23, మార్చి 2019, శనివారం

దేవుడి పటాలన్నీ దిబ్బకిందిచెరువులో...


ఈ మధ్యన లోపలి అలలు అన్న బ్లాగును చదువుతున్నాను. దుగ్గిరాల శ్రీశాంతి గారు చాలా బాగా వ్రాస్తున్నారు. ఈరోజున ఆవిడ తాజాటపా నాయనమ్మ పూనకం... చదివాను. బాగుంది.

టపా చివరకు వచ్చే సరికి అంతే నాలుగో నాడు తెల్లారే ఇంట్లో దేవుడి పటాలన్నీ దిబ్బకిందిచెరువులో తేలాయి అని ఒక మాట చెప్పారు.

ఈ  నాయనమ్మ పూనకం... టపా చదివాక కొన్నిసంఘటనలను గురించిన విషయాలు వ్రాయా లనిపించింది.

నేను డిగ్రీ పూర్తిచేసిన తరువాత కొన్ని నెలలకే అనుకుంటాను మా నాన్నగారికి రంపచోడవరం హైస్కూలుకు హెడ్మాష్టరుగా బదిలీ అయ్యింది.

నా ఉద్యోగప్రయత్నాలు నేను మెల్లగా చేసుకుంటూ ఉండే వాడిని. కాలక్షేపం కోసం కొందరు బీదవిద్యార్థులకు ట్యూషన్ చెబుతూ ఉండే వాడిని.

అలా నా దగ్గరకు ట్యూషన్ కోసం వచ్చే వాళ్ళలో ఒకమ్మాయీ అమె అన్నగారూ కూడా ఉండే వాళ్ళు.  ఆ అమ్మాయి పేరు లక్ష్మి. ఆమె అన్న పేరు ఇప్పుడు సరిగా గుర్తుకు రావటం లేదు. సత్యనారాయణ అనో మరొకటో. వాళ్ళు తాము కిరస్తానంలోని మతం మార్చుకున్నామని చెప్పారు.

ఒకరోజు ఆ అమ్మాయి నాతో రేపు పండగ కదా, ట్యూషన్ కోసం రామండి అంది. ఆ పండగ వినాయక చవితో వరలక్ష్మీ వ్రతమో సరిగా గుర్తుకు రావటం లేదు. వాటిల్లో ఒకటి మాత్రం అవును.

నేనన్నాను కదా, అదేమిటమ్మా మీరు మతం మారారు కదా ఇంకా ఈపండగలు చేసుకుంటున్నారా అని.

అప్పుడు ఆ అన్నా చెల్లెళ్ళు తమ మతాంతరీకరణ గురించి చాలా చెప్పారు.

పిల్లలకు చర్చి తరపున మంచిమంచి చదువులు చెప్పిస్తాం అని ఎన్నో హామీలు ఇస్తే పిల్లల బాగు కన్నా కావలసింది ఏముందీ అని వాళ్ళ అమ్మానాన్నా ఒప్పుకున్నారట. అప్పటికే కొన్ని నెలలుగా వాళ్ళను మతంలోనికి రమ్మని వివిధరకాలుగా అడుగుతున్నారట కానీ ఈ హామీ మాత్రం బాగా ఆకర్షించిందట.

మొత్తానికి మతం మారారు మొత్తం కుటుంబం అంతా.

ఆ తరువాత జరిగిన కథ మాత్రం ఆశించిన దానికి భిన్నంగా ఉన్నది. వాళ్ళను చర్చిలోనికి రానివ్వటం లేదు. అదేమిటీ అంటే మీరు ఇంకా బాప్తిజం తీసుకోలేదు అని అభ్యంతరం చెప్పారట. అదేదో త్వరగా ఇవ్వండీ అంటే దానికి ఎవ్వరెవ్వరి నుండో అనుమతులు రావాలీ, వాళ్ళొచ్చి ఇవ్వాలీ వీళ్ళొచ్చి ఇవ్వాలీ అని ఏళ్ళతరబడీ తిప్పుతున్నారట.  సరే అదలా ఉంచి పిల్లల చదువులకు సాయం చేస్తామన్నారుగా అంటే అదీ బాప్తిజం మీరు తీసుకున్నాకే ఆ సాయాలు గట్రా అంటున్నారట.

వీళ్ళదా చాలా బీదకుటుంబం. అప్పటి వరకూ ఏదో బంధువులు కొద్దోగొప్పో తమస్తోమతును బట్టి చిన్నా పెద్దా సాయాలు చేస్తూ ఉండే వారట ఈ పిల్లల చదువులకు. ఈ కుటుంబం అనుకుందీ, ఇలా బందువులపై భారం  ఎన్నాళ్ళు మోపుతామూ, ఈ చర్చివాళ్ళు పిల్లలకు సాయం చేస్తే ఇటు బంధువులను ఇబ్బంది పెట్టక్కర్లేదూ మనం మరొకళ్ళని ఏమీ అడగక్కర్లేదూ ఉభయతారకంగా ఉంటుంది మతంమారటం అని.

ఇప్పుడు ఇటు ఆమతం వాళ్ళు పూర్తిగా చేరదీయనూ లేదు సాయమూ చేయటం లేదు. అటు ఉన్న బంధువులు వద్దన్నా మతం మారి వాళ్ళకూ దూరం అయ్యారు.

పూర్వం ఇంట్లో పండగలన్నీ ఉన్నంతలో ఆనందగా చేసుకొనే వారట. గుళ్ళకూ తరచూ వెళ్ళే వారట.

ఇప్పుడు అటు చర్చి రానివ్వటం లేదు. ఇటు గుళ్ళోకి వెడితే ఊళ్ళో వాళ్ళు ఆక్షేపిస్తున్నారు.

ఇలా చెప్పుకొని ఆపిల్ల కళ్ళవెంట నీళ్ళు కార్చింది.

అందుచేత పండగలన్నీ ఇప్పటికీ ఒక్కటీ మానకుండా అంతే భక్తిగా చేసుకుంటున్నారట. కాని తమ ఇంట్లోనే కొంచెం గుట్టు చప్పుడు కాకుండా తలుపులు వేసుకొనీ మరీ చేస్తున్నారట.

అప్పుడు నేనో మా అమ్మగారో గుర్తులేదు కాని ఒక ప్రశ్న వేసాము. మీ యింట్లో మీరు పండగ చేసుకుంటే తలుపులు ఎందుకు వేసుకోవటం అని.

దానికి వచ్చిన జవాబు ఏమిటంటే బంధువులు కొంచెం సానుభూతితో అర్థంచేసుకుంటున్నారట, కాని ఒకటి రెండు సార్లు చర్చి వాళ్ళు ఇంటి మీదికి వచ్చి చాలా రభస చేసి వెళ్ళారట.

మీరు సరైన దైవవిశ్వాసులు కాకపోతే మీకు బాప్తిజం ఇవ్వటం ఎలా అని కోప్పడ్డారట.

అందుకని బయటకి కిరస్తానమూ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా సనాతనధర్మమూ నడుస్తున్నాయి వాళ్ళింట్లో. దేవుళ్ళ బొమ్మలూ కాలెండర్లూ అవీ ఎవరికీ కనబడకుండా ఒక పాత పెట్టలో ఉంచారట. వాటికి పండగపబ్బాలప్పుడు పెరోల్ దొరుకుతూ ఉంటుందట.

ఇక రెండవ సంఘటన నేను హైదరాబాదుకు ఉద్యోగనిమిత్తం వచ్చాకనే జరిగింది. అది మేము సీతాఫలమండీలో ఉన్న రోజుల్లోని ఘటన.

నాకు చంద్రప్రకాశ్ అని ఒక ప్రియమిత్రుడు ఉన్నాడు. ఇప్పుడాయన విజయవాడలో ఉన్నాడు. అప్పట్లో ఒక యింట్లో నేను మా అమ్మా, అన్నదమ్ములూ అప్పచెల్లెళ్ళతో ఒకవాటాలోనూ మరొకవాటాలో ఈచంద్రప్రకాశ్ బ్రహ్మచారిగాను అ అద్దెకు ఉండే వాళ్ళం. ఈ చంద్రప్రకాశ్ మా అఫీసులోనే పనిచేసేవాడు. మా ప్రక్కవాటాలో అన్న పేరే కాని మాయింట్లోనే మా అమ్మపిల్లల్లో ఒకడిగానే మసులుతూ ఉండేవాడు. మేమిద్దంగా అంటుకు తిరుగుతూ ఉండే వాళ్ళం నిత్యమూ.

ఒకసారి అతను తమ స్వస్థలం విజయవాడకు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి తిరిగి వచ్చి చెప్పిన విశేషాల్లో ఈ సంగతి చెప్పాడు.

తమ ఇంటికి దగ్గర్లో ఒక యింట్లో ఒకమ్మాయికి దెయ్యం పట్టిందట.

దాన్ని వదిలించే క్రమంలో ఆ కుటుంబం చేసిన రకరకాల ప్రయత్నాల్లో ఒకటి ఎవరో చెప్తే, ఒక దెయ్యాలు వదిలించే ఫాదిరీ గారి దగ్గరకు వెళ్ళటం.

ఏం జరుగుతుందో చూదామని వెళ్ళిన వాళ్ళలో ఈ చంద్రపకాశ్ కూడా ఉన్నాడు.

ఆ ఫాదిరీ గారు కొంచెం హంగామా అదీ చేసినా దెయ్యం పోలేదూ, అదుపులోనికి కూడా రాలేదు.

అప్పుడు ఆయన పిల్లను తీసుకు వచ్చిన వాళ్ళతో ఏమని చెప్పాడో తెలుసా అని అడిగి చంద్రపకాశ్ చాలా సేపు నవ్వుతూ కూర్చున్నాడు.

ఏమన్నాడయ్యా అంటే, ఆ ఫాదిరీ గారు, "ఈ పిల్లను పట్టుకున్నది చాలా గడ్డు దెయ్యం. ఆ దెయ్యం పేరు కాళికా దేవి" అని.

పిల్ల తరపు వాళ్ళు తెల్లబోయి అదేమిటీ అంటే ఆయన సెలవిచ్చిన మాటలు, వినండి. "కాళికా దేవి నుండి ఎవ్వరూ కాపాడలేరు. అది చాలా మొండిదీ క్రూరమైనదీ కూడా. ఒక్క దేవుడే ఈ పిల్లనీ మిమ్మల్నీ కాపాడాలి. మీరేమో దైవ విశ్వాసులు కారు. కాబట్టి మీరంతా దైవవిశ్వాసులై ప్రార్థనలు చేసి నమ్మకంతో ఏసుప్రభువును వేడుకుంటే ఆయన ఈ అమ్మాయినీ మిమ్మల్నీ ఆ కాళికాదేవినుండి కాపాడతాడు. మరొక దారి లేదు. ఇంకెవ్వరూ కాళికను తరమలేరు ఏసు తప్ప" అని .

ఆ తరువాత ఏం జరిగిందో చెప్పమంటే, అందరూ ఫాదిరీ గారితో కొంచెం ఘర్షణ పడ్డారట, పిల్లను తీసుకొని అక్కడ నుండి ధుమధుమలాడుతూ వెళ్ళిపోయారట.

మరేమన్నా కథ నడిచిందా అంటే చంద్రప్రకాశ్ చెప్పలేడు. ఎందుకంటే ఈ సంఘటన జరిగిన నాడే బయలుదేరి అతను హైదరాబదుకు తిరిగి వచ్చాడు.

మతం మారతం అంటే హిందువులు ఏ కిరస్తానంలోని వెళ్ళటం అనే అర్థమే రానక్కరలేదు. మనలోనూ చాలాచాలా ఉపమతాలు పుట్టుకొని వచ్చాయి.

అలాంటి ఒక ఉపమతం లోనికి మా దగ్గర బంధువుల కుటుంబం ఒకటి మారింది. అది నా పెళ్ళికాక మునుపే.

ఆ కుటుంబం తాలూకు వ్యక్తుల ద్వారా సదరు ఉపమతం వారు నన్నూ మాకుటుంబాన్ని తమలోనికి ఆహ్వానించే ప్రయత్నమూ బాగానే చేసారు అప్పట్లోనే.

నిజానికి అలా మొదట ఆ ఉపమతం లోనికి వెళ్ళింది మా బంధువర్గంలోని ఒక అమ్మాయి కుటుంబం. వాళ్ళు మొదట్లో ఎంతో నిష్ఠగా రాముణ్ణి కొలిచే వారు.  శ్రీరామనవమి ఎంతో ఘనంగా చేసేవారు.  ఆవైభవాన్ని మా అమ్మగారే కళ్ళారా చూసి ఆనందించి నాకు చెప్పారు కూడా.

సరే వారంతా ఆ ఉపమతం స్వీకరించారు. క్రమంగా ఆఅమ్మాయి పుట్టింటి వారూ ఆ మతంలోనికి మారారు.

అప్పట్లో వారింట్లో ఉండే అర్చావిగ్రహాలూ అవీ అన్ని హుస్సేన్ సాగర్లో పారేసారని చెప్పి అందరూ చెప్పుకొని బాధపడే వారు. నాకు మరీ ఎక్కువ వివరాలు తెలియవు.

ఒక్కటి మాత్రం నిజం. ఆ అమ్మాయి కన్నతల్లి మాత్రం అటు స్వధర్మాన్ని విడచి రాముణ్ణి మరవలేకా ఇటు ఈ కొత్తమతంలో ఇమడలేకా చాలా అవస్థపడటం నాకు ప్రత్యక్షంగానే తెలుసు. ఈమధ్యనే ఆవిడ కా బాధనుండి భగవంతుడు విముక్తి కల్పించాడు. ఇలా మతం లోనికి మారటం వలన ఇబ్బంది పడే ఒక జీవి కథను ఒక కోడలి కథ అని నేను శ్యామలీయంలో వ్రాసాను.

ఇదంతా ఎందుకు చెప్పానంటే దుగ్గిరాల శ్రీశాంతి  గారు దేవుడి పటాలన్నీ దిబ్బకిందిచెరువులో... అని అనగానే పై సంఘటన లన్నీ మనస్సులో మెదిలాయి కాబట్టి.


19 కామెంట్‌లు:

  1. బాప్తీసం లేకుండా చర్చిలోకి రానివ్వలేదు అనేది తమ క్రియేషన్ అని అర్ధమౌతోంది. ప్రపంచంలో ఏ చర్చిలోకూడా ఇలాంటి అలవాటులేదు.

    నా చిన్నప్పుడు వెంకటెశ్వర స్వామి దెయ్యం అంటూ, తనతో ఆ దెయ్యం మాట్లాడినట్టూ ఏకంగా ఒక కాసెట్టు రిలీజ్ చెశాడు ఫారెస్టు అధికారిగా పని చేసి రెటైర్ అయ్యిన ఒక పెద్దాయన.

    అవతలివాడి మీద ఆధిపత్యం కావాలంటే మొదట వాడి నమ్మకం మీద దెబ్బ కొట్టాలి. దానికోసం నువ్వు నమ్మేది దెయ్యమైనా అంటాడు.. కుదరకపోతే నీకు రాక్షషుడు అని పేరుపెడతాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిరంజీవి గారూ, ఇక్కడ నేను వ్రాసిన సంఘటనల్లో కల్పనల అవసరం ఏమీ లేదు. అన్నీ నిజంగా జరిగినవే. ఐతే లక్ష్మి అనే అమ్మాయి చెప్పిన విషయాలు నాకు గుర్తు ఉన్నంతవరకూ సరిగానే వ్రాసాను. ఈ సంఘటన జరిగినది 1972 లేదా 1973లో. ఇప్పటికి చాలా కాలమే ఐనది. అప్పట్లో రంపచోడవరం చాలా వెనుకబడిన ప్రాంతం. ఆ ఊళ్ళో పక్కా ఇళ్ళే అతి కొద్ది. ఎక్కువమంది గిరిజనులు. వాళ్ళలో అక్షరాస్యత బహుస్వల్పం. అప్పుడప్పుడే కొంచెం చదువుకుందుకు వస్తున్నారు. వాళ్ళ అమాయకత్వం వలన ఎలాంటి ఎలాంటి దోపిడీలు జరుగుతున్నాయో, వాటిని ఎదిరిస్తున్న కొంతమందితో కలిసి ఇరవైయేళ్ళ యువకుడిగా నేనూ ప్రత్యక్షంగానే చూసాను. రంపచోడవరంలో సంతలో గిరిజనులు తెచ్చిన చింతపండుతో తూకం వేసి కూరగాయలు ఇవ్వటమూ, తేనె తీసుకొని కొంచెం చిన్న కొబ్బెరనూనె సీసా ఇవ్వటమూ, అలాగే అటవీ ఉత్పత్తులను బాగా దండుకొని సెకండ్ హేండ్ బనియన్లూ వగైరాలు ఇవ్వటమూ - నేను స్వయంగా చూడటమే కాదు, వాటిని నిరోధించటనికి యత్నించిన వాళ్ళలోనూ ఉన్నాను. చర్చి స్వయంగా కాకపోయినా దానిని అడ్డుపెట్టుకొని కొందరు పెద్దమనుషులు ఆమాయక కుటుంబాలను మోసం చేస్తూ ఉన్నారేమో అనుకోవచ్చునుగా. ఆలోచించండి. దయచేసి అర్థం చేసుకోండి దురుద్దేశంతో కాని మరొక కారణం వలన కాని నేనేమీ కల్పనలు చేసి వ్రాయలేదు ఈ వ్యాసంలో.

      తొలగించండి
  2. >>ఇక్కడ నేను వ్రాసిన సంఘటనల్లో కల్పనల అవసరం ఏమీ లేదు

    అస్సలు చర్చి వాడిన టెక్నిక్ నే మీరు కాదు అంటున్నారు. గుళ్ళు దగ్గరకి రానివ్వని వాల్లందర్నీ అవి లాగేసుకున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత వాటికన్ చర్చిలోకి కూడా ఎవరైనా వెల్లొచ్చు. పోపుతో కరచాలనం చెయ్యొచ్చు. అందుకే అంటున్నాను. అది మీ క్రియేషన్ ఐయ్యుండాలి లేదా వాల్లు డ్రామాలాడుండాలి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చిరంజీవి గారు, నా ఉద్దేశంలో లక్ష్మి వాళ్ళ కుటుంబంతో ఎవరో ఆడుకొని ఉండవచ్చును. ఒక నిరక్షరాస్యకుటుంబానికి రావలసిన లేదా వచ్చిన డబ్బును కొట్టేయటానికి ఎవరన్నా డ్రామాలు ఆడి ఉండవచ్చును కదా? ఎనిమిదవ తరగతిపిల్ల ఏడుస్తూ చెప్పుకొన్న మాటలు డ్రామాలు అనుకోలేను. నాదే డ్రామా అంటారా, అది మీ యిష్టం. ఒక నమస్కారం చేయటం తప్ప మరేమీ చెప్పలేను. అభిప్రాయాలు పంచుకున్నాం కదా. ఇంక చర్చ విరమిద్దాం.

      తొలగించండి
  3. శ్రీశాంతి దుగ్గిరాల గారు ఈటపా గురించి తమ బ్లాగులో తెలియ జేసిన స్పందన ఇలా ఉంది. చదివానండి.. నేను రాసింది నాకు మిగిలిన చిన్ననాటి జ్ఞాపకాలు.. అందులో కల్పనలు లేవు. ఇక శ్యామలీయం బ్లాగులో చదివింది సగం వరకే జ్ఞాపకంలా అనిపించింది.

    వారి అభిప్రాయంలో నా యీ టపాలో "సగం వరకే జ్ఞాపకంలా" అంటే మిగితా సగం "కల్పన" అనే కదా. కల్పించి ఏమీ వ్రాయలేదు కాని వారికి అటువంటి అభిప్రాయం కలగటం గమనార్హం.

    పోనివ్వండి. ఇబ్బంది లేదు.

    రిప్లయితొలగించండి
  4. మొదట్లో శ్రీశాంతి తనగురించి కూడా నిజాయితీగా, బాగా వ్రాస్తున్నారు కదా అని అనుకున్నా...మొన్న ఇంట్లో ఉండే ఆడవాళ్ళు టీవీ లు చూస్తూ గడిపేస్తారన్నట్లు వ్రాసింది. అక్కడికి ఉద్యొగినులు ఉద్ధరించేస్తున్నట్లూ....నిన్న ఒకావిడ ఊపిరి ఆగిపోతే బాగుండూ అని వ్రాస్తే చక్కటి ఊహ అని కమెంట్ వ్రాసింది. దాన్నుంచి తేరుకునేలోపు ఈరోజు మీగురించి వ్రాసింది. మీరు మొహమాటం లేకుండా నిజం చెపుతారు అని నాకు తెలుసు. నేను చెప్పినా ఎవరూ వినరు కదా అని ఊరుకున్నాను.

    రిప్లయితొలగించండి
  5. # శ్యామలరావు గారు
    మీ ఈ టపా గురించి శ్రీశాంతి గారికి వారి బ్లాగ్ లో "నాయనమ్మ పూనకం" టపా క్రింద నా కామెంట్ ద్వారా వారికి మొదట్లో తెలియజేసింది "నేనే" (నాయుడి గారి స్టైల్ లో చెప్పాలంటే 😀). అప్పుడు వారేమీ స్పందించలేదు. ఇప్పుడు వచ్చిన వారి స్పందన నాకు కూడా ఆశ్చర్యకరంగానే ఉంది. ఎంత ఎవరి అభిప్రాయం వారిదనుకున్నా కూడా ఇది మింగుడుపడలేదు.

    రిప్లయితొలగించండి
  6. గురువు గారూ,

    "ద్వారపూడి వచ్చిన కొత్తల్లో నాకు పరిచయం"
    "మా నాన్నగారికి రంపచోడవరం హైస్కూలుకు హెడ్మాష్టరుగా బదిలీ అయ్యింది"

    మీరు రాసిన లక్ష్మిది రంపచోడవరం; శ్రీశాంతి గారు రాసిన లక్ష్మిది ద్వారపూడి (~ 50 km distance)

    "నేను డిగ్రీ పూర్తిచేసిన తరువాత కొన్ని నెలలకే"
    "ఈ సంఘటన జరిగినది 1972 లేదా 1973లో"
    "వాళ్ళ చిన్న కూతురు లక్ష్మి మాతోనే చదివేది"
    "అది రోజూ మాకోసం స్కూలుకి బిస్ కెట్లు తెచ్చేది"

    ఆవిడ మీకంటే వయసులో బాగానే చిన్న అనుకుంటాను కనుక కాలమానం కూడా అంతగా సరిపోవడం లేదు.

    నా డిటెక్టివ్ (డిఫెక్టివ్?) బుర్రకు తోచిందేమిటంటే:

    - ఈ లక్ష్మి, ఆ లక్ష్మి వేర్వేరు మనుషులు
    - మనుషులు వేరయినప్పుడు వారి గురించి జ్ఞాపకాలు కూడా వారే అయుంటాయి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కాకతాళీయంగా లక్ష్మి అన్న పేరు ఇద్దరి టపాల్లో ఉంటే ఆలక్ష్మి ఈలక్ష్మీ ఒకరే కానక్కర లేదుగా! మీపరిశోధన ఏమిటో బోధపడలేదు.

      తొలగించండి
    2. మీరు "తన లక్ష్మి" గురించి రాసారనుకొని ఆవిడ అనుకున్నారని నాకు అనిపించింది. I thought this may have led to some misunderstanding.

      తొలగించండి
    3. అబ్బా..డిటెక్టివ్ నారద వచ్చేసారండీ..ఇపుడు ఇదో ట్విస్టా ?
      శ్రీశాంతి గారు కూడా ఇలాగే పొరపడలేదు కదా ?

      తొలగించండి
  7. # శ్రీశాంతి గారు
    జ్ఞానవృధ్ధుడను కాను గాని వయసులో పెద్దవాడనేమో. మీ బ్లాగును ఆసక్తితో చదివాను. మీ తెలుగురచనాశైలి బాగుంది. మీ 'నాయనమ్మ పూనకం' టపాను పురస్కరించుకొని నా యెఱుకలోని కొన్ని విషయాలు చెప్పినట్లూ ఉంటుంది, మీకు ఆశీఃపూర్వకంగా శుభకామనలు అందించినట్లుగానూ ఉంటుంది అని భావించి, నా యీ టపా వ్రాసాను. పాఠకులను ఆకర్షించటంకోసం కల్పనాచాతురి చూపటానికి ఏమీ వ్రాయను. అది నా పధ్ధతి కాదు. నా రాముడు నన్ను మెచ్చితే చాలు. లోకం మెప్పుకోసం ఆరాటపడే మనసూ కాదు వయసూ కాదు నాది. ఐనా అపోహలకు నేను కారణమని మీరు భావించిన పక్షంలో, దయచేసి నన్ను మన్నించండి. అన్నట్లు నా యీ టపా చదివి మీ బ్లాగుకు వచ్చి చదివిన నా మిత్రు డొకాయన నాకు నిన్న రాత్రి ఫోన్ చేసి మీ శైలి చాలా బాగుందని మిక్కిలి ప్రశంసించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. దుగ్గిరాల శ్రీశాంతి గారు తమ వ్యాఖ్యలను ఎందుకు తొలగించారో తెలియదు. వారి వ్యాఖ్యను నేను చదివి ఆమోదించి ప్రకటించిన తరువాత, వారికి నాపట్ల ఏ అపోహ ఐనా ఎందుకు కలిగిందో అర్థం కావటం లేదు. వారికి నా వలన మనస్తాపం కలిగితే క్షంతవ్యుడను.

    రిప్లయితొలగించండి
  9. వి న రా గారూ,
    ఇపుడు నా వ్యాఖ్యలను నేను ఉంచాలా తీసివేయాలా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. # నీహారిక గారు
      ఇక్కడ చర్చకు అసలు కారణమైన తన బ్లాగ్ లోని తన వ్యాఖ్యను కూడా సదరు లేడీబ్లాగర్ గారు తన బ్లాగ్ నుండి తొలగించనంతకాలం సంబంధిత మన వ్యాఖ్యలను ఇక్కడ మనం తీసివేయవలసిన అవసరం లేదని నా అభిప్రాయం.

      తొలగించండి
  10. సైకిల్ మీద "చేయి" వదిలేసి స్పీడ్ గా తొక్కేస్తాను అన్న మనిషి నిలబడి మాట్లాడకుండా, రాసేటపుడు ఉన్న నిజాయితీ చేతల్లో లేదు అని అనుకుని చర్చ ఇంతటితో ఆపేస్తున్నాను.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.