మోచెర్ల వెంకన్న లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
మోచెర్ల వెంకన్న లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, జనవరి 2018, బుధవారం

మోచర్ల వెంకన్న గారి సమస్యాపూరణాలు - 4


ఇంక వెంకన్నగారు అసామాన్యకవీంద్రులని అనిపించి రాజుగారు ఆయనకు ఉచితసత్కారం చేయాలనుకున్నారని చెప్పానుకదా. అందుకని అయ్యా గంటకు ఎన్ని పద్యాలు చెప్పగలరూ అన్న ప్రశ్నతో ప్రస్తావన చేసారు. కవిగారు వెంటనే ఊరకనే పద్యాలు చెప్పటమేం, కావలస్తే పరీక్షించుకోండి ఆశువుగా సమస్యలనూ పూరించగలం అన్నారు.

ఆపైన రాజుగారు వరుసగా సమస్యలను ఇవ్వటమూ వాటిని వెంకన్నగారు పూర్తి చేయటమూ జరిగింది.

రాజుగారు ఇచ్చిన మొదటి సమస్య దృఢసత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాడఁగన్ అన్నది.

ఇది వినటానికే విడ్డూరంగా లేదూ. చీమ యేమిటీ మాంచి బలంగా ఢామ్మని తుమ్మటం యేమిటీ ఆమహాధ్వనికి దిగ్గజాలు ఆల్లాడటం యేమిటీ చిత్రం!

దీనికి వెంకన్న గారు చేసిన పూరణ చూడండి.

సఢులీశోర్వి చలింప నిర్జరవరుల్ శంకింప  భేరీనికా
య ఢమత్కారత నిద్రలేచి దశకంఠామర్త్యవిద్వత్పరీ
వృఢసోదర్యుఁడు లేచి రా వ్యధ యొనర్చెన్ నాసికాంతస్థ్సమై
దృఢసత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాడఁగన్

ఈ పద్యంలో బోలెండంత సంస్కృతం ఉండి చాలా హడావుడిగా ఉన్నా దీనిని అర్థం చేసుకోవటం మరీ అంత కష్టం కాదు..

ఢులి అంటే తాబేలు. కూర్మావతారం అన్నమాట,.

అసలు మన భూగోళాన్ని ఎవరు మోస్తున్నారూ  అన్న దానిమీద బోలెడంత గందరగోళం ఉంది. సైంటిఫిక్ యుగంలో ఏమిటీ నాన్సెన్స్ అని ఏ గోంగూరబాబో తిట్టే లోపలే ఒక వివరణ కూడా చెప్పుకుందాం. ఆపాటి సైన్సు మనకీ తెలుసునూ ఉన్నదంతా పౌరాణిక గందరగోళం మాత్రమే అని.

కొన్ని చోట్ల ఈ భూమిని అష్టదిగ్గజాలు మోస్తున్నాయంటారు.

ఒక్కో సారి దీన్ని ఆదిశేషుడు మోస్తున్నాడంటారు.

అన్నట్లు కొన్ని చోట్ల కూర్మావతారం మోస్తోందీ అనీ అంటారు.

సౖంటిఫిక్ టెంపర్మెంటు దిట్టంగా ఉండి భారతీయం అంటేనే ట్రాష్ అనే కొందరికి చెప్పాల్సిన ముక్కొకటి ఉందిక్కడ. గ్రీకులు కాబోలు దీన్నెవరో అట్లాసో హెర్కులిసో మోస్తున్నాడంటారు!

సరిసరి శాఖాచంక్రమణం ఆపి పద్యం చూదాం. ఇందులో ఉన్న ఢులి అంటే భూగోళాన్ని మోస్తున్న కూర్మావతారం అన్నమాట. ఇంక  సఢులీశోర్విచలింప అంటే ఆ భూగోళంతో సహా సాక్షాత్తూ ఆ మహాకూర్మస్వామి కూడా కాస్త కదిలిపోయేటట్లుగా అన్నది అర్థం.  అంత గొప్ప సంఘటన ఏమిటబ్బా అన్నది మిగతా పద్యం చెప్పాలి మరి.

ఆ సంఘటన దొడ్డతనం ఎటువంటిదీ అంటే నిర్జరవరుల్ శంకింపగా ఉందిట. జర అంటే ముసలితనం. (ఊరికే నిఘంటువులో వెదికి జర అంటే జర అనే రాక్షసి, భారతంలో కనిపిస్తుంది అని అర్థం చెప్పకండేం. అదిక్కడ పొసగదు. ఎక్కడ ఏ అర్థం చెప్పాలో కాస్త నిదానించాలి.)  జర ఉన్నవాళ్ళు  మామ్మూలు జనం. నరులైనా సరే రాక్షసులైనా సరేను. నిర్జరులు అంటే దానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు. అంటే అస్సలు ముసలితనం లేని వాళ్ళు. దేవతలు. వాళ్ళకి ముసలితనం లేకపోగా అసలు నడివయస్సు కూడా లేదు. వాళ్ళ వయస్సు ఎప్పుడూ కూడా సరిగ్గా ముఫై  మాత్రమే. సినీ తారమ్మలకి ఎప్పుడూ పదహారే అనే అంటారు చూడండి. అలాగన్న మాట.  నిజంగా అలాగంటే అలా కాదు. వాళ్ళు ముఫై ఏళ్ళ వాళ్ళలా కనిపించటమే కాదు. అలాగే నిజంగా ఉండిపోతారన్నమాట. అన్నట్లు అందుకే వాళ్ళను త్రిదశులు అని కూడా అంటారు.

ఆ దేవతలకు అనుమానం కలిగేలా జరిగిన సంఘటన అట. ఏం టబ్బా అని. అసలు మన దేవతల కందరికీ ఎప్పుడూ ఒకటే అనుమానం. ఎవడన్నా రాక్షసుడు వచ్చి వాళ్ళ భోగాలన్నీ లాగేసుకొని అడవుల పాలు చేస్తాడేమో అని ఆ సుకుమారులకు ఎప్పుడూ ఒకటే శంక.  అందుకని ఏదైనా నమ్మశక్యం కాని ఒక పెద్ద సంఘటన తటస్థించిందా వాళ్ళ కుశ్శంక పైకి లేచిందన్నమాటే. ఏంజరిగిందో ఇప్పుడు!

ఈ దశకంఠామర్త్యవిద్వత్పరీవృఢసోదర్యుఁడు అన్న డాబుసరి సమాసం చూసారా? దీనిలో దశకంఠుడూ అంటే అలాగే దశకంఠామర్త్యుడూ అంటే మనకి తెలిసిపోతూనే ఉంది. వాడే రావణాసురుడు కదా అని. నిజమే. వాడే. సోదర్యుడు అంటే సోదరుడూ అనే అర్థం. మరి అందరికీ తెలిసిన సోదరుడు అన్న మాటే వాడొచ్చు కదా అంటే వాడొచ్చును కాని ఇక్కడ వాడకూడదు - ఈ పద్యం ఛందస్సు ఒప్పుకోదు. అందుకనే సరిపడే మాటను ఎన్నుకోవటం. విభీషణ కుంభకర్ణుల్లో ఒకడై తీరాలి మరి. చూదాం.

మధ్యలో విద్వత్తూ పరీవృడత్వమూ తెచ్చి విద్వత్పరీవృఢ అన్న విశేషప్రసంగం ఒకటి చేసారు వెంకన్న గారు. పరీవృఢుడు అంటే అధికారి -  అంటే రాజన్న మాట. ఈ రాజశబ్దానికి విద్వత్తును కట్టబెట్టటం ఎందుకూ అంటారా మళ్ళా పద్యంలో సౌలభ్యం కోసం ఎన్నుకున్న పదమే కాని తదన్యం కాదు. అది పెద్ద ఇబ్బంది కాదు.

ఐనా ఈ ఢకారప్రాసా వైభవమూ అట్టహాసమూ చూస్తుంటే వీడు కుంభకర్ణుడు కాక తప్పేలా లేదు. అదీ కాక వాడు భేరీనికాయ ఢమత్కారత నిద్రలేచినట్లుగా చెబుతున్నారు కదా పద్యంలో. అంటే పెద్దపెద్ద డప్పులు పెద్ద సమూహంగా తెచ్చి గోలగోలగా వాయిస్తే నిద్రలేచి వచ్చాడు అని చెబుతున్నాక ఇంక వాడు కుంభకర్ణుడే అని ఋజువౌతున్నది కదా మనకి. హమ్మయ్య, ఇప్పుడు కొంత బోధపడింది.

ఈ కుంభకర్ణుడు లేచి రా వ్యధ యొనర్చెన్ నాసికాంతస్థ్సమై దృఢసత్త్వంబున చీమ అంటున్నారు. అంటే ఏమిటో చూదాం. నాసిక అంటే ముక్కు కదా. అందుచేత నాసికాంతస్థమై అంటే ముక్కులో దూరి అని అర్థం ఫెడీమని తడుతున్నది.  ఆముక్కులో దూరింది ఏమిటయ్యా అంటే అది ఒక చీమ అట.  అది వాడి ప్రాణానికి వ్యధ యునర్చెన్ అంటే వాడికి బాగా నొప్పి పుట్టే టట్లుగా కుట్టిందీ అని పిండితార్థం.

ఎవడి ముక్కులో నైనా ఒక ధూళికణం కొంచెంగా చిరాకు కలిగిస్తే? ఆంగ్లంలో బడాయిగా చెప్పాలంటె ఇరిటేషన్ కలిగిస్తే?  ఏమౌతుందీ? ఎవడైనా సరే ఉన్నపాటున ఢాం అని తుమ్ముతాడు. తుమ్మక చస్తాడా!

పాపం అంత లావు కుంభకర్ణుడూ తుమ్మక తప్పని పరిస్థితిమరి. (అయ్యా లావు అంటే బలం అన్న అర్థం కూడా ఉందని దయచేసి గమనించ ప్రార్థన. అంతలావు కుంభకర్ణుడు అంటె అంత బలవంతుడైన కుంభకర్ణుడు అని అర్థం కాని వాడు డేనియల్ లాంబర్ట్ లాగా గుమ్మాలు పట్టనంత లావుగా ఉన్నాడని నా అభిప్రాయం కాదని విన్నవించుకుంటున్నాను.)

మామ్మూలు మనిషి హఠాత్తుగా తుమ్మితేనే దాని దెబ్బకి పక్కవాళ్ళు జడుసుకోవటం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది .

ఈ కుంభకర్ణుడేమో మహాబలశాలి. అస లందుకనే కదా నిద్దరపోతున్నాడన్న జాలికూడా లేకుండా లబలబలాడుతూ రావణాసురుడు వాణ్ణి లేవగొట్టించిందీ?

అంత బలశాలి తుమ్మితే ఇంకేమన్నా ఉందా చెప్పండి?

కవిగారు చెబుతున్నారూ వాడు తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాడఁగన్ అని. అంటే భూమిని మోసే అష్టదిగ్గజాలూ కూడా అల్లల్లాడిపోయేలా అదురుపుట్టిందట వాడి తుమ్ము దెబ్బకి.

ఈ చప్పుడుకే మరి దేవతలు మళ్ళా ఎవడన్నా యుధ్ధభేరీలు మోగిస్తున్నాడా అమరావతి ముంగిట్లో అని శంకించటమూ.  భూమీ అష్టదిగ్గజాలతొ పాటే  కూర్మావతారమూ కొద్దోగొప్పో కంపించటమున్నూ.

ఇప్పుడు అంతా సరిగ్గా తెలిసిపోతున్నది కదా. అవసరమైతే పద్యాన్ని మరొక్కసారి చదివి ఆనందించండి.

ఇక్కడ సమస్య ఏమిటీ అంటే రాజు గారు దృఢసత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరా అన్నారు. కవిగారేమో చీమకు అంత  గొప్పగా దడదడలాడేంత ఘాట్టిగా తుమ్మగల  సత్వం ఇవ్వటం కుదరదు కాబట్టి ఆ తుమ్ము హడావుడి కుంభకర్ణుడికీ కుట్టటం మాత్రం చీమకీ పంచి మంచి వినోదభరితమైన పద్యం అందించారు.

అయ్యా అదీ సంగతి.


21, జనవరి 2018, ఆదివారం

మోచర్ల వెంకన్న గారి సమస్యాపూరణాలు -3

గత టపా మోచర్ల వెంకన్న గారి సమస్యాపూరణాలు -2 లో వెంకన్నగారి ప్రస్తిధ్ధమైన సమస్యాపూరణాల నేపధ్యం గురించి కొంత చర్చించాం. ఈటపాతో ఆచర్చకు ముగింపు పలుకుదాం.

రాజుగారికి వెంకన్న గారు చేసిన వర్తమానం తెలుగుకవులము వచ్చామూ అని.  రాజుగారికి తెలుగు కవిత్వం వినటంపై ఆసక్తి మెండైతే అందులో అభినందించవలసినదే కాని ఆక్షేపించవలసినది యేమీ లేదు.  నిజానికి తెలుగుకవులమూ అని చెప్పుకొనేవాళ్ళు ముప్పాతికమువ్వీసం మంది చెప్పే తెలుగుకవిత్వం ఎటువంటిది అన్నది చూడండి. వాళ్ళు ముఖ్యంగా సంస్కృతవృత్తాలను ఎక్కువగా సమాదరిస్తారు.  తెలుగు జాత్యుపజాతుల పద్యాలను చెప్పరని కాదు దాని అర్థం. వారు చెప్పే పద్యాలనో పదికి ఎనిమిది తొమ్మిది దాకా సంస్కృతపదాలో తత్సమాలో తప్ప అచ్చమైన తెలుగుమాటలు తక్కువ. అంటే సంస్కృతపాండిత్యం ముఖతః ఉంటే తప్ప తెలుగుకవిత్వం లేదు. నన్నయ కాలం నుండీ అదే పరిస్థితిమరి.  నిజానికి తెలుగుభారతమే ఒక సంస్కృతశ్లోకంతో ఆరంభమైనది కదా

శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే
లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.

అని.

అదికాదయ్యా అది ఏదో శుభమా అని మంత్రోఛ్ఛారణంలాగా దేవభాషలో అలా ఉపక్రమించారు ఆదికవి అంటారా,  లోపలికిపోయి మరో పద్యం చూదాం.

విపరీతప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! యీ పుత్త్రగా
త్రపరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్త్రగా
త్రపరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్‌ శీతమే.

ఈపద్యంలో మాటలను భాషాపరంగా వేరుచేయాలంటే తెలుగుమాటల్ని వెతుక్కోవాలా? సంస్కృతం మాటల్ని వెతుక్కోవాలా చెప్పండి?

ఏమాటకామాట చెప్పుకోవాలి. నన్నయనాటికి తెలుగులో కవిత్వప్రక్రియ వ్యవస్థీకృతంగా లేదు, ఎవరూ కావ్యనిర్మాణాలు చేయటం లేదు. ఆ పరిస్థితిని మార్చాలనే రాజరాజనరేంద్రుడనే తెలుగురాజూ, ఆయన ఆస్థానకవి ఐన నన్నపార్యుడూ పూనుకొన్నారు.  ఉన్నపాటున నూటికినూరుతెలుగుపదాలతో కావ్యనిర్మితిచేసి అప్పటిపండితపామర లోకాల్ని మెప్పించటం కుదరదు కాబట్టి కలగలుపుగా సాగింది నన్నయ విధానం. మరో నాలుగువందల ఏళ్ళ తరువాత తిక్కన్న గారు అందిపుచ్చుకొని తెలుగుపాళ్ళు బాగా పెంచి నెల్లూరుప్రాంత మాండలికానికి పెద్దపీటను కూడా వేసారు.

ఐనా తెలుగుకవిత్వంలో సంస్కృతం పెత్తనం ఏమీ చెప్పుకోదగినంతగా తగ్గలేదు. వృత్తాడంబరమూ వాటిలో సంస్కృతధాటీ ఐతేనే తెలుగుకవిత్వంగా ఉండిపోయింది.

అందుచేత మనతెలుగు మనతెలుగు అని మనసు కొట్టుకొనే రాజెవడన్నా తెలుగుకవులకు ప్రత్యేక గౌరవం అంటూ  తెలుగు మధురిమతో కవిత్వం చెప్పేవారిని ప్రోత్సహంచటం మెచ్చుకోదగ్గదే.

అందులోనూ ఈ రాజుగారు ఈవిషయంలో కొంచెం తీవ్రవాదిలాగా ఉన్నారు. సంస్కృతకవినే అంటే దర్శనం కూడా ఇవ్వడేమో మరి!

మాఊరిపేరు తెట్టు అంటే రాజుగారు కావాలనో నిజంగానో కొంచెం తేలికపరిచారు. కొంచెం కోపించి వెంకన్నగారు చెప్పిన పద్యం చూడండి.

తెట్టు కుమారకృష్ణజగతీవరనందన రాజ్యలక్ష్మికిం
బట్టు ధరాంగనామణికిఁ బాపట బొట్టు రిపూరగాళి
వా కట్టు సముజ్వలధ్ధృతికి గట్టు బుధాళికి వేల్పుఁ జెట్టు వా
గ్దిట్టల కున్కి పట్టును మదీయ నివాసము యాచభూపతీ

మాఊరిపేరు తెట్టు అంటే సామాన్యం అనుకున్నావా అని గద్దిస్తూ ఆఊరి విశేషాలు అంత్యానుప్రాసలు వేసి మరీ దిట్టంగా చెప్పారు కదా తెట్టు-పట్టు--బొట్టు-కట్టు-గట్టు-చెట్టు అంటూ. ఆ శబ్దాలంకారాలను దాటి పద్యంలోపల చూదాం.

మొదటిది కుమారకృష్ణజగతీవరనందన అన్నది. కవి అన్నవాడు రాజదర్శనం చేసి రాజును సమ్ముఖంలో స్తుతించటం విడ్డూరం కాదు కదా.  కాని గడుసుదనం అంతా ఓ కుమారకష్ణజగతీవరనందనా, తెట్టు రాజ్యలక్ష్మికి పట్టు అని చెప్పటంలో ఉంది. ఏమయ్యా మాఊరంటే ఏమనుకున్నావు? అది మన రాజ్యం యొక్క వైభవానికి మూలస్థానం అని చెబుతూ పద్యం అందుకోవటం వెంకన్న గారి ధీమాను తెలుపుతున్నది.

నాకు రిపూరగాళి వాకట్టు అన్న ప్రయోగం బాగా నచ్చింది.  రిపు+ఉరగ -> రిపూరగ అంటే శత్రువు అనే పాము.  లోకంలో శత్రువులు లేని వాళ్ళు అరుదు.  ఈ శత్రువులు రెండు రకాలు. ఎదటపడి ధైర్యంగానే శత్రుత్వం సాధించేవాళ్ళూ, లోపల్లోపలే కుళ్ళుకుంటూ అవకాశంకోసం ఎదురుచూసేవాళ్ళూ అంటూ. మొదటిరకం వారు నయం. వారితో అమీతుమీ తేలుతుంది ఎలాగూ.  రెండవరకం వారు  మనని ఏమీ చేయలేక సూటిపోటి మాటలతో బాధించేవారుగా ఉంటారు.  కొందరు మనముందూ అలా ఉంటారు మనపరోక్షంలోనూ అలాగే ఉంటారు. వారిసంగతి తెలిసిందే కాబట్టి వారి గురించి బెంగలేదు. కాని కొందరు రెండునాలుకల వాళ్ళుంటారు. మనముందు మంచిగా మాట్లాడుతారు. మనవెనుక మనగురించి అందరికీ చెడుమాటలు చెబుతుంటారు. ఒకనాలుకతో మన మంచినీ మరొకనాలుకతో మనచెడునూ వర్ణించటంలో సమయసంధర్భాలు చూసుకొని మరో అనువైన నాలుకను అనువైన చోట ప్రదర్శిస్తూ పండగచేసుకుంటూ ఉంటారు. ఇలా రెండునాలుకలు ఉండే జీవులు వీళ్ళు.

మరి రెండునాలుకలు ఉన్న జీవి పాము కదా. అందుకని ఇల్లాంటి శత్రువులను పాములనే అనాలి కదా. అదే వెంకన్నగారి పదప్రయోగం కూడాను.  మాఊరు రిపూరగాళి వాకట్టు అంటున్నారు. వాకట్టు అంటే తెలుసు కదా! నోటికితాళం అన్నమాట.

మా ఊళ్ళో పాముల్లాంటి శత్రువుల నాలుకలకు తాళమయ్యా అంటున్నారు.  అంటే అర్థం ఏమిటీ? ఇతరుల గురించి చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకు మాఊళ్ళో పప్పులుడకవూ అందరూ వివేకవంతులూ ఎవరూ చెప్పుడు మాటలు ఎవరినీ చెప్పనివ్వరూ వినరూ అని అనటం.

పిండితార్థం ఏమిటీ అంటే మాఊళ్ళో అందరూ మంచి వివేకవంతులు అని తమ ఊరిని ప్రస్తుతిస్తున్నారు వెంకన్న గారు.

బుధాళికి వేల్పు చెట్టు అన్న మరో ప్రయోగం చూడండి. దీని అర్థం మా ఊరు పండితులకు కల్పవృక్షం అని చెప్పటం.  పండితులు ఎవరో ఒకర్ని ఆశ్రయించి సుఖజీవనం చేస్తారని కదా ఆర్యుల మాట! నిరాశ్రయా న శోభంతే పండితా వనితా లతా అని ప్రచారంలో ఉన్నదే. మాఊరు కల్పవృక్షమయ్యా ఎవరినీ ఆశ్రయించవలసి అవసరంలేదు మా ఊరి పండితులకూ అని చురకవేస్తున్నారు వెంకన్నగారు రాజుకు! పైగా పద్యంలో మొదటే రాజ్యలక్ష్మికిం బట్టు అన్నారు కదా - అంటే రాజ్యం యొక్క లక్ష్మీ స్థానం మాఊరి వైభవం అని ముందే చాటారు.

తెట్టు అనే ఊరు వాగ్దిట్టలకు ఉనికి పట్టు అని కూడా అన్నారు. చక్కగా శాస్త్రాభ్యసనం చేసి మహాపండితులైన వారికి మాఊరు నిలయం. ఎవరైనా వాదానికి వచ్చినా మా ఊరిని జయించలేరూ అని దాని అర్థం.

మిగిలిన విశేషణాలను వివరించటం లేదు విస్తరభీతితో.

ఈ పద్యం విన్నాక రెండు విషయాలు రాజుగారికి బోధపడ్డాయి. ఎదుట నిలుచున్న కవి మంచి వాగ్ధాటి కలవ్యక్తి.  సంస్కృతాంధ్రాల్లో మంచి ధిషణ కలవాడు అన్నది మొదటిది, దానికి తోడుగా మంచి సందర్భోచిత వాగ్వైఖరి కలవాడు అని రెండవది ఈ బోధపడ్డ అంశాలు. అందుకే వెంకన్న గారి పైన గొప్ప ఆదరం వెంటనే కలిగింది

తన పేరు తెలుపమని రాజుగారు కోరినప్పుడు వెంకన్నగారు  ఒక చిన్న కందపద్యం చెప్పారు.

నా పేరు వెంక నందురు
భూపాలకమకుట నీలపుంజమిళిందో
ద్ధీపితపాదాంబుజ కరు
ణాపర వెలుగోటి యాచనరనాథేంద్రా

అందులోనూ విశేషం గమనించండి. భూపాలకమకుటనీలపుంజమిళిందోద్దీపితపాదాంబుజ అన్న దీర్ఘసమాసం వేసి మరీ మరొక్కమారు రాజును ప్రస్తుతిస్తూ మరీ చెప్పారు. మొదట తమ ఊరిని ప్రస్తావించవలసినప్పుడు దానిని పెద్దచేస్తూ సాలంకృతం చేస్తూ ఒక వృత్తం చెప్పారు. తనను గురించి చెప్పుకొన వలసి వచ్చినప్పుడు మాత్రం బాగా తగ్గి చిన్న కందంలో చెప్పారు.  అందునా తనను గురించి ఒక పాలూ తమరాజు గురించి మూడు పాళ్ళూగా స్థానం ఇచ్చారు.

పెద్దలు తమగురించి తాము అతిశయంగా చెప్పుకోవటం సముదాచారం కాదు. అందుకే నా పేరు వెంకన అన్నారే కాని తనగురించి మరేమీ వివరించనే లేదు. అవును మరి తనను గురించి ఏమన్నా చెప్పాలంటే అది తన కవిత్వమే చెబుతుంది కదా!

18, జనవరి 2018, గురువారం

మోచర్ల వెంకన్న గారి సమస్యాపూరణాలు -2

క్రిందటి టపాలో మోచర్ల వెంకన్న గారిని గురించీ వారు సమస్యాపూరణాలు చేసిన సందర్భం గురించీ తెలుసుకున్నాం. 

మొదట ఆ టపాలోని విషయాల మీదే కొంత చర్చించుకోవాలి.

పైపైన చదివిన వారికి రాజుగారు తెలుగుభాషాభిమాని అనీ సంస్కృతం అంటే పెద్దగా అదరం లేనివాడనీ అనిపించే అవకాశం ఉంది. అందరికీ కాకపోయినా కొందరికి అలాంటి అభిప్రాయం కలిగితే ఆశ్చర్యం లేదు. కాని అది సరైన అభిప్రాయం కాదని నా మనవి.

రాజుగారు నిస్సందేహంగా ఆంధ్రభాషాభిమాని. 

ఐతే కవులూ పండితులూ సంస్కృతానికి పెద్దపీటవేసి తెలుగును ద్వితీయశ్రేణిభాషగా చూడటం ఆయనకు బహుశః సమ్మతం కాదని అనుకుంటాను.

కాని అప్పటి కాలమాన పరిస్థుతులను పరిశీలిస్తే సంస్కృతభాషలో మంచి పాండిత్యం ఉన్నవారికి యావద్భారత దేశంలోనూ చెలామణీ బాగుండేది. అసేతుహిమాచలమూ వారు సునాయాసంగా సన్మానాలందుకుంటూ సుఖజీవనం చేయటానికి ఆస్కారం ఉండేది.

కాని తెలుగుకవులూ తెలుగుపండితులూ మాత్రం కొంత ఇబ్బందిలో ఉండేవారనే చెప్పాలి, నిజం చెప్పాలంటే తెలుగుపండితులు అన్న ప్రసక్తి ఉండేదే కాదప్పట్లో.  తెలుగులో దిట్టంగా కవిత్వం చెప్పగల వాళ్ళకు మాత్రం తెలుగుకవులన్న ఆదరం ఉండేది.

నిజానికి ఇప్పట్లా తెలుగులో కవిత్వం చెప్పటం ఒక బ్రహ్మండమైన విషయంగా ఉండేదే కాదు. అందరూ సాంప్రదాయికమైన పద్ధ్హతిలో మొదట సంస్కృతాంధ్రాలు పంచకావ్యాదులు యధాశక్తి చదువుకొనే వారు. స్వతంత్రంగా చాలామందే అంతో ఇంతో సంస్కృతంలో శ్లోకాలూ తెలుగులో పద్యాలూ చెప్పగలిగి ఉండేవారు.

ఐతే కొందరు మాత్రమే రసవంతమైన కవిత్వం చెప్పగల శక్తిని కలిగి ఉండేవారు.  సంస్కృతంలో అనుష్టుప్పులు చెప్పటం ఎంత తేలికంటే సంస్కృతం రాని నేనుకూడా కొద్దిగా గిలకగలను! అటువంటప్పుడు పద్దతిగా సంస్కృతాభ్యసనం చేసిన వారు చాలామందే సంస్కృతంలో శ్లోకాలు చెప్పగలిగి ఉంటారు కదా! అందుకు సందేహం అక్కరలేదు కదా.

ఇకపోతే సంస్కృతపండితులంటే వ్యాకరణతర్కమీమాంసాదుల్లో గురుశుశ్రూషను బహుకాలం చేసి గడితేరిన వారు. వారికి శాస్త్రపాండితి విస్తరించి ఉంటుంది. కాని ఎంతగా భాషమీదో ఏదైనా శాస్త్రం మీదో పట్టున్నంత మాత్రాన రసవంతంగా కవిత్వం చెప్పగలగటం కుదరదు.  దానికి కావలసిన  ఆసక్తీ ఆశక్తీ ఆ అభినివేశమూ వేరు, దానికి కావలసిన సామాగ్రి వేరు దానికి కావలసిన పరిశ్రమ వేరు. 

ఆరోజుల్లో ఎవరెవరో దేశం నలుమూలల నుండీ వచ్చి తమ శాస్త్రవైదుష్యాన్ని ప్రదర్శించి రాజసన్మానాలు కొనిపోయేవారు. సంస్థానాల సొమ్ముల్లో ఈవిధంగా బాగానే వెచ్చం అయ్యేది ఉండేది.

సంస్థానాల్లో తెలుగుకవులకూ గౌరవం దక్కేదా అంటే దక్కేదనే చెప్పాలి. కాని సంస్కృతకవిపండితులు దిగ్దంతులట్టివారు వచ్చి బహుమతు లందుకొంటున్నపుడు తెలుగుకవుల్లో కూడా అటువంటి స్థాయి చూపగలవారికే కదా అంతపెద్ద పెద్ద సన్మానాలకు యోగ్యత ఉండేది? 

కాని ఎందుకనో కాని తెలుగువారికి కీర్తికండూతి తక్కువనే చెప్పాలి. పైగా తెలుగుమాత్రమే కవిత్వసాధనంగా ఉన్నవాళ్ళు దేశాటనం చేయటం కుదిరే పని కాదే. ఎంతగా కవిత్వసంపద ఉన్నా అనేకులు కావ్యనిర్మాణం జోలికి పోయే వారు కా దనిపిస్తుంది. అందుకు మోచర్లవారే ఉదాహరణ.

అందుచేత రాజయాచేంద్రునికి తెలుగుకవి అయిన వాడికి ఏదన్నా సన్మానం చేదామన్నా అంత స్థాయి కవి తటస్థపడేది తక్కువ గానూ, సంస్కృత కవిపండితులైన వాళ్ళు తారసపడేది ఎక్కువగానూ ఉండేది అని చెప్పటానికి ఇబ్బంది లేదు. ఈ రాజుగారు స్వయంగా కవిత్వం చెప్పగల సమర్థుడు కావచ్చును. అదేమీ కొత్తవిషయం కాదు.  సాధారణంగా రాజులు కూడా సంస్కృతాంధ్రాలు బాగానే చదువుకొనే వారు. వారిలో అనేకులు స్వయంగా కొద్దో గొప్పో కవులుగానూ ఉండేవారు. బయట ఏవోకొన్ని జనాంతికంగా చాటుపద్యాలు చెప్పేవాళ్ళు అటువంటి రాజులవద్ధ కూసువిద్యను ప్రదర్శించి ఆమోదం పొందటం కుదరదు.

ఇప్పుడు చూదాం రాజుగారు వయ్యాకరణిని ఎందుకు నిరాదరించిందీ.
రాజుగారు అడిగినది తెలుగులో కవిత్వం చెప్పగలరా అని.

సంస్కృతంలో కొంచెంగా శ్లోకాలు చెప్పగలగటం అప్పుడూ పెద్దవిషయం కాదు - ఇప్పుడూ పెద్దవిషయం కాదు.
ఆయన సంస్కృతంలో దిట్టంగా చెప్పగలను అన్నా రాజాదరం దొరికి ఉండేదేమో.

కొంచెం శ్లోకాలైతే చెప్పగలను అనేసరికి రాజుగారికి నచ్చలేదు ఆసమాధానం. సభలోవారూ నవ్వుకొని ఉంటారు.

ఐతే రాజుగారి ఆంధ్రభాషాభిమానం ఒక మంచి మాటను అనిపించిది తెనుగెరుగడు సంస్కృతంపు తెన్నేమెరుగున్ అని.

ఈరోజుల్లో అందరూ అంటున్నారు కదా. శాస్త్రవేత్తలేమీ సామాన్యులేమీ. ముందు మాతృభాష అనేది క్షుణ్ణంగా వస్తేనే మరొక భాష బాగా వస్తుందీ అని. రాజుగారు అచ్చంగా ఆభావాన్నే వెలిబుచ్చారంతే.

ఐతే రాజుగారి వలన జరిగిన అపరాథమూ పెద్దదే. వచ్చింది వయ్యాకరణి. చేతనైతే తనూ కాకపోతే సభలో ఎవరైనా మంచి వయ్యాకరణులూ వచ్చిన పెద్దమనిషితో కొద్దిసేపు ముచ్చటించి తగిన విధంగా సత్కరించాలి. లేదా అయ్యా మా దగ్గర వయ్యాకరణులు ఎవరూ లేరూ, మీ అంత వారు వచ్చారూ అదే మా భాగ్యం అని చెప్పి ఏదన్నా మంచిబహుమానం ఇచ్చిపంపాలి. 

నాకు కవిత్వం కావాలయ్యా వ్యాకరణం కాదూ, అదీ కాక తెలుగుకవిత్వమే కావాలీ పో అనటం పండితావమానమే. ఆ కారణంగానే వెంకన్నగారికి కోపం వచ్చింది.

ఇప్పుడా పండితుడు దేశసంచారం చేస్తూ ఫలాన వేంకటగిరి సంస్థానాధీశుడు వట్టి పొగరుబోతు. నాకు తెలుగుకవిత్వం రాకపోవటం ఏదో గొప్ప తప్పూ అన్నట్లుగా తిట్టి వెళ్ళగొట్టాడూ అని దేశం అంతా టముకు వేస్తే రాజుగారి పరువు పోతుంది. సంస్థానం ప్రతిష్ట దెబ్బతింటుంది.

అందుకనీ రాజగౌరవమూ రాజ్యగౌరవమూ నిలపాలనే వెంకన్న గారు కోపం ధరించారు.

ఇంకొంచెం వ్రాయవలసి ఉంది మన్నించాలి, టపా ఇప్పటికే పెద్దదైనది కదా. అందుకని తాత్కాలిక విరామం!  We will be right back after the break అన్న మాట.



మోచెర్ల వెంకన్న గారి సమస్యాపూరణాలు - 1


నిన్న శంకరాభరణం బ్లాగులో వాగ్దానం చేసినట్లుగా సమస్యాపూరణాలను గురించి కొన్ని టపాలు వ్రాస్తున్నాను.

ఇప్పుడు వ్రాయబోయేవన్నీ మోచెర్ల వెంకన్న గారి సమస్యాపూరణలు.

ఈ మోచెర్ల వెంకన్న గారు నెల్లూరు మండలం వేంకటగిరి సంస్థానంలోని తెట్టు గ్రామ నివాసి అయిన నియోగి భ్రాహ్మణులు. ఈయనా వారి సోదరుడు దత్తప్ప గారూ మంచి ఆశుకవులు.

ఒకరోజున వెంకన్న గారింటికి అభ్యాగతుడుగా ఒక సంస్కృతపండితుడు వచ్చి తనగోడు చెప్పుకున్నాడు. ఆయన రాజదర్శనానికిపోతే అవమానం జరిగింది.

రాజుగారు తెలుగులో పద్యాలు చెప్పగలరా? అని అడిగారు.

ఈయనేమో అయ్యా నేను వయ్యాకరణిని, సంస్కృతంలో శ్లోకాలు చెప్పగలను కాని తెలుగులో కవిత్వం చెప్పలేను అన్నాడు.

రాజుగారు తెనుఁ గెఱుఁగఁడు సంస్కృతంపు తెన్నే మెఱుఁగున్ అని చెప్పి చులకనగా అన్నారు.

ఈ కథనం విని వెంకన్న గారు బాగా నొచ్చుకొని ఆ పండితుడితో పదవయ్యా స్వామీ నీకా రాజు  చేతనే సన్మానం చేయిస్తానూ అని ఆయనను వెంటబెట్టుకొని వెళ్ళి రాజుగారికి తెలుగు కవులు వచ్చారని కబురు పెట్టారు.  రాజు గారు ఆహ్వానించి మీ దే ఊరండి అని అడిగి తెట్టేనా అని హాస్యం చేసారు.

వెంకన్న గారికి మండి ఇలా అన్నారు.

తెట్టు కుమారకృష్ణజగతీవరనందన రాజ్యలక్ష్మికిం
బట్టు ధరాంగనామణికిఁ బాపట బొట్టు రిపూరగాళి వా
కట్టు సముజ్వలధ్ధృతికి గట్టు బుధాళికి వేల్పుఁ జెట్టు వా
గ్దిట్టల కున్కి పట్టును మదీయ నివాసము యాచభూపతీ

ఈ ఆశువుగా వచ్చిన అంత్యానుప్రాసలతో నిండి మనోహరంగా ఉన్న పద్యం విని రాజుగారు మహదానంద పడ్డారు. స్వరం మారింది

అయ్యా తమపేరేమి?

నా పేరు వెంక నందురు
భూపాలకమకుట నీలపుంజమిళిందో
ద్ధీపితపాదాంబుజ కరు
ణాపర వెలుగోటి యాచనరనాథేంద్రా

రంగం సిధ్ధమైంది. రాజు గారికి కవిగారిని సత్కరంచాలని కోరిక కలిగింది, సభాసదులకు కవి ప్రతిభను మరింతగా వెల్లడించి ఆపని చేస్తే బాగుంటుంది కదా.

రాజు గారి ప్రశ్న. అయ్యా తమరు గంటకు ఎన్ని పద్యాలు చెప్పగలరు?
(ఇక్కడ నాదొక సందేహం గంట అనా ఘడియ అనా అని? దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు గంట అన్నారు)

వెంకన్న గారి జవాబు చూడండి. ఊరక పద్యములు చెప్పుట కాదు. ఆశువుగా సమస్యలనే పూరించగలను. కావలసినచో పరీక్షించుకొనవచ్చును.

ఇంకేమి సమస్యలే సమస్యలు పూరణాలే పూరణాలు. అదీ ఆశువుగా.

ఒకటా రెండా? ఇంచుమించు ఒక యాభై దాకా సమస్యాపూరణాలు.

అవన్నీ మనం వచ్చే టపాల్లో చూదాం.