17, సెప్టెంబర్ 2020, గురువారం

హరి హరి హరి హరి యనరాదా

 హరి హరి హరి హరి యనరాదా శ్రీ
హరి మావాడని యనరాదా

హరి కన్యులు లే రనరాదా శ్రీ
హరి మా హితుడని యనరాదా
హరి నావాడని యనుకొన నొల్లని
నరజన్మము వృధ యనరాదా

హరియే చుట్టం బనరాదా శ్రీ
హరియే నేస్తం బనరాదా
హరియే తనవా డనుకొననిది ఆ
నరజన్మము వృధ యనరాదా

హరినే యఱసెద ననరాదా శ్రీ
హరినే కలిసెద ననరాదా
హరిని కలియుటం దభిరుచి లేని
నరజన్మము వృధ యనరాదా

హరి సేవయె చాలనరాదా శ్రీ
హరి సేవను మురియగరాదా
హరి సేవలలో మురియని జన్మము
హరి హరి వలదని యనరాదా

హరియే దైవం బనరాదా శ్రీ
హరినామము చాలనరాదా
హరినామము రుచిమరుగని జన్మము
హరి హరి వలదని యనరాదా

హరి భక్తియె గొప్పనరాదా శ్రీ
హరి భక్తులు ఘను లనరాదా
హరి భక్తిని సొంపారని జన్మము
హరి హరి వలదని యనరాదా

హరి భజనము చేయగరాదా శ్రీ
హరి భజనమె సుఖ మనరాదా
హరి భజనలతో నలరని జన్మము
హరి హరి వలదని యనరాదా

హరి దాసుల గలియగరాదా శ్రీ
హరి దాసుడె నరు డనరాదా
హరి దాసుల మరియాద చేయనిది
నరజన్మము కాదనరాదా

హరి విశ్వేశ్వరు డనరాదా శ్రీ
హరియే విశ్వం బనరాదా
హరి విశ్వాత్మకు నెరుగని జన్మము
హరి హరి వలదని యనరాదా

హరియే గతి యని యనరాదా శ్రీ
హరిని మరువరా దనరాదా
హరిని మరచితే యధోగతే ఆ
నరజన్మము వృధ యనరాదా

హరియే రాముం డనరాదా ఆ
హరియే కృష్ణుం డనరాదా
తరచుగా హరిని తలచని జన్మము
హరి హరి వలదని యనరాదా

హరి మావాడని యనరాదా శ్రీ
హరి మావాడని యనరాదా
హరి మావాడిక యన్యుల సంగతి
హరిహరి వలదని యనరాదా