27, మార్చి 2019, బుధవారం

చింతలన్ని తొలగించి యంతులేని సుఖమిచ్చి


చింతలన్ని తొలగించి యంతులేని సుఖమిచ్చి
చెంత జేర్చుకొనువాడు సీతారాముడు

వయసును నమ్ముకొని పట్టరాని గర్వమున
భయము భక్తి లేక విషయవాంఛలతో నుండి
వయసుడిగిన పిదప గతము భావించి కించపడి
అయయో యని నరుడు కావరా రాముడా యంటే

అధికార మున్నదని  యంగబల మున్నదని
యధికముగ విఱ్ఱవీగి బుధుల పరిభవించి
అధముడై బ్రతికిబ్రతికి అవల చాల కించపడి
వ్యధను చెంది నరుడు రామభద్రుడా శరణంటే

పరుగులిడి ధనములకై పడరాని పాట్లుపడి
పరమార్థము ధనమన్న భావనలోనుండి
పరముమాట తలపకుండ బ్రతికి చాల కించపడి
నరుడు బుధ్ధి తెచ్చుకొని నా రాముడా యంటే

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.