30, మార్చి 2019, శనివారం

నేర మేమున్న దని నీ మౌనము


నేర మేమున్న దని నీ మౌనము మన
సార నిను కోరి కొలిచేర రఘువీర

వేళపాళ లేక పాడి విసిగించితినా కరు
ణాలవాల నీమాటలు నమ్మనంటినా మతి
మాలి చెడుస్నేహములు మరగినానా బ్రతి
మాలినను వినవేమని మండిపడితినా

కలలనైన నిను కలియుట కరువైనది నీ
పలుకరింపు లేక బ్రతుకు బరువైనది మా
టలకు నీవు లొంగవని యర్థమైనది నా
వలన దోసమేమున్నదొ తెలియకున్నది

ఘోరపాపవిదారణము కోరితి నంతే తని
వార నిను కీర్తించగ వలచితి నంతే దు
ర్వారమైన భవముదాట తలచితి నంతే సం
సార మింక చాలునని సణగితి నంతే

29, మార్చి 2019, శుక్రవారం

తెలిసికొంటి రాముడే దేవుడనే సత్యమును


తెలిసికొంటి రాముడే దేవుడనే సత్యమును
తెలియజేయు చుంటి నదే తెల్లముగాను

జనులార విష్ణుదేవు డనువా డొక్కండు కలడు
మునులు దేవతల కన్న మొదటి వాడగు వాడు
తనలో నొక యంశయై తనరారు నీసృష్టి
వినుడు వాడె రాముడై వెలసె పుడమిపై నని

చనుదెంచి యింద్రుడు స్వామి యీ రావణుని
యని నెదిరించ రాని దాయ రక్షించు మన
నినకుల మందు నేను జనియింతు నవనిపై
నని పలికి దిగివచ్చిన యా వెన్ను డాతడని

జనులార రాముడే సర్వేశుడు హరి యని
జనులార రాముడే సకలార్థప్రదుం డని
మనసార నమ్మరే మనకు వాడే దిక్కు
విను డాతని నమ్మిన పిదప జన్మము లేదు

అసమాన మైనది యతిమధురమైనది


అసమాన మైనది యతిమధురమైనది
రసనకు హితవైనది రామనామము

పసితనము నుండి నా భావనలో నిలచినది
వసుధ కడు సేవ్యమై వరలు నామము
కసిగ భవవిషలతల ఖండించే నామము
అసలైన సంపదగ నలరు నామము

నరసురసిధ్ధసాధ్యగరుడోరగయక్షకి
న్నరగంధర్వవిద్యాధరులు కొల్చునామము
పరమయోగీంద్రులు భావించు నామము
నిరుపమమౌ నిధియన నెగడు నామము

బహుభవములుగ నేను భావించు నామము
అహరహము కష్టముల నడ్డు నామము
దహరాకాశంబున తళుకొత్తు నామము
మహితమౌ ముక్తి నిడు మంచి నామము

శ్రీరామ భజనము చేయరేల మీరు


శ్రీరామ భజనము చేయరేల మీరు
నోరార హరికీర్తి నుడువరేల

చేరిచి మీ మనసులలో తారకమంత్రంబును
కూరిమితో శ్రీరాముని కొలువరేల
ధారాళమైన వాని దయామృతము గ్రోలగ
కోరి యిదే చేరరేల కోదండరాముని

పొరుగువారు నవ్వెదరను భీతి యేల మీకు
పొరుగువారు ముక్తినిచ్చి ప్రోచువారా
ఇరుగుపొరుగు మాటయేల నీశ్వరానుగ్రహము
పరమని భావించి రామభద్రు చేరరేల

పాపపుణ్యముల గోలను వదిలించు రాముని
శ్రీపాదములకు పూజ చేయరేల
తాపత్రయముల నుండి తప్పించి ముక్తి నిడు
శ్రీపతిని మరచి కలికి చిక్కెదరేల

28, మార్చి 2019, గురువారం

రావయ్య సంజీవరాయడా పెద్దన్నా


రావయ్య సంజీవరాయడా పెద్దన్నా
నీవు ముందుండి భజన నిర్వహింపగా

భూమిపైన తొట్టతొలి రామదాసుడవు నీవు
రామదాసాగ్రణివై రాణకెక్కి
రామభక్తిప్రచారము ప్రేమతో చేయుచున్న
ఓ మహానుభావ  మమ్ముధ్ధరించగను

కామక్రోధాదిభూత గణము నిదే వెడలించి
రామభజన చేయించ రాగదయ్య
ప్రేమ గల పెద్దన్నవు రామభక్తులకు నీవు
మామనవి విని మమ్ము సామీరి నడపవే

పావనాతిపావనమై పరగు రామనామము
పావని మాచేత నీవు పలికించగ
భావనాతీత రామబ్రహ్మోపాసనమును
నీ వలన మేమిపుడు నేర్చి తరించెదము

ఓ మనసా శ్రీరామచంద్రునే యేమరక సేవించగదే


ఓ మనసా శ్రీరామచంద్రునే
యేమరక సేవించగదే

ఎవరే సుతులు ఎవరే హితులు
ఎవరే చుట్టము లిట నీకు
ఎవరెవరైనను నీభవమున నిన్ను
తవులుకొన్న బంధములే కాక

ధనము హుళక్కి దార హుళక్కి
తనువును విడచు తరుణమున
కనుగొన నీవని యనుకొను చున్నవి
వెనుక లేవు ముందును లేవు కదే

కలుగుట కల్ల తొలగుట కల్ల
ఇలపైన నీ వాడుటలు కల్ల
కలిగించునులే తెలివిడిని నీకు
కొలుచుకున్ననీ గోవిందు డిదే

27, మార్చి 2019, బుధవారం

చింతలన్ని తొలగించి యంతులేని సుఖమిచ్చి


చింతలన్ని తొలగించి యంతులేని సుఖమిచ్చి
చెంత జేర్చుకొనువాడు సీతారాముడు

వయసును నమ్ముకొని పట్టరాని గర్వమున
భయము భక్తి లేక విషయవాంఛలతో నుండి
వయసుడిగిన పిదప గతము భావించి కించపడి
అయయో యని నరుడు కావరా రాముడా యంటే

అధికార మున్నదని  యంగబల మున్నదని
యధికముగ విఱ్ఱవీగి బుధుల పరిభవించి
అధముడై బ్రతికిబ్రతికి అవల చాల కించపడి
వ్యధను చెంది నరుడు రామభద్రుడా శరణంటే

పరుగులిడి ధనములకై పడరాని పాట్లుపడి
పరమార్థము ధనమన్న భావనలోనుండి
పరముమాట తలపకుండ బ్రతికి చాల కించపడి
నరుడు బుధ్ధి తెచ్చుకొని నా రాముడా యంటే

ఇందిరారమణ గోవింద సదానంద


ఇందిరారమణ గోవింద సదానంద ముని
బృందవంద్యపాదారవింద రక్షమాం

శ్రీమదయోధ్యాపురీ సింహాసనస్థిత
శ్యామలాంగ కోమలాంగ శౌరి రక్షమాం
రామచంద్ర రాఘవేంద్ర రాజీవలోచన
భూమిజాసమేత సర్వవినుత రక్షమాం

కామితార్థదాయక కళ్యాణకారక
భూమిజామనోహర రామ రక్షమాం
ప్రేమామృతదివ్యసుధావృష్టి సంతర్పిత
సౌమనస్విలోక రామచంద్ర రక్షమాం

భండనోద్దండ రామ చండకోదండధర
ఖండితాసురేంద్రభుజాగర్వ రక్షమాం
పుండరీకాక్ష భక్తపోషక సర్వేశ భూ
మండలాధినాథ రక్షమాం రక్షమాం

26, మార్చి 2019, మంగళవారం

తెలుగువాడు మోసపోని దినం ఉన్నదా?







తెలుగువాడు మోసపోని దినం ఉన్నదా
మోసం చేయని కేంద్రప్రభుత్వమున్నదా?

మోసపోయినా నోరు మూసుకొనే రకాలనే
మోసగించి మోసగించి మురిసే నాయకులనే
మరలమరల బుధ్ధిలేక మనం ఎన్నకుంటున్నాం
భాధ్యతగా మోసపోయి బాధలే పడుతున్నాం ॥ తెలుగువాడు॥

ఆరుదశాబ్దులపాటు అంతులేని కష్టాలు
అభివృధ్ధిని కాంక్షిస్తే అడుగడుగున నష్టాలు
ఎన్నుకున్న నాయకులు మిన్నకున్న తన్నక
మోసమని మొత్తుకునే మెతకతనం చాలిక ॥తెలుగువాడు॥

కలసి ఉన్నప్పుడే కడగండ్లకు లోటులేదు
ముక్కచెక్కలయ్యాక ముఖంచూచే దెవ్వరు
ఆలనపాలన లేని ఆట్టడుగు ఆంద్రజనం
అంతులేని బాధలతో అఘోరించు దినం దినం ॥తెలుగువాడు॥









గమనిక:  2, మార్చి 2015, సోమవారం, 3:10PM సమయంలో  పై గేయాన్ని  ఒక బ్లాగులో వ్యాఖ్యగా వ్రాసాను. శ్యామలీయం బ్లాగులో ఉంచటం బాగుంటుందని ఇక్కడ కూడా అదే రోజున 3:22PM సమయంలో ప్రచురించాను. ఈరోజు 26/3/19న 7:00PM సమయంలో మరలా  ప్రచురిస్తున్నాను.

మా రామచంద్రు డెంతో మంచివాడు


మా రామచంద్రు డెంతో మంచివాడు మమ్ము
చేరదీసి తనవారిని చేసుకొన్నాడు

ఉరక తిర్యగ్యోనులలో నుర్వి చుట్టు చున్న మమ్ము
నరజన్మములకు తెచ్చినాడు వాడు
నరులమై తన కొరకై పరితపించు చుంటిమని
ధరమీదను మమ్మేలగ డాసినాడు

మాయలో నుండి తన మార్గ మెఱుగకున్న మాకు
చేయందించుటకు విచ్చేసినాడు
శ్రీయుతుడగు శ్రీహరియె శ్రీరామచంద్రు డనగ
మా యందే తానొకడై మసలినాడు

తనివారగ తననామము తలచుచుండు నట్టి మమ్ము
తన వారని ఆదరించు ధర్మమూర్తి
జననమరణ చక్రమింక చాలునంటే దయతో మా
మనివి నాలకించి నాడు మంచివాడు


25, మార్చి 2019, సోమవారం

వృత్తిధర్మం!


ఓట్ల పండగొచ్చింది.
ఊరంతా సందడే.
ఒక ఊర నేముంది.
ఏ వూళ్ళో చూసినా ఆ ఊరంతా సందడే.

ఎవరు మీటింగు ఉందని పిలిచినా లారీ ఎక్కటానికి సిధ్ధంగా కొందరుంటారు. మీటింగుకు పోతే నోట్లోకి తిండీ తీర్థమూ దొరుకుతాయి. కాసిని కరెన్సీ నోట్లూ దొరుకుతాయి. తిండి చేదా? డబ్బు చేదా? మొన్న అ పార్టీ వాళ్ళు పిలిస్త్తే వెళ్ళిన వాళ్ళు ఈవేళ ఈపార్టీ పిలిస్తే వెళ్ళకూడదని రూలుందా ఎక్కడన్నా? వీళ్ళ వృత్తిధర్మం వీళ్ళది. ఎవరు పిలిచినా లారీ ఎక్కుతారు,  మీటింగుకు వెళ్తారు, జై కొట్టి పుచ్చుకోవలసినవి పుచ్చుకుంటారు. ఇందులో వీళ్ళు సిగ్గుపడవలసింది ఏమీ లేదే.

ఏ పార్టీ వాళ్ళు పిలిచి ప్రచారగీతాలు పాడిపెట్టమన్నా అందుకు కళాకారులు సిధ్దంగానే ఉంటారు. అయ్యో ఫలాని పార్టీని ఆకాశానికి ఎత్తేస్తూ పాడేశాం కదా మొన్ననే, ఇప్పుడు మీ పార్టీని పొగుడుతూ మళ్ళా ఎలా పాటలు పాడటం అని అంటారా? అంత అమాయకత్వం ఎవరికీ ఉండదు. ఐనా అందులో తప్పేముందీ? కళాకారులుగా సేవను అందిస్తున్నారు, సొమ్ము పుచ్చుకొని సంతోషపడుతున్నారు. వీళ్ళ వృత్తిధర్మం వీళ్ళది. ఇందులో వీళ్ళు సిగ్గుపడవలసింది ఏమీ లేదే.

కళాకారులంటే గుర్తుకు వచ్చింది. ఇప్పుడు సినిమావాళ్ళేగా ఎక్కువగా కళాకారులం అని చెప్పుకొనేదీ?  డైలాగులు చెప్పటం సరిగ్గా రాకపోయినా, ముఖంలో హావభావాలకు ఎంతమాత్రం స్థానం లేకపోయినా ష్టార్‍డమ్ ఉన్న కళాకారులు ఉన్న చిత్రపరిశ్రమలోనే ఏదో ఒక వేషం అని బెట్టుచేయకుండా మనని అడిగిందే పదివేలు అనుకొనే నటులు బోలెడు మంది ఉన్నారు కదా. పాపం వీళ్ళల్లో మంచి నటులు బాగానే ఉంటారు. ఐనా పేరుండదు. ఒక పార్టీ వాళ్ళు ప్రచారం కోసం ఒక సినిమాతీసినా, ఏదో వీడియో ఆడ్ తీసినా నటిస్తారు. అలాగే మరొక పార్టీ వాళ్ళూ అలాంటి ఆడ్ లేదా సినిమా ఛాన్స్ ఇచ్చినా సంతోషంగా చేస్తారు. వీళ్ళ వృత్తిధర్మం వీళ్ళది. ఇందులో వీళ్ళు సిగ్గుపడవలసింది ఏమీ లేదే.

పార్టీలన్నాక కార్యకర్తలు అని ఉంటారు. వీళ్ళ పని అల్లా నాయకులకు జై కొడుతూ తిరగటం. తమ నాయకుడు ఏపార్టీలో ఉంటే ఆపార్టీని గొప్ప చేస్తూ వీలున్నప్పడల్లా అంటే నాయకుడు సూచించినప్పు డల్లా నానాహంగామా చేయటం. నాయకుడు ఒక పార్టీలో ఉన్నాడు. జై కొట్టారు. అయనకు టిక్కట్టు రాకో, అక్కడ కిట్టుబాటు కాకో ఉన్న పార్టీ మారి మరొక పార్టీలోనికి గంతువేసి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా కార్యకర్తలు కూడా ఆటోమాటిగ్గా నాయకుడి నుండి పార్టీ మార్పుని అందిపుచ్చుకోవాలి.  ఈరోజు ఉదయం దాకా పొగిడిన పార్టీని చచ్చేట్లు తిట్టాలి. ఇంతవరకూ శాపనార్థాలు పెడుతూ చెడతిట్టిన పార్టీని కీర్తిస్తూ ఊగిపోవాలి. యథా నాయకుడూ తధా కార్యకర్తలూ అన్నమాట.  వీళ్ళ వృత్తిధర్మం వీళ్ళది. ఇందులో వీళ్ళు సిగ్గుపడవలసింది ఏమీ లేదే.

రాజకీయ నాయకులని ఒక రకం మనుషులున్నారు. వాళ్ళు చేసే వృత్తికి అఫీషియల్ పేరు ప్రజాసేవ. అంటే వీళ్ళంతా ప్రజాసేవకులు అన్నమాట. కాదంటే కొడతారు కూడా. కాని విజ్ఞులు అందరికీ తెలిసి రాజకీయం కూడా ఒక వృత్తి. మరి వృత్తి అన్నాక దానిలో కొనసాగటం లాభసాటిగా ఉండాలా వద్దా చెప్పండి. బోలెడు డబ్బులు తగలేసి, బోలెడు మందిని తిట్టి, బోలెడంత హైరానా పడి గెలిచి అమ్మయ్య అనుకునేది పోయి ఐదేళ్ళ కోసారి వోటేసే జనానికి నానా సేవా చేయటానికా? కాదు కదా. లాభసాటిగా అంటే ఇల్లిపీకి రాజభవనం చేసుకోవాలీ, మహారాజులా వెలగాలీ, వారసులు పడితిన్నా కొన్ని తరాలకు సరిపోయే సిరిని తవ్వి తలకెత్తుకోవాలీ వగైరా బోలెడు పొందవలసినవీ చెందవలసినవీ ఉంటాయి కదా. తనతో పాటుగా తన కుటుంబంలో మరొకరో ఇద్దరో రాజకీయవృత్తిలో అందిరావాలా, తన తరువాత తన వారసులూ రాజకీయవ్యాపారంలో స్థిరపడాలా? అబ్బో ఎన్నున్నాయనీ? అలాంటప్పుడు అవకాశం - అదేనండి టికెట్ - ఇచ్చిన పార్టీకే జై అనాలి కాని మనపార్టీ అంటూ బోడి సెంటిమెంటుతో ఎవరు మాత్రం ఏదో ఒక పార్టీకి ఉత్తినే కంచిగరుడ సేవ ఎందుకు చెయ్యాలి చెప్పండి. అందుకే రాజకీయ నాయకులు ఎవరు పెద్దపీట వేస్తే వాళ్ళ దగ్గరకే పోతారు. వీళ్ళ వృత్తిధర్మం వీళ్ళది. ఇందులో వీళ్ళు సిగ్గుపడవలసింది ఏమీ లేదే.

ఐతే ప్రజాసేవ అన్నదే మావృత్తి అని చెబుతూ రాజకీయం అనే వృత్తిలో ఉన్నవాళ్ళను చూసి మన జనం సిగ్గుపడాలి. ఎందుకంటే అలాంటి మోసగాళ్ళను తయరుచేస్తున్నది మనమే కాబట్టి. ఓట్లు వేయటం మనకు వృత్తి కాదు, హాబీ కాదు. బాధ్యత. కాని మనం బాధ్యతగా ఓటు వేస్తే మోసకారి రాజకీయవృత్తిపరుల్ని కొంతైనా నిరోధించగలం.


పొగడగ నేలా యొరుల భూజనులారా


పొగడగ నేలా యొరుల భూజనులారా మీరు
పొగడవలయును రామ భూమిపాలుని

అగణితసుగుణమణి యైన రాము డొక్కడే
పొగడదగిన వాడు కదా పురుషుల లోన
జగదేకవీరుని శరణాగతరక్షకుని
మిగుల కీర్తి గొనిన హరిని మీరు పొగడరే

విమలవేదాంతవేద్యు డమలినచారిత్ర్యుడు
కమలాప్తకులశోభను డమితతేజుడు
క్షమాగుణపూర్ణుడు శాంతస్వభావుడు
అమరనుతుడు కదా రాము డతని పొగడరే

వందారుభక్తజన మందారు డైనట్టి
యందగాడు రామచంద్రు డతివ సీతతో
బృందారకులు గొల్వ పేరోలగమున కనుల
విందు చేయుచున్నా డిదె వేడ్క పొగడరే

24, మార్చి 2019, ఆదివారం

భాజనీయతా సూత్రం: 7 చేత భాగిస్తే శేషం ఎంత?


మనకు చాలానే బాజనీయతా సూత్రాలు తెలుసును.

సరిసంఖ్యలను (అంటే ఒకట్ల స్థానంలో 0,2,4,6,8 ఉన్నవి)  2 చేత భాగించవచ్చును - శేషం సున్న అని తెలుసును.
సంఖ్య ఒకట్ల స్థానంలో 0 కాని 5 కాని ఉంటే సంఖ్యను5 చేత భాగించగలం అని తెలుసును.
సంఖ్యలోని అంకెల మొత్తాన్ని 3 చేత భాగించ గలిగితే ఆ సంఖ్యను 3 భాగిస్తుందని తెలుసును.
సంఖ్యలోని అంకెల మొత్తాన్ని 9 చేత భాగించ గలిగితే ఆ సంఖ్యను 9 భాగిస్తుందని తెలుసును.
సంఖ్య చివరి రెండు  అంకెలు తీసుకొని 4 చేత, మూడు అంకెలు తీసుకొని 8 చేత భాజనీయత తెసుకో గలం.

కాని సాధారణంగా ఒక సంఖ్యను 7 చేత భాగించగలమా అన్నది ఎలా తెలుసుకోవటం అన్నదానికి సూత్రం ఏదీ ప్రచారంలో లేదు.

ఈ మధ్య అక్కడక్కడా ఈ విషయంపై కొన్ని సూత్రాలు చూసాను కాని అవి బాగోలేవు. కొన్నింటి కన్నా నేరుగా భాగహారం చేయటమే మంచిది అన్నంత చిరాగ్గా ఉన్నాయి.

సులభంగా ఉండే సూత్రం నేను మీకు వివరిస్తాను. ఈ సూత్రం ఏమిటంటే వేలనూ వందలనూ తొలగించటం. అదెలాగో వివరిస్తాను.

1001 అన్న సంఖ్యను తీసుకోండి. దీన్ని 7 చేత భాగించితే శేషం ఏమీ రాదు. ఎందుకంటే 1001 = 7 x 143 కాబట్టి.

ఇప్పుడు 5286 అన్న సంఖ్యను తీసుకుందాం.  1001 లో 7 నిశ్శేషంగా పోతుంది కాబట్టి 5005 లో కూడా నిశ్శేషంగా పోతుందని సులువుగానే అర్థం చేసుకోవచ్చును.

5286 ను 5005 + 281 ని విడదీయ వచ్చును కదా. అంటే వేల స్థానంలోని అంకెను ఒకట్ల స్థానంలోని అంకెనుండి తీసివేయ వచ్చును. శేషంలో తేడా ఏమీ రాదు.

అంటే 5286ను 7 చేత భాగిస్తే శేషం ఎంతో 281ని 7 చేత భాగించినా శేషం అంతే.

ఇది పట్టుకున్నారా?  లేకపోతే మరొకటి రెండు సార్లు ఈ వివరణను మరలా చదవండి.

ఈ వేలస్థానాన్ని మింగేసే టెక్నిక్ ఎంత పెద్దసంఖ్యపైన ఐనా సరే ప్రయోగించి వందల్లోనికి తెచ్చేయవచ్చును. అదెలాగో చూదాం.

62582364679 అని ఒక సంఖ్యను తీసుకుందాం. బాబోయ్ అంత పెద్ద సంఖ్యే అనకండి. తమాషా చూడండి.

22582364679 లో ఎడమవైపునుండి మొదలు పెట్టి 2258 వరకూ తీసుకుందాం. వేలస్థానంలోని 2ను ఒకట్ల స్థానంలోని 8నుండి తీసివేదాం. 2258 --> 2258 - 2 = 256 అని వచ్చింది కదా. ఇలా వేల స్థానం మాయం చేసిపారేసాం. ఇప్పుడు ఇచ్చిన 22582364679 లో 2258 బదులు 256 ఉంచితే 2562364679 ఐనది కదా.

ఈ 2562364679 పైన మళ్ళా ఇందాకటి ట్రీట్ మెంట్ ఇద్దాం. 2562 లో మొదటి 2 ని చివరి 2లోనుండి తీసివేదాం.

ఇప్పుడు మనదగ్గర ఉన్న సంఖ్య 560364679. ఇప్పుడు ఇచ్చిన 22582364679 నుండి ఎడమవైపు నుండి మొదటి రెండు స్థానాలూ దర్జాగా మింగేశాం చూడండి.

ఇలా మొత్తం సంఖ్యను కుదించుకుంటూ పోవటం వలన ఫలితం చూడండి

1. 22582364679 ని కుదిస్తే 2562364679
2. 2562364679 ని కుదిస్తే 560364679
3. 560364679 ని కుదిస్తే 60564679  (ఇక్కడ 3-5 బదులు 7+3-5 అని అనుకోండి)
4. 60564679ని కుదిస్తే 0504679
5. 504679 ని కుదిస్తే 04179
6. 4179 నికుదిస్తే 175

ఇలా ఇచ్చిన 22582364679 తీసుకొని 175గా కుదించేసాం. 175ని 7 చేత భాగిస్తే శేషం 0. 7 x 25  175 కాబట్టి. అందుచేత 22582364679 ని 7 చేత భాగించినా శేషం 0 వస్తుంది. వచ్చి తీరాలి. (నిజానికి 7 x 3226052097 = 22582364679  అవుతుంది)

అన్నట్లు ఒక్క ముఖ్యవిషయం. ఈ కుదింపులు చేసేటప్పుడు ఒకస్థానానికి పరిమితంగా పైన చూపినట్లే చేయనక్కరలేదు. వేలస్థానంలో అంకె కొట్టివేయగా ఏర్పడ్డ వందల్లోని సంఖ్య మొత్తం పరిగణనలోనికి తీసుకోవచ్చును. ఇది కొందరికి సహజంగానూ సులువుగానూ ఉండవచ్చును.

పైన  560364679 ని కుదిస్తే 60564679  (ఇక్కడ 3-5 బదులు 7+3-5 అని అనుకోండి) అన్నాం కాని 603-5= 986 అని కూడా కుందించవచ్చును. అలాగు కొనసాగిస్తే కుదింపులు ఇలా వస్తాయి.

59864679 నికుదిస్తే 9814679
9814679 ని కుదిస్తే 812679
812679 ని కుదిస్తే 12579
12579 ని కుదిస్తే 2569
2569 ని కుదిస్తే 567

పైన ఇచ్చిన కుదింపులన్నీ నిజంగా చాలా వేగంగా చేయవచ్చును.  కొంచెం అభ్యాసం చేసి చూడండి.

22582364679 
-2562364679 
--560364679
---60564679
----0504679
-----504679
------04179
-------4179
--------175

చూసారుగా. మీకూ ఇది సులువుగా తోస్తున్నదా లేదా? నిజానికి ఇలా నిలువుగా చూపినట్లు చేయనక్కర లేదు. ఎక్కడి కక్కడ తీసివేతలు చేస్తూ సులువుగా ఒకలైనులోనే చేసేయ వచ్చును.

ఇంక వందలను ఎలా తొలగించాలీ అన్నది చెప్పుకోవాలి. ఇది కూడా సులువే.

100 ని 2 చేత భాగిస్తే శేషం 2 వస్తుంది 100 = 7 x 14 + 2  కాబట్టి. అంటే ఇచ్చిన సంఖ్యలో ఎన్ని వందలు ఉన్నాయో అన్ని 2లు శేషం అన్నమాట.

ఇప్పుడు పైన ఉన్న 175ను తీసుకుందాం. ఇందులో వందలస్థానంలో ఉన్నది 1 కాబట్టి ఒకట్ల స్థానానికి 1 x 2 = 2 ను కలుపుదాం. వందల స్థానం వదిలేద్దాం.

175
-77

ఇప్పుడు మనకు వందలస్థానం కొట్టేస్తే 77 వచ్చింది. దీన్ని 7 భాగిస్తుందని సులువుగా తెలుసుకోవచ్చును కదా.

ఇలా మనం ఇచ్చిన సంఖ్యలోనుండి వేలూ ఆపైన స్థానాలు కొట్టి వేయాలి. ఆపైన వందలస్థానమూ కొట్టి వేయాలి. రెండంకెల సంఖ్య మిగులుతుంది.

ఏమిటీ?  రెండంకెల సంఖ్యను 7 చేత భాగిస్తే శేషం ఎంతో సులువుగా ఎలా తెలుస్తుంది అంటున్నారా? హతోస్మి. 7వ ఎక్కం సరిగా రాదా?

పోనివ్వండి, దీనికీ ఒక సులువుంది.

పదుల స్థానంలో ఉన్న అంకెలో సగాన్ని ఒకట్ల స్థానంలోనుండి తీసేయండి. అంటే 43 అని ఉందనుకోండి 43లో ఒకట్ల స్థానం 4. దీన్లో సగం 2. 3 -2 = 1 కాబట్టి, శేషం 1 అన్నమాట.  ఒకట్ల స్థానంలో సరిసంఖ్య ఉంటే సులువే కాని బేసి సంఖ్య ఉంటే అంటారా? ఫరవాలేదు 7ను కలుపుకోండి లేదా తీసెయ్యండి. ఉదాహరణకు 96ను 7 చేత భాగించితే శేషం ఎంతా అంటే 9లో సంగం అన్నా 9-7=2 లో సగం అన్నా సమానమే కాబట్టి 6-1=5శేషం. అలాగే 36ను 7 చేత భాగించవలసి వస్తే 3 కు బదులుగా 3+7=10ని సగం చేయండి అప్పుడు 6-5=1 శేషం అని సులువుగా చెప్పవచ్చును.

అసలు ఈ పదుల స్థానం తొలగించే టెక్నిక్ ఎంతపెద్ద సంఖ్యపైన ఐనా ప్రయోగించవచ్చును. మొదట ఇచ్చిన సంఖ్యనే చూదాం

22582364679  22 బదులుగా 2-2/2 = 1
-1582364679  15 బదులుగా 5-(7+1)/2 = 5-4 -1
--182364679  18 బదులుగా 8-4 =3
---42364679  42 బదులుగా 2 - 4/2 = 0
----0364679  ఎడమవైపు 0 అనవసరం.
-----364679  36 బదులుగా 6 - (3+7)/2 = 1
------14679  14 బదులుగా 4 - (7+1)/2 = 0
-------0679  ఎడమవైపు 0 అనవసరం.
--------679  67 బదులుగా 7 - 6/2 = 4
---------49  49 బదులుగా 9 - 4/2 = 7
----------7  ఒకట్ల స్థానంలో 7 కాని అంతకన్నా ఎక్కువున్నా 7 తీసేయవచ్చును.
----------0  శేషం.

ఐతే ఇలా ఎడమవైపు అంకెను సగం చేస్తూ తీసివేతలు చేయటం కొందరికి చిరాకు అనిపించవచ్చును. ఇదంతా మామూలు పద్దతిలో 7 చేత భాగహారంలా అనిపించవచ్చును.

కాని వేల స్థానాలమీద పని చేస్తున్నప్పుడు సగంచేసే పని లేదు కాబట్టి అలా చేయటం సులువుగా ఉంటుంది.


23, మార్చి 2019, శనివారం

దేవుడి పటాలన్నీ దిబ్బకిందిచెరువులో...


ఈ మధ్యన లోపలి అలలు అన్న బ్లాగును చదువుతున్నాను. దుగ్గిరాల శ్రీశాంతి గారు చాలా బాగా వ్రాస్తున్నారు. ఈరోజున ఆవిడ తాజాటపా నాయనమ్మ పూనకం... చదివాను. బాగుంది.

టపా చివరకు వచ్చే సరికి అంతే నాలుగో నాడు తెల్లారే ఇంట్లో దేవుడి పటాలన్నీ దిబ్బకిందిచెరువులో తేలాయి అని ఒక మాట చెప్పారు.

ఈ  నాయనమ్మ పూనకం... టపా చదివాక కొన్నిసంఘటనలను గురించిన విషయాలు వ్రాయా లనిపించింది.

నేను డిగ్రీ పూర్తిచేసిన తరువాత కొన్ని నెలలకే అనుకుంటాను మా నాన్నగారికి రంపచోడవరం హైస్కూలుకు హెడ్మాష్టరుగా బదిలీ అయ్యింది.

నా ఉద్యోగప్రయత్నాలు నేను మెల్లగా చేసుకుంటూ ఉండే వాడిని. కాలక్షేపం కోసం కొందరు బీదవిద్యార్థులకు ట్యూషన్ చెబుతూ ఉండే వాడిని.

అలా నా దగ్గరకు ట్యూషన్ కోసం వచ్చే వాళ్ళలో ఒకమ్మాయీ అమె అన్నగారూ కూడా ఉండే వాళ్ళు.  ఆ అమ్మాయి పేరు లక్ష్మి. ఆమె అన్న పేరు ఇప్పుడు సరిగా గుర్తుకు రావటం లేదు. సత్యనారాయణ అనో మరొకటో. వాళ్ళు తాము కిరస్తానంలోని మతం మార్చుకున్నామని చెప్పారు.

ఒకరోజు ఆ అమ్మాయి నాతో రేపు పండగ కదా, ట్యూషన్ కోసం రామండి అంది. ఆ పండగ వినాయక చవితో వరలక్ష్మీ వ్రతమో సరిగా గుర్తుకు రావటం లేదు. వాటిల్లో ఒకటి మాత్రం అవును.

నేనన్నాను కదా, అదేమిటమ్మా మీరు మతం మారారు కదా ఇంకా ఈపండగలు చేసుకుంటున్నారా అని.

అప్పుడు ఆ అన్నా చెల్లెళ్ళు తమ మతాంతరీకరణ గురించి చాలా చెప్పారు.

పిల్లలకు చర్చి తరపున మంచిమంచి చదువులు చెప్పిస్తాం అని ఎన్నో హామీలు ఇస్తే పిల్లల బాగు కన్నా కావలసింది ఏముందీ అని వాళ్ళ అమ్మానాన్నా ఒప్పుకున్నారట. అప్పటికే కొన్ని నెలలుగా వాళ్ళను మతంలోనికి రమ్మని వివిధరకాలుగా అడుగుతున్నారట కానీ ఈ హామీ మాత్రం బాగా ఆకర్షించిందట.

మొత్తానికి మతం మారారు మొత్తం కుటుంబం అంతా.

ఆ తరువాత జరిగిన కథ మాత్రం ఆశించిన దానికి భిన్నంగా ఉన్నది. వాళ్ళను చర్చిలోనికి రానివ్వటం లేదు. అదేమిటీ అంటే మీరు ఇంకా బాప్తిజం తీసుకోలేదు అని అభ్యంతరం చెప్పారట. అదేదో త్వరగా ఇవ్వండీ అంటే దానికి ఎవ్వరెవ్వరి నుండో అనుమతులు రావాలీ, వాళ్ళొచ్చి ఇవ్వాలీ వీళ్ళొచ్చి ఇవ్వాలీ అని ఏళ్ళతరబడీ తిప్పుతున్నారట.  సరే అదలా ఉంచి పిల్లల చదువులకు సాయం చేస్తామన్నారుగా అంటే అదీ బాప్తిజం మీరు తీసుకున్నాకే ఆ సాయాలు గట్రా అంటున్నారట.

వీళ్ళదా చాలా బీదకుటుంబం. అప్పటి వరకూ ఏదో బంధువులు కొద్దోగొప్పో తమస్తోమతును బట్టి చిన్నా పెద్దా సాయాలు చేస్తూ ఉండే వారట ఈ పిల్లల చదువులకు. ఈ కుటుంబం అనుకుందీ, ఇలా బందువులపై భారం  ఎన్నాళ్ళు మోపుతామూ, ఈ చర్చివాళ్ళు పిల్లలకు సాయం చేస్తే ఇటు బంధువులను ఇబ్బంది పెట్టక్కర్లేదూ మనం మరొకళ్ళని ఏమీ అడగక్కర్లేదూ ఉభయతారకంగా ఉంటుంది మతంమారటం అని.

ఇప్పుడు ఇటు ఆమతం వాళ్ళు పూర్తిగా చేరదీయనూ లేదు సాయమూ చేయటం లేదు. అటు ఉన్న బంధువులు వద్దన్నా మతం మారి వాళ్ళకూ దూరం అయ్యారు.

పూర్వం ఇంట్లో పండగలన్నీ ఉన్నంతలో ఆనందగా చేసుకొనే వారట. గుళ్ళకూ తరచూ వెళ్ళే వారట.

ఇప్పుడు అటు చర్చి రానివ్వటం లేదు. ఇటు గుళ్ళోకి వెడితే ఊళ్ళో వాళ్ళు ఆక్షేపిస్తున్నారు.

ఇలా చెప్పుకొని ఆపిల్ల కళ్ళవెంట నీళ్ళు కార్చింది.

అందుచేత పండగలన్నీ ఇప్పటికీ ఒక్కటీ మానకుండా అంతే భక్తిగా చేసుకుంటున్నారట. కాని తమ ఇంట్లోనే కొంచెం గుట్టు చప్పుడు కాకుండా తలుపులు వేసుకొనీ మరీ చేస్తున్నారట.

అప్పుడు నేనో మా అమ్మగారో గుర్తులేదు కాని ఒక ప్రశ్న వేసాము. మీ యింట్లో మీరు పండగ చేసుకుంటే తలుపులు ఎందుకు వేసుకోవటం అని.

దానికి వచ్చిన జవాబు ఏమిటంటే బంధువులు కొంచెం సానుభూతితో అర్థంచేసుకుంటున్నారట, కాని ఒకటి రెండు సార్లు చర్చి వాళ్ళు ఇంటి మీదికి వచ్చి చాలా రభస చేసి వెళ్ళారట.

మీరు సరైన దైవవిశ్వాసులు కాకపోతే మీకు బాప్తిజం ఇవ్వటం ఎలా అని కోప్పడ్డారట.

అందుకని బయటకి కిరస్తానమూ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా సనాతనధర్మమూ నడుస్తున్నాయి వాళ్ళింట్లో. దేవుళ్ళ బొమ్మలూ కాలెండర్లూ అవీ ఎవరికీ కనబడకుండా ఒక పాత పెట్టలో ఉంచారట. వాటికి పండగపబ్బాలప్పుడు పెరోల్ దొరుకుతూ ఉంటుందట.

ఇక రెండవ సంఘటన నేను హైదరాబాదుకు ఉద్యోగనిమిత్తం వచ్చాకనే జరిగింది. అది మేము సీతాఫలమండీలో ఉన్న రోజుల్లోని ఘటన.

నాకు చంద్రప్రకాశ్ అని ఒక ప్రియమిత్రుడు ఉన్నాడు. ఇప్పుడాయన విజయవాడలో ఉన్నాడు. అప్పట్లో ఒక యింట్లో నేను మా అమ్మా, అన్నదమ్ములూ అప్పచెల్లెళ్ళతో ఒకవాటాలోనూ మరొకవాటాలో ఈచంద్రప్రకాశ్ బ్రహ్మచారిగాను అ అద్దెకు ఉండే వాళ్ళం. ఈ చంద్రప్రకాశ్ మా అఫీసులోనే పనిచేసేవాడు. మా ప్రక్కవాటాలో అన్న పేరే కాని మాయింట్లోనే మా అమ్మపిల్లల్లో ఒకడిగానే మసులుతూ ఉండేవాడు. మేమిద్దంగా అంటుకు తిరుగుతూ ఉండే వాళ్ళం నిత్యమూ.

ఒకసారి అతను తమ స్వస్థలం విజయవాడకు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తిరిగి వచ్చి చెప్పిన విశేషాల్లో ఈ సంగతి చెప్పాడు.

తమ ఇంటికి దగ్గర్లో ఒక యింట్లో ఒకమ్మాయికి దెయ్యం పట్టిందట.

దాన్ని వదిలించే క్రమంలో ఆ కుటుంబం చేసిన రకరకాల ప్రయత్నాల్లో ఒకటి ఎవరో చెప్తే, ఒక దెయ్యాలు వదిలించే ఫాదిరీ గారి దగ్గరకు వెళ్ళటం.

ఏం జరుగుతుందో చూదామని వెళ్ళిన వాళ్ళలో ఈ చంద్రపకాశ్ కూడా ఉన్నాడు.

ఆ ఫాదిరీ గారు కొంచెం హంగామా అదీ చేసినా దెయ్యం పోలేదూ, అదుపులోనికి కూడా రాలేదు.

అప్పుడు ఆయన పిల్లను తీసుకు వచ్చిన వాళ్ళతో ఏమని చెప్పాడో తెలుసా అని అడిగి చంద్రపకాశ్ చాలా సేపు నవ్వుతూ కూర్చున్నాడు.

ఏమన్నాడయ్యా అంటే, ఆ ఫాదిరీ గారు, "ఈ పిల్లను పట్టుకున్నది చాలా గడ్డు దెయ్యం. ఆ దెయ్యం పేరు కాళికా దేవి" అని.

పిల్ల తరపు వాళ్ళు తెల్లబోయి అదేమిటీ అంటే ఆయన సెలవిచ్చిన మాటలు, వినండి. "కాళికా దేవి నుండి ఎవ్వరూ కాపాడలేరు. అది చాలా మొండిదీ క్రూరమైనదీ కూడా. ఒక్క దేవుడే ఈ పిల్లనీ మిమ్మల్నీ కాపాడాలి. మీరేమో దైవ విశ్వాసులు కారు. కాబట్టి మీరంతా దైవవిశ్వాసులై ప్రార్థనలు చేసి నమ్మకంతో ఏసుప్రభువును వేడుకుంటే ఆయన ఈ అమ్మాయినీ మిమ్మల్నీ ఆ కాళికాదేవినుండి కాపాడతాడు. మరొక దారి లేదు. ఇంకెవ్వరూ కాళికను తరమలేరు ఏసు తప్ప" అని .

ఆ తరువాత ఏం జరిగిందో చెప్పమంటే, అందరూ ఫాదిరీ గారితో కొంచెం ఘర్షణ పడ్డారట, పిల్లను తీసుకొని అక్కడ నుండి ధుమధుమలాడుతూ వెళ్ళిపోయారట.

మరేమన్నా కథ నడిచిందా అంటే చంద్రప్రకాశ్ చెప్పలేడు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన నాడే బయలుదేరి అతను హైదరాబదుకు తిరిగి వచ్చాడు.

మతం మారతం అంటే హిందువులు ఏ కిరస్తానంలోని వెళ్ళటం అనే అర్థమే రానక్కరలేదు. మనలోనూ చాలాచాలా ఉపమతాలు పుట్టుకొని వచ్చాయి.

అలాంటి ఒక ఉపమతం లోనికి మా దగ్గర బంధువుల కుటుంబం ఒకటి మారింది. అది నా పెళ్ళికాక మునుపే.

ఆ కుటుంబం తాలూకు వ్యక్తుల ద్వారా సదరు ఉపమతం వారు నన్నూ మాకుటుంబాన్ని తమలోనికి ఆహ్వానించే ప్రయత్నమూ బాగానే చేసారు అప్పట్లోనే.

నిజానికి అలా మొదట ఆ ఉపమతం లోనికి వెళ్ళింది మా బంధువర్గంలోని ఒక అమ్మాయి కుటుంబం. వాళ్ళు మొదట్లో ఎంతో నిష్ఠగా రాముణ్ణి కొలిచే వారు.  శ్రీరామనవమి ఎంతో ఘనంగా చేసేవారు.  ఆవైభవాన్ని మా అమ్మగారే కళ్ళారా చూసి ఆనందించి నాకు చెప్పారు కూడా.

సరే వారంతా ఆ ఉపమతం స్వీకరించారు. క్రమంగా ఆఅమ్మాయి పుట్టింటి వారూ ఆ మతంలోనికి మారారు.

అప్పట్లో వారింట్లో ఉండే అర్చావిగ్రహాలూ అవీ అన్ని హుస్సేన్ సాగర్లో పారేసారని చెప్పి అందరూ చెప్పుకొని బాధపడే వారు. నాకు మరీ ఎక్కువ వివరాలు తెలియవు.

ఒక్కటి మాత్రం నిజం. ఆ అమ్మాయి కన్నతల్లి మాత్రం అటు స్వధర్మాన్ని విడచి రాముణ్ణి మరవలేకా ఇటు ఈ కొత్తమతంలో ఇమడలేకా చాలా అవస్థపడటం నాకు ప్రత్యక్షంగానే తెలుసు. ఈమధ్యనే ఆవిడ కా బాధనుండి భగవంతుడు విముక్తి కల్పించాడు. ఇలా మతం లోనికి మారటం వలన ఇబ్బంది పడే ఒక జీవి కథను ఒక కోడలి కథ అని నేను శ్యామలీయంలో వ్రాసాను.

ఇదంతా ఎందుకు చెప్పానంటే దుగ్గిరాల శ్రీశాంతి  గారు దేవుడి పటాలన్నీ దిబ్బకిందిచెరువులో... అని అనగానే పై సంఘటన లన్నీ మనస్సులో మెదిలాయి కాబట్టి.


22, మార్చి 2019, శుక్రవారం

మోక్ష మేలరాదు నీకు మోదముతో


మోక్ష మేలరాదు నీకు మోదముతో రాముని
సాక్షాత్తు శ్రీహరిని చక్కగ సేవించిన

హరిని కొలుచు వానికే యబ్బనిచో మోక్షము
మరి యొకరిని కొలుచువాని మాట యేమి
హరి చేసిన విశ్వమున హరియె మోక్ష ప్రదుండై
వరలు గాక యన్యదైవతములతో పనియేమి

జీవులను కట్టుమాయ శ్రీహరిదై యుండగ
జీవుల విడిపించు నొడుపు శ్రీహరి కాక
జీవుల నెవరెరుగుదురు శ్రీహరియే చేసిన
దేవత లందైన నెవరు తెలియగా వశము

హరినామసాహస్రి యందు రామనామము
పరమోత్కృష్ట మనుచు పరమేశ్వరుడు
హరియె తా నైన వా డాన తిచ్చిన మాట
మరువ నేమిటికి నరుడ మానస మందు

21, మార్చి 2019, గురువారం

నిన్నే నమ్ముకొంటి నయ్య నిజము


నిన్నే నమ్ముకొంటి నయ్య నిజము శ్రీరామ
కన్నతండ్రి నన్నేల కాపాడవు రామ

భయమాయెను చెప్పరాని బాధల వలన
రయమున నను కాపాడ రావేల రామ
దయామయబిరుదాంకిత దశరథ రామ
జయశీల శుభచరిత జానకిరామ

దురుసులాడు వారి పుల్లవిరుపుల వలన
కరము నొచ్చు నన్నేల కావవు రామ
కరుణాకరబిరుదాంకిత నరపతి రామ
శరణాగతుల బ్రోచు జానకిరామ

తమకించి యిలకు వచ్చి తత్తరపడుచు
కుములు న న్నేలవేల గోవింద రామ
సమరాంగణసార్వభౌమ సద్గుణధామ
సమానాధికులు లేని జానకిరామ


రాముడా వందిత సుత్రాముడా


రాముడా వందిత సుత్రాముడా జయము జయము
స్వామీ నీ దయామృతము చాలును మాకు

మూడు లోకములను పుట్టించి పోషించి
వేడుకతో కాపాడు విభుడవు నీవు
పాడుదుము నీకీర్తి పరిపరి విధంబుల
వేడుకతో నీగాథల వేయినోళ్ళ పొగడుచు

జీవు లందరను నీవు సృజియించు చున్నావు
ఏవేళ నైన వారి కేడుగడవు
నీ వేడుక కొరకు వారు నిత్య మిచట క్రీడింప
నీవే తగు సమయమున నినుజేర నిచ్చెదవు

హరివి విశ్వాత్మకుడవు నడపదడప మాపైన
కరుణతో నాటలోన కనవత్తువు
నరులకు నీరాకలే నడవడికలు నేర్పు
తరచు నీనామమే మరలించు జీవులను






19, మార్చి 2019, మంగళవారం

అంత వాడ నింత వాడ నని


అంత వాడ నింత వాడ నని తలచేను రామ
చింతనారతి లేక చెడిపోయేను

అది నేర్చి యిది నేర్చియంతంత మాత్రాన
మది నెంచు తానేమో మనుజు లందు
యెదిరించ రాని పండితుడనై యుంటినని
కుదరక హరిభక్తి వదలక గరువము

అది యిచ్చి యిది యిచ్చి అయిన వారి నుబ్బించి
మది నెంతో మురియు తాను మనుజు లందు
సదమలవృత్తిగల సత్పూరుషుడనని
హృదయమును హరి కీయ నెఱుగనే యెఱుగడు

అది యొప్పు నిది యొప్ప దనుచు తీర్పులు చెప్పి
మది నెంచు న్యాయబుధ్ధి మనుజు లందు
విదితముగ తనకబ్బె విబుధుండ నేనని
అది న్యాయమా హరిని యాత్మశు తలపడు

18, మార్చి 2019, సోమవారం

చేతులెత్తి మ్రొక్కెదను సీతారామ


చేతులెత్తి మ్రొక్కెదను సీతారామ నీకు
చేతకాని దేమున్నది సీతారామ

కాకి మీద దర్భవిసిరి సీతారామ నీవు
లోకములు త్రిప్పితివి సీతారామ
కాకివలె  భీతుడనై సీతారామ నేను
లోకములు తిరుగుచుంటి సీతారామ

లోక మెల్ల మ్రొక్కునట్టి సీతారామ నా
శోకమును గమనింపుము సీతారామ
నీకందరు సమానులే సీతారామ భువ
నైకశరణ్యుడవు నీవు సీతారామ

కావుకావు మనెను కాకి సీతారామ నీవు
భావించితి వయ్య కృప సీతారామ
కావుకావు మను భక్తుని సీతారామ నీవు
కావ కుండుట భావ్యమా సీతారామ

నీవారని పైవారని సీతారామ నీ
వేవేళను తలపవండ్రు సీతారామ
నావాడవు నీవొకడవె సీతారామ నా
భావమెఱిగి నన్నేలుము సీతారామ

నిరుపమాన కృపాలయ సీతారామ ఈ
చరాచర జగతినేలు సీతారామ
ధరమీద నీ నామమె సీతారామ మా
నరులందరకు దిక్కు సీతారామ

పరాత్పర నీవు కాక సీతారామ ఈ
నరాధమున కెవరు దిక్కు సీతారామ
శరణుశరణు భువనేశ సీతారామ నన్ను
కరుణించుము వేడుకతో సీతారామ


16, మార్చి 2019, శనివారం

శివపూజ జేసేవు సీతమ్మా


శివపూజ జేసేవు సీతమ్మా ఆ
శివు డెవరో హరి యెవరో సీతమ్మా

హరికొఱకు తపించిన యానాటి వేదవతివి
హరికి యిల్లాలివై హరుని పూజించెదవు
హరిభక్తు రాలవును హరభక్తు రాలవును
తరుణిరో విశదించ దగునమ్మ చెప్పవే

వెన్నుడే శివుడని వెన్నుడే రుద్రుడని
వెన్నుడే స్థాణుడని వెన్నుడే శంభుడని
వెన్నుడే యీశ్వరుడని వివరంబుగా
నెన్న లేని వారికే యీ సందియము

వెన్నుడు శివపూజ చేయు వేయినామాలతో
వెన్నుని ధ్యానించు సర్వవేళలను శివుడు
చిన్నమెత్తు బేధమును శివకేశవుల కేది
పన్నుగ నిది యెఱిగిన వారికిక శంకేది


12, మార్చి 2019, మంగళవారం

చకచక బాణాలు సంధించరాదా


చకచక బాణాలు సంధించరాదా
ప్రకటించి విల్లెత్తి వికటబుధ్ధుల పైన

కపటబుధ్ధుల వారు కల్లబ్రతుకుల వారు
విపరీతములు చేయు వేడ్కల వారు
అపకారులై జనుల నణగద్రొక్కుచు నుండ
తపనపడు మమ్మేల తడయగ నేలా

తెలుగింటి ఘనకీర్తి కలతబారుచు క్రుంగ
కలుషబుధ్ధులు నేడు గంతులువేయ
వెలతెల బోవు మా తెలుగు తల్లిని బ్రోవ
తులలేని విలుకాడ తొందరపడ రాదా

శూరుడ నీవిటుల జూచుచు నూరకున్న
నేరగాళ్ల పాలగును నేల సమస్తము
శ్రీరామ నీవారు చిక్కులు పడుచుండ
కారుణ్యమును జూపి కాపాడ రాదా


11, మార్చి 2019, సోమవారం

రమణీమణులార రాముని సద్గుణము


రమణీమణులార రాముని సద్గుణము
కమనీయముగ పాడ గలరు కాదె

అడవులకు వెడలనంపు నట్టి సవతితల్లిపై
కడుభక్తి చూపునట్టి కొడు కొక డున్నే
యిడిగో యీ కోసలేంద్రు డీత డొక్కడు కాక
పుడమిపై ముక్కాలములను పొలతులార

అవగుణములవా డొక్క డాలి నెత్తుక పోవ
మివుల కోపమును చెంది మీదికి దండెత్తి
అవసరపడి మార్కొని యయ్యో డస్సినా వని
వివశుడైన శాత్రవుని విడచెనట సతులార

వైకుంఠరాయడై వెలుగుచు నుండువాడు
లోకోపకార  మెడద లోన చాల దలచి
చీకాకుల నోర్చెనట రాకాసుల నణగించి
శ్రీకరుడై లోకమున చెలగెనట చెలులార

సోదరుల పోరు లోన జొరబడినావు


సోదరుల పోరు లోన జొరబడినావు
మేదినిపై ధర్మమే మెఱయించినావు

వాలి సుగ్రీవు మెడపట్టి గెంటి వైచి
గాలించి చంపగా గమకించు వేళ
కోల నేసి వాలిని నీలమేఘశ్యామ
పాలించి సుగ్రీవు  ప్రభువు జేసినావు

నీతిచెప్ప రావణుడు నిందించి వెడలింప
ఖ్యాతిగల విభీషణు డాతురుడై చేరగ
ప్రీతిమై చేరదీసి వీరుడా రాముడా
ఆతనికే లంక నుపాయనము చేసినావు

కౌరవులు పాండవుల కడగండ్లు పెట్ట
పోరు తప్పనట్టి వేళ పోయి నల్లనయ్య
చేరి పాండవులతో కౌరవుల నణగించి
ధారుణికి భారమును తగ్గించినావు


6, మార్చి 2019, బుధవారం

సీతారాములు తల్లిదండ్రులని


సీతారాములు తల్లిదండ్రులని చెప్పుకు తిరిగేము
భూతలమంతా మాయిల్లే నని ప్రీతిగ పలికేము

ఆదరించు రఘురాము డుండగ అన్యుల గొడవేల
కోదండరాముడు కోర్కెలు తీర్చ కొఱతలుండు టేడ
వేదవేద్యుని నామముండగ వేరు విద్యలేల
మోదముతో చరింతు మెప్పుడును వేదనలు లేక

శ్రీమహాలక్ష్మి చింతలు తీర్చు సీతమ్మ బిడ్డలము
ప్రేమామృతవారాశి మాయమ్మ రేబవళ్ళు మాకు
గోముగ నిచ్చలు రామభక్తిని కూరిమితో నేర్ప
మే మన్యము లపేక్షచేయక స్వామిని కొలిచేము

రామరామ శ్రీ రఘురామా యని రక్తి మీఱ పాడ
మేము నేర్చితిమి రామచంద్రుడు మిక్కిలి మెచ్చగను
మేము నేర్చినది వినుచు సీతమ్మ మిక్కిలి పొంగగను
రామభక్తిని చాటుచు మేము భూమిని తిరిగేము

4, మార్చి 2019, సోమవారం

వేదపాదస్తోత్రం

ముందుమాట.

ఈ వేదపాదస్తోత్రం జైమనీమహర్షి కృతం. ఇందులో ప్రతిశ్లోకంలోనూ చివరి పాదం ఒక వేదమంత్రం. ఈ మంత్రాలు ఋగ్వేద యజుర్వేదాలలోనివి. ఒక్కటి మాత్రం ముండకోపనిషత్తు లోనిది. మొదటి ఎనిమిది శ్లోకాలూ భూమిక. 1 నుండి 112 వరకూ శివపరమైన శ్లోకాలు, 113 వ శ్లోకం గణపతి పరం గానూ 114వ శ్లోకం స్కందపరంగానూ ఉన్నాయి. 115 నుండి 122వరకూ దేవీపరమైన శ్లోకాలున్నాయి.123 నుండి 131 వరకూ ఫలశ్రుతి శ్లోకాలు. చిట్టచివరి మూడు శ్లోకాలూ ప్రార్థనాశ్లోకాలు.

శ్రీగణేశాయ నమః

అథ

శ్రీ వేదపాద స్తోత్ర ప్రారంభః


ఋషయ ఊచుః

పుండరీకపురం ప్రాప్య జైమిని ర్ముని సత్తమ
కిం చకార మహాయోగీ సూత నో వక్తు మర్హసి 1

సూత ఉవాచ

భగవాన్ జైమిని ర్ధీమాన్ పుండరీక పురే పురా
మహర్షి సిధ్ద గంధర్వ యక్ష కిన్నర సేవితే 2

నృత్యద్భి రప్సర స్సంఘైః ర్దివ్య గానైశ్చ శోభితే
నృత్యంతం పర మీశానం దదర్శ సదసి ప్రభుం 3

ననామ దూరతో‌దృష్ట్వా దండవత్ క్షితిమండలే
పపావుత్థాయ దేవస్య తాండవాఽమృత మాగలం 4

పార్శ్వస్థితాం మాహాదేవీం పశ్యంతీం తస్య తాండవం
దృష్ట్వా సుసంహృష్టమనాః పపాత పురతో మునిః 5

తతశ్శిష్యాన్ సమాహూయ సర్వశాస్త్రార్థ పారగాన్
అగ్నికేశ మకేశం చ శతయాగం‌ జటాధరం 6

వక్రనాసం సమిత్పాణిం ధూమగన్ధిం కుశాసనం
ఏతై స్సార్థం మహాదేవం పూజయామాస జైమినిః7

తతోఽపి వేదవేదాంత సారార్థం తత్ప్రసాదతః
కృతాంజలి రువాచేమం వేదాంతస్తవ ముత్తమం 8

జైమిని రువాచ

ఓం విఘ్నేశ విథి మార్తాండ చంద్రేంద్రోపేంద్ర వందిత
నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం‌ బ్రహ్మణస్పతే 1

ఉమా కోమల హస్తాబ్జ సంభావిత లలాటికం
హిరణ్యకుండలం వందే కుమారం పుష్కర స్రజం 2

శివం విష్ణోశ్చ దుర్దర్శం నరః క స్తోతు మర్హతి
తస్మాన్మత్తః స్తుతిః సేయ మభ్రాత్ వృష్టిరివాజని ౩

నమః శివాయ సాంబాయ నమః శర్వాయ శంభవే
నమో నటాయ రుద్రాయ సదసస్పతయే నమః 4

పాదభిన్నాఽహిలోకాయ మౌలిభిన్నాండభిత్తయే
భుజభ్రాంత దిగంతాయ భూతానాం పతయే నమః 5

క్వణన్నూపుర యుగ్మాయ విలసత్ కృత్తి వాససే
ఫణీంద్ర మేఖలాయాఽస్తు పశూనాం‌ పతయే నమః 6

కాలకాలాయ సోమాయ యోగినే శూలపాణయే
అస్థిభూషాయ శుధ్దాయ జగతాం పతయే నమః 7

పాత్రే సర్వస్య జగతో నేత్రే సర్వ దివౌకసాం
గోత్రాణాం‌ పతయే తుభ్యం క్షేత్రాణాం‌ పతయే నమః 8

శంకరాయ నమస్తుభ్యం మంగలాయ నమోఽస్తుతే
ధనానాం‌ పతయే తుభ్య మన్నానాం పతయే నమః 9

అష్టాంగాయాఽతిహృష్టాయ క్లిష్ట భక్తేష్టదాయినే
ఇష్టిఘ్నా యేష్టితుష్టాయ పుష్టానాం‌ పతయే నమః 10

పంచభూతాఽధిపతయే కాలాఽధిపతయే నమః
నమ ఆత్మాఽధిపతయే దిశాంచ పతయే నమః 11

విశ్వకర్త్రే మహేశాయ విశ్వభర్త్రే పినాకినే
విశ్వహర్తేఽగ్నినేత్రాయ విశ్వరూపాయ వై నమః 12

ఈశాన తే‌ తత్పురుష నమో ఘోరాయ తే సదా
వామదేవ నమస్తే స్తు సద్యోజాతాయ వై నమః 13

భూతిభూషాయ భక్తానాం భీతిభంగరతాయ తే
నమో భవాయభర్గాయ నమో రుద్రాయ మీఢుషే 14

సహస్రాంగాయ సాంబాయ సహస్రాభీషవే నమః
సహస్రబాహవే తుభ్యం సహస్రాక్షాయ మీఢుషే 15

సుకపోలాయ సోమాయ సులలాటాయ సుభ్రువే
సుదేహాయ నమస్తుభ్యం సుమృళీకాయ మీఢుషే 16

భవక్లేశనిమిత్తాయ భవఛ్ఛేదకృతేసతాం
నమస్తుభ్యమషాఢాయ సషమానాయ వేధసే 17

వందేఽహం దేవమానందసందోహం లాస్యసుందరం
సమస్తజగతాంనాథం సదసస్పతి మధ్బుతం 18

సుజంఘం సుందరం సూరుం సుకంఠం సోమభూషణం
సుగండం సుదృశం వందే సుగంధిం పుష్టివర్ధనం 19

భిక్షాహారం‌ హరిత్ క్షౌమం తక్షాభూషం క్షితిక్షమం
యక్షేశేష్టం నమామీశ మక్షరం పరమం పదం 20

అర్థాలక మవస్త్రార్థ మస్థ్యుత్పల దలస్రజం
అర్థపుంలక్షణం వందే పురుషం కృష్ణపింగళం 21

సకృత్ ప్రణత సంసార మహాసాగరతారకం
ప్రణామీశం తమీశానం జగతస్త స్థుషస్పతిం 22

ధాతాతం జగతామీశం దాతారం సర్వసంపదాం
నేతారం‌ మరుతాం వందే జేతార మపరాజితం 23

తం త్వాం మంతక హంతారం వందే మందాకినీధరం
తతాని విదధే యోయ మిమామి త్రీణివిష్టపా 24

సర్వజ్ఞం సర్వగం సర్వం కవిం వందే తమీశ్వరం
యతశ్చ యజుషా సార్థ మృచః సమాని జజ్ఞిరే 25

భవంతం సుదృశం వందే భూతభవ్యభవంతి చ
త్యజంతీతరకర్మాణి యోవిశ్వాభి విపశ్యతి 26

హరం సురనియంతారం పరంతమహమానతః
యదాజ్ఞయా జతత్సర్వం వ్యాప్యనారాయణస్థితః 27

తన్నమామి మహాదేవం యన్నియోగాదజం జగత్
కలాదౌ భగవాన్ దాతా యథాపూర్వ మకల్పయత్ 28

ఈశ్వరం తమహం వందే యస్యలింగ మహర్నిశం
యజంతే సహభార్యాభి రిన్ద్రజ్యేష్ఠామరుద్గణాః 29

నమామి తమిమం రుద్రం యమభ్యర్చ సకృత్ పురా
అవాపుః స్వం స్వమైశ్వర్యం దేవాసః పూషరాతయః 30

తం వందే‌ తమీశానం యం శివం‌ హృదయాంబుజే
సతతం యతయ శ్శాంతాః సంజానానా ఉపాసతే 31

తదస్యై సతతం కుర్మో నమః కమలకాంతయే
ఉమాకుచపదోరస్కా యాతేరుద్ర శివాతనూః 32

నమస్తే రుద్రభావాయ నమస్తే రుద్రకేలయే
నమస్తే రుద్రశాంత్యైచ నమస్తే రుద్రమన్యవే 33

వేదాశ్వరథనిష్ఠాభ్యాం పాదాభ్యాం త్రిపురాంతకః
బాణకార్ముకహస్తాభ్యాం బాహుభ్యా ముతతే నమః 34

ఈశానాం సకలారాధ్యం వందే సంపసమృధ్ధిదం
యస్య చాసీధ్దరి శ్శస్త్రం బ్రహ్మా భవతి సారధిః 35

నమస్తే వాసుకీజ్యాయ విష్ఫారాయ చ శంకర
మహతే మేరురూపాయ నమస్తే అస్తు ధన్వనే 36

నమః పరశవే దేవ శులాయాఽనల రోచిషే
హర్యగ్నీంద్రాత్మనే తుభ్య ముతోత ఇషవే నమః 37

సురేతరవధూహార హారీణి హర యాని తే
అన్యాన్యస్త్రాణ్యహం తూర్ణ మిదం తేభ్యో కరం నమః 38

ధరాధరసుతా లీలా సరోజాహత బాహవే
తస్మై తుభ్యమవోచామ నమో అస్మా అవస్యవః 39

రక్షమా మక్షమం క్షీణ మక్షక్షత మశిక్షితం
అనాథం దీన మాపన్నం దరిద్రం నీలలోహితః 40

దుర్ముఖం దుష్క్రియం దుష్టం రక్షమామీశ దుర్దృశం
మాదృశానాం‌ మహం న త్వదన్యం విందామి రాధసే 41

భవాఖ్యేనాగ్నినా శంభో రాగద్వేషమదార్చిషా
దయాలో దహ్యమానానా మస్మాక మవితాభవ 42

పరదారం పరావాసం పరవస్త్రం పరాప్రియం
హర పాహి పరాన్నం‌ మాం పురుణామన్ పురుష్టుత 43

లౌకికైర్యత్ కృతం పుష్టై ర్నావమానం సహామహే
దేవేశ తవ దాసేభ్యో భూరిదా భూరి దేహి నః 44

లోకానా ముపపన్నానాం గర్విణా మీశ పశ్యతాం
అస్మభ్యం క్షేత్ర మాయుశ్చ వసుస్పార్హం తదాభర‌ 45

యాంచాదౌ మహతీం లజ్జా మస్మదీయం ఘృణానిధే
త్వమేవ వేత్శి వస్తూర్ణ మిషం స్తోతృభ్య ఆభర 46

జాయా మాతా పితా చాన్యే మాం ద్విషంత్య మతికృశం
దేహిమే మహతీం విద్యాం రాయా విశ్వపుషా సహ 47

అదృష్టార్ధేషు సర్వేషు దృష్టార్ధేష్వపి కర్మసు
మేరు ధన్వన్నశక్తేభ్యో బలం దేహి తనూషు నః 48

లబ్ధాఽనిష్ట సహస్రస్య నిత్య మిష్టవియోగినః
హృద్రోగం మమదేవేశ హరిమాణాం చ నాశయ 49

యేయే రోగాః పిశాచావా నరా దేవాశ్చ మామిహ
బాధంతే దేవతాన్ సర్వాన్ నిబాధస్వ మహా అసి 50

త్వమేవ రక్షితాఽస్మాకం నాన్యః కశ్చిన విద్యతే
తస్మాత్ స్వీకృత దేవేశ రక్షాణో బ్రహ్మణస్పతే 51

త్వమే వో మాపతే మాతా త్వం పితా త్వం పితామహః
త్వ మాయుస్త్వం మతిస్త్వం శ్రీరుతభ్రాతో నః సఖా 52

యతస్త్వమేవ దేవేశ కర్తా సర్వస్య కర్మణః
తతః క్షమస్వ తత్సర్వం యన్మయా దుషృతం కృతం 53

త్వస్తమో న ప్రభుత్వేన ఫల్గుత్వేనచ మత్సమః
అతో దేవ మహాదేవ త్వ మస్మాకం తవస్మసి 54

సుస్మితం భస్మగౌరాంగం తరుణాదిత్యవిగ్రహం
ప్రసన్నవదనం సౌమ్యం గాయేత్వా నమసా గిరా 55

ఏష ఏవ వరోఽస్మాకం నృత్యత్వం త్వాం సభాపతే
లోకయంత ముమాకాంతం పశ్యేమ శరదశ్శతం 56

అరోగిణా మహాభాగా విద్వాంసశ్చ బహుశ్రుతాః
భగవన్ త్వత్ ప్రసాదేన జీవేమ శరదశ్శతం 57

సదారా బంధుభిస్సార్థం త్వదీయం తాండవాఽమృతం
పిబంతః కామ మీశాన నందామ శరదశ్శతం 58

దేవదేవ మహాదేవ త్వదీయాంఘ్రిసరోరుహే
కామం మధుమయం పీత్వా మోదామ శరదశ్శతం 59

కీటా నాగాః పిశాచావా యేవా కేవా భవేభవే
తవదాసా మహాదేవ భవామ శరదశ్శతం 60

సభాయా మీశ తే దివ్యం నృత్త వాద్య కలస్వనం
శ్రవణాభ్యాం మహాదేవ శృణవామ శరదశ్శతం 61

స్మృతిమాత్రేణ సంసారవినాశన కరాణి తే
నామాని తవ దివ్యాని ప్రబ్రవామ శరదశ్శతం 62

ఐషు సంధానమాత్రేణ దగ్ధత్రిపుర ధూర్జటే
అధిభిర్వ్యాధిధిర్నిత్య మజీతాశ్యామ శరదశ్శతం 63

చారు చామీకరాభాసం గౌరీకుచపదోరసం
కదా ను లోకయిష్యామి యువానం విశ్పతిం‌ కవిం 64

ప్రమథేంద్రావృతం ప్రీతవదనం ప్రియభాషిణం
సేవిష్యేహం కదా సాంబం సుభాసం శుక్రశోచిషం 65

బహ్వేనసం మా మకృతపుణ్యలేశం చ దుర్మతిం
స్వీకరిష్యతి కిం త్వీశో నీలగ్రీవో విలోహితః 66

కాలశూలాఽనలాసక్త భీతివ్యాకుల మానసం
కదా ను ద్రక్షతీశో మాం తివిగ్రీవో‌ అనానతః 67

గాయకా యూయమాయాత యది రాయాది లిప్సవః
ధనదస్య సఖేశోఽయ ముపాస్మై గాయతా నరః 68

ఆగఛ్చత సఖాయో మే యది యూయం ముముక్షవః
స్తుతేశ మేనం ముక్త్యర్ధ మేష విప్రై రభిష్టుతః 69

పదే పదే పదే దేవ పదం న స్సేత్స్యతి ధ్రువం
ప్రదక్షణం ప్రకురుత మధ్యక్షం ధర్మణా మిమం 70

సర్వం‌ కార్యం యువాభ్యాం హిసుకృతం సుహృదౌ మమ
అంజలిం కురుతౌ హస్తౌ రుద్రాయ స్థిర ధన్వనే 71

మన్మూర్థన్ మరుతామూర్థ్వం భవం‌ చంద్రార్థమూర్థజం
మూర్థఘ్నంచ చతుర్మూర్థో సమస్యా కల్మలీకినం 72

నయమే నయమోద్భూత దహనాలీఢ మన్మథం
పశ్యంతం తరుణం సౌమ్యం భ్రాజమానం హిరణ్మయం 73

సభాయాం శూలిన స్సంధ్యానృత్తవాద్యస్వనాఽమృతం
కర్ణౌతూర్ణం యథాకామం పాతం గౌరా వివేరిణే 74

నాసికే వాసుకీస్వాసవాసితా భాసితోరసం
ఘ్రాయతం గరలగ్రీవ మస్మభ్యం శర్మయఛ్చతం 75

స్వస్త్యస్తు సుఖితే జిహ్వే విద్యా దాతు రుమాపతే
స్తవ ముచ్చతరం బ్రూహి జయతా మివ దుందుభిః 76

చేతః పోత నశోచస్త్వం నింద్యం విందాఽఖిలం జగత్
అస్య నృత్తాఽమృతం శంభో గౌరో నతృషితః పిబ 77

సుగంధిం సుఖ సంస్పర్శం కామదం సోమభూషణం
గాఢమాలింగ మచ్చిత్తయోషా జారమివప్రియం 78

మహామయూఖాయ మహాభుజాయ
మహాశరీరాయ మహాంబరాయ
మహాకిరీటాయ మహేశ్వరాయ
మహా మహీం సుష్టుతి మీర యామి 79

యథా కథం చిత్ రచితాభిరీశ
ప్రసాదతశ్చారుభిరాదరేణ
ప్రపూజయామ స్తుతిభి ర్మహేశ
మషాహ్ళ ముగ్రం సహమాన మాభిః 80

నమః శివాయ త్రిపురాంతకాయ
జగత్రయీశాయ దిగంబరాయ
నమోస్తు ముఖ్యాయ హరాయ శంభో
నమో జఘన్యాయ చ భుధ్నియాయ 81

నమో వికారాయ వికారిణీ తే
నమో‌ భవాయాఽస్తు భవోధ్బవాయ
బహు ప్రజాత్యంత విచిత్రరూపా
యతః ప్రసూతా జతగః ప్రసూతీ 82

తస్మై సురేశోరు కిరీట నాసా
రత్నావృతాఽష్టాపద విష్టరాయ
భస్మాంఽగరాగాయ నమః పరస్మై
యస్మాత్పరం నాఽపరమస్తి కించిత్ 83

సర్పాధిరాజౌషధినాథ యుధ్ధ
క్ష్యుభ్య జ్జటామండల గహ్వరాయ
తుభ్యం నమః సుందర తాండవాయ
యస్మిన్నిదం సచ విచైతి సర్వం 84

మురారి నేత్రార్చిత పాదపద్మం
ఉమాఽంఘ్రిలాక్షా పరిరక్తపాణిం
నమామి దేవం విష నీలకంఠం
హిరణ్యదంతం శుచివర్ణమారాత్ 85

నమామి నిత్యం త్రిపురారి మేనం
యమాంతకం షణ్ముఖతాత మీశం
లలాట నేత్రార్దిత పుష్పచాపం
విశ్వం పురాణం తమసః పరస్తాత్ 86

అనంత మవ్యక్త మచింత్య మేకం
హరం తమాశాంబర మంబరాంగం
అజం పురాణం ప్రణమామి యోఽయం
అణోరణీయాన్ మహతో‌ మహీయాన్ 87

అంతస్థ మాత్మాన మజం న దృష్ట్వా
భ్రమంతి మూఢా గిరిగహ్వరేషు
పశ్చాదుదక్ దక్షిణతః పురస్తా
దధస్విదాసీ దుపరి స్విదాసిత్ 88

ఇమం‌ నమా మీశ్వర మిందు మౌలిం
శివం మహానంద మశోక దుఃఖం
హృదంబుజే తిష్ఠతి యః పరాత్మా
పరీత్య సర్వాః ప్రదిశో దిశశ్చ 89

రాగాది కాపధ్య సముధ్బవేన
భగ్నం భవాఖ్యేన మహాఽఽమయేన
విలోక్య మాం పాలయ చంద్రమౌలే
భిషక్తమం త్వా భిషజాం శృణోమి 90

దుఃఖాంబురాశిం సుఖలేశహీనం
అస్పృష్టపుణ్యం బహుపాతకం మాం
మృత్యోః కరస్థం భవరక్షభీతం
పశ్చాత్ పురస్తా దధరా దు దక్తాత్ 91

గిరీంద్రజా చారుముఖా~వలోక
సుశీతయా దేవ తవైవ దృష్ట్యా
వయం దయాపూరితయైవ తూర్ణం
అపో ననావా దురితా తరేమ 92

అపారసంసారసముద్రామధ్యే
నిమగ్నముత్క్రోశ మనల్ప రాగం
మమాక్షమం పాహి మహేశ జుష్టం
ఓజిష్ఠయా దక్షిణ యేవరాతిం 93

స్మరన్ పురాసంచిత పాతకాని
ఖరం యమస్యా౽పి ముఖం యమారే
బిభేమి మే దేహి యధేష్ట మాయుః
య దిక్షితాయు ర్యది వా పరేత 94

సుగంధిభిః సుందర భస్మ గౌరైః
అనంత భోగైః ర్మృదులై రఘోరైః
ఇమం కదా౽౽లింగతి మాం పినాకీ
స్థిరేభిరంగైః పురు రూప ఉగ్రః 95

క్రోశంత మీశః పతితం భవాబ్ధౌ
నాగాస్యమండూక మివాతి భీతం
కదా ను మాం రక్ష్యతి దేవదేవో
హిరణ్యరూపః సహిరణ్య సందృక్ 96

అారుస్మితం చంద్రకలావతంసం
గౌరీకటాక్షార్హమయుగ్మనేత్రం
ఆలోకయుష్యాయమి కదా ను దేవం
ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ 97

ఆగచ్ఛతా౽త్రా౽౽శు ముముక్షువో యే
యూయం శివం చింతయతాఽంతరాబ్జే
ధ్యాయంతి ముక్త్ర్యర్థ మిమంహి నిత్యం
వేదాంతవిజ్ఞాన సునిశ్చితార్థాః 98

ఆయాత యూయం భువనాధిపత్య
కామా మహేశం సకృదర్చయధ్వం
ఏనం పురాఽభ్యర్చ హిరణ్యగర్భో
భూతస్య జాతః పతిరేక ఆసీత్ 99

యే కామయంతే విపులాం‌ శ్రియంతే
శ్రీకంఠ మేనం సకృదానమంతాం
శ్రీమానయం శ్రీపతివంద్యపాదః
శ్రీణా ముదారో ధరుణోరయీణాం 100

సుపుత్రస్యకామా అపి యే‌ మనుష్యా
యువాన మేనం గిరిశం‌ యజంతాం
యతః స్వయం భూర్జగతాం విధాతా
హిరణ్యగర్భః సమవర్త తాగ్రే 101

అలం కి ముక్తై ర్బహుర్భిః సమీహితం
సమస్త మస్యా శ్రయణేన సిధ్యతి
పురైన మాశ్రిత్య హి కుంభసంభవో
దివా న నక్తం పలితో ఇవాజని 102

అన్యత్పరిత్యజ్య మమాఽక్షిభృంగాః
సర్వం సదైవం శివమాశ్రయధ్వం
ఆమోదవా నేష మృదుః శివోఽయం
స్వాదుష్కిలాయాం మధుమాం ఉతాయం 103

భవిష్యసి త్వం ప్రతిమానహీనో
వినిర్జితాఽశేష నరామరశ్చ
నమోఽస్తుతే వాణి మహేశ మేనం
స్తుహి శ్రుతం గర్త సదం‌యువానం 104

యద్యన్మన శ్చింతయసి త్వమిష్టం
తత్తద్ భవిష్య త్యఖిలం ధ్రువం తే
దుఃఖే నివృత్తి ద్విషయే కదాచిత్
యక్ష్వామహే సౌమనసాయ రుద్రం 105

అజ్ఞానయోగా దపచారకర్మ
యత్పూర్వ మస్మాభి రనుష్ఠితం తే
తద్దేవ సోఢ్వా సకలం దయాలో
పితేన పుత్రాన్ ప్రతి నో జుషస్వ 106

సంసారాఖ్య క్రుధ్ధ సర్వేణ తీవ్రై
రాగద్వేషోన్మాద లోభాది దంతైః
దష్టం దృష్ట్వా మాం దయాలుః పినాకీ
దేవ స్త్రాతా త్రాయతా మప్రౌయఛ్చన్ 107

ఇత్యు క్త్వాంతే యత్సమాధే ర్నమంతో
రుద్రాద్యా స్త్వాం యాంతి జన్మాహిదష్టాః
సంతో నీలగ్రీవ సూత్రా త్మనాఽహం
తత్వాయామి బ్రహ్మణా వందమానః 108

భ వాతిభీషణజ్వరేన పీడితాన్ మహా భయా
నశేష పాతకాలయా నదూరకాల లోచనాన్
అనాథనాథ తే‌ కరేణ భేషజేన కాలహ
న్నదూషణో వ సోమహే మృశస్వ శూర రాధసే 109

జయేమ యేన శర్వమే తదిష్ట మష్టదిగ్గజం
భువస్థలం‌ నభస్థలం దివస్థలం చ తద్గతం
య యేష సర్వ దేవదానవా నతః సభాపతిః
సనోదదాతు తం రయిం రయిం పిశంగ సదృశం 110

నమో‌ భవాయ తే హరాయ భూతి భాసితోరసే
నమో మృడాయ తే హరాయ భూతభీతి భంగినే
నమః శివాయ విశ్వరూప శాశ్వతాయ శూలినే
న యస్య హన్యతే సఖా న జీయతే కదాచన 111

సురపతి పతయే నమో‌నమః
క్షితిపతి పతయే నమః ప్రజాపతి పతయే
నమో నమోఽంబికాయ పతయ
ఉమాపతయే పశుపతయే నమోనమః 112

వినాయకం వందక మస్త కాయతి
ప్రణామ సంఘుష్ట సమస్తవిష్టపం
నమామి నిత్యం ప్రణతార్తి నాశనం
కవిం కవీనా ముప మ శ్రవస్తమం 113

దేవే యుధ్ధే యాగే విప్రా
స్వీయాం సిధ్ధిం హ్వాయన్ హ్వాయన్
యం సిధ్యంతి స్కందం వందే
సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం 114

నమః శివాయై జగదంబికాయై
శివప్రైయాయై శివవిగ్రహాయై
సముద్ బభూ వాద్రిపతేః సుతాయై
చతుష్కపర్ద్రా యువతిః సుపేశాః 115

హిరణ్యవర్ణాం‌మహి నూపురాంఘ్రిం
ప్రసన్నవక్త్రాం శుకపద్మహస్తాం
విశాలనేత్రాం ప్రణమామి గౌరీం
వచో విదం వాచముదీరయంతీం 116

నమామి మేనా తనయా మమేయాం
ఉమామిమాం మానవతీం చ మాన్యాం
కరోతి యా భూతి స్తితౌ స్తనౌ ద్వౌ
ప్రియం సఖాయాం పరిష స్వజానా 117

కాంతా ముమాకాంత నితాంతకాంతి
బ్ర్హాంతా ముపాంతానత హర్యజేంద్రాం
నతోఽస్మి యాస్తే గిరిశస్య పార్శ్వే
విశ్వాని దేవీ భువనాని చక్ష్య 118

వందే గౌరీం తుంగపీనస్తనీం త్వాం
చంద్రాం చూడాం శ్లిష్ట సర్వాంగరాగాం
ఏషా దేవీ ప్రాణినా మంతరాత్మా
దేవం‌ దేవం రాధసే చోదయంతీ 119

ఏనాం వందే దీనరక్షా వినోదాం
మేనాకన్యా మానతానందదాత్రీం
యా విద్యానాం మంగలానాంచ వాచాం
ఏషా నేత్రీ రాధస సూనృతానాం‌ 120

భవాభిభీతో రుభయాపహంత్రి
భవాని భోగ్యా భరణైక భోగైః
శ్రియం పరాం దేహి శివప్రయే నో
యయాతి విశ్వా దురితా తరేమ 121

శివే కథం త్వం మతిభిస్తు గీయసే
జగకృతిః కేలిరయం శివః పతిః
హరిస్తు దాఓఽనుచరేందిరా శచీ
సరస్వతీ వా సుభగా దదిర్వసు 122

ఇమం స్తవం జైమినా ప్రచోదితం
ద్విజోత్తమో యః పఠతీశ భక్తితః
తమిష్ట వాక్సిధ్ది మతి ద్యుతి శ్రియః
పరిష్వజంతే జనయో యథాపతిం 123

మహీపతిర్యస్తు యుయుత్సురాదిరా
దిమం పఠ స్తస్య తథైవ సుందరం
ప్రయాంతివా శీఘ్ర మథాంతకాంతికం
భియం దధానా హృదయేషు శత్రవః 124

త్రైవర్ణికే ష్వన్యతమో య ఏనం
నిత్యం కదాచిత్ పఠతీశ భక్తితః
కలేవరాంతే శివపార్శ్వ వర్తీ
నిరంజన స్సామ్య ముపైతి దివ్యం 125

లభంతే పఠంతో మతిం బుధ్దికామా
లభంతే చిరాయు స్తథాయుష్యకామః
లబంతే పఠంతః శ్రియం పుష్టికామా
లభంతే హ పుత్రా ర్లభంతేహ పౌత్రాన్ 126

ఇత్యనేన స్తవే నేశం స్తుత్వాఽసౌ జైమినిర్మినిః
స్నేహాసుపూర్ణనయనః ప్రణవామ సభాపతిం 127

ముహుర్ముహుః పిబన్నీశ తాండవాఽమృత మాగలం
సర్వాన్ కామాన వాప్యాం తే గాణాపత్య మవాప సః 128

పాదం వాఽప్యర్థపాదంవా శ్లోకం శ్లోకార్థ మేవ వా
యస్తు వాచయతే నిత్యం సమోక్ష మధిగఛ్చతి 129

వేద శ్శివో శ్శివో వేదో వేదాధ్యాయీ‌ సదా శివః
తస్మా త్సర్వ ప్రయత్నేన వేదాధ్యాయిన మర్చయేత్ 130

అదీత విస్మృతో వేదో వేద పాద స్తవం పఠన్
స చతుర్వేద సాహస్ర పారాయణఫలం లభేత్ 131

కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్ర మనంత రూపం
విశ్వేశ్వరం త్వాం హృది భావయామి 132

ఆనంద నృత్యసమయే నటనాయకస్య
పాదారవింద మణినూపుర శింజితాని
ఆనందయంతి మదయంతి విమోహయంతి
రోమాంచయంతి నయనాని కృతార్థయంతి 133

అతిభీషణ కటుభాషణ యమకింకర పటలీ
కృతతాడన పరిపీడన మరణాగమ సమయే
ఉమయాసహ మమచేతసి యమశాసన నివసన్
హర శంకర శివ శంకర హర మే హర దురితం 134

       ఇతి
శ్రీ జైమినికృత వేదపాద స్తోత్రం సంపూర్ణం
  శుభం

ఓం శాంతిః శాంతిః శాంతిః