉంటుంది.

తాక మంత్రము కోరిన దొరికెను న్యుడ నైతిని ఓ రన్నా
మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని మది నమ్మన్నా

ఇది మధురగతి రగడ. ఇక్కడ ర అన్నది ప్రాసగా చక్కగా కనిపిస్తోంది కదా. అలాగే తా-ధ లకూ మీ-మృ లకూ యతిమైత్రి కూడా కనిపిస్తోంది కదా.

తెలుగు సాహిత్యంలో రగడలు చెప్పుకోదగినంత స్థానం పొందాయనే అనవచ్చును. అంటే కందాల్లాగా సీసాల్లాగా కవులెవ్వరూ వాటిని విస్తారంగా వాడలేదు. కాని దాదాపుగా అందరు పెద్దకవులూ తమ కావ్యాల్లో కనీసం ఒకటి రెండు చోట్ల నైనా రగడలను వినియోగించారు. సాధారణంగా రగడలను ఎవ్వరూ నాలుగుపాదాల పద్యాల్లాగా వ్రాయరు. రగడను ఎప్పుడు అందరూ ఒక మాలికలాగా వ్రాస్తారు. ఐదారు పాదాలు కాదు కనీసం పదహారు పాదాలుంటాయనే అనవచ్చును. రగడలను గురించి వేరుగా ఇంకొక వ్యాసంలో వివరిస్తాను.

కాని రగడలకు యతిప్రాస నియమాలు వృత్తాలకు వలెనే ఉన్నాయి. అవి మాత్రాగణాల్లో వ్రాయబడతాయన్నది నిజం.

తారకమంత్రము కీర్తన మధురగతి రగడగా ఉందని పైన చూసాం కదా. అందులో యతి ప్రాసలనూ గమనించాం. ఇలా కాకుండా రగడలోని పాదాన్ని విడిగా యతిరహితంగా బహుపాదాల్లో వ్రాయటంలో కవులకు పెద్దగా సారస్యం కనిపించక పోవటంలో ఆశ్చర్యం లేదు. కనీసం ప్రాసనియమాన్ని పాటించితే ఇలా షట్పదల వలె వ్రాసినా కొంతలో కొంత మెఱుగుగా ఉంటుంది. లేని పక్షంలో రగడను నిర్వహించలేక దాన్ని షట్పద అన్నాడు కవి అని పాఠకులు అనుకొనే ప్రమాదం దండిగా ఉంది. అందుచేత తెలుగుకవులు షట్పదలను కావ్యనిర్మాణాల్లో విసర్జించారు.

ఆదునిక కాలంలో కవిత్వపు ధోరణి చాలా మారింది. పొట్టిపొట్టి కవిత్వాలకు ఆదరణ పెరిగింది. యతిప్రాసల వైముఖ్యం కూడా బాగానే పెరిగింది. ఒకప్పుడు లబ్ధప్రతిష్ఠుడైన మైఖేల్ మదుసూదన దత్‍ అనే బెంగాలీ కవి ఇలా యతి ప్రాసలవంటివి త్రోసివేసి మేఘనాథవధ అన్న కావ్యం వ్రాసాడు. సంప్రదాయ కవిత్వం బాగా చెప్పగలిగిన శ్రీశ్రీ తన ధోరణికి అంటే అధునాతన భావజాలాన్ని జనబాహుళ్యానికి అందించటానికి పాతఛందస్సులూ పాతధోరణులూ నప్పవని వచనలో కవిత్వం వ్రాసాడు.

ఈరోజున వచనకవిత్వం పేర వస్తున్నది అంతా కవిత్వం అనలేం. అలా వ్రాస్తున్నాం కవులం అనుకొనే వారిలో చాలా మందికి సరైన భాషాజ్ఞానం కూడా ఉండటం లేదు.

అందుచేత నవీనకాలానికి తగినట్లుగా యతిప్రాసలు లేకుండా చిన్న చిన్న వృత్తాలూ దేశిఛందస్సులూ వాడుక చేయాలనుకొనే వారికి షట్పదలు రుచించే అవకాశం ఉంది. ఐతే దేశి ఛందస్సులో మూలసూత్రాలను కూడా విసర్జిస్తే అవి ఎంతగా నచ్చజెప్పినా గోలపెట్టినా సరైన కవితలు కాలేవు.

26, నవంబర్ 2019, మంగళవారం

తిరమై యుండున దేది తెలియగను


తిరమై యుండున దేది తెలియగను దాని
నరుడు పొందున దెట్లు నమ్మకముగను

ధనములిచ్చు గౌరవములు మనుజున కా
ధనములట్లు చంచలములు ధారుణి బంధు
జనులిచ్చు గౌరవములు మనుజున కా
ధనము కొఱకు పుట్టు గాక తనకవి తిరమా

కులము వలన విద్య వలన గౌరవంబులు
కలుగు గాక గొప్ప యేమి యిలను విడచుచో
కులుకుచును తనవెంట కొనిపోడే
దులుపుకొని పోవుసరుకు తోడా తిరమా

హరిభక్తి కలిగిన దేని యదియే తిరము
తరియించు భవమును తా నొగి బుట్టిన
హరిభక్తుడే యగు నరుడందుచే
మరువ రాదు రామనామ స్మరణ మెన్నడు

25, నవంబర్ 2019, సోమవారం

పావులూరి మల్లన గణితంలో ఒకపద్యం.


ఈరోజున  పావులూరి గణితము - ఒక సందేహము అన్న ఒక టపాను చూడటం జరిగింది. అందులో పావులూరి మల్లన గణితంలోనిదిగా ఈ క్రింది పద్యం ఉటంకించారు.

శరశశి షట్కచంద్ర శరసాయక రంధ్ర వియన్నగాగ్ని భూ
ధర గగనాబ్ధి వేదగిరి తర్కపయోనిధి పద్మజాస్య కుం
జరతుహినాంశు సంఖ్యకు నిజంబగు తచ్చతురంగ గేహ వి
స్తరనగు రెట్టి రెట్టి తగు సంకలితంబు జగత్ప్రసిద్ధికిన్

టపా చివరన బ్లాగరు గారు నాకేమాత్రమూ అర్థం కాలేదు. మీకెవరికన్నా అర్థమైతే, ఆ పద్యం నుండి ఆ సంఖ్య ఎలా వచ్చిందో చెబుతారా? అని అడగటం జరిగింది.

సమాధానం కొంచెం పెద్దది కాబట్టీ, విస్తృతపాఠకలోకోపయోగిగా ఆ సమధానం ఉండబట్టీ ఇక్కడ ఒకటపాగా వ్రాస్తున్నాను.

ఈపద్యంలో చాలా సంస్కృతపదాలున్నాయి. ఆ పదాలు అంకెలను తెలుపుతాయి. అదెలాగో చూదాం.


  1. శర అంటే 5. శరములు అంటే మన్మథుడి బాణాలు ఐదు అన్నది ఇక్కడ లెక్క. 
  2. శశి అంటే 1. సూర్యచంద్రులు ఒక్కొక్కరే. అందుకే శశి అదే చంద్రుడు అని వచ్చింది కాబట్టి లెక్క 1.
  3. షట్క అంటే 6. షట్కము అంటే అరు అని సూటిగా చెప్పేసాడు ఇక్కడ.
  4. చంద్ర అంటే 1. ఈ విషయం ముందే చెప్పుకున్నాం కద.
  5. శర అంటే 5. ఇది కూడా ముందే చెప్పుకున్నాం.
  6. సాయక అంటే 5. సాయకము అన్నా శరము అన్నా ఒక్కటే. కాబట్టి 5 అని లెక్క.
  7. రంధ్ర అంటే 9. నవరంద్రముల కాయము అని ప్రతీతి. అందుచేత రంద్రములు 9కి గుర్తుగా ఇక్కడ లెక్క 9.
  8. వియత్ అంటే 0. వియత్తు అంటే ఆకాశం. ఆకాశం గగనం శూన్యం అని లెక్క.
  9. నగ అంటే 7. హిమవంతము, వింధ్యము, నిషధము, మాల్యవంతము, పారియాత్రము, గంధమాదనము, హేమకూటము అని కులగిరులు 7. కాబట్టి ఇక్కడ లెక్క 7.
  10. అగ్ని అంటే 3. గార్హపత్యాగ్ని, దక్షిణాగ్ని, ఆహవనీయాగ్ని అని అగ్నులు మూడు. కాబట్టి లెక్క 3.
  11. భూధర అంటే 7 అంటే  పైన చెప్పిన కులగిరులే. ఇక్కడా లెక్క 7.
  12. గగన అంటే 0. అకాశం గగనం శూన్యం అంటే 0 అని ముందే చెప్పుకున్నాం కదా.
  13. అబ్ధి అంటే 4. ఇక్కడ కొంచెం గందరగోళం ఉంది. మన సప్తసముద్రాలు అని వింటూ ఉంటాం  అవి లవణసముద్రము,  ఇక్షుసముద్రము, సురాసముద్రము, సర్పిస్సముద్రము,  దధిసముద్రము,  క్షీరసముద్రము,  జలసముద్రము. నాలుగుసముద్రాలు అని వేరే లెక్క ఉంది. మనం ప్రవర చెప్పుకొనేటప్పుడు చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు అని మొదలుపెడతాం కదా. భూగోళంపై నాలుగుదిక్కుల అంచులవరకూ విస్తరించి  ఉన్నసముద్రాల గురించిన సంగతి ప్రస్తావిస్తున్నారు. ఇదీ ఇక్కడి లెక్క.  కాబట్టి ఇక్కడి లెక్క 4.
  14. వేద అంటే 4. చతుర్వేదములు అని అందరకూ తెలుసును. అందుకని లెక్క 4.
  15. గిరి అంటే 7. అంటే ముందు చెప్పుకున్న కులగిరులే. మరలా లెక్క 7.
  16. తర్కఅంటే 6. తర్కశాస్త్రం ప్రమాణాల ఆధారంగా నిజానిజాలను లెక్కించుతుంది. ఆ ప్రమాణాలు ఆరు. అవి ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అర్థాపత్తి,  అనుపలబ్ధి అనేవి. కాబట్టి ఇక్కడ లెక్క 6.
  17. పయోనిధి అంటే 4. పయోనిధి అంటే సముద్రం అని అర్థం. పయోనిధులు ముందు చెప్పుకున్నట్లుగా 4.
  18. పద్మజాస్య అంటే 4.  పద్మజుడు అంటే బ్రహ్మ. అతడి అస్యములు అంటే ముఖాలు ఎన్ని? అవి 4 కదా.
  19. కుంజర అంటే 8. పురాణాల ప్రకారం అష్టదిగ్గజాలు అని ఉన్నాయి. వాటి పేర్లు ఐరావతము, పుండరీకము, వామనము, కుముదము, అంజనము, పుష్పదంతము, సార్వభౌమము, సుప్రతీకము. అందుకని ఇక్కడి లెక్క 8.
  20. తుహినాంశు అంటే 1.  తుహినం అంటే మంచు. తుహినకరుడు అంటే చంద్రుడు. చంద్రుడికి సంకేతం 1 అని ముందే చెప్పుకున్నాం.


అంకానాం వామతో గతిః అని నియమం. కాబట్టి తుహినాంశు నుండి వెనక్కు అంకెలను పేర్చుకుంటూ వెళ్ళాలి. అలా చేస్తే మనకు వచ్చే ఫలితం 18446744073709551615 అవుతుంది. ఇది 2 ^ 64 -1 కు సమానం.

మొదటి గడిలో ఒక గింజ అంటే 1 ఇది 2 ^ 0 కు సమానం. రెండవగడిలో రెండు గింజలు అంటే అది 2 ^ 1 కు సమానం. ఇక మూడవగడిలో దీనికి రెట్టింపు అంటే 4 గింజలు అన్నది 2 ^ 2 కు సమానం. ఇలా చివరకు 64వ గడిలో ఉండే గింజల సంఖ 2 ^63 అవుతుంది. ఈ గింజలన్నీ కలిపితే వచ్చే రాశి విలువ

2 ^ 0  + 2 ^ 1 + 2 ^ 2 + ......... 2 ^ 63

ఈ సంకలనం విలువ గణిత శాస్త్రం ప్రకారం 2 ^64 - 1 అవుతుంది. అంటే ఆరాశి సంఖ్య 18446744073709551615

ఈ విధంగా పైపద్యంలో 2 ^ 64 - 1 అంత పెద్ద సంఖ్యను ఇరికించి చెప్పటం జరిగింది.

సంస్కృతంలో సంఖ్యలను శ్లోకాల్లో పొందుపరిచేందుకు ఇది ఒక పద్ధతి. మరొక పధ్ధతి కటపయాది అని ఉంది. దాని గురించి మరెప్పుడన్నా చూదాం.

నేర మేమి చేసినాను నేను రామచంద్ర


నేర మేమి చేసినాను నేను రామచంద్ర
కానరావేల నాకు కరుణారససాంద్ర

నీరూపము మది నెన్ని నీనామ ముపాసించి
నీరమ్యగుణావళుల నిత్యమెన్ని పాడి
ధారాళమైన నీదు దయామృతవృష్టి నే
కోరి యెదురుచూచెడు గుణవంతుడ గానా

నీ మహిమను చాటుదును నీ చరితము చాటుదును
స్వామి నీదు భక్తులను చాల పొగడుచుందును
నేమయ్యా నాలోప మేమెంచి నావయా
నా మాట మన్నించ విదేమి న్యాయమయ్యా

కలిసర్పదష్టుడనై కటకట పడనిత్తువా
యిలమీద నీభక్తుని హితమునే కోరవా
నళినాక్ష కలనైనను కనుపించ నేరవా
పలుకరించ రానంత పాపమేమి చేసితిని

23, నవంబర్ 2019, శనివారం

గతి హరియే నని గమనించి


గతి హరియే నని గమనించి
మతిమంతులు శ్రీపతిని భజింతురు

బలవంతులకును బలహీనులకును
కులవంతులకును కులహీనులకును
కలవారలకును కడుపేదలకును
ఇలాతలమునం దెవ్వరికైనను

నరసింహాయని నారాయణయని
హరేరామ యని హరేకృష్ణ యని
పరమహర్షమున పాడెడు వారికి
నరకము లేదని నరులందరకును

హరితత్త్వము లోనెఱిగిన వారికి
హరి యపవర్గము నందిచ్చెడు నని
తరుణోపాయము హరిస్మరణంబని
హరికిభక్తులై యన్యుల గొలువక

17, నవంబర్ 2019, ఆదివారం

చాణూరాంధ్రనిషూదనః కాదు చాణూరాంధకసూదనః

శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రంలోని 825వ నామం చాణూరాంధ్రనిషూదనః అని ప్రసిధ్ధంగా ఉంది. శ్రీశంకరులు ఈనామానికి వ్యాఖ్యానంగా విగ్రహవాక్యం చెబుతూ చాణూరనామానాం అంధ్రం నిషూదే చాణూరాంధ్రనిషూదనః ఇతి అని చెప్పారు. నాకైతే ఇది అంతగా యుక్తం కాదనిపిస్తోంది. నా వాదనను మనవి చేస్తాను.

అంధ్రశబ్దంతోనే గోరఖ్‍పూర్‍ వారి భారత వ్యాఖ్యానంలోనూ కనిపిస్తోందని రేమెళ్ళ అవధానులు గారు చెప్పారు. ఈ అంధ్ర అనేది రాక్షసుల్లో ఒక తెగ అట. ఇది కొంచెం అప్రసిధ్ధవ్యవహారం. ఈ ప్రకారం అంధ్రతెగకు చెందిన ఒకానొక ఆంధ్రుని శ్రీకృష్ణుడు సంహరించటాన్ని ఈనామం ఉటంకిస్తున్నట్లు భావించాలి. ఈ అంధ్ర తెగ రాక్షసుల గురించి ప్రస్తావన దాదాపు ఇతరత్రా మృగ్యంగా ఉన్నది. కాబట్టి ఈవిధమైన ఆంధ్రుని ఒక రాక్షసుని కృష్ణుడు సంహరించటం గురించి ఈనామం అయ్యుండదు.

పైగా చాణూరుడు అనే వాడు అంధ్రతెగ రాక్షసుడు ఐతే కృష్ణుడు ఇద్దరు చాణూరులను సంహరించాడన్న మాట. ఒకడు మల్లుడు రెండవవాడు రాక్షసుడు. ఇలా చెప్పుకోనవసరం లేదూ, కంసుడి దగ్గర రాక్షసులకు కొదవేముందీ అది భాగవత ప్రసిధ్ధ వ్యవహారమే కదా అనవచ్చును. అప్పుడు చాణూరమల్లుడు కాస్తా చాణూరాసురుడు ఐపోతాడు. మహాభాగవతంలో అలాగ లేదే! శకటాసుర గార్ధభాసురాదులను బోలెడు మందిని స్పష్టంగా చెప్పి, సాక్షాత్తూ కంసుడి సమక్షంలో అతడి ప్రోద్బలంపై కృష్ణుణ్ణి చంపబోయిన వాణ్ణి చాణూరాసురుడు అని కాక చాణూరమల్లుడు అని భాగవతం ఎందుకు అంటుందీ?

కాబట్టి ఉన్నదొక్కడే చాణూరుడు కాని వాడు రాక్షసుడు అయ్యుండడు.  అందువలన అంధ్రతెగ రాక్షసుడు అని చెప్పటం అంత యుక్తి యుక్తంగా లేదు.

కాబట్టి చాణూరాంధ్ర అన్న చోట చాణూరుడనే ఆంద్రుడనీ అతడు మల్లుడనీ అర్ధం తీయక తప్పటం లేదు.

ఆంధ్రుడు కాక చాణూరుడు అంధకుడు అనటం అసలు పాఠం ఏమో అని అలోచిద్దాం.

యాదవుల్లో మూడు ప్రధాన శాఖలున్నాయి. అవి వష్ణి, బోజ, అంధక శాఖలు.

శ్రీకృష్ణుడు వృష్ణివంశం వాడు. ఈ మాట జగత్ప్రసిధ్దమే. కులశేఖరాళ్వారులు తమ ముకుందమాలాస్తోత్రంలో

జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్టి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముక్దునః

అంటారు రెండవ శ్లోకంలో.

శ్రీకృష్ణుని మేనమామ ఐన కంసుడు భోజవంశం వాడు. పోతన్న గారి ఈ క్రింది వచనం చూడండి.

అని యిట్లాకాశవాణి పలికిన, నులికిపడి, భోజకుల పాంసనుండైన కంసుండు సంచలదంసుండై, యడిదంబు బెడిదంబుగాఁ బెఱికి, జళిపించి,

ఇది కంసుడు ఆకాశవాణి హెచ్చరిక విని దేవకీదేవిని చంపబోవటాన్ని ఉద్దేశించి చెప్పిన వచనం.

సరే అప్పటికి దేవకీదేవిని కంసుడు ఎందువల్లనైతే నేమి చంపకుండా వదలినా అటుపిమ్మట నారదప్రబోధితుడై ఆమెకు జన్మించిన శిశువులను సంహరిస్తూ పోతాడు కాని హరి పన్నాగం ప్రకారం బలరామకష్ణుల జననాలను గ్రహించలేకపోతాడు. ఆనక గ్రహించి వారిని మట్టుపెట్టటానికి ఎన్ని దురోపాయాలు ప్రయోగించినా కుదరక స్వయంగా తన సమక్షంలోనే వారిని వధించటానికి ధనుర్యాగం అనే మిషమీద వారిని రేపల్లె నుండి మధురకు రప్పించుకొంటాడు.

అక్కడ వారికి కంససమక్షంలో చాణూరముష్టికులనే కొండలవంటి మల్లులతో యుధ్ధం చేయవలసి వస్తుంది. ఈ 825వ నామం ఆ సందర్భంలో కృష్ణుడు చాణూరుణ్ణి చంపటాన్ని పురస్కరించుకొని చాణూరమర్దనుడిగా కీర్తించటానికి ఉద్దేశించినది.

ఈ చాణూరాంధ్రనిషూదనః అన్న నామంలో చాణూరుడు  అన్నప్పుడు ఒక్కడు. ఆంధ్ర పదం జాతి వాచకం. కాబట్టి సామాన్యార్ధం శ్రీకృష్ణుడు చాణూరుడు అనే ఆంధ్రుడిని సంహరించాడు అని వస్తుంది. ఇలా చాణూరుడు అనే వాడు ఒక ఆంధ్రానుండి వచ్చి కంససభలో ఉన్న ప్రముఖ మల్లుడని తెలుస్తున్నది.

కాని అప్పటికి శ్రీకృష్ణుడికి ఆంద్రులతో వైరం అంటూ ఏమీ లేదు. కాబట్టి చాణూరుడు అనే ఆంధ్రమల్లుడు అని చెప్పవలసిన అవసరం కాని చెప్పటం వలన నామావళిలో కొత్తగా తెలియవచ్చే విశేషం కాని ఏమీ లేదు.

పోనీ, చాణూరుడు అనేవాడినీ, ఆంధ్రులనూ సంహరించిన వాడు విష్ణువు అని అందామా అంటే అలాకూడా పొసగదు. ఇప్పుడే అనుకున్నట్లు కృష్ణుడికి ఆంధ్రులతో కనీసం అప్పటికి వైరమే లేదే. అదీ కాక, చాణూరుడు అని ఏకవచనంలో ఒక మాటనూ, ఆంధ్రులు అని బహువచనంగా ఒక జాతిని ఉద్దేశించి ఒకే నామంగా చెప్పటం సమజసం కాదు కూడా.

ఇక్కడ ఆంధ్రశబ్దం బదులు ఈ నామంలో అంధక శబ్దం ఉండి ఉండవచ్చును అనుకుంటే అప్పుడు నామం చాణూరాంధకసూదనః అని చెప్పవలసి ఉంటుంది. శ్లోకంలో ఛందోభంగం ఏ మాత్రం కాదు.

అంధకులు కూడా వృష్ణి భోజులవలె యాదవుల్లో ఒక శాఖ వారు. అది యాదవరాజ్యం. దాదాపు అందరూ యాదవులే అక్కడ. అందుచేత చాణూరుడు అంధకుడు ఎందుకు కాకూడదు? తప్పక కావచ్చును.

ఇలా ఆలోచిస్తే చాణూరాంధకసూదనః అన్న రూపమే ఈనామానికి అసలు స్వరూపం అయ్యుంటుందని భావించవచ్చును. అది మరింత సమజసం ప్రస్తుతం ఉన్న చాణూరాంద్రనిషూదనః అన్న రూపం కనా.

కంసుడి సభలో చాలామందే పెద్ద యోధులున్నారు. వారిలో కంసుడి ఎంపిక చాణూరముష్ణికులు. వారు కొండలంత మల్లులు కావటమే కాదు. మరొక విశేషం కూడా ఉంది.

మల్లుల్లోవృష్ణి వంశం వాళ్ళను ఎంపిక చేసి వదిలిన పక్షంలో వాళ్ళు తమశాఖ వాళ్ళూ చిన్నపిల్లలూ అన్న సానుభూతితో బలరామకృష్ణులతో సరిగా పోరాడక పోవచ్చును. అది కసంసుడికి సమ్మతం కాదు కదా.

పోనీ తమ శాఖకు చెందిన మల్లుల్ని ఎంపిక చేద్ద్దామా అన్నా అందులోనూ నమ్మకం ఉంచటం కష్టం. వాళ్ళల్లో ఎవడికైనా సరే తాను తండ్రిని దింపి సింహాసనం ఎక్కటం ఇష్టం లేకపోవచ్చును.

అందుకని వృష్ణి భోజశాఖల మల్లులను ప్రక్కన బెట్టి అంధకశాఖవారిని ఎంపిక చేసాడు కంసుడు.

ఐతే ఇదే తర్కాన్ని కొంచెం సాగదీసి, అసలు యాదవులను నమ్మలేమని ఆంద్రామల్లురను ఎంపిక చేసాడేమో అనవచ్చును. అదీ కొంతవరకూ సమంజసమే. కాని కంసుడి ఆస్థానంలో దూరప్రాంత మల్లుడికి బదులు స్థానిక మల్లుడిని ఊహించటమే ఎక్కువగా సమంజసం అనుకుంటున్నాను.

ఒకవేళ యాదవుల్లో ఏదన్నా అంతఃకలహాలూ, ఆ మూడు శాఖల్లోనూ హెచ్చుతగ్గుల కారణంగా వైరాలూ ఉన్నాయనుకుంటే, వాటిని పురస్కరించుకొని కంసుడు అందకులను బలరామకృష్ణుల పైకి ఉసికొల్పాడని అనుకోవటం సబబుగా ఉంటుంది.

అందువలన చాణూరాంధకసూదనః అన్నపాఠమే సరైనది కావచ్చునని నా భావన.

ఐతే శ్రీశంకరులు చాణూరాంధ్రనిషూదనః అన్న పాఠాన్ని ఎందుకు స్వీకరించారూ అన్నప్రశ్న వస్తుంది. అప్పటికే ఆపాఠం ప్రచారంలో ఉండటమే దానికి కారణం కావచ్చును.

16, నవంబర్ 2019, శనివారం

కర్మ నెట్‍వర్క్


ఒకదేశపు రాజు. ఆయనకు ఉన్నట్లుండి ఒకనాడు రాజదానిలో ఒక రోజున నగరసంచారం చేయాలీ అన్న బుధ్ధిపుట్టింది.  అదేమీ కొత్తసంగతి కాదు లెండి. అప్పుడప్పుడు ఆయన అలాగే చేస్తూ ఉంటాడు. ఎందుకలా అంటే ఆయన తండ్రి అలా చేసేవాడు. ఆయన తాతముత్తాతలూ ఆపని చేసేవారని ఆ తండ్రిగారే ఒకనాడు కొడుక్కి చెప్పాడు. ఇక తనకూ ఆనవాయితీని కొనసాగించటం అన్న మహత్కార్యం ఎలా తప్పుతుందీ. ఐతే ఏదన్నా సరే తెలిసి చేయటంలో ఒక అర్ధం ఒక పరమార్ధం ఉంటాయంటారు. ఆమాట కూడా రాజుగారికి తండ్రిగారే ఉపదేశించారు.

అసలు ఆ తండ్రిగారు కొడుక్కి చాలానే విషయాలు ఉపదేశించారు. వేదాంతంతో సహా. ఆయనకు రాజకీయం తలకెక్కింది కాని వేదాంతం మాత్రం రుచించలేదు. అది వేరే సంగతి.

ఇంతకీ నగరసంచారం ఎందుకంటే రాజు స్వయంగా రాజ్యం ఎట్లా నడుస్తున్నదీ రాజ్యాంగం ఎలా అమలౌతున్నదీ పర్యవేక్షిస్తూ ఉండాలి. ఆపని చేయటానికి మహాదర్జాగా జీతాలు పుచ్చుకుంటున్న మంత్రులూ మందీ మార్బలమూ లేదా అని మీరనవచ్చును.  పాపం, రాజుగారు కూడా చిన్నతనం కొద్దీ తండ్రిగారిని ఆమాట అడిగారు కూడా. అందుకు సమాధానం ఏమిటంటే రాజు ఎవ్వరినీ పూర్తిగా నమ్మకూడదు. అలాగని ఎవ్వరినీ తాను సంపూర్ణంగా విశ్వసించటం లేదని ఎవ్వరికీ తెలియనీయ కూడదు. చివరికి మహారాణీని ఐనా సరే, యువరాజును ఐనా సరే ఎంతవరకూ నమ్మాలో అంతవరకే. స్వయంగా అందరిమీదా ఒక కన్నేసి ఉంచని రాజు అధోగతికి పోతాడట. అదీ విషయం. అందుకని అయ్యా మీపరిపాలన బ్రహ్మాండంగా ఉందని మంత్రిపురోహితదండనాథాదులు ఎంతగా ఊదరగొడుతున్నా చారులు ఎంతగా అందరూ మనది రామరాజ్యం అని పొగుడుతున్నారండీ అని ఉబ్బేస్తున్నా సరే అదేదో వీలైనంతగా స్వయంగా పరిశీలించుకోక తప్పదన్న మాట.

పగలల్లా రాజుగారు మారువేషం కట్టి నగరం అంతా తిరిగి చూసాడు. తన మందిరానికి చేరుకొని మళ్ళా రాత్రి పూట కూడా రాజధానీ నగరం అంతా పరిశీలనగా చూస్తూ పోతున్నాడు.

అర్ధరాత్రి దాటింది. అంతవరకూ ఏ విధమైన వింతలూ విడ్డూరాలూ అనుమాస్పదసంగతులూ ఆయన దృష్టికి రాలేదు.

ఇంతలో ఆయన కంటికి ఒక వ్యక్తి చేతిలో కత్తిపట్టుకొని ఊరి చివరకు వెళ్తూ కనిపించాడు. చూడటానికి చాలా పేదవాడిలాగా ఉన్నాడు. వడివడిగా అతను ఊరిచివరన ఉన్న అమ్మవారి దేవాలయం ఒకదాని దగ్గరకు చేరుకొనే సరికి అతని వెనకాలే కుతూహలంగా రాజుగారూ అక్కడికి చేరుకొనారు..

అమ్మవారి గుడి చాలా పాతది. శిథిలావస్థలో ఉంది. గుడికి తలుపులు కూడా లేవు. అసలా గుడి ఒకటి ఉందని రాజుగారికి తెలియను కూడా తెలియదు. ఆ పేదవాడు గుడిలోనికి వెళ్ళాడు. రాజుగారు కూడా అతడికి తెలియకుండా తానూ గుడిలోనికి ప్రవేశించి ఒక స్తంభం చాటున నిలబడ్డాడు.

ఇంక చాలమ్మా అని ఆ పేదవాడు ఒక పొలికేక పెట్టాడు. సాగిలపడి అమ్మవారికి దండం పెట్టి అమ్మ మూర్తికి చేరువగా వచ్చి నిలుచున్నాడు.

అమ్మా, వీరుణ్ణి నువ్వు దీనుణ్ణి చేసావు. రాజుగారు ఇస్తున్న భత్యం నా కుటుంబం పోషణకు ఏమూలకూ రావటం లేదు. ఐనా నీదయ ఇలా ఉంటే ఇంకేం చేసేదీ అని రోజులు నెట్టుకొని వస్తున్నాను.

ఇప్పుడు నువ్వు చేతికి అందివస్తున్న నా కొడుకును కూడా ఎత్తుకొని పోయావు. రేపోమాపో వాడు కొలువులో చేరి మాకింత ముద్దపెట్టి ఆదుకుంటాడని ఆశగా ఎదురుచూస్తున్నామే, నీ పుణ్యమా అని ఆ ఆశకూడా పోయింది.

ఇంకా బతికి ఏం చూడాలమ్మా?

ఇదిగో నిన్ను పదిసార్లు జై కొట్టి పిలుస్తాను. నువ్వు నాకు మానహాని లేకుండా జీవించే ఏర్పాటు చేస్తున్నానని చెప్పావా సరి. లేదా పదవసారి జైకొట్టిన వెంటనే నా తలకొట్టుకొని నీ పాదాలవద్ద సమర్పిస్తాను.

నా ఇంటిదాని సంగతంటావా అదీ రేపు నావెనకే నీ పేరు చెప్పుకొని అగ్గిలో దూకుతుంది.

ఇదిగో విను పదే సార్లు పిలువగలను అంతే.

ఇలా అని జై జగన్మాతా అని అరిచాడు.

అంతా వింటున్న రాజు ఆశ్చర్యపోయాడు. ఇతడెవరో మొన్న పొరుగురాజ్యంతో జరిగిన యుధ్ధంలో గాయపడ్ద సైనికుడు. ఇక సైన్యంలో పని చేయటానికి నప్పడని రాజ్యం భృతి ఇస్తున్నది. ఇతడి మాటలను బట్టి చూస్తే ఇతడికి భార్యా ఒక కొడుకూ తప్ప ఎవరూ లేనట్లుంది. మరి భృతి ఎందుకు సరిపోవటం లేదు? ఇందులో ఏదో మర్మం ఉంది. విచారించాలి అనుకున్నాడు.

అంత కంటే ముందుగా ఈ వీరుడు ఆత్మాహుతి చేసుకోకుండా ఎలా ఆపాలా అనుకున్నాడు.

కాని ఆ భక్తుడికి అమ్మవారిపైన ఉన్న విశ్వాసం గుర్తుకు వచ్చి ఆగాడు. అతడిని అమ్మవారు కనికరిస్తుందా లేదా తెలుసుకోవాలని ఆయనకు తోచింది.

ఏం జరుగుతుందో చూదామని, కొంచెం దగ్గరగా చేరి వేచి చూస్తున్నాడు.

తొమ్మిది సార్లు జై జగన్మాతా అని ఆ వీరుడు పిలిచాడు. పదోసారి గుడి అంత మారుమ్రోగేటట్ల్గుగా జై జగన్మాతా అని అరచి, రాజు అతడి చేతిని పట్టుకొని ఆపేందుకు యత్నించే లోగానే తటాలున తలను నరుక్కున్నాడు.

పెద్ద మెఱుపు మెరిసినట్లైనది. గుడి అంతా వెలుగుతో నిండిపోయింది.

ఆ వీరసైనికుడి కత్తి కాస్తా పూలదండగా మారి అతడి మెడలో ప్రకాశించింది.

రాజు నిశ్చేష్ఠుడైనాడు..

ఆ సైనికుడికి కొంత సేపటికి కాని వంటి మీదకు స్పృహ రాలేదు.

తీరా వచ్చాక అతడు కూడా విభాంత చిత్తుడై అమ్మవారిని చూస్తూ ఉండిపోయాడు.

*    *    *    *    *

 అమ్మవారు ప్రత్యక్షం ఐనది. ఆ తల్లి దివ్యకంఠస్వరం తీయగా వినిపించింది.

నాయనా నీ భక్తికి మెచ్చాను. ఇకనుండీ నీ కుటుంబానికి అన్ని ఇబ్బందులూ తొలగి పోతాయి.  సంతోషమేనా?

వీరుడు అనందభాష్పాలు తుడుచుకుంటూ అడిగాడు. అమ్మా పుట్టి బుద్దెరిగి నప్పటి నుండీ నీకు పరమభక్తుడను. అసలు నాకిన్ని కష్టాలు ఎందుకు కలిగించావమ్మా అని.

అమ్మ మందహాసం చేసింది. నాయనా అందరూ కర్మఫలాలను తప్పక అనుభవించాలి. అది సృష్టినియమం అన్నది.

ఐతే ఏమి కర్మఫలం నన్ను వీరుణ్ణీ చేసింది? ఇప్పుడేది నన్ను అవిటి వాడిని చేసింది అన్నాడు వీరుడు.

గత జన్మలో నీవు ఒక వీరుడికి సేవకుడిగా ఉండి అతడిలా వీరుడివై దేశసేవ చేయాలని కోరుకున్నావు. చాలా ప్రయత్నించావు. కాని ఆ ఉపాధికి అంత శక్తి లేదు. అందుకే ఈజన్మలో వీరుడివి అయ్యావు. ఐతే అప్పట్లో నీ వచ్చీ రాని సాధన వలన ఒకడికి అవయవలోపం కలిగింది. ఆదోషం వలన ఇప్పుడు నీకు కొంచెం అవిటితనం వచ్చింది అంది అమ్మవారు.

మరి నా కొడుకేమి చేసాడమ్మా వాడిని తీసుకొని పోయావే అన్నాడు వీరుడు అమ్మవారిని నిలదీస్తూ.

ఒక సారి యుధ్ధోన్మాదంలో నువ్వు ఒక యువకుడిని ఆతడి తండ్రికండ్లముందే చంపావు. నిజానికి నువ్వు రాజాజ్ఞ ప్రకారం అతడి తండ్రిని బంధించాలని వెళ్ళావు. ఆతని కుమారుడు ఏమీ తప్పు చేయలేదే? కాని నీవు నీ వీరత్వం చూపటానికి అతడిని బలితీసుకొన్నావు. ఆ తండ్రి పడిన క్షోభను ఇప్పుడు నువ్వు అనుభవించవలసి వచ్చింది.

నువ్వు అడుగకపోయినా మరొక సంగతి నీకుమారుడు కూడా తన కర్మఫలం ప్రకారమే అల్పాయుష్కుడు అయ్యాడు. నీ భార్యకూడా గతజన్మలో దరిద్రులను హేళనగా చూసిన పాపానికి గాను ఇప్పుడు దారిద్యం అనుభవించవలసి వచ్చింది.

నాయనా ఎవరూ తమతమ కర్మఫలాలను తప్పించుకొన లేరు అనుభవించకుండా.

మూడేండ్లనుండీ నీవు దుర్భరదారిద్ర్యం అనుభవిస్తున్నా,  ఈనాటికి గాని నీకు నా అనుగ్రహం కోసం ఇలా రావాలన్న స్పృహ కలుగలేదు. దానికి కారణం ఇప్పటికి గాని నీకు కర్మక్షయం కాకపోవటమే.

నీ కొడుకు ఒకడు తప్పిపోయాడు కదా చిన్నతనంలో వాడు, తిరిగి వస్తున్నాడు తొందరలో. ఇంక మీకు అన్నీ శుభాలే. పో, నీ అవిటితనం కూడా తొలగిస్తున్నాను అంది అమ్మవారు.

ఇదంతా వింటున్న రాజుగారు సంభ్రమాశ్చర్యాలతో కొయ్యబారి ఉన్నాడు.

అమ్మవారు రాజును కూడా ఇలా రావయ్యా అని పిలిచింది.

రాజు గారిలో చలనం వచ్చింది. అమ్మ చెంతకు వచ్చాడు.

నీకు నా దర్శనం ఎందుకు దొరికిందో తెలుసునా అన్నది అమ్మవారు.

అమ్మా అది నా పూర్వజన్మసుకృతం అన్నాడు రాజుగారు.

అది సరే, ఈ గుడిని ఒకప్పుడు నీవే కట్టించావు. ఇదిగో ఇలా పాడుబడింది. దీనికి జీర్ణోధ్దరణ చేయి. నీకూ కర్మక్షయం కావస్తున్నది. అందుకే దర్సనం ఇచ్చాను. పో నీకు శుభం కలుగుతుంది అని అమ్మవారు అదృశ్యం అయ్యారు.

ఉపసంహారంగా ఆట్టే చెప్పవలసింది ఏముంది? రాజుగారు గుడిని జీర్ణోద్ధరణ చేసారు. కొడుక్కి రాజ్యం అప్పగించి అమ్మవారిని సేవించుకుంటూ ఉండిపోయారు.

అన్నట్లు మరిచాను, ఎంతగా వెయ్యికళ్ళతో లెక్కలు చూస్తున్నా మాజీసైనికులకు ఇచ్చే భత్యాలనూ బొక్కుతూ ఇబ్బంది పెడుతున్న రాజోద్యోగులను కనిపెట్టి పనిబట్టారు అన్నిటి కంటే ముందుగా.

కథ కంచికి.

15, నవంబర్ 2019, శుక్రవారం

బోధనామాధ్యమం గురించిన రగడ


బోధనామాధ్యమం అన్న మాట వాడినందుకు విసుక్కునే వాళ్ళూ కోప్పడేవాళ్ళూ కూడా ఉంటారని తెలుసు. అంతే కాదు వీలైనంతగా హేళన చేసి సంతోషించేవాళ్ళు కూడా ఎదురుపడతారనీ తెలుసు. ఐనా ఆమాట తెలిసే వాడాను. వీడెవడో పరమచాందసుడు, వీడి బోడి అభిప్రాయాలు మనకెందుకూ అనుకొనే వారికి ఇక్కడితేటే విరమించే అవకాశం ఎలాగూ ఉండనే ఉంది.

మీరు గూగుల్‍లో language of instruction in israel అని శొధిస్తే నాకు మొట్టమొదటగా కనిపించినది

Search Results

Featured snippet from the web

Image result for language of instruction in israel
Hebrew
Medium of Instruction: Hebrew is the main language of instruction in Israeli institutions of higher education. Arabic is the language of instruction at 3 teacher training colleges and Arab teacher centres. Certain bachelor's degree programmes are taught in English.
అసలు నేను మొదలు పెడుతూనే ఈ ఇజ్రాయెల్‍ గురించి ఎందుకు ప్రస్తావించానో వివరిస్తాను. ఈ ఇజ్రాయెల్‍ గురించి మనవాళ్లకు కొద్దోగొప్పో అవగాహన ఉండవచ్చును. కాని అది సరైన విధంగా ఉండకపోవచ్చును. ఈ ఇజ్రాయెల్ అనే దేశం గురించి వికీపీడియా పేజీలో ఏమని వ్రాసి ఉందో తెలుసునా? ఆ పేజీలో ఈ సైన్సు & టెక్నాలజీ విభాగంలో మొదటి పేరాగ్రాఫ్ ఇలా ఉంది.

Israel's development of cutting-edge technologies in software, communications and the life sciences have evoked comparisons with Silicon Valley.[544][545] Israel ranks 5th in the 2019 Bloomberg Innovation Index,[68] and is 1st in the world in expenditure on research and development as a percentage of GDP.[65] Israel boasts 140 scientists, technicians, and engineers per 10,000 employees, the highest number in the world (in comparison, the same is 85 for the U.S.).[546][547][548] Israel has produced six Nobel Prize-winning scientists since 2004[549] and has been frequently ranked as one of the countries with the highest ratios of scientific papers per capita in the world.[550][551][552] Israel has led the world in stem-cell research papers per capita since 2000.[553] Israeli universities are ranked among the top 50 world universities in computer science (Technion and Tel Aviv University), mathematics (Hebrew University of Jerusalem) and chemistry (Weizmann Institute of Science).[391]

ఇందులోని విషయాలను తీసుకొని మనదేశం ఇజ్రాయెల్‍తో పోలిస్తే ఎక్కడ ఉన్నదో ఒక్కమాటు ఆలోచించండి.

తరువాతి పేరా మొదటి వాక్యం చూడండి.  In 2012, Israel was ranked ninth in the world by the Futron's Space Competitiveness Index.[ అని! అంటే అంతరిక్షపరిశోధనారంగంలో అది ప్రపంచంలోనే తొమ్మిదవ స్థానంలో ఉంది అని. మొదటిపది స్థానాలు ఇలా ఉన్నాయట.

  1.  United States 99.67
  2.  Europe 50.11
  3.  Japan 48.76
  4.  Russia 45.29
  5.  China 41.85
  6.  Canada 39.10
  7.  India 28.64
  8.  South Korea 15.22
  9.  Israel 9.30
  10.  Australia 5.22

అసలు Science and technology in Israel అని ఒక పూర్తి వికీ పేజీయే ఉంది. అక్కడ మరిన్ని వివరాలు దొరుకుతున్నాయి.

ఇజ్రాయెల్‍ చాలా చిన్నదేశం. అక్కడ హిబ్రూలో చదువుకోవటానికి ఎవ్వరూ 'ఇంగ్లీషులో చదువుకోకపోతే బ్రతుకులేదు' వంటి కుంటి సాకులు చెప్పటం లేదు. అక్కడ సైన్సును హిబ్రూ భాషలో బోధించటమే కాదు అక్కడి శాస్త్రజ్ఞ్లులు ఆభాషలో పరిశోధనాపత్రాలూ ప్రకటిస్తున్నారు. ఎవ్వరూ సిగ్గుపడటం లేదు (మనలా!)

ప్రపంచవ్యాప్తంగా రష్యన్, జర్మను, ప్రెంచి, స్పానిష్‍, జపనీస్, చైనీస్ చివరికి బుల్లిదేశం భాష ఇటాలియన్‍లో కూడ పరిశోధనాపత్రాలు వెలువడుతున్నాయి.

మనకు తెలుగులో చదువుకుంటే కొంపమునిగిపోతుందన్న భావన ఉండటమే కాదు దాన్ని ప్రభుత్వాలూ బలమైన రాజకీయపార్టీలూ కూడా ప్రచారం చేస్తున్నాయి.

ఆడలేక మద్దెల ఓటిది అన్నట్లుగా మన తెలుగు భాష స్థాయిని పెంచుకోవటం మనకు చేతకావటం లేదు కాబట్టి అసలు మన వెధవాయలకు అలాంటి సదుద్దేశం ఏకోశానా లేదు కాబట్టి, ఇంగీషు భాష ప్రాణాధారం అన్న వాదన చేస్తున్నాం అన్నమాట.

మరిన్ని వివరాలూ సమర్ధనలతో ఇంకా పెద్దగ్రంథమే వ్రాయవచ్చును కాని ఇది చాలనుకుంటున్నాను.

10, నవంబర్ 2019, ఆదివారం

ఒక ప్రయత్నం.


కొంత కాలం మాలికను పట్టించుకోలేదు. బ్లాగులను పట్టించుకోలేదు.

మరలా old habits die hard అన్నది నిజం కాబట్టి కొద్దికొద్దిగా మాలికనూ బ్లాగులనూ పరిశీలించటం మొదలు పెట్టాను.

ఐతే ఈ పరిశీలన కొంత నిరాశను కలిగించింది.

శంకరాభరణం బ్లాగులో కొందరు సమస్యాపూరణ కోసం పడుతున్న ప్రయాసలు ఒక ప్రక్కన ఎప్పటిలాగే తగినంత స్థలం ఆక్రమించుతున్నాయి మాలిక వ్యాఖ్యల పేజీలో. ఆ పద్యాల వాసి కూడా ఎప్పటిలాగే ఉంది.

ఎప్పటిలాగే జిలేబీగారు గిద్యాలూ గీమెంట్లతో మెరుస్తున్నారు.

ఎప్పటిలాగే కామెంట్ల యుధ్ధం ఔచిత్యపు పరిధులు దాటి జోరుగా నడుస్తోంది.

విన్నకోట వారు తమ శైలిలో తాము యధోచితంగా వ్యాఖ్యలను పంపుతున్నారు వివిధబ్లాగులకు.

ఇకపోతే బ్లాగుల్లో సినిమాల గురించీ, రాజకీయాల గురించీ కొన్ని బ్లాగులు నడుస్తూ ఉన్నా ఆథ్యాత్మిక సాహిత్యరంగాలకు సంబంధించిన బ్లాగులు కొన్ని చురుగ్గానే ఉన్నాయి. మొత్తం మీద సోది సరుకు కొంత ఉన్నా కొంచెం మంచి సరుకు ఉన్న బ్లాగులూ నడుస్తున్నాయన్నది సంతోషం కలిగించే విషయం.

ఐతే ఇక్కడ నిరాశ కలిగించే అంశం ఏమిటంటే వ్యాఖ్యల ధోరణి చూస్తే వ్యాఖ్యాతలు వివిధవిషయాల గురించి స్పందించటం లేదు.  శంకరాభరణం వ్యాఖ్యలూ, రాజకీయ లేదా సినిమాసంగతుల మీద వ్యాఖ్యలూ కామెంటుయుధ్ధాలూ మినహాయిస్తే మిగిలేవి కొద్ది వ్యాఖ్యలే అంటే హెచ్చుశాతం బ్లాగుటపాలకు స్పందన కరువుగా ఉంది.

ఈ పరిస్థితి మారాలి. అంటే మంచి విలువలతో కూడిన టపాలు హెచ్చుగా రావాలి. వివిధవిషయాలపై టపాలను చదివే వారు కూడా పెరగాలి.

మొదట విలువైన బ్లాగుటపాలకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం ఒకటి జరగాలి.

అటువంటి ఒకప్రయత్నాన్ని వివరిస్తున్నాను. ఇది నేనే పూనుకొని చేయనక్కర లేదు. ఆసక్తి ఉన్నవారు ఎవరన్నా చేయవచ్చును. ఇలాగే అని కాక వీలైతే ఇంతకంటే బాగా కూడా చేయవచ్చును.

నేను ఆలోచించిన విధానం ఇలా ఉంది.

  1. అజ్ఞాతలకు ప్రవేశం లేదు
  2. ప్రతి సోమవారం ఉదయం 5:30 నుండి ఒక వారం దినాలను ప్రమాణకాలావధిగా తీసుకుంటాం. (అంటే 7 x 24 గంటల సమయం ఒక పీరియడ్‍గా లెక్కించుదాం)
  3. అసక్తి కల బ్లాగర్లు, పాఠకులు తమ అభిప్రాయాలను పంపవలసినదిగా ఒక  ప్రత్యేక బ్లాగుని ఇవ్వటం జరుగుతుంది. అభిప్రాయాలు అందులో నేరుగా ప్రకటింపబడవు. (మిగిలన అంశాలు చదవండి)
  4. అభిప్రాయాలను పంపటానికి 3 రోజుల గడువు. అంటే గతవారం దినాల టపాలలో తమ ఎన్నికలను గురువారం ఉదయం 5:30గం. సమయం దాటకుండా పంపాలి.
  5. వారం దినాలలో చాలానే బ్లాగుటపాలు వస్తాయి అని ఆశించవచ్చును. అందుచేత తమకు నచ్చిన పది టపాలకు లింకులను ప్రాదాన్యతా క్రమంలో లిష్టు చేసి పంపాలి
  6. ఒకరు ప్రాధాన్యతా క్రమంలో మొదటి స్థానంలో ఉంచిన టపాకు 10 గుణాలు, పదవ స్థానంలో ఉంచిన టపాకు ఒక (వెయిటేజీ) గుణం చొప్పున లెక్కించబడుతుంది. ఈ విధంగా అందరి లిష్టులలో ఉటంకించబడిన టపాలనూ లెక్కించి సమాకలనం చేయటం జరుగుతుంది.
  7. ప్రతి శనివారం నాడు గతవారం టపాలకు వచ్చిన స్పందన అధారంగా మొదటి పది స్థానాలలో వచ్చిన టపాలను అ ప్రత్యేక ప్రకటించటం జరుగుతుంది.  అందులో ఇతర విషయాలపై టపాలు ఉండవు.
  8. ప్రతి అభిప్రాయాన్నీ కూడా బేరీజు వేయటం జరుగుతుంది. ఒకరు ఎంత ధగ్గరగా ఫలితాలను ఊహించగలిగారు అన్నదానిని బట్టి వారికీ కొన్ని గుణాలు కేటాయించబడతాయి. 
  9. ఫలితాలకు దగ్గరగా వచ్చిన అంచనాలను పంపిన వారి గురించి కూడా ప్రకటించటం వారం వారం జరుగుతుంది.
  10.  పని ఇచ్చిన అరవ అంశానికి ఒక సవరణ/వివరణ ఉన్నది.  ప్రాథమికంగా ప్రతిఅభిప్రాయం కూడా ఒక వెయిటేజీ గుణం కలిగి ఉంటుంది. ఒకరి అభిప్రాయం గురి హెచ్చుగా వచ్చిన కొద్దీ ఆ వెయిటేజీ పెరుగుతుంది. అది రెండు వరకూ చేరవచ్చును. గురి తప్పిన కొద్దీ వెయిటేజీ తగ్గిపోవచ్చును ఒకటి నుండి అర వరకూ పడిపోవచ్చును. గత ఐదు సార్లుగా ఒకరు పంపిన అభిప్రాయం ఎంత గురిగా వచ్చింది అన్నదానిని బట్టి ఆ వెయిటేజీ మారుతూ ఉంటుంది.  అందుచేత ఒక వెయిటేజీ గుణం విలువ 0.5 నుండి 2.0 వరకూ మారుతూ ఉంటుందని గమనించండి. ఈ ఆలోచనకు కారణం ఒకటే - ఆలోచించి మరీ నిజాయితీగా అభిప్రాయాలను పంపుతారని!
  11. ప్రకటించిన ఫలితాలలో ఉటంకించిన బ్లాగుటపాలకు కాని అభిప్రాయం చెప్పిన వారికి కాని బహుమతులు ఏమీ ఉండవు.
  12. ఒకరు తమ అభిప్రాయం పంపేటప్పుడు ఒక బ్లాగు నుండి రెండు కంటే ఎక్కువ టపాలను ఎన్నుకోకూడదు.
  13. ఒకరు తమ అభిప్రాయం పంపేటప్పుడు కనీసం 5 టపాలను లిష్టు చేయాలి.
  14. తరచుగా లిష్టు అవుతున్న బ్లాగులను గురించి ప్రకటించటం జరుగుతుంది.
  15. తరచుగా గురిగా లిష్టుచేస్తున్న వారి గురించి కూడా ప్రకటించటం జరుగుతుంది.


ఇది ఒక ఆలోచన.  ఎవరన్నా దీనిని కాని దీనికంటే మెరుగైన విధానాన్ని కాని అమలు చేస్తే మంచి బ్లాగులకూ మంచి చదువరులకూ ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ విధానానికి గుర్తింపు వస్తే మంచి బ్లాగులకు తగిన గుర్తింపు కూడా మరింతగా వస్తుంది.

ఈ విషయంలో మీ అభిప్రాయాలు వ్రాయగోర్తాను.

7, నవంబర్ 2019, గురువారం

ఆర్టీసీ సమ్మె - రంగనాయకమ్మ


ఈరోజున ఉయ్యాల బ్లాగులో రంగనాయకమ్మ గారి వ్యాసం ఒకటి తిండి సరిపోక చేసేది సమ్మె! ‘అదనపు విలువ’ అరగక చేసేది అణచివేత !! - రంగనాయకమ్మ (ఆంధ్ర జ్యోతి 5-11-2019) అనే శీర్షికతో వచ్చింది. సరే శీర్షికను బట్టే ఇది ఆంధ్రజ్యోతిపత్రికలో ఇప్పటికే ఫలానా దినంనాడు వచ్చినదీ అని తెలుస్తూనే ఉంది.

ఆ వ్యాసంలో రంగనాయకమ్మగారు మార్క్సు కనిపెట్టిన ‘అదనపు విలువ సిద్ధాంత కోణం’ నుండి ఒక ఉదాహరణను ఇస్తూ మరీ పరిశీలించి చూసారు. కాని అదనపు విలువను ఆవిడ లెక్కలు వేసిన విధానం అంత సమగ్రంగా ఉన్నట్లు తోచదు.

ముందే ఒక సంగతి చెప్పాలి. నేను ఆర్ధికశాస్త్రవేత్తను కాను. కనీసం ఆ శాస్త్రం చదువుకున్న వాడిని ఐనా కాను.  నేను కమ్యూనిష్టును కానీ కమ్యూనిష్టు పార్టీలకూ వారి సిధ్ధాంతాలకు సానుభూతిపరుణ్ణి కానీ కాను. అలాగని కమ్యూనిజం అయ్యేది మరొకటయ్యేది దేనినీ గ్రుడ్డిగా వ్యతిరేకించే వాడినీ కాను.

అలాగే మరొక సంగతీ చెప్పాలి. రంగనాయకమ్మ గారి 'ఆండాళ్ళమ్మ గారు' నేను మొదటగా చదివిన ఆవిడ రచన. భలే బాగుందనిపించింది. విషవృక్షం చదివాను. అస్సలు నచ్చలేదు. 'మాట్లాడే తెలుగే వ్రాస్తున్నామా' అని ఆవిడ వ్రాసిన వ్యాసం నచ్చింది - ఆలోచింప జేసింది. అందుచేత ఆవిడపట్ల నాకేమీ గ్రుడ్డి వ్యతిరేకత లేదు.

ఇక నేను చెప్పదలచుకున్న విషయాలలోనికి సూటిగా వస్తున్నాను.

మీకొక దుకాణం ఉందనుకుందాం. అది ఏదన్నా కావచ్చును. బట్టలదుకాణం, కిరాణాదుకాణం, ఫాన్సీషాపు లేదా మరొకటి. మీ స్వంత దుకాణం.

వస్తువుల ధరలను మీరు ఎలా నిర్ణయిస్తారు అన్నది ఇక్కడ ఆలోచిస్తున్న సంగతి.  లాభానికి అమ్మాలి అన్నది సరే, చిన్నపిల్లవాడి నడిగినా ఆ మాట చెప్పగలడు. కాని ఎంత లాభానికి అంటే కొంచెం ఆలోచించి చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే అనేక విషయాలను పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది కాబట్టి.

సరుకులు కొనటానికి పెట్టుబడి పెట్టాలి. అలాగే సరుకులు నిలువచేయటానికీ, ప్రదర్శించటానికీ కూడా తగిన సదుపాయాల కోసం పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులన్నాక అంతా మీరు మీ ఆస్తిపాస్తులనుండే పెట్టలేరు. కొంత పెట్టుబడి అప్పుగా వస్తుంది. మీ సొమ్ము ఐనా ఇతరుల సొమ్ము ఐనా అది బ్యాంకు వడ్డీ కన్నా తక్కువగా ఆర్జిస్తూ ఉండే పక్షంలో దుకాణం దండగ. కాబట్టి పెట్టుబడులు వెనక్కి రాబట్టుకోవటానికి లాభార్జన తప్పదు.

మీ దుకాణానికి అద్దె కట్టాలి.  షాపు అన్నాక మీ యింట్లోనే నిర్వహించటం అస్తమానూ కుదరదు. అది బజారులో ఉండాలి మరి.  మీ యిల్లు వేరొక చోట ఉంటుంది.

మీ పనివాళ్ళకు జీతాలివ్వాలి. షాపు అన్నాక మీరొక్కరే గళ్ళాపెట్టె దగ్గరా, తూకాల దగ్గరా, సామానుల దగ్గరా అన్నిచోట్లా ఉండలేరు కదా. వచ్చే గిరాకీలు అందరినీ మీరొక్కరే సమర్ధించుకుంటూ నడపలేరు కదా. అందుకని వివిద కార్యకలాపాలకోసం పనివాళ్ళ అవసరం ఉంటుంది. అది దుకాణం స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. అందరికీ తగినంత జీతం సమయానికి అందిస్తూ ఉండకపోతే దుకాణం నడవదు.

దుకాణం ఉంది అంటే దానికి కొన్ని హంగులూ అవసరాలూ ఉంటాయి. విద్యుత్తు కావాలి కదా కనీసం లైటింగు నుండి శీతలీకరణాదులకోసం. ఈ బిల్లులు అన్నీ చెల్లవలసింది దుకాణం ఆర్జించే సొమ్మునుండే.

దుకాణంలో సరుకు అమ్మేసి దాన్ని మూసివేయరు కదా. మార్కెట్టును బట్టి ఎప్పటికప్పుడు కొత్త సరుకును కొని దుకాణంలో ఉంచాలి. అది నిత్యనూతనమైన కర్చు. దానికి అవసరమైన సొమ్మును దుకాణమే సమకూర్చాలి.

దుకాణం పెట్టింది ఎందుకు? ముందు మీరు సుఖంగా సదుపాయంగా సకుటుంబంగా బ్రతకటానికి.  మీరు ఎవరిదగ్గరన్నా ఉద్యోగంలో ఉంటే అందుకు కావలసిన సొమ్ము మీకు అందే జీతం సమకూర్చుతుంది. మరి మీది ఒక దుకాణం ఐనప్పుడు ఆ సొమ్మును సమకూర్చవలసిన బాధ్యత ఆ దుకాణానిదే కదా. అంటే పనివాళ్ళకే కాదు దుకాణం మీకూ పోషణకు సొమ్ము ఇవ్వాలి.

దుకాణం నడపటంలో కొన్ని ఒడిదుడుకులకు సిధ్ధం కావాలి. వాటి గురించిన అవగాహన దుకాణం పెట్టే ముందే ఉండాలి మీకు. వాటి గురించి కూడా అలోచించాలి దుకాణం నడపటంలో.

ప్రకృతి విపత్తుల గురించి ఆలోచించి దుకాణానికి బీమా చేయించాలి. అది ఊరికే రాదు. అ బీమా కిస్తీలు కూడా దుకామే భరించాలి.

మీకే ఏదన్నా కారణం వలన దుకాణం నడపటానికి విరామం ఇవ్వవలసి వస్తే? దానికి కారణం మీకో మీ యింట్లో ముఖ్యసభ్యులకో అనారోగ్యం కావచ్చును. లేదా సకుటుంబంగా ఏదన్నా ఊరు కొన్నాళ్ళు తప్పని సరిగా వెళ్ళవలసి రావచ్చును. అప్పుడు దుకాణం నడవకపోతే చాలా నష్టాలు వస్తాయి. అవన్నీ భరించే బాధ్యత దుకాణానిదే.

వస్తువుల ధరలు స్థిరంగా ఉండవు, ఉండాలని ఆశించటం తప్పు కూడా. అవి పెరిగితే ఆనందమే. మీకు మంచి లాభాలొచ్చేస్తాయి. కాని ఒక్కొక్కసారి దుకాణంలో సరుకు నింపిన కొద్దికాలానికే సరుకు ధర పడిపోతే, నష్టం వస్తుంది. దాన్ని దుకాణమే భరించాలి.

అలాగె ఒక్కొక్క సారి బజారులోనికి కొత్తరకం సరుకు వచ్చి మీదగ్గర ఉన్నదానికి అస్సలు గిరాకీ లేకపోవచ్చును. అప్పుడు దానిని ఐనకాడికి తెగనమ్ముకోవాలి. రూపాయి వస్తువును పావలాకు కూడా ఎవరూ కొనని పరిస్థితీ రావచ్చును . అలాంటి విపత్తును తట్టుకొనే శక్తి దుకాణానికి ఉండాలి.

మీ దగ్గర ఉన్న సరుకు పూర్తిగా అమ్ముడయ్యేలోగా ఎన్ని జాగ్రతలు తీసుకొన్నా కొంత సరుకు పాడైపోవచ్చును. ఆ నష్టం గురించి దుకాణదారుడికి అవగాహన ఉండాలి. అలా వచ్చే నష్టం దుకాణం తట్టుకోవాలి తప్పదు.

మీ ఉద్యోగస్థులకు జీతాలిస్తున్నారు సరే. కాని అవసరమైనప్పుడు వారికి ద్రవ్యసహాయం చెయ్యవలసి ఉంటుంది. పావలా కూడా అడ్వాన్సు ఇవ్వను దిక్కున్నచోట చెప్పుకో పో అనే వాడి దగ్గర ఉద్యోగులు ఎక్కువకాలం ఉండలేరు - ఉండరు. అందుకని అటువంటి అవసరాలకు సొమ్ము దుకాణం ఆదాయంలోనుండే కేటాయించాలి.

వ్యాపారలావాదేవీల నిమిత్తం తిరుగుళ్ళు ఉంటాయి. అవి సరుకుల ఖరీదుల్లో చేరవు. కాని అవసరమైన కర్చులే. అవన్నీ కూడా దుకాణం ఆదాయంలో నుండే వెచ్చించాలి.

మీ ఉద్యోగులకు ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగితే మీకు బాధ్యత ఉంటుంది. సొమ్ము కర్చవుతుంది. అదంతా మీ దుకాణం చూసుకోవలసిందే.

వ్యాపారం అన్నాక విస్తరణ అన్నమాటా వినిపిస్తుంది. వినిపించాలి కూడా. చిన్నదుకాణం పెద్దదవుతుంది. పెద్దదుకాణం మరొక చోటికి కూడా విస్తరించుతుంది. ఒకటికి నాలుగో పదో బ్రాంచీలూ ఏర్పడుతాయి. మరి ఇదంతా ఉత్తినే కలగనగానే జరిగేది కాదు. సినిమాల్లో ఐతే నాలుగుసార్లు రింగులురింగులు తిరుగుతున్నట్లు చూపితే ఐపోతుంది. కాని నిజజీవితంలో వాస్తవిక జగత్తులో అంత వీజీ కాదు కదా. ఎంతో శ్రమపడాలి. ఎన్నో చోట్ల ముందుచూపుతో అవసరమైన పెట్టుబడులూ పెట్టాలి. కొత్తకొత్తవి సొంత బిల్డింగులు కట్టుకోగలగాలి. ఇదంతా బోలెడు డబ్బుతో కూడిన వ్యవహారం కదా. ఈడబ్బంతా ఎవరూ ఇవ్వరు. మీ దుకాణమే సమకూర్చుతూ పోవాలి.

ఒక్కోక్క సారి సాధ్యమైతే కొత్తవ్యాపారాలూ మొదలుపెట్టాలి, ఎప్పుడూ ఒకే వ్యాపారం మీద కూర్చో కూడదు. మార్కెట్ బాగా మారిపోతే, మీ వ్యాపారం బాగా నడవక మూతబడుతుంది. కాబట్టి కాస్త నిలద్రొక్కుకున్నాక వీలును బట్టి క్రొత్త వ్యాపారాల్లోనికి వెళ్ళటానికి యత్నించాలి. దానికి కావలసిన పెట్టుబడులూ వగైరా మీ దుకాణం సమకూర్చాలి సింహభాగం.

ఇప్పటికి చాలును.

ఇలా వ్యాపారం అన్నాక అనేకానేక అంశాల ప్రభావంతో నడిచే వ్యవహారం కాని రంగనాయకమ్మ గారు చెప్పినంత సింపుల్ విషయం కాదు.

ఏ వ్యాపారంలో అన్నా సరే జీతగాళ్ళు సంస్థకు అదనపు విలువలను సమకూర్చుతారు. వ్యాపారం నడవాలంటే అది తప్పదు కాక తప్పదు. అదంతా యాజమాన్యం తినేస్తోంది అనుకోవటం అన్నిటా సరైన ఆలోచన కాదు.

ఆవిడ చెప్పిన ఉదాహరణనే తీసుకుంటే ఆర్టీసీ సంస్థకు ఉన్న అన్ని కర్చులూ ఈ అదనపు విలువనుండే కదా చెల్లించవలసింది?

ఆర్టీసీ వారు కొత్తబస్సుల్ని కొనాలంటే, ఉన్న బస్సుల మరమ్మత్తులూ వగైరాలకూ సొమ్ము అందులోనుండే రావాలి.

బస్సుకొక డ్రైవరూ, కండక్టరూ సరిపోతారా నిజంగా?

సంస్థ నిర్వహణకు అవసరమైన యాజమాన్యసిబ్బంది సంగతేమిటీ? తిన్నగా బస్సులో కనిపించని కార్మికుల సంగతేమిటీ? ఇలా బోలెడు మంది ఉంటారు కదా వారినీ సంస్థ పోషించాలి కదా?

జాగ్రతగా ఆలోచిస్తే సంస్థ నిర్వహణ వేరూ బస్సు నిర్వహణ వేరూ అన్నది తెలుస్తుంది.

అందుచేత పైపై లెక్కలు వేసి బోలెడు మిగులుతోందీ, యాజమాన్యం బొక్కేస్తోందీ అనటం సబబు కాదని అనుకుంటాను.


2, నవంబర్ 2019, శనివారం

లంచమిచ్చి మాన్పలేరు రామభక్తిని


లంచమిచ్చి మాన్పలేరు రామభక్తిని బెది
రించి దాని నెవ్వ రడ్డగించను లేరు

మంచిబుధ్ధి కలవారును మాన్యచరితులగు వారును
నంచితముగు రామనామ మవలంబింప
వంచకులగు వారు చేరి బహుధా యత్నించి రేని
కొంచెమైన ఫలముండదు గోవిందుడా

పట్టుదల కలవారును పరమయోగులగు వారును
పట్టి రామపాదములను వదలక యున్న
చుట్టుముట్టి తులువలెన్ని చిత్రాలు చేసిన గాని
గొట్టుచేయ లేరు కదా గోవిందుడా

కాము నీడ్చితన్నిన వారు పామరత్వ మెఱుగని వారు
రామతత్త్వ చింతనమున రంజిల్లగను
తామసులు చెడగొట్టుటకు తలక్రిందులైనను గాని
ఏమి లాభము గోవింద యెంచి చూడగ

1, నవంబర్ 2019, శుక్రవారం

నమ్మిన నమ్మకున్న నారాయణుడే


నమ్మిన నమ్మకున్న నారాయణుడే
యిమ్మహి నాథుడై యెసగుచుండును

పొగడుగాక తెగడుగాక తగ నెల్లవేళలను
జగము నం దొక్కడు హరిస్మరణంబు చేసిన
పగవాడగు భక్తుండగు వాని యెడదలోపల
నగుచు తిష్ఠవేయును నారాయణుడెప్పుడు

కనకకశిపు జొచ్చి హృదయగహ్వరంబున నుండె
నినకులేశు డగుచు రావణునిలోన నిండె
వెనుక కంస శిశుపాలుర మనోవీధు లందుండె
మనసు నిండియుండు వాడు మరినాథుడే కదా

రాముడై హనుమ హృదయరాజీవ మందుండు
రామ రామ యనువారిని రక్షించుచు నుండు
కామితార్ధప్రదుడగుచు కనికరించుచు నుండు
ఏమయ్యా రక్షకుడే యెసగ నాథుడు కదా