28, నవంబర్ 2019, గురువారం

షట్పదలు


జిలేబీగారు షట్పదలను కెలికారు.
ఈ షట్పదలను గురించి వ్రాయటం కొంచెం అవసరం అనిపించి వ్రాస్తున్నాను.

జిలేబీగారి షట్పదాసమరోత్సాహం గురించి చెప్పాలంటే దానికి కారణం శరషట్పద. అది వారి మాటల్లో "భలే బాగుంది. నో యతి‌ నో ప్రాసల ఝంఝాటపు ఝంకృతి" కావటమే అని తెలుస్తున్నది.  జిలేబీ గారి షట్పదను తిలకించి తరిద్దాం

షట్పద మొనరిం
చునొక్కొ ఝంకా
రమ్మున్ జిలేబి శరషట్పద
మిదియె సుమా సుల
భమైనది నేర్వ
గా ప్రాసయతులు లేవు సుమా

ఇలా షట్పదను వ్రాయాలంటే "రెండు నాల్గు మాత్రలు, రెండు నాల్గు మాత్రలు, మూడు నాల్గు మాత్రలు ఒక రెండు మాత్రలు.. రిపీట్ మాడి." అని సంబరపడిపోయారు. కాని షట్పద యొక్క నాడిని పట్టుకోవటానికి ఆట్టే ప్రయత్నించలేదు. చివరికి షట్పద మాడి చచ్చిందని చెప్పకతప్పదు.

ఈ శరషట్పదను గురించి ఛందం పేజీలో కొంత సమాచారం ఉంది. అది ఈ క్రింద చూపుతున్నాను జనసౌలభ్యం కోసం
.

శర షట్పద పద్య లక్షణములు
జాతి(షట్పదలు) రకానికి చెందినది. 4 నుండి 14 అక్షరములు ఉండును. 6 పాదములు ఉండును. ప్రాస నియమం లేదు

ఒకటవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును. రెండవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును. మూడవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.
నాలుగవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును. ఇదవ పాదమునందు రెండు 4 మాత్రలు గణములుండును. ఆరవ పాదమునందు మూడు 4 మాత్రలు , ఒక 2 మాత్రలు గణములుండును.

ఈ లక్షణాలను ఉటంకిస్తూ జిలేబి గారి వరూధిని బ్లాగులో శర్మ గారు కొంచెం వివరణ కావాలని అడిగారు.

అన్నట్లు ఆ ఛందం పేజీ వారు ఎక్కడి నుండి తెచ్చారో కాని ఈ క్రింది ఉదాహరణను ఇచ్చారు శరషట్పదికి

  శ్రీతరుణిరొ నే
  శ్రీరఘురాముడ
  చేరి కవాటము తీవే
  ఖ్యాతిగ శ్రీరఘు
  రాముడవైతే
  కోతుల జేరగదోయీ

పై వివరాలను గురించి కొంచెం ఆగి చర్చిద్దాం. ముందుగా షట్పదల గురించి వివరంగా తెలుసుకుందాం.

షట్పదలు కన్నడ ఆంధ్ర ఛందస్సులు రెండింటిలోనూ కనిపిస్తాయి. కన్నడంలో వీటికి ప్రాచుర్యం ఉంది - ముఖ్యంగా భామినీషట్పదకు. ఐతే తెలుగులో వీటికి కవిజనామోదం లేదు. ఎవరూ తమ కావ్యాల్లో వాడింది లేదు. కేవలం తెలుగులాక్షణికులు సమగ్రత కోసం షట్పదలను కూడా తమ పుస్తకాల్లో ప్రస్తావించటమూ వివరించటమూ చేసారంతే.

ఈ షట్పదులు పదఛ్ఛందాలు. మాత్రాఛందస్సులులతో నడుస్తాయి. అందుచేత, కవులు - అంటే ముఖ్యంగా మన తెలుగుకవులు గమనించవలసిన సంగతి ఒకటి ఉంది. ఈ షట్పదులు గేయగతులు కలిగి ఉన్నాయన్నది. ఐనా సరే, మన తెలుగులాక్షణికులు తమ పుస్తకాలలో వీటికి గణవ్యవస్థను గురించి నిర్దేశించటానికి దేశిగణాల సహాయంతో ప్రయత్నం గట్టిగా చేసారు. కన్నడంలో ఈ షట్పదలకు మాత్రాఛందస్సుల్లోనే లక్షణాలు చెప్పబడ్దాయి.

మల్లియ రేచన తన కవిజనాశ్రయంలో షట్పదకు ఇచ్చిన లక్షణం చూడండి

ఇంద్ర + ఇంద్ర
ఇంద్ర + ఇంద్ర
ఇంద్ర  + ఇంద్ర + చంద్ర
ఇంద్ర + ఇంద్ర
ఇంద్ర + ఇంద్ర
ఇంద్ర  + ఇంద్ర + చంద్ర

ఇలా 6 పాదాలకు లక్షణం. ఇక్కడ మొదటి మూడు పాదాలు పూర్వఖండం, చివరి మూడు పాదాలూ ఉత్తరఖండం. అని స్పషంగా మనకు కనిపిస్తున్నది పై లక్షణ సౌష్టవాన్ని బట్టి.  రేచన కూడా మూడు పాదాల త్రిపద లక్షణం చెప్పి, దానిని రెట్టించితే అది షట్పద అని చెప్పాడు.

కాని ప్రాస ఎలాగు అన్నది అయన చెప్పిన విధానం చూస్తే పద్య లక్షణం ఇలా ఉంటుంది.

ఇంద్ర + ఇంద్ర + ఇంద్ర + ఇంద్ర
ఇంద్ర  + ఇంద్ర + చంద్ర
ఇంద్ర + ఇంద్ర + ఇంద్ర + ఇంద్ర
ఇంద్ర  + ఇంద్ర + చంద్ర

ఇలా షట్పదను సంప్రదాయిక చతుష్పాత్తుగా భావించి ప్రాస నియమం యథావిధిగా పాటించాలి అని రేచన ఉద్దేశం అన్నమాట.

ఈ అభిప్రాయాన్ని అతడు ఇచ్చిన ఉదాహరణ బలపరుస్తున్నది. లక్షణపద్యంగా రేచన ఇచ్చిన షట్పదను చూడండి

త్రిదశేంద్రగణములు
వెలయ నిర్మూడిడి
కదియ నంత్యంబున జంద్రు గూర్చి
తుది యిట్లుగా మది
జెప్పిన నదియ ష
ట్పదమగు మల్లియ రేచనాఖ్య

ఈ పద్యాన్నే చతుష్పాత్తుగా పైన చెప్పిన విధంగా వ్రాస్తే, ప్రాస యుక్తంగా ఇలా ఉంటుంది.

త్రిశేంద్రగణములు వెలయ నిర్మూడిడి
దియ నంత్యంబున జంద్రు గూర్చి
తుది యిట్లుగా మదిజెప్పిన నదియ ష
ట్పమగు మల్లియ రేచనాఖ్య

వావిళ్ళ వారు ప్రచురించిన కవిజనాశ్రయంలో కూడా ఇలాగే ఉన్నది.

కవిజనాశ్రయకారుడి దష్టిలో షట్పద అంటే త్రిపదకు రెట్టించిన లక్షణం. నాలుగు పాదాలు కానిదే పద్యం కాదన్న ఉద్దేశంతో షట్పదను నాలుగు పాదాలుగా వ్రాసి ప్రాసనుంచాలని రేచన ఉద్దేశం కావచ్చును.

మధ్యేమార్గంగా నాకీ ఉపాయం తోస్తున్నది. విజ్ఞులు ఆలోచించాలి.

త్రిదశేంద్రగణములు
    వెలయ నిర్మూడిడి
కదియ నంత్యంబున జంద్రు గూర్చి
తుది యిట్లుగా మది
    జెప్పిన నదియ ష
ట్పదమగు మల్లియ రేచనాఖ్య

సీసపద్యంలో మనం ఒక ఆధునిక విధానం చూస్తున్నాం. ప్రథాన భాగం నాలుగుపాదాలనూ రెండేసి ముక్కలుగా వ్రాస్తున్నాం. పూర్వార్థం నాలుగు ఇంద్రగణాలు ఒక భాగం వ్రాసి,  ఉత్తరార్థం రెండు ఇంద్రగణాలు, రెండు సూర్యగణాలను కొంచెం ఎడమిచ్చి క్రిందుగా వ్రాస్తున్నాం. కాని పూర్వకాలం ప్రతుల్లో మొత్తం 8గణాలనూ బారుగా వ్రాయటం చేసేవారని గమనించవచ్చును. అందుకని మనం షట్పదలో 2,5 పాదాలను కూడా కొంచెం ఎడమిచ్చి వ్రాస్తే ప్రాస చక్కగా కనిపిస్తూ ఉంటుంది.

మల్లియరేచన వివేచన చూసాం కదా. ఒక్క రేచన తప్ప మిగిలిన లక్షణకారులు మొత్తం ఆరు పాదాలుగా షట్పదను భావించి ప్రాసను పాటించారు.

షట్పదుల్లో ప్రాస విషయం గురించి ముచ్చటించున్నాక యతి నియమం గురించి కూడా చెప్పుకుందాం.

షట్పది లోని పొట్టిపాదాలకు రెండేసి ఇంద్రగణాలు మాత్రం ప్రమాణదైర్ఘ్యంగా ఉంది. అంటే ఈపాదాల నిడివి మాత్రల్లో 8 నుండి 10 వరకూ వస్తుందంతే. అక్షరసంఖ్యను గమనించినా 6 నుండి 8 అక్షరాలు మాత్రమే. ఇంత చిన్నపాదాలకు యతి స్థానం నిర్దేశించటం సంప్రదాయం కాదు. అందుచేత పొట్టిపాదాలను వాటిమానాన వాటిని వదిలి వేయవచ్చును.

షట్పదలోని రెండు పొడుగుపాదాలైన 3వ మరియు 6వ పాదాలకు చెరొక చంద్రగణమూ అదనంగా ఉంది. చంద్రగణాలను గురించి కొంచెం ఆగి పరిశీలిధ్ధాం. మొత్తం మీద ఈ రెండుపాదాలూ తగినంత అక్షర మరియు మాత్రాదైర్ఘ్యాలను కలిగి ఉన్నాయని ఖచ్చితంగా చెప్పవచ్చును. అందుచేత కొందరు లక్షణ కారులు అంటే విన్నకోట పెద్దన, అనంతుడు చంద్రగణం ప్రారంభంతో యతిమైత్రిని పాటించారు. వీరు ఇలా యతిని పాటించటం కేవలం వారి ఉదాహరణల్లో యాదృఛ్ఛికం కావచ్చును. ఎందుకంటే యతిమైత్రి పాటించాక పాదం నిడివి ఒక్కగణం మాత్రమే కద.

అప్పకవి షట్పదికి నిర్యతి అన్నాడు. అనంతుడు దీన్ని వళ్ళుదొఱగ వ్రాయాలి అన్నాడు. ఇలా ఇద్దరూ యతి లేదనే చెప్పారు. కన్నడంలో కూడా యతి నియమం లేదు. తెలుగులో యతినియమం లేని పద్యం ఇదొక్కటేను!

ఇకపోతే చంద్రగణం గురించిన చర్చ ఒకటి మిగిలింది. దీర్ఘపాదాలు రెండూ చంద్రగణంతో ముగుస్తాయి కద. మన చర్చకు సంబంధించనంత వరకు చంద్రగణం అంటే 6 లేదా 7 మాత్రల ప్రమాణం కలది అని చెప్పుకుంటే సరిపోతుంది.

చంద్రగణం అనే కాదు మనం ఇప్పటిదాకా లక్షణకారులు ఇంద్రగణం అన్నదానిని గురించి కూడా ఒక ముఖ్యమైన ముక్క తప్పకుండా చెప్పుకోవాలి. నిజానికి ఇంద్రగణాలుగా షట్పదల్లో గణాల వాడుక లేనే లేదు. అవన్నీ మాత్రాగణాలు. గణం కొలత 3, 4 లేదా 5 మాత్రలు. కొన్ని రకాల షట్పదల్లో ఒకగణం బదులుగా గణద్వయం ఉంటుంది అంటే 4 + 4 లేదా  3 +4 వగైరాగా దీర్ఘగణాలుగా. అందుచేత లక్షణం పుస్తకాలు చూసి ఇంద్రగణాలూ చంద్రగణాలు అంటూ ప్రయత్నిస్తే షట్పదలు రావు.

మరొక ముఖ్య విషయం. షట్పదలయ్యేది మరొక దేశి చందస్సు అయ్యేది  కూడని పనులు కొన్ని ఉన్నాయని గమనించాలి.

గణసంకరం పనికిరాదు.  4 మాత్రల గణాలు రెండు అన్నామనుకోండి. మొత్తం 8 మాత్రలు కదా అని 5 + 3 మాత్రలుగా వచ్చేలా వ్రాయకూడదు.  ఉదాహరణకు రాజకుమారుడు అన్నది నప్పుతుంది కాని రాకుమారకుడు అన్నది నప్పదు.

ప్రవాహగుణం వర్జించాలి. పాదాలు కొత్త మాటలతో మొదలు కావాలి. అంటే పాదం చివర మాట పూర్తికావాలి కాని తరువాయి పాదంలోనికి విస్తరించకూడదు.

ఇంకా కొన్ని ఇలాంటి నియమాలున్నాయి కాని ముఖ్యంగా ఈపై రెండూ గుర్తుపెట్టుకోవాలి. ఈ నియమాలు తేటగీతి ఆటవెలది కందం వంటి వాటికీ వర్తిస్తాయి, ఇక్కడ షట్పదలకూ వర్తిస్తాయి.

కన్నడంలొ 6 రకాల షట్పదలున్నాయి.  తెలుగులోనూ అవే. వాటి గురించి చర్చించకుండా ఈవ్యాసం సంపన్నం కాదు. అందుకని వాటిని పరిశీలిద్దాం. ఈ చర్చకు మనం మాత్రాఛందస్సులను వాడుతున్నాం అని గమనించండి.

శరషట్పద.

4 + 4
4 + 4
4 + 4 + 4 + 2
4 + 4
4 + 4
4 + 4 + 4 + 2

ఇక్కడ సాధారణగణాలన్నీ 4 మాత్రల గణాలు. దీర్ఘపాదాలు 4 + 2 = 6 మాత్రల గణంతో ముగుస్తాయి.

ప్రసిధ్ధమైన భగగోవింద స్తోత్రం చూడండి

భజగోవిందం
భజగోవిందం
గోవిందంభజ మూడమతే
సంప్రాప్తే స
న్నిహితే కాలే
నహినహి రక్షతి డుకృన్కకరణే

దీన్ని స్ఫూర్తిగా తీసుకొని శ్రీశ్రీ వ్రాసినది చూడండి

మరో ప్రపంచం
మరో ప్రపంచం
మరోప్రపంచం పిలిచిందీ
పదండి ముందుకు
పదండీ త్రోసుకు
పోదాం పోదాం పైపైకీ

ఈ రెండింటిలో ప్రాస గురించి అడక్కండి. సంస్కృతంలో ప్రాసనియమం ఎలాగూ లేదు. శ్రీశ్రీది ఆధునిక కవిత్వం కాని పద్యకవిత్వం కాదు కాబట్టి యతిప్రాసల పట్టింపు లేనేలేదు!

రామదాసు గారి ప్రసిధ్ధకీర్తన ఒకటి తారకమంత్రము కోరిన దొరకెను అన్నది చూడండి.

తారక మంత్రము
కోరిన దొరికెను
ధన్యుడ నైతిని ఓ రన్నా
మీరిన కాలుని
దూతల పాలిటి
మృత్యువు యని మది నమ్మన్నా

ఇది కూడా శరషట్పద ఛందంలో ఉన్న గేయమే. ఐతే ప్రాసనియమం పాటించలేదు.  గేయాల్లో ప్రాసనియమం ఐఛ్ఛికం కదా. కాని మనం శరషట్పదను పద్యరూపంగా వ్రాసినా దాని గేయపు నడకకు అన్యాయం చేయకూడదు. పద్యం అన్నాక దానికి ఉన్న ప్రాసనియమం మరువకూడదు.

కుసుమషట్పద

5 + 5
5 + 5
5 + 5 + 5 + 2
5 + 5
5 + 5
5 + 5 + 5 + 2

ఇక్కడన్నీ పంచమాత్రాగణాలు. అన్నీ ఇంద్రగణాలు కావాలని గమనించండి. దీర్ఘపాదాల్లో చివరిది 7మాత్రల గణం కావాలి - వీటిని పంచమాత్రా ఇంద్రగణం పైన గురువుగా సాధించాలి.

అనంతుడి ఛందో దర్పణంలోని ఉదాహరణ చూడండి.

మెఱయంగ నిద్ద ఱి
ద్దఱు సురేంద్రులు మూడు
తెఱగులన్‍ శశిగూడ నర్దంబులన్‍
నెఱిగ్రాలగా వళ్ళు
దొఱగ షట్పద రీతి
వఱలు జక్రి పదాబ్జ వర్ణనంబుల్

ఇది కొఱకరాని కొయ్యలా ఉంది కదూ.  ఒక ఆధునిక కవితను చూడండి

స్వప్నాలలో నన్ను
స్వర్గాల తేలించి
ఆనందమున ముంచివేసావురా

భోగషట్పద

3 + 3 + 3 + 3
3 + 3 + 3 + 3
3 + 3 + 3 + 3 + 3 + 3 + 2
3 + 3 + 3 + 3
3 + 3 + 3 + 3
3 + 3 + 3 + 3 + 3 + 3 + 2

ఇక్కడ ఒక్కొక్క గణం స్థానంలోనూ  3+ 3 అని ఆరు మాత్రల కాలవ్యవధిని వాడాలి.

కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చును కాని ఇది తెలుగులో మంచి ప్రచారంలో ఉన్న షట్పద గేయ విధానం.

భద్రాచల రామదాసు గారి సాహిత్యంలో చూడండి

రామచంద్రాయ జనక
రాజజామనోహరాయ
మామకాభీష్టదాయ మహితమంగళం

అన్నది భోగషట్పద నడకలో ఉంది.  మీకు గణవిభజనకు కుదరటం లేదు కదూ?

ఒక్క విషయం. రామదాసు గారిది గేయం. పద్యం కాదు. గేయంలో నడక కోసం అవసరమైన చోట అక్షరాల/మాటల మీద కాలవ్యవధిని పెంచటం కుంచించటం చేస్తాం. తప్పులేదు. ఇప్పుడు కాలవ్యవధానంతో చూదాం.

రామ।  చం।  ద్రాయ।  జనక।
రాజ।  జామ।  నోహ।  రాయ।
మామ।  కా।  భీష్ట।  దాయ।  మహిత।  మంగ।  ళం

ఈ పాట అందరికీ సుపరిచితమే కాబట్టి ఒక్కసారి పాడుకొని చూడండి. ఈకుసుమషట్పద నడక చక్కగా తెలుస్తుంది.

మరొక ఉదాహరణ

తులసి।  నింట।  నుంచు।  వార్ని
తులసి।  పూజ।  జేయు।  వార్ని
తులసి।  యందు।  భక్తి।  యుంచి।  కొలుచు।  వారి।  నీ

భామినీ షట్పద

3 + 4 + 3 + 4
3 + 4 + 3 + 4
3 + 4 + 3 + 4 + 3 + 4 + 2
3 + 4 + 3 + 4
3 + 4 + 3 + 4
3 + 4 + 3 + 4 + 3 + 4 + 2


ఇక్కడ గణప్రమాణంగా 3 + 4 అని విభజన చూడండి. ఈభామినీషట్పద కన్నడంలో కన్నడకస్తూరి అన్న పేరు పొందిన ఛందం. 3 +4 = 7 మాత్రల ప్రమాణం కాలం ఉన్న మాటలు తెలుగులో అంత సహజం కావు. కాని 7 మాత్రలూ ఒకే మాట కానవసరం లేదు. కాని 7 మాత్రలకు ఒకసారి పదం విరగటం జరగాలి.

ఒక ప్రసిధ్ధమైన గేయం దీనికి మంచి ఉదాహరణ.

గుమ్మడేడే గోపిదేవీ
గుమ్మడేడే కన్నతల్లీ
గుమ్మడిని పొడసూప గదవే అమ్మ గోపెమ్మా

ఇది కూడా విభాగం చేసి చూపితే కొంచెం స్పష్తపడుతుంది.

గుమ్మ।  డేడే।  గోపి।  దేవీ
గుమ్మ।  డేడే।  కన్న।  తల్లీ
గుమ్మ।  డిని పొడ।   సూప గదవే।   అమ్మ గోపె।  మ్మా

పరివర్ధిని షట్పద

ఇది శరషట్పదకు రెట్టింపు పొడుగు పాదాలతో ఉంటుంది

4 +  4 + 4 + 4
4 +  4 + 4 + 4
4 +  4 + 4 + 4 + 4 + 4 + 2
4 +  4 + 4 + 4
4 +  4 + 4 + 4
4 +  4 + 4 + 4 + 4 + 4 + 2

ఇక్కడ 4 +  4 = 8 మాత్రల కాలం ఒక గణప్రమాణం. దీర్ఘపాదాల్లో చివరి 2 మాత్రలూ ఒక గురువు. ఒక్క విషయం గమనించండి 4 + 4 అన్నారు. 5 +  3 అని విడదీయ కూడదు 8 మాత్రల్ని. అంటే 4 మాత్రల ఇంద్రగణాలనే వాడాలి. ఇక్కడ చంద్రగణం అంటే రెండు ఇంద్రగణాల పైన ఒక గురువు అన్నమాట.

వార్ధక షట్పద

5 + 5 + 5 + 5
5 + 5 + 5 + 5
5 + 5 + 5 + 5 + 5 + 5 + 2
5 + 5 + 5 + 5
5 + 5 + 5 + 5
5 + 5 + 5 + 5 + 5 + 5 + 2

దీని వైనం కుసుమషట్పదకు రెట్టింపు అన్నమాట. ఇక్కడ అన్నీ 5 మాత్రల ఇంద్రగణాలనే వాడాలి. ఇక్కడ చంద్రగణం అంటే 5 మాత్రల ఇంద్రగణం పైన ఒక గురువు అన్నమాట.


ఇంకా కొన్ని షట్పద విశేషాలున్నాయి. తలషట్పద, జలషట్పద,  విషమషట్పద, ప్రౌఢషట్పద అంటూ.  వాటి గురించి ప్రస్తుతం చర్చించటం లేదు.  ఈవ్యాసం పాఠకుల్లో ఎవరికనా అసక్తి ఉంటే వాటిని వివరిస్తాను.

అలాగే షట్పదల నడకలూ వగైరా గురించి కూడా వ్రాయదగిన సామాగ్రి కొంత ఉంది. ఐతే క్లుప్తంగా ఒక్క విషయం చెప్తాను. ముందే మనవి చేసినట్లుగా షట్పదలు గేయఛందస్సులు. అందుచేత పాడటానికి అందగా ఉండేటట్లుగా వ్రాస్తే వాటికి సార్ధకత వస్తుంది. కేవలం మాత్రలు కిట్టించి ఇదిగో షట్పద అనేస్తే అది ఒక సర్కస్ ఫీట్ అవుతుందేమో కాని అదొక షట్పద మాత్రం కాదు.

ఇప్పుడు షట్పదల యొక్క స్థూలస్వరూపం గురించి మనకు చక్కగా బోధపడి ఉండాలి. ఈ షట్పద యొక్క నిర్మితి ఇలా ఉంటుంది

X + X
X + X
X + X + X + U
X + X
X + X
X + X + X + U

ఇక్కడ U అంటే ఒక గురువు. X అంటే ఒక మాత్రాగణం. అది 4,5,6 ఇలా ఎంతైనా ఉండవచ్చును.

ఈ షట్పదలకూ రగడలకూ మంచి దగ్గరచుట్టరికం ఉంది.

భోగషట్పద అన్నది హాయప్రచార రగడ. ఇది త్రిస్రగతిలో త్రిమాత్రలతో నడుస్తుంది
శరషట్పద అన్నది మధురగతి రగడ. ఇది చతుర్మాత్రలతో నిర్మితమై చతురస్రగతిలో నడుస్తుంది.
కుసుమషట్పద అన్నది ద్విరదగతి రగడ. ఇది పంచమాత్రాప్రమాణమై ఖండగతిలో నడుస్తుంది.
భామినీషట్పద అన్నది హరిణగతి రగడ. ఇది  4 + 3 మాత్రల మిశ్రమగణంతో నిర్మితమై మిశ్రగతిలో నడుస్తుంది.

మనం శరషట్పదకు రామదాసస్వామిగారి కీర్తన  తారకమంత్రము కోరిన దొరకెను అన్నది ఒకటి ఉదాహరణగా చెప్పుకున్నాం కదా.  దానిని మరొక సారి చూదాం.

తారక మంత్రము
కోరిన దొరికెను
ధన్యుడ నైతిని ఓ రన్నా
మీరిన కాలుని
దూతల పాలిటి
మృత్యువు యని మది నమ్మన్నా

ఇందులో మీకు యతిమైత్రి కనిపించటం లేదు కదా. కాని మనం దీనిని రగడగా వ్రాస్తే అది ఇలా ఉంటుంది.

తాక మంత్రము కోరిన దొరికెను న్యుడ నైతిని ఓ రన్నా
మీరిన కాలుని దూతల పాలిటి మృత్యువు యని మది నమ్మన్నా

ఇది మధురగతి రగడ. ఇక్కడ ర అన్నది ప్రాసగా చక్కగా కనిపిస్తోంది కదా. అలాగే తా-ధ లకూ మీ-మృ లకూ యతిమైత్రి కూడా కనిపిస్తోంది కదా.

తెలుగు సాహిత్యంలో రగడలు చెప్పుకోదగినంత స్థానం పొందాయనే అనవచ్చును. అంటే కందాల్లాగా సీసాల్లాగా కవులెవ్వరూ వాటిని విస్తారంగా వాడలేదు. కాని దాదాపుగా అందరు పెద్దకవులూ తమ కావ్యాల్లో కనీసం ఒకటి రెండు చోట్ల నైనా రగడలను వినియోగించారు. సాధారణంగా రగడలను ఎవ్వరూ నాలుగుపాదాల పద్యాల్లాగా వ్రాయరు. రగడను ఎప్పుడు అందరూ ఒక మాలికలాగా వ్రాస్తారు. ఐదారు పాదాలు కాదు కనీసం పదహారు పాదాలుంటాయనే అనవచ్చును. రగడలను గురించి వేరుగా ఇంకొక వ్యాసంలో వివరిస్తాను.

కాని రగడలకు యతిప్రాస నియమాలు వృత్తాలకు వలెనే ఉన్నాయి. అవి మాత్రాగణాల్లో వ్రాయబడతాయన్నది నిజం.

తారకమంత్రము కీర్తన మధురగతి రగడగా ఉందని పైన చూసాం కదా. అందులో యతి ప్రాసలనూ గమనించాం. ఇలా కాకుండా రగడలోని పాదాన్ని విడిగా యతిరహితంగా బహుపాదాల్లో వ్రాయటంలో కవులకు పెద్దగా సారస్యం కనిపించక పోవటంలో ఆశ్చర్యం లేదు. కనీసం ప్రాసనియమాన్ని పాటించితే ఇలా షట్పదల వలె వ్రాసినా కొంతలో కొంత మెఱుగుగా ఉంటుంది. లేని పక్షంలో రగడను నిర్వహించలేక దాన్ని షట్పద అన్నాడు కవి అని పాఠకులు అనుకొనే ప్రమాదం దండిగా ఉంది. అందుచేత తెలుగుకవులు షట్పదలను కావ్యనిర్మాణాల్లో విసర్జించారు.

ఆదునిక కాలంలో కవిత్వపు ధోరణి చాలా మారింది. పొట్టిపొట్టి కవిత్వాలకు ఆదరణ పెరిగింది. యతిప్రాసల వైముఖ్యం కూడా బాగానే పెరిగింది. ఒకప్పుడు లబ్ధప్రతిష్ఠుడైన మైఖేల్ మదుసూదన దత్‍ అనే బెంగాలీ కవి ఇలా యతి ప్రాసలవంటివి త్రోసివేసి మేఘనాథవధ అన్న కావ్యం వ్రాసాడు. సంప్రదాయ కవిత్వం బాగా చెప్పగలిగిన శ్రీశ్రీ తన ధోరణికి అంటే అధునాతన భావజాలాన్ని జనబాహుళ్యానికి అందించటానికి పాతఛందస్సులూ పాతధోరణులూ నప్పవని వచనలో కవిత్వం వ్రాసాడు.

ఈరోజున వచనకవిత్వం పేర వస్తున్నది అంతా కవిత్వం అనలేం. అలా వ్రాస్తున్నాం కవులం అనుకొనే వారిలో చాలా మందికి సరైన భాషాజ్ఞానం కూడా ఉండటం లేదు.

అందుచేత నవీనకాలానికి తగినట్లుగా యతిప్రాసలు లేకుండా చిన్న చిన్న వృత్తాలూ దేశిఛందస్సులూ వాడుక చేయాలనుకొనే వారికి షట్పదలు రుచించే అవకాశం ఉంది. ఐతే దేశి ఛందస్సులో మూలసూత్రాలను కూడా విసర్జిస్తే అవి ఎంతగా నచ్చజెప్పినా గోలపెట్టినా సరైన కవితలు కాలేవు.

17 కామెంట్‌లు:


 1. టపా బాగుంది. కొన్ని అనుమానాలుండిపోయాయి.

  మొదటి పాదంలో రెండు ఇంద్రగణాలన్నారు. అంటే ఎనిమిది. మరో ఇంద్ర గణమూ చేర్చచ్చా. అప్పటికి పన్నెండు మాత్రలు. ఇదెలాగా తేల్చుకోవాలి? గణాలు సరిపెట్టుకోవాలా? మాత్రలా?

  ఇక మూడో పాదంలో ఎలాగో, మాత్రలు సరిపెట్టుకోవాలా? గణాలు సరిపెట్టాలా? ఇక్కడే గందరగోళం.

  రారా నాసా మి
  రారా రారా రాపే
  ల చేసేవురా ఇటు రారా
  రారా నాసా మి
  రారా రారా రాపే
  ల చేసేవురా ఇటు రారా

  ఈ షట్పది పాటకేగాని పద్యానికి పనికిరాదా? పైదానిలో గణం సమస్య కనపడలేదుగాని, మరితరాల్లో ఎలా?
  తెలియనితనంతో పిచ్చి ప్రశలేసి ఉంటే మన్నించండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మరిన్ని వివరాలను వ్యాసంలో చేర్చాను. మీ సందేహాన్ని దృష్టిలో ఉంచుకొని. మరొక్కసారి వ్యాసాన్ని పరిశీలించ ప్రార్థన. మీరిచ్చిన ఉదాహరణ గేయం షట్పది కాదు. షట్పదిది గేయపు నడక. పద్యంగా వ్రాసినపుడు ప్రాసను పాటించటం ఉచితం. గేయంగా వాడినప్పుడు ప్రాస పాటించటం ఐఛ్ఛికం.

   తొలగించండి


  2. సులభమైన వాటిని కాంప్లికేటు చేయగ గందర గోళము రాక మరేమి వచ్చును :)


   ట్వింకిల్ ట్వింకిల్
   లిట్టిల్ స్టార్ హౌ
   యై వండర్ వాట్ యువ్వార్ అప్
   అబవ్ ది వాల్డ్ సో
   హై లైక్ యే డై
   మండిందస్కై శరషట్పద!   జిలేబి

   తొలగించండి
  3. జిలేబీ గారు,
   సులభమైన వాటిని కాంప్లికేటు చేయటం అంటే ఏమిటీ మీ ఎత్తిపొడుపు? అందమైన షట్పదలను మీరు చిత్రవధ చేసింది చాలును. ఇలాంటి వెఱ్ఱిమొఱ్ఱి గిలుకుళ్ళన్నీ పద్యాలని అనుకోవటం నావల్ల కాదు. ఆ ముక్క మీకు ఎప్పుడో ఏళ్ళ క్రిందటే చెప్పాను. నేను చెప్పవలసిన దేదో చెప్పాను. మీకు నచ్చాలని కాదు విషయం జనానికి తెలియాలని చెప్పాను. ఎవరికి వారు ఏది బాగుందో తెలుసుకోవచ్చును. నాకు వాదించే ఆసక్తీ ఓపికా తీరికా ఏవీ లేవు. ధన్యవాదాలు.

   తొలగించండి

  4. ప్రాస యతి లేని షట్పద మీద యెందుకు ప్రాస యతులను రుద్ది సంక్లిష్టతరం చేస్తున్నారండీ .

   రాసే దంతా రాసేసి ఆయ్ నాకు ఓపిక లే వాదించేందుకు అంటూ పోవడమేవిటో !

   జిలేబి

   తొలగించండి
  5. షట్పదలకు యతి నియమం లేదని వివరించాను. కాని ప్రాసనియమం ఉందని కూడా చెప్పాను. అది ఏలక్షణకారులు చెప్పారో కూడా వివరించాను. ఇందులో నా స్వకపోలకల్పితం ఏమీ లేదు. మీరు ఛందం పేజీని ప్రమాణం అనుకుంటున్నారు. వారు "జాతి(షట్పదలు) రకానికి చెందినది... ప్రాస నియమం లేదు" అని వ్రాసారు1 ఉపజాతి పద్యాలకు ప్రాసనియమం ఉండదు. దానికి తేటగీతి ఆటవెలదులు ఉదాహరణలు. జాతిపద్యాలకు ప్రాసనియమం ఉంటుంది. ఉదాహరణకు కందం. మీరు కాస్త ఛందశ్శాస్త్రం కూడా చదువుకుంటే బాగుంటుంది మరి. నాకుతీరికా ఓపికా వగైరాలు లేకపోవటానికి నాకారణాలు నాకున్నాయి. 24గం. పాటు వాదిస్తూ బోధిస్తూ కూర్చోలేను కదా. పైగా మీరు ఒకరు చెబితే వినేరకం కాదాయె! మీ కాలక్షేపం అల్లా నాకు ప్రాణసంకటం ఐతే ఎట్లాగండీ? మళ్ళా ధన్యవాదాలు.

   తొలగించండి

  6. ఎవరో ఆకాలంలో తనకు తెలిసిన దాన్ని ఇంద్ర + ఇంద్ర అంటూ ఉదాహరణ గా గణాన్ని పద్యాన్ని ఉటంకిస్తే అందులోనుంచి ప్రాస సరి పోవాలని / ఉండాలని
   లా చిక్కు లాగటం అదిన్నూ సంక్లిష్టతరంగా లాజిక్కు పెట్టి ? దీన్నేమంటారో సెలవీయండి

   చందాలు చస్తున్నాయంటే ఇట్లాంటి over doing వ్యాఖ్యానాలు కారణం కాకుంటే మరేమవుతుందీ ?


   సవాలే సవాల్
   జిలేబి

   తొలగించండి
  7. జిలేబీ గారూ, మీకు నా వ్యాసం నచ్చనందుకు చింతిస్తున్నాను. నేను చెప్పిన విషయాలను ఎవరేమి చెప్పారో లక్షణాలను వివరంగానే చెప్పి మరీ పద్యస్వభావం గురించీ వైవిధ్యం గురించీ వ్రాసాను. మీరు మరింత శ్రధ్ధతో దానిని మరొకటి రెండు సార్లు చదివి చూచిన పక్షంలో నేను వ్యాసంలో షట్పదలను ఎలా అందంగా వ్రాయవచ్చునో అన్నదానిని సోదాహరణంగా వివరించటానికి యత్నించానే కాని ఎక్కడా సంక్లిష్టం చేయటానికి ఏమీ over doing చేయలేదని గ్రహించగలరని భావిస్తున్నాను. మీరు కొంచెం sportiveగా తీసుకోగలిగిన పక్షంలో ఒక్క ముక్క చెప్పటానికి సాహసిస్తున్నాను. ఛందస్సులకు పడుతున్న దుర్గతికి కారణం పద్యఛందస్సులలోని నడకలను సరిగా గమనించకుండా గౌరవించకుండా లక్షణాలచట్రాలలో అక్షరాలు కుక్కేస్తే చాలు పద్యం కిట్టించేసాం చచ్చినట్లు అది మంచి పద్యం ఐనట్లే అని భావించే కొందరి అత్యుత్సాహం. నేను ఇప్పుడు ఈ షట్పదలను వివరించినా లోగడ కొన్నికొన్ని ఛందస్సులను వివరించినా వాటి నడకలూ నడతలూ ముఖ్యంగా చెప్పాను తప్ప ఏవిధంగా అతి చేయలేదు. ఇకపోతే మీకు వాదనలు పసందు అన్నసంగతి విదితమే కాని, ఇలాంటి వాదనల వలన మీకు ఏమన్నా ప్రయోజనం ఉండవచ్చునేమో కాని పాఠకలోకానికి ఏమీ ఉండదనే నా నమ్మకం. మీకు ఆరోగ్యకరమైన చర్చకూ యుధ్ధోన్మాదానికీ తేడా లేదన్నట్లు సవాళ్ళు సవాళ్ళు అంటూ ఊగిపోవటం వినోదం కావచ్చుకాని నాకు అలాంటివి వెగటుగా ఉంటాయి. మీకు నచ్చకపోతే పోనివ్వండి.

   తొలగించండి


  8. పండితుల్ని కెలికితేనే గా మీటరు ఊడిపడును :)   జిలేబి

   తొలగించండి


 2. కెలుక జిలేబియె
  దులిపిరి శ్యామల
  రాయలు షట్పద వృత్తపు రీ
  తిన్ సంక్లిష్టము
  గాను తెలుపుచున్
  సులభమనంగ మనకు పడదోయ్ :)


  నారదా!
  జిలేబి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. షట్పద ఎలా వ్రాయకూడదో అన్నదానికి జిలేబీ గిద్యం ఒక మంచి ఉదాహరణ.

   తొలగించండి
  2. రామా లాలీ
   మేఘ శ్యామా లాలీ
   తామరాసా నయనా
   దశరధ తనయా లాలీ ...

   ఇలా ఉండాలి , ఇంత మనోఙ్ఞంగా రాయగలగాలి
   పద సాహిత్యం .

   తొలగించండి
 3. ఈ వ్వాసంలో శ్రీశ్యామలరావుగారు ప్రస్తావించిన ప్రక్రియలన్నీ పూర్వం ప్రసిధ్ధమైన జానపద సాహిత్యానికి
  చెందినవి . ఇవి అనేకం . అపారం . పద్యసాహిత్యం
  కంటే శతథా సహస్రథా వెలుగొంది , జనబాహుళ్యంలోకి
  బహుళ ప్రాచుర్యం చెందింది . అంతా మాత్రాఛందోబధ్ధం . లయకోసం మనోఙ్ఞంగా యతి , ప్రాసయతి , ప్రాస , అనుప్రాసలు (చట్రంలో ఇరికించడానికి కాకుండా)సహజ ప్రవృత్తిగా , ధారాళంగా , యధేచ్చగా వాడుకున్నారు .
  రసభరితంగా అలవోకగా పాడుకున్నారు . అసలైన సహజసాహిత్యమిదే .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. దేశికవిత్వపు జీవం అదేనండీ. కుమారసంభవంలో నన్నెచోడుడు"అలరుల మందహాసముల సన్నిన షట్పధ మంజుగీతి" అన్నాడు. తెనాలి రామకృష్ణకవి పాండురంగమాహాత్మ్యంలో "కన్నడ కవితావిలాసంబుం బోలె షట్పధ వృత్త విలస భాసురంబై" అన్నాడు. అయ్యలరాజు రామభద్రకవి "షట్పదములు గల మంజరు లిండు" అన్నాడు రామాభ్యుదయంలో. రామరాజభూషణుడు వసుచరిత్రంలో ఒక పద్యంలో పదమెత్తన్ కలహంసలీల... వీక్షింప షట్పదియుం బొల్చు" అన్నాడు. ఇలా కవిప్రశంస పొందినా షట్పద జానపదగీతాల్లో ప్రచారం పొందినది కాని పద్యకవిత్వంలో అదరం పొందలేదు. బహిశః కావ్యరచనలో మాత్రాఛందస్సులకు ఆకాలంలో ప్రముఖస్థానం ఇవ్వకపోవటం కారణం కావచ్చును. ఈమధ్యకాలంలో కూడా కొందరు పండితుల ధోరణి అలాగే ఉంది. ఒక పెద్దాయన నాతో ఒకసభలో సంభాషిస్తూ సంస్కృతవృత్తాలే హెచ్చుగా వాడమన్నారు నాకు దేశిఛంధస్సులు ఇష్టం అని చెప్పగానే. ఎందుకలా అన్నారంటే, ఆయన సమాధానం దేశిఛందస్సులు అంత గంభీరంగా ఉండవట. మరి మన సాహిత్యంలో మూడవవంతు పద్యాలు కందాలే కదా అంటే మరి జవాబులేదు. ఇప్పుడే ఇలా ఉంటే పూర్వపు సంగతి చెప్పాలా. ఐతే షట్పదలూ రగడలూ వంటి గీతికాఛందాలను లయ జ్ఞానం కలిగి వాడితే బహుసొగసుగా వస్తాయి. ఐతే లక్షణాలలో అక్షరాలను కుక్కేస్తే అది సరైన పద్యం ఐపోతుందని భావించే వారికి చెప్పగలవారు ఎవ్వరూ లేరు. హృదయంగమం కానిది ఎంత లక్షణ యుక్తం ఐనా జీవకళ లేనిదే అవుతుంది అన్న స్పృహ కవులకూ చదువరులకూ సమంగా ఉంటే భాషాయోషకు ఇతోధికంగా అనందం కలుగుతుంది.

   తొలగించండి
 4. గమనిక.
  తెలుగు సాహిత్యంలో రగడలు .... అంటూ మొదలు పెట్టి వ్యాసం చివరన ఒక అరడజను పేరాలను జోడించాను. అసక్తి ఉన్నవారు పరిశీలించగలరు.

  రిప్లయితొలగించండి
 5. వివరించినందులకు ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.