10, నవంబర్ 2019, ఆదివారం

ఒక ప్రయత్నం.


కొంత కాలం మాలికను పట్టించుకోలేదు. బ్లాగులను పట్టించుకోలేదు.

మరలా old habits die hard అన్నది నిజం కాబట్టి కొద్దికొద్దిగా మాలికనూ బ్లాగులనూ పరిశీలించటం మొదలు పెట్టాను.

ఐతే ఈ పరిశీలన కొంత నిరాశను కలిగించింది.

శంకరాభరణం బ్లాగులో కొందరు సమస్యాపూరణ కోసం పడుతున్న ప్రయాసలు ఒక ప్రక్కన ఎప్పటిలాగే తగినంత స్థలం ఆక్రమించుతున్నాయి మాలిక వ్యాఖ్యల పేజీలో. ఆ పద్యాల వాసి కూడా ఎప్పటిలాగే ఉంది.

ఎప్పటిలాగే జిలేబీగారు గిద్యాలూ గీమెంట్లతో మెరుస్తున్నారు.

ఎప్పటిలాగే కామెంట్ల యుధ్ధం ఔచిత్యపు పరిధులు దాటి జోరుగా నడుస్తోంది.

విన్నకోట వారు తమ శైలిలో తాము యధోచితంగా వ్యాఖ్యలను పంపుతున్నారు వివిధబ్లాగులకు.

ఇకపోతే బ్లాగుల్లో సినిమాల గురించీ, రాజకీయాల గురించీ కొన్ని బ్లాగులు నడుస్తూ ఉన్నా ఆథ్యాత్మిక సాహిత్యరంగాలకు సంబంధించిన బ్లాగులు కొన్ని చురుగ్గానే ఉన్నాయి. మొత్తం మీద సోది సరుకు కొంత ఉన్నా కొంచెం మంచి సరుకు ఉన్న బ్లాగులూ నడుస్తున్నాయన్నది సంతోషం కలిగించే విషయం.

ఐతే ఇక్కడ నిరాశ కలిగించే అంశం ఏమిటంటే వ్యాఖ్యల ధోరణి చూస్తే వ్యాఖ్యాతలు వివిధవిషయాల గురించి స్పందించటం లేదు.  శంకరాభరణం వ్యాఖ్యలూ, రాజకీయ లేదా సినిమాసంగతుల మీద వ్యాఖ్యలూ కామెంటుయుధ్ధాలూ మినహాయిస్తే మిగిలేవి కొద్ది వ్యాఖ్యలే అంటే హెచ్చుశాతం బ్లాగుటపాలకు స్పందన కరువుగా ఉంది.

ఈ పరిస్థితి మారాలి. అంటే మంచి విలువలతో కూడిన టపాలు హెచ్చుగా రావాలి. వివిధవిషయాలపై టపాలను చదివే వారు కూడా పెరగాలి.

మొదట విలువైన బ్లాగుటపాలకు గుర్తింపు తెచ్చే ప్రయత్నం ఒకటి జరగాలి.

అటువంటి ఒకప్రయత్నాన్ని వివరిస్తున్నాను. ఇది నేనే పూనుకొని చేయనక్కర లేదు. ఆసక్తి ఉన్నవారు ఎవరన్నా చేయవచ్చును. ఇలాగే అని కాక వీలైతే ఇంతకంటే బాగా కూడా చేయవచ్చును.

నేను ఆలోచించిన విధానం ఇలా ఉంది.

  1. అజ్ఞాతలకు ప్రవేశం లేదు
  2. ప్రతి సోమవారం ఉదయం 5:30 నుండి ఒక వారం దినాలను ప్రమాణకాలావధిగా తీసుకుంటాం. (అంటే 7 x 24 గంటల సమయం ఒక పీరియడ్‍గా లెక్కించుదాం)
  3. అసక్తి కల బ్లాగర్లు, పాఠకులు తమ అభిప్రాయాలను పంపవలసినదిగా ఒక  ప్రత్యేక బ్లాగుని ఇవ్వటం జరుగుతుంది. అభిప్రాయాలు అందులో నేరుగా ప్రకటింపబడవు. (మిగిలన అంశాలు చదవండి)
  4. అభిప్రాయాలను పంపటానికి 3 రోజుల గడువు. అంటే గతవారం దినాల టపాలలో తమ ఎన్నికలను గురువారం ఉదయం 5:30గం. సమయం దాటకుండా పంపాలి.
  5. వారం దినాలలో చాలానే బ్లాగుటపాలు వస్తాయి అని ఆశించవచ్చును. అందుచేత తమకు నచ్చిన పది టపాలకు లింకులను ప్రాదాన్యతా క్రమంలో లిష్టు చేసి పంపాలి
  6. ఒకరు ప్రాధాన్యతా క్రమంలో మొదటి స్థానంలో ఉంచిన టపాకు 10 గుణాలు, పదవ స్థానంలో ఉంచిన టపాకు ఒక (వెయిటేజీ) గుణం చొప్పున లెక్కించబడుతుంది. ఈ విధంగా అందరి లిష్టులలో ఉటంకించబడిన టపాలనూ లెక్కించి సమాకలనం చేయటం జరుగుతుంది.
  7. ప్రతి శనివారం నాడు గతవారం టపాలకు వచ్చిన స్పందన అధారంగా మొదటి పది స్థానాలలో వచ్చిన టపాలను అ ప్రత్యేక ప్రకటించటం జరుగుతుంది.  అందులో ఇతర విషయాలపై టపాలు ఉండవు.
  8. ప్రతి అభిప్రాయాన్నీ కూడా బేరీజు వేయటం జరుగుతుంది. ఒకరు ఎంత ధగ్గరగా ఫలితాలను ఊహించగలిగారు అన్నదానిని బట్టి వారికీ కొన్ని గుణాలు కేటాయించబడతాయి. 
  9. ఫలితాలకు దగ్గరగా వచ్చిన అంచనాలను పంపిన వారి గురించి కూడా ప్రకటించటం వారం వారం జరుగుతుంది.
  10.  పని ఇచ్చిన అరవ అంశానికి ఒక సవరణ/వివరణ ఉన్నది.  ప్రాథమికంగా ప్రతిఅభిప్రాయం కూడా ఒక వెయిటేజీ గుణం కలిగి ఉంటుంది. ఒకరి అభిప్రాయం గురి హెచ్చుగా వచ్చిన కొద్దీ ఆ వెయిటేజీ పెరుగుతుంది. అది రెండు వరకూ చేరవచ్చును. గురి తప్పిన కొద్దీ వెయిటేజీ తగ్గిపోవచ్చును ఒకటి నుండి అర వరకూ పడిపోవచ్చును. గత ఐదు సార్లుగా ఒకరు పంపిన అభిప్రాయం ఎంత గురిగా వచ్చింది అన్నదానిని బట్టి ఆ వెయిటేజీ మారుతూ ఉంటుంది.  అందుచేత ఒక వెయిటేజీ గుణం విలువ 0.5 నుండి 2.0 వరకూ మారుతూ ఉంటుందని గమనించండి. ఈ ఆలోచనకు కారణం ఒకటే - ఆలోచించి మరీ నిజాయితీగా అభిప్రాయాలను పంపుతారని!
  11. ప్రకటించిన ఫలితాలలో ఉటంకించిన బ్లాగుటపాలకు కాని అభిప్రాయం చెప్పిన వారికి కాని బహుమతులు ఏమీ ఉండవు.
  12. ఒకరు తమ అభిప్రాయం పంపేటప్పుడు ఒక బ్లాగు నుండి రెండు కంటే ఎక్కువ టపాలను ఎన్నుకోకూడదు.
  13. ఒకరు తమ అభిప్రాయం పంపేటప్పుడు కనీసం 5 టపాలను లిష్టు చేయాలి.
  14. తరచుగా లిష్టు అవుతున్న బ్లాగులను గురించి ప్రకటించటం జరుగుతుంది.
  15. తరచుగా గురిగా లిష్టుచేస్తున్న వారి గురించి కూడా ప్రకటించటం జరుగుతుంది.


ఇది ఒక ఆలోచన.  ఎవరన్నా దీనిని కాని దీనికంటే మెరుగైన విధానాన్ని కాని అమలు చేస్తే మంచి బ్లాగులకూ మంచి చదువరులకూ ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ విధానానికి గుర్తింపు వస్తే మంచి బ్లాగులకు తగిన గుర్తింపు కూడా మరింతగా వస్తుంది.

ఈ విషయంలో మీ అభిప్రాయాలు వ్రాయగోర్తాను.

12 కామెంట్‌లు:

  1. మీ ప్రతిపాదన బాగుంది శ్యామలరావు గారు. ఇటువంటి విశ్లేషణ ongoing basis మీద చేసేందుకు ఉత్సాహం, సమయం ఎంతమందికి ఉంటుందన్నది ఆలోచించవలసిన విషయం.అలాగే
    స్పందనలను వడగట్టడానికి సాఫ్ట్వేర్ అవసరమవుతుందేమో కదా?

    ఏతావాతా నేననేదేమిటంటే మీ ప్లయత్నం వృధా ప్రయాస అవుతుందేమోనని నా అనుమానం. ఏమనుకోకండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆసంగతి ఇప్పటికే స్పష్టం ఐనదండీ. కేవలం యాభై మంది చదివారంటే, మీరిక్కడ, నీహారిక గారు మెయిల్ ద్వారా స్పందన తెలిపారు కాని మరెవ్వరూ పలకలేదంటే అర్ధం ఆదేకద.

      తొలగించండి
  2. పోనివ్వండి. నావంతు ప్రయత్నం నేను చేసొనన్న తృప్తి మిగులుతుంది.

    రిప్లయితొలగించండి
  3. మంచి ఆలోచన.మదింపు లేకపోతే క్వాలిటీ ఎలా తెలుస్తుంది?ఇది ఒక రకంగా ప్రోగ్రెస్ రిపోర్టులా ప్రతి బ్లాగరూ వారం వారం తన ఎదుగుదలని సమీక్షించుకోవడానికి ఉపయోగపడుతుంది!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మదింపు లాభదాయకం అనే నా ఉద్దేశమూ. కాని విన్నకోటవా రన్నట్లు ఇటువంటి విశ్లేషణ ongoing basis మీద చేసేందుకు ఉత్సాహం, సమయం ఎంతమందికి ఉంటుందన్నది ఆలోచించవలసిన విషయం.

      తొలగించండి
    2. కష్టమేనండి. ఉన్న బ్లాగులు చడవడానికే సమయం దొరకనివారే ఎక్కువనుకుంటాను.

      తొలగించండి
  4. మీ ప్రతిపాదన అమోఘం సార్. ఆచరణ కోసం analytics widget లాంటి సాంకేతిక సాధనాలు ఉన్నాయేమో భరద్వాజ్ గారికి తెలియవచ్చు.

    Imaginary example: 1-5 star "rate this blog post" synced with a rules based engine that implements the 15 rules stated by Syamaliyam sir above

    రిప్లయితొలగించండి

  5. శ్యామలీయం‌ వారికి ఈ మధ్య పని తక్కువైనట్టుందనుకుంటా :)

    పని లేని వారు మార్జాలకుంతలమ్ముల ..... :)






    నారాయణ!
    జిలేబి




    రిప్లయితొలగించండి
  6. మీ ప్రతిపాదనకు నా మద్దతు .
    ప్రారంభించండి . బ్లాగు ప్రపంచానికి
    నూతన తేజాన్ని సమకూర్చండి .
    నా బ్లాగును కూడా సమీక్షించండి ముందుగా .

    రిప్లయితొలగించండి
  7. Is the proposal a) necessary? b) practicable ?c) efficacious ? d) worth the effort?

    My answer for all of the above is NO.

    Every writer knows his/her best posts.

    They can compile them into e-books and keep links.

    బ్లాగులు డిజిటల్ / వర్చువల్ రచ్చబండ లుగా ఉపయోగపడుతున్నాయి. I like it that way.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బుచికి గారూ,

      నేను చేసిన ప్రతిపాదన ఆచరణసాధ్యం కాకపోవచ్చును కాని అసాధ్యం కాదు. ఐతే ఈ ప్రతిపాదన వెనుక ఉద్దేశం బ్లాగుటపాల మంచిచెడులను విశ్లేషించటం కాదు. అభిరుచి కల పాఠకులు వేటిని మెచ్చుతున్నా రన్నది తేటతెల్లం చేయటానికి మాత్రమే. ప్రస్తుతం వ్యాఖ్యలు ఆపని చేయటం లేదు. ఎందుకంటే అవి కొట్లాటలకూ కోతిమాటలకూ పెద్దపీట వేస్తున్నాయి కాబట్టి. మీరన్నట్లు బ్లాగర్లు తమ ఉత్తమ టపాలను విడిగా e-books చేసుకోవచ్చును. నా ప్రతిపాద వారే టపాలను ఎన్నుకోవాలీ అన్నదానిని influence చేయనవసరం లేదు.

      బ్లాగులు రచ్చబండలుగా ఉండటం మీకు హితవుగా ఉండవచ్చును. కాని బ్లాగులకు మరింత విస్తృతప్రయోజనం ఉందని విశ్వసిస్తున్నాను. ఇప్పటికే చెప్పినట్లుగా అవి ఉపయుక్తసమాచారవితరణకూ, విజ్ఞానప్రదీపనకూ ఉపయోగపడటం మరింతగా హర్షదాయకంగా ఉంటుందని మీరూ అంగీకరిస్తారని భావిస్తున్నాను.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.