11, మార్చి 2019, సోమవారం

రమణీమణులార రాముని సద్గుణము కమనీయముగ పాడ గలరు కాదె


రమణీమణులార రాముని సద్గుణము
కమనీయముగ పాడ గలరు కాదె

అడవులకు వెడలనంపు నట్టి సవతితల్లిపై
కడుభక్తి చూపునట్టి కొడు కొక డున్నే
యిడిగో యీ కోసలేంద్రు డీత డొక్కడు కాక
పుడమిపై ముక్కాలములను పొలతులార

అవగుణములవా డొక్క డాలి నెత్తుక పోవ
మివుల కోపమును చెంది మీదికి దండెత్తి
అవసరపడి మార్కొని యయ్యో డస్సినా వని
వివశుడైన శాత్రవుని విడచెనట సతులార

వైకుంఠరాయడై వెలుగుచు నుండువాడు
లోకోపకార  మెడద లోన చాల దలచి
చీకాకుల నోర్చెనట రాకాసుల నణగించి
శ్రీకరుడై లోకమున చెలగెనట చెలులార

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.