25, మార్చి 2019, సోమవారం

వృత్తిధర్మం!


ఓట్ల పండగొచ్చింది.
ఊరంతా సందడే.
ఒక ఊర నేముంది.
ఏ వూళ్ళో చూసినా ఆ ఊరంతా సందడే.

ఎవరు మీటింగు ఉందని పిలిచినా లారీ ఎక్కటానికి సిధ్ధంగా కొందరుంటారు. మీటింగుకు పోతే నోట్లోకి తిండీ తీర్థమూ దొరుకుతాయి. కాసిని కరెన్సీ నోట్లూ దొరుకుతాయి. తిండి చేదా? డబ్బు చేదా? మొన్న అ పార్టీ వాళ్ళు పిలిస్త్తే వెళ్ళిన వాళ్ళు ఈవేళ ఈపార్టీ పిలిస్తే వెళ్ళకూడదని రూలుందా ఎక్కడన్నా? వీళ్ళ వృత్తిధర్మం వీళ్ళది. ఎవరు పిలిచినా లారీ ఎక్కుతారు,  మీటింగుకు వెళ్తారు, జై కొట్టి పుచ్చుకోవలసినవి పుచ్చుకుంటారు. ఇందులో వీళ్ళు సిగ్గుపడవలసింది ఏమీ లేదే.

ఏ పార్టీ వాళ్ళు పిలిచి ప్రచారగీతాలు పాడిపెట్టమన్నా అందుకు కళాకారులు సిధ్దంగానే ఉంటారు. అయ్యో ఫలాని పార్టీని ఆకాశానికి ఎత్తేస్తూ పాడేశాం కదా మొన్ననే, ఇప్పుడు మీ పార్టీని పొగుడుతూ మళ్ళా ఎలా పాటలు పాడటం అని అంటారా? అంత అమాయకత్వం ఎవరికీ ఉండదు. ఐనా అందులో తప్పేముందీ? కళాకారులుగా సేవను అందిస్తున్నారు, సొమ్ము పుచ్చుకొని సంతోషపడుతున్నారు. వీళ్ళ వృత్తిధర్మం వీళ్ళది. ఇందులో వీళ్ళు సిగ్గుపడవలసింది ఏమీ లేదే.

కళాకారులంటే గుర్తుకు వచ్చింది. ఇప్పుడు సినిమావాళ్ళేగా ఎక్కువగా కళాకారులం అని చెప్పుకొనేదీ?  డైలాగులు చెప్పటం సరిగ్గా రాకపోయినా, ముఖంలో హావభావాలకు ఎంతమాత్రం స్థానం లేకపోయినా ష్టార్‍డమ్ ఉన్న కళాకారులు ఉన్న చిత్రపరిశ్రమలోనే ఏదో ఒక వేషం అని బెట్టుచేయకుండా మనని అడిగిందే పదివేలు అనుకొనే నటులు బోలెడు మంది ఉన్నారు కదా. పాపం వీళ్ళల్లో మంచి నటులు బాగానే ఉంటారు. ఐనా పేరుండదు. ఒక పార్టీ వాళ్ళు ప్రచారం కోసం ఒక సినిమాతీసినా, ఏదో వీడియో ఆడ్ తీసినా నటిస్తారు. అలాగే మరొక పార్టీ వాళ్ళూ అలాంటి ఆడ్ లేదా సినిమా ఛాన్స్ ఇచ్చినా సంతోషంగా చేస్తారు. వీళ్ళ వృత్తిధర్మం వీళ్ళది. ఇందులో వీళ్ళు సిగ్గుపడవలసింది ఏమీ లేదే.

పార్టీలన్నాక కార్యకర్తలు అని ఉంటారు. వీళ్ళ పని అల్లా నాయకులకు జై కొడుతూ తిరగటం. తమ నాయకుడు ఏపార్టీలో ఉంటే ఆపార్టీని గొప్ప చేస్తూ వీలున్నప్పడల్లా అంటే నాయకుడు సూచించినప్పు డల్లా నానాహంగామా చేయటం. నాయకుడు ఒక పార్టీలో ఉన్నాడు. జై కొట్టారు. అయనకు టిక్కట్టు రాకో, అక్కడ కిట్టుబాటు కాకో ఉన్న పార్టీ మారి మరొక పార్టీలోనికి గంతువేసి వెళ్ళిపోయాడు. అప్పుడు కూడా కార్యకర్తలు కూడా ఆటోమాటిగ్గా నాయకుడి నుండి పార్టీ మార్పుని అందిపుచ్చుకోవాలి.  ఈరోజు ఉదయం దాకా పొగిడిన పార్టీని చచ్చేట్లు తిట్టాలి. ఇంతవరకూ శాపనార్థాలు పెడుతూ చెడతిట్టిన పార్టీని కీర్తిస్తూ ఊగిపోవాలి. యథా నాయకుడూ తధా కార్యకర్తలూ అన్నమాట.  వీళ్ళ వృత్తిధర్మం వీళ్ళది. ఇందులో వీళ్ళు సిగ్గుపడవలసింది ఏమీ లేదే.

రాజకీయ నాయకులని ఒక రకం మనుషులున్నారు. వాళ్ళు చేసే వృత్తికి అఫీషియల్ పేరు ప్రజాసేవ. అంటే వీళ్ళంతా ప్రజాసేవకులు అన్నమాట. కాదంటే కొడతారు కూడా. కాని విజ్ఞులు అందరికీ తెలిసి రాజకీయం కూడా ఒక వృత్తి. మరి వృత్తి అన్నాక దానిలో కొనసాగటం లాభసాటిగా ఉండాలా వద్దా చెప్పండి. బోలెడు డబ్బులు తగలేసి, బోలెడు మందిని తిట్టి, బోలెడంత హైరానా పడి గెలిచి అమ్మయ్య అనుకునేది పోయి ఐదేళ్ళ కోసారి వోటేసే జనానికి నానా సేవా చేయటానికా? కాదు కదా. లాభసాటిగా అంటే ఇల్లిపీకి రాజభవనం చేసుకోవాలీ, మహారాజులా వెలగాలీ, వారసులు పడితిన్నా కొన్ని తరాలకు సరిపోయే సిరిని తవ్వి తలకెత్తుకోవాలీ వగైరా బోలెడు పొందవలసినవీ చెందవలసినవీ ఉంటాయి కదా. తనతో పాటుగా తన కుటుంబంలో మరొకరో ఇద్దరో రాజకీయవృత్తిలో అందిరావాలా, తన తరువాత తన వారసులూ రాజకీయవ్యాపారంలో స్థిరపడాలా? అబ్బో ఎన్నున్నాయనీ? అలాంటప్పుడు అవకాశం - అదేనండి టికెట్ - ఇచ్చిన పార్టీకే జై అనాలి కాని మనపార్టీ అంటూ బోడి సెంటిమెంటుతో ఎవరు మాత్రం ఏదో ఒక పార్టీకి ఉత్తినే కంచిగరుడ సేవ ఎందుకు చెయ్యాలి చెప్పండి. అందుకే రాజకీయ నాయకులు ఎవరు పెద్దపీట వేస్తే వాళ్ళ దగ్గరకే పోతారు. వీళ్ళ వృత్తిధర్మం వీళ్ళది. ఇందులో వీళ్ళు సిగ్గుపడవలసింది ఏమీ లేదే.

ఐతే ప్రజాసేవ అన్నదే మావృత్తి అని చెబుతూ రాజకీయం అనే వృత్తిలో ఉన్నవాళ్ళను చూసి మన జనం సిగ్గుపడాలి. ఎందుకంటే అలాంటి మోసగాళ్ళను తయరుచేస్తున్నది మనమే కాబట్టి. ఓట్లు వేయటం మనకు వృత్తి కాదు, హాబీ కాదు. బాధ్యత. కాని మనం బాధ్యతగా ఓటు వేస్తే మోసకారి రాజకీయవృత్తిపరుల్ని కొంతైనా నిరోధించగలం.


1 కామెంట్‌:

  1. అందరి మనస్సులో మాటను మీరు మరింత స్పష్టంగా చెప్పారు. మీ చివరి వాక్యాలు మరింత కీలకం. పౌరకర్తవ్యం ఏమిటో ఇంత కంటే వివరంగా చెప్పటం వీలు కాదు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.