17, నవంబర్ 2019, ఆదివారం

చాణూరాంధ్రనిషూదనః కాదు చాణూరాంధకసూదనః

శ్రీవిష్ణుసహస్రనామస్తోత్రంలోని 825వ నామం చాణూరాంధ్రనిషూదనః అని ప్రసిధ్ధంగా ఉంది. శ్రీశంకరులు ఈనామానికి వ్యాఖ్యానంగా విగ్రహవాక్యం చెబుతూ చాణూరనామానాం అంధ్రం నిషూదే చాణూరాంధ్రనిషూదనః ఇతి అని చెప్పారు. నాకైతే ఇది అంతగా యుక్తం కాదనిపిస్తోంది. నా వాదనను మనవి చేస్తాను.

అంధ్రశబ్దంతోనే గోరఖ్‍పూర్‍ వారి భారత వ్యాఖ్యానంలోనూ కనిపిస్తోందని రేమెళ్ళ అవధానులు గారు చెప్పారు. ఈ అంధ్ర అనేది రాక్షసుల్లో ఒక తెగ అట. ఇది కొంచెం అప్రసిధ్ధవ్యవహారం. ఈ ప్రకారం అంధ్రతెగకు చెందిన ఒకానొక ఆంధ్రుని శ్రీకృష్ణుడు సంహరించటాన్ని ఈనామం ఉటంకిస్తున్నట్లు భావించాలి. ఈ అంధ్ర తెగ రాక్షసుల గురించి ప్రస్తావన దాదాపు ఇతరత్రా మృగ్యంగా ఉన్నది. కాబట్టి ఈవిధమైన ఆంధ్రుని ఒక రాక్షసుని కృష్ణుడు సంహరించటం గురించి ఈనామం అయ్యుండదు.

పైగా చాణూరుడు అనే వాడు అంధ్రతెగ రాక్షసుడు ఐతే కృష్ణుడు ఇద్దరు చాణూరులను సంహరించాడన్న మాట. ఒకడు మల్లుడు రెండవవాడు రాక్షసుడు. ఇలా చెప్పుకోనవసరం లేదూ, కంసుడి దగ్గర రాక్షసులకు కొదవేముందీ అది భాగవత ప్రసిధ్ధ వ్యవహారమే కదా అనవచ్చును. అప్పుడు చాణూరమల్లుడు కాస్తా చాణూరాసురుడు ఐపోతాడు. మహాభాగవతంలో అలాగ లేదే! శకటాసుర గార్ధభాసురాదులను బోలెడు మందిని స్పష్టంగా చెప్పి, సాక్షాత్తూ కంసుడి సమక్షంలో అతడి ప్రోద్బలంపై కృష్ణుణ్ణి చంపబోయిన వాణ్ణి చాణూరాసురుడు అని కాక చాణూరమల్లుడు అని భాగవతం ఎందుకు అంటుందీ?

కాబట్టి ఉన్నదొక్కడే చాణూరుడు కాని వాడు రాక్షసుడు అయ్యుండడు.  అందువలన అంధ్రతెగ రాక్షసుడు అని చెప్పటం అంత యుక్తి యుక్తంగా లేదు.

కాబట్టి చాణూరాంధ్ర అన్న చోట చాణూరుడనే ఆంద్రుడనీ అతడు మల్లుడనీ అర్ధం తీయక తప్పటం లేదు.

ఆంధ్రుడు కాక చాణూరుడు అంధకుడు అనటం అసలు పాఠం ఏమో అని అలోచిద్దాం.

యాదవుల్లో మూడు ప్రధాన శాఖలున్నాయి. అవి వష్ణి, బోజ, అంధక శాఖలు.

శ్రీకృష్ణుడు వృష్ణివంశం వాడు. ఈ మాట జగత్ప్రసిధ్దమే. కులశేఖరాళ్వారులు తమ ముకుందమాలాస్తోత్రంలో

జయతు జయతు దేవో దేవకీ నందనోయం
జయతు జయతు కృష్ణో వృష్టి వంశ ప్రదీపః
జయతు జయతు మేఘశ్యామలః కోమలాంగో
జయతు జయతు పృధ్వీభారనాశో ముక్దునః

అంటారు రెండవ శ్లోకంలో.

శ్రీకృష్ణుని మేనమామ ఐన కంసుడు భోజవంశం వాడు. పోతన్న గారి ఈ క్రింది వచనం చూడండి.

అని యిట్లాకాశవాణి పలికిన, నులికిపడి, భోజకుల పాంసనుండైన కంసుండు సంచలదంసుండై, యడిదంబు బెడిదంబుగాఁ బెఱికి, జళిపించి,

ఇది కంసుడు ఆకాశవాణి హెచ్చరిక విని దేవకీదేవిని చంపబోవటాన్ని ఉద్దేశించి చెప్పిన వచనం.

సరే అప్పటికి దేవకీదేవిని కంసుడు ఎందువల్లనైతే నేమి చంపకుండా వదలినా అటుపిమ్మట నారదప్రబోధితుడై ఆమెకు జన్మించిన శిశువులను సంహరిస్తూ పోతాడు కాని హరి పన్నాగం ప్రకారం బలరామకష్ణుల జననాలను గ్రహించలేకపోతాడు. ఆనక గ్రహించి వారిని మట్టుపెట్టటానికి ఎన్ని దురోపాయాలు ప్రయోగించినా కుదరక స్వయంగా తన సమక్షంలోనే వారిని వధించటానికి ధనుర్యాగం అనే మిషమీద వారిని రేపల్లె నుండి మధురకు రప్పించుకొంటాడు.

అక్కడ వారికి కంససమక్షంలో చాణూరముష్టికులనే కొండలవంటి మల్లులతో యుధ్ధం చేయవలసి వస్తుంది. ఈ 825వ నామం ఆ సందర్భంలో కృష్ణుడు చాణూరుణ్ణి చంపటాన్ని పురస్కరించుకొని చాణూరమర్దనుడిగా కీర్తించటానికి ఉద్దేశించినది.

ఈ చాణూరాంధ్రనిషూదనః అన్న నామంలో చాణూరుడు  అన్నప్పుడు ఒక్కడు. ఆంధ్ర పదం జాతి వాచకం. కాబట్టి సామాన్యార్ధం శ్రీకృష్ణుడు చాణూరుడు అనే ఆంధ్రుడిని సంహరించాడు అని వస్తుంది. ఇలా చాణూరుడు అనే వాడు ఒక ఆంధ్రానుండి వచ్చి కంససభలో ఉన్న ప్రముఖ మల్లుడని తెలుస్తున్నది.

కాని అప్పటికి శ్రీకృష్ణుడికి ఆంద్రులతో వైరం అంటూ ఏమీ లేదు. కాబట్టి చాణూరుడు అనే ఆంధ్రమల్లుడు అని చెప్పవలసిన అవసరం కాని చెప్పటం వలన నామావళిలో కొత్తగా తెలియవచ్చే విశేషం కాని ఏమీ లేదు.

పోనీ, చాణూరుడు అనేవాడినీ, ఆంధ్రులనూ సంహరించిన వాడు విష్ణువు అని అందామా అంటే అలాకూడా పొసగదు. ఇప్పుడే అనుకున్నట్లు కృష్ణుడికి ఆంధ్రులతో కనీసం అప్పటికి వైరమే లేదే. అదీ కాక, చాణూరుడు అని ఏకవచనంలో ఒక మాటనూ, ఆంధ్రులు అని బహువచనంగా ఒక జాతిని ఉద్దేశించి ఒకే నామంగా చెప్పటం సమజసం కాదు కూడా.

ఇక్కడ ఆంధ్రశబ్దం బదులు ఈ నామంలో అంధక శబ్దం ఉండి ఉండవచ్చును అనుకుంటే అప్పుడు నామం చాణూరాంధకసూదనః అని చెప్పవలసి ఉంటుంది. శ్లోకంలో ఛందోభంగం ఏ మాత్రం కాదు.

అంధకులు కూడా వృష్ణి భోజులవలె యాదవుల్లో ఒక శాఖ వారు. అది యాదవరాజ్యం. దాదాపు అందరూ యాదవులే అక్కడ. అందుచేత చాణూరుడు అంధకుడు ఎందుకు కాకూడదు? తప్పక కావచ్చును.

ఇలా ఆలోచిస్తే చాణూరాంధకసూదనః అన్న రూపమే ఈనామానికి అసలు స్వరూపం అయ్యుంటుందని భావించవచ్చును. అది మరింత సమజసం ప్రస్తుతం ఉన్న చాణూరాంద్రనిషూదనః అన్న రూపం కనా.

కంసుడి సభలో చాలామందే పెద్ద యోధులున్నారు. వారిలో కంసుడి ఎంపిక చాణూరముష్ణికులు. వారు కొండలంత మల్లులు కావటమే కాదు. మరొక విశేషం కూడా ఉంది.

మల్లుల్లోవృష్ణి వంశం వాళ్ళను ఎంపిక చేసి వదిలిన పక్షంలో వాళ్ళు తమశాఖ వాళ్ళూ చిన్నపిల్లలూ అన్న సానుభూతితో బలరామకృష్ణులతో సరిగా పోరాడక పోవచ్చును. అది కసంసుడికి సమ్మతం కాదు కదా.

పోనీ తమ శాఖకు చెందిన మల్లుల్ని ఎంపిక చేద్ద్దామా అన్నా అందులోనూ నమ్మకం ఉంచటం కష్టం. వాళ్ళల్లో ఎవడికైనా సరే తాను తండ్రిని దింపి సింహాసనం ఎక్కటం ఇష్టం లేకపోవచ్చును.

అందుకని వృష్ణి భోజశాఖల మల్లులను ప్రక్కన బెట్టి అంధకశాఖవారిని ఎంపిక చేసాడు కంసుడు.

ఐతే ఇదే తర్కాన్ని కొంచెం సాగదీసి, అసలు యాదవులను నమ్మలేమని ఆంద్రామల్లురను ఎంపిక చేసాడేమో అనవచ్చును. అదీ కొంతవరకూ సమంజసమే. కాని కంసుడి ఆస్థానంలో దూరప్రాంత మల్లుడికి బదులు స్థానిక మల్లుడిని ఊహించటమే ఎక్కువగా సమంజసం అనుకుంటున్నాను.

ఒకవేళ యాదవుల్లో ఏదన్నా అంతఃకలహాలూ, ఆ మూడు శాఖల్లోనూ హెచ్చుతగ్గుల కారణంగా వైరాలూ ఉన్నాయనుకుంటే, వాటిని పురస్కరించుకొని కంసుడు అందకులను బలరామకృష్ణుల పైకి ఉసికొల్పాడని అనుకోవటం సబబుగా ఉంటుంది.

అందువలన చాణూరాంధకసూదనః అన్నపాఠమే సరైనది కావచ్చునని నా భావన.

ఐతే శ్రీశంకరులు చాణూరాంధ్రనిషూదనః అన్న పాఠాన్ని ఎందుకు స్వీకరించారూ అన్నప్రశ్న వస్తుంది. అప్పటికే ఆపాఠం ప్రచారంలో ఉండటమే దానికి కారణం కావచ్చును.

8 కామెంట్‌లు:

  1. నాదో మాట

    చాణూరుడు ముష్టికులను కంసుడు ప్రయోగించినది. శంకరులు చాణూరాంధ్ర నిషూదనాయనమః అన్నదానిలో చాణూరుడు, ఆంధ్రుడు గా భావించి ఉంటారనుకుంటా. ఇప్పుడు మనం అంధ్ర శబ్దాన్ని ఒక జాతికి అన్వయించడం లో ఈ తేడా ఏర్పడుతోందేమో!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మ గారు, నమస్తే. శంకరులు ఇచ్చిన విగ్రహవాక్యం "చాణూరనామానాం అంధ్రం నిషూదే చాణూరాంధ్రనిషూదనః"లో ఉన్నది అంధ్ర అన్న శబ్దం కాని ఆంధ్ర కాదు కాని అంధ్రస్యాపత్యం ఆంధ్రః అని సంస్కృతభాషామర్యాదగా రూపసిధ్ధి అవుతుంది. ఇక్కడ అంధ్ర అనేది ఒక రాక్షస జాతి అట. ఈ విగ్రహాన్నే గోరఖ్‍పూర్‍ వారూ స్వీకరించారు. అనేకులు ఇతరులూ గ్రహించారు. భారతయుధ్ధకాలం నాటికే ఆంధ్రజాతి ప్రత్యేక రాజ్యంతో ఉన్నది మరియు వారు కౌరవపక్షంలో పోరాడారు. అది రాక్షసజాతి అని ఎక్కడా చెప్పబడలేదు. పైగా ఆంధ్రులు విశ్వామిత్రసుతు డొకని (పాలన)కారణంగా ప్రసిధ్ధం ఐన జాతి అని వాదన ప్రచురంగ ఉన్నది.

      తొలగించండి
    2. ఏమైనా ఆదిశంకరుల మాట కాదనలేను. మన్నించండి.

      తొలగించండి
    3. మనవాళ్ళకి ఎవరిపక్కన పోరాడాలో అప్పటినుంచే ఆలోచన లేదన్నమాట! గురజాడవారు ఊరికే అనలేదు మనవాళ్ళొట్టి వేదవాయిలోయ్! అని.

      తొలగించండి
    4. కౌరవులకీ, ఆంధ్రులకి మిత్రత్వం ఎలా కలిసెనో కదా

      తొలగించండి
  2. // "మనవాళ్ళకి ఎవరిపక్కన పోరాడాలో అప్పటినుంచే ఆలోచన లేదన్నమాట!" //

    ఇప్పటికీ అంతే కదా 😃?

    రిప్లయితొలగించండి
  3. నిజమేనండీ, మనల్ని రాక్షసులని పిలిచినా, మనం మాత్రం వాల్ల తరుపునే యుద్దాలు చెయ్యాలి. వాల్ల విజయాలకోసం, మన అన్నదమ్ముల వీక్ పాయింట్లని, వాల్లకి మనమే చేరవెయ్యాలి. అప్పుడు మనల్ని "పూర్వజన్మలో దేవతలనీ, శాపం దెబ్బకి రాక్షసుల సైడు పుట్టామనీ" ఓ పిట్టకథ అల్లేసుకోవొచ్చు. అంతేగా?

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.