25, మార్చి 2019, సోమవారం

పొగడగ నేలా యొరుల భూజనులారా మీరు పొగడవలయును రామ భూమిపాలుని


పొగడగ నేలా యొరుల భూజనులారా మీరు
పొగడవలయును రామ భూమిపాలుని

అగణితసుగుణమణి యైన రాము డొక్కడే
పొగడదగిన వాడు కదా పురుషుల లోన
జగదేకవీరుని శరణాగతరక్షకుని
మిగుల కీర్తి గొనిన హరిని మీరు పొగడరే

విమలవేదాంతవేద్యు డమలినచారిత్ర్యుడు
కమలాప్తకులశోభను డమితతేజుడు
క్షమాగుణపూర్ణుడు శాంతస్వభావుడు
అమరనుతుడు కదా రాము డతని పొగడరే

వందారుభక్తజన మందారు డైనట్టి
యందగాడు రామచంద్రు డతివ సీతతో
బృందారకులు గొల్వ పేరోలగమున కనుల
విందు చేయుచున్నా డిదె వేడ్క పొగడరే

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.