7, నవంబర్ 2019, గురువారం

ఆర్టీసీ సమ్మె - రంగనాయకమ్మ


ఈరోజున ఉయ్యాల బ్లాగులో రంగనాయకమ్మ గారి వ్యాసం ఒకటి తిండి సరిపోక చేసేది సమ్మె! ‘అదనపు విలువ’ అరగక చేసేది అణచివేత !! - రంగనాయకమ్మ (ఆంధ్ర జ్యోతి 5-11-2019) అనే శీర్షికతో వచ్చింది. సరే శీర్షికను బట్టే ఇది ఆంధ్రజ్యోతిపత్రికలో ఇప్పటికే ఫలానా దినంనాడు వచ్చినదీ అని తెలుస్తూనే ఉంది.

ఆ వ్యాసంలో రంగనాయకమ్మగారు మార్క్సు కనిపెట్టిన ‘అదనపు విలువ సిద్ధాంత కోణం’ నుండి ఒక ఉదాహరణను ఇస్తూ మరీ పరిశీలించి చూసారు. కాని అదనపు విలువను ఆవిడ లెక్కలు వేసిన విధానం అంత సమగ్రంగా ఉన్నట్లు తోచదు.

ముందే ఒక సంగతి చెప్పాలి. నేను ఆర్ధికశాస్త్రవేత్తను కాను. కనీసం ఆ శాస్త్రం చదువుకున్న వాడిని ఐనా కాను.  నేను కమ్యూనిష్టును కానీ కమ్యూనిష్టు పార్టీలకూ వారి సిధ్ధాంతాలకు సానుభూతిపరుణ్ణి కానీ కాను. అలాగని కమ్యూనిజం అయ్యేది మరొకటయ్యేది దేనినీ గ్రుడ్డిగా వ్యతిరేకించే వాడినీ కాను.

అలాగే మరొక సంగతీ చెప్పాలి. రంగనాయకమ్మ గారి 'ఆండాళ్ళమ్మ గారు' నేను మొదటగా చదివిన ఆవిడ రచన. భలే బాగుందనిపించింది. విషవృక్షం చదివాను. అస్సలు నచ్చలేదు. 'మాట్లాడే తెలుగే వ్రాస్తున్నామా' అని ఆవిడ వ్రాసిన వ్యాసం నచ్చింది - ఆలోచింప జేసింది. అందుచేత ఆవిడపట్ల నాకేమీ గ్రుడ్డి వ్యతిరేకత లేదు.

ఇక నేను చెప్పదలచుకున్న విషయాలలోనికి సూటిగా వస్తున్నాను.

మీకొక దుకాణం ఉందనుకుందాం. అది ఏదన్నా కావచ్చును. బట్టలదుకాణం, కిరాణాదుకాణం, ఫాన్సీషాపు లేదా మరొకటి. మీ స్వంత దుకాణం.

వస్తువుల ధరలను మీరు ఎలా నిర్ణయిస్తారు అన్నది ఇక్కడ ఆలోచిస్తున్న సంగతి.  లాభానికి అమ్మాలి అన్నది సరే, చిన్నపిల్లవాడి నడిగినా ఆ మాట చెప్పగలడు. కాని ఎంత లాభానికి అంటే కొంచెం ఆలోచించి చెప్పవలసి వస్తుంది. ఎందుకంటే అనేక విషయాలను పరిగణనలోనికి తీసుకోవలసి ఉంటుంది కాబట్టి.

సరుకులు కొనటానికి పెట్టుబడి పెట్టాలి. అలాగే సరుకులు నిలువచేయటానికీ, ప్రదర్శించటానికీ కూడా తగిన సదుపాయాల కోసం పెట్టుబడులు పెట్టాలి. పెట్టుబడులన్నాక అంతా మీరు మీ ఆస్తిపాస్తులనుండే పెట్టలేరు. కొంత పెట్టుబడి అప్పుగా వస్తుంది. మీ సొమ్ము ఐనా ఇతరుల సొమ్ము ఐనా అది బ్యాంకు వడ్డీ కన్నా తక్కువగా ఆర్జిస్తూ ఉండే పక్షంలో దుకాణం దండగ. కాబట్టి పెట్టుబడులు వెనక్కి రాబట్టుకోవటానికి లాభార్జన తప్పదు.

మీ దుకాణానికి అద్దె కట్టాలి.  షాపు అన్నాక మీ యింట్లోనే నిర్వహించటం అస్తమానూ కుదరదు. అది బజారులో ఉండాలి మరి.  మీ యిల్లు వేరొక చోట ఉంటుంది.

మీ పనివాళ్ళకు జీతాలివ్వాలి. షాపు అన్నాక మీరొక్కరే గళ్ళాపెట్టె దగ్గరా, తూకాల దగ్గరా, సామానుల దగ్గరా అన్నిచోట్లా ఉండలేరు కదా. వచ్చే గిరాకీలు అందరినీ మీరొక్కరే సమర్ధించుకుంటూ నడపలేరు కదా. అందుకని వివిద కార్యకలాపాలకోసం పనివాళ్ళ అవసరం ఉంటుంది. అది దుకాణం స్థాయిని బట్టి మారుతూ ఉంటుంది. అందరికీ తగినంత జీతం సమయానికి అందిస్తూ ఉండకపోతే దుకాణం నడవదు.

దుకాణం ఉంది అంటే దానికి కొన్ని హంగులూ అవసరాలూ ఉంటాయి. విద్యుత్తు కావాలి కదా కనీసం లైటింగు నుండి శీతలీకరణాదులకోసం. ఈ బిల్లులు అన్నీ చెల్లవలసింది దుకాణం ఆర్జించే సొమ్మునుండే.

దుకాణంలో సరుకు అమ్మేసి దాన్ని మూసివేయరు కదా. మార్కెట్టును బట్టి ఎప్పటికప్పుడు కొత్త సరుకును కొని దుకాణంలో ఉంచాలి. అది నిత్యనూతనమైన కర్చు. దానికి అవసరమైన సొమ్మును దుకాణమే సమకూర్చాలి.

దుకాణం పెట్టింది ఎందుకు? ముందు మీరు సుఖంగా సదుపాయంగా సకుటుంబంగా బ్రతకటానికి.  మీరు ఎవరిదగ్గరన్నా ఉద్యోగంలో ఉంటే అందుకు కావలసిన సొమ్ము మీకు అందే జీతం సమకూర్చుతుంది. మరి మీది ఒక దుకాణం ఐనప్పుడు ఆ సొమ్మును సమకూర్చవలసిన బాధ్యత ఆ దుకాణానిదే కదా. అంటే పనివాళ్ళకే కాదు దుకాణం మీకూ పోషణకు సొమ్ము ఇవ్వాలి.

దుకాణం నడపటంలో కొన్ని ఒడిదుడుకులకు సిధ్ధం కావాలి. వాటి గురించిన అవగాహన దుకాణం పెట్టే ముందే ఉండాలి మీకు. వాటి గురించి కూడా అలోచించాలి దుకాణం నడపటంలో.

ప్రకృతి విపత్తుల గురించి ఆలోచించి దుకాణానికి బీమా చేయించాలి. అది ఊరికే రాదు. అ బీమా కిస్తీలు కూడా దుకామే భరించాలి.

మీకే ఏదన్నా కారణం వలన దుకాణం నడపటానికి విరామం ఇవ్వవలసి వస్తే? దానికి కారణం మీకో మీ యింట్లో ముఖ్యసభ్యులకో అనారోగ్యం కావచ్చును. లేదా సకుటుంబంగా ఏదన్నా ఊరు కొన్నాళ్ళు తప్పని సరిగా వెళ్ళవలసి రావచ్చును. అప్పుడు దుకాణం నడవకపోతే చాలా నష్టాలు వస్తాయి. అవన్నీ భరించే బాధ్యత దుకాణానిదే.

వస్తువుల ధరలు స్థిరంగా ఉండవు, ఉండాలని ఆశించటం తప్పు కూడా. అవి పెరిగితే ఆనందమే. మీకు మంచి లాభాలొచ్చేస్తాయి. కాని ఒక్కొక్కసారి దుకాణంలో సరుకు నింపిన కొద్దికాలానికే సరుకు ధర పడిపోతే, నష్టం వస్తుంది. దాన్ని దుకాణమే భరించాలి.

అలాగె ఒక్కొక్క సారి బజారులోనికి కొత్తరకం సరుకు వచ్చి మీదగ్గర ఉన్నదానికి అస్సలు గిరాకీ లేకపోవచ్చును. అప్పుడు దానిని ఐనకాడికి తెగనమ్ముకోవాలి. రూపాయి వస్తువును పావలాకు కూడా ఎవరూ కొనని పరిస్థితీ రావచ్చును . అలాంటి విపత్తును తట్టుకొనే శక్తి దుకాణానికి ఉండాలి.

మీ దగ్గర ఉన్న సరుకు పూర్తిగా అమ్ముడయ్యేలోగా ఎన్ని జాగ్రతలు తీసుకొన్నా కొంత సరుకు పాడైపోవచ్చును. ఆ నష్టం గురించి దుకాణదారుడికి అవగాహన ఉండాలి. అలా వచ్చే నష్టం దుకాణం తట్టుకోవాలి తప్పదు.

మీ ఉద్యోగస్థులకు జీతాలిస్తున్నారు సరే. కాని అవసరమైనప్పుడు వారికి ద్రవ్యసహాయం చెయ్యవలసి ఉంటుంది. పావలా కూడా అడ్వాన్సు ఇవ్వను దిక్కున్నచోట చెప్పుకో పో అనే వాడి దగ్గర ఉద్యోగులు ఎక్కువకాలం ఉండలేరు - ఉండరు. అందుకని అటువంటి అవసరాలకు సొమ్ము దుకాణం ఆదాయంలోనుండే కేటాయించాలి.

వ్యాపారలావాదేవీల నిమిత్తం తిరుగుళ్ళు ఉంటాయి. అవి సరుకుల ఖరీదుల్లో చేరవు. కాని అవసరమైన కర్చులే. అవన్నీ కూడా దుకాణం ఆదాయంలో నుండే వెచ్చించాలి.

మీ ఉద్యోగులకు ఏదన్నా అనుకోని ప్రమాదం జరిగితే మీకు బాధ్యత ఉంటుంది. సొమ్ము కర్చవుతుంది. అదంతా మీ దుకాణం చూసుకోవలసిందే.

వ్యాపారం అన్నాక విస్తరణ అన్నమాటా వినిపిస్తుంది. వినిపించాలి కూడా. చిన్నదుకాణం పెద్దదవుతుంది. పెద్దదుకాణం మరొక చోటికి కూడా విస్తరించుతుంది. ఒకటికి నాలుగో పదో బ్రాంచీలూ ఏర్పడుతాయి. మరి ఇదంతా ఉత్తినే కలగనగానే జరిగేది కాదు. సినిమాల్లో ఐతే నాలుగుసార్లు రింగులురింగులు తిరుగుతున్నట్లు చూపితే ఐపోతుంది. కాని నిజజీవితంలో వాస్తవిక జగత్తులో అంత వీజీ కాదు కదా. ఎంతో శ్రమపడాలి. ఎన్నో చోట్ల ముందుచూపుతో అవసరమైన పెట్టుబడులూ పెట్టాలి. కొత్తకొత్తవి సొంత బిల్డింగులు కట్టుకోగలగాలి. ఇదంతా బోలెడు డబ్బుతో కూడిన వ్యవహారం కదా. ఈడబ్బంతా ఎవరూ ఇవ్వరు. మీ దుకాణమే సమకూర్చుతూ పోవాలి.

ఒక్కోక్క సారి సాధ్యమైతే కొత్తవ్యాపారాలూ మొదలుపెట్టాలి, ఎప్పుడూ ఒకే వ్యాపారం మీద కూర్చో కూడదు. మార్కెట్ బాగా మారిపోతే, మీ వ్యాపారం బాగా నడవక మూతబడుతుంది. కాబట్టి కాస్త నిలద్రొక్కుకున్నాక వీలును బట్టి క్రొత్త వ్యాపారాల్లోనికి వెళ్ళటానికి యత్నించాలి. దానికి కావలసిన పెట్టుబడులూ వగైరా మీ దుకాణం సమకూర్చాలి సింహభాగం.

ఇప్పటికి చాలును.

ఇలా వ్యాపారం అన్నాక అనేకానేక అంశాల ప్రభావంతో నడిచే వ్యవహారం కాని రంగనాయకమ్మ గారు చెప్పినంత సింపుల్ విషయం కాదు.

ఏ వ్యాపారంలో అన్నా సరే జీతగాళ్ళు సంస్థకు అదనపు విలువలను సమకూర్చుతారు. వ్యాపారం నడవాలంటే అది తప్పదు కాక తప్పదు. అదంతా యాజమాన్యం తినేస్తోంది అనుకోవటం అన్నిటా సరైన ఆలోచన కాదు.

ఆవిడ చెప్పిన ఉదాహరణనే తీసుకుంటే ఆర్టీసీ సంస్థకు ఉన్న అన్ని కర్చులూ ఈ అదనపు విలువనుండే కదా చెల్లించవలసింది?

ఆర్టీసీ వారు కొత్తబస్సుల్ని కొనాలంటే, ఉన్న బస్సుల మరమ్మత్తులూ వగైరాలకూ సొమ్ము అందులోనుండే రావాలి.

బస్సుకొక డ్రైవరూ, కండక్టరూ సరిపోతారా నిజంగా?

సంస్థ నిర్వహణకు అవసరమైన యాజమాన్యసిబ్బంది సంగతేమిటీ? తిన్నగా బస్సులో కనిపించని కార్మికుల సంగతేమిటీ? ఇలా బోలెడు మంది ఉంటారు కదా వారినీ సంస్థ పోషించాలి కదా?

జాగ్రతగా ఆలోచిస్తే సంస్థ నిర్వహణ వేరూ బస్సు నిర్వహణ వేరూ అన్నది తెలుస్తుంది.

అందుచేత పైపై లెక్కలు వేసి బోలెడు మిగులుతోందీ, యాజమాన్యం బొక్కేస్తోందీ అనటం సబబు కాదని అనుకుంటాను.