18, జనవరి 2018, గురువారం

మోచెర్ల వెంకన్న గారి సమస్యాపూరణాలు - 1


నిన్న శంకరాభరణం బ్లాగులో వాగ్దానం చేసినట్లుగా సమస్యాపూరణాలను గురించి కొన్ని టపాలు వ్రాస్తున్నాను.

ఇప్పుడు వ్రాయబోయేవన్నీ మోచెర్ల వెంకన్న గారి సమస్యాపూరణలు.

ఈ మోచెర్ల వెంకన్న గారు నెల్లూరు మండలం వేంకటగిరి సంస్థానంలోని తెట్టు గ్రామ నివాసి అయిన నియోగి భ్రాహ్మణులు. ఈయనా వారి సోదరుడు దత్తప్ప గారూ మంచి ఆశుకవులు.

ఒకరోజున వెంకన్న గారింటికి అభ్యాగతుడుగా ఒక సంస్కృతపండితుడు వచ్చి తనగోడు చెప్పుకున్నాడు. ఆయన రాజదర్శనానికిపోతే అవమానం జరిగింది.

రాజుగారు తెలుగులో పద్యాలు చెప్పగలరా? అని అడిగారు.

ఈయనేమో అయ్యా నేను వయ్యాకరణిని, సంస్కృతంలో శ్లోకాలు చెప్పగలను కాని తెలుగులో కవిత్వం చెప్పలేను అన్నాడు.

రాజుగారు తెనుఁ గెఱుఁగఁడు సంస్కృతంపు తెన్నే మెఱుఁగున్ అని చెప్పి చులకనగా అన్నారు.

ఈ కథనం విని వెంకన్న గారు బాగా నొచ్చుకొని ఆ పండితుడితో పదవయ్యా స్వామీ నీకా రాజు  చేతనే సన్మానం చేయిస్తానూ అని ఆయనను వెంటబెట్టుకొని వెళ్ళి రాజుగారికి తెలుగు కవులు వచ్చారని కబురు పెట్టారు.  రాజు గారు ఆహ్వానించి మీ దే ఊరండి అని అడిగి తెట్టేనా అని హాస్యం చేసారు.

వెంకన్న గారికి మండి ఇలా అన్నారు.

తెట్టు కుమారకృష్ణజగతీవరనందన రాజ్యలక్ష్మికిం
బట్టు ధరాంగనామణికిఁ బాపట బొట్టు రిపూరగాళి వా
కట్టు సముజ్వలధ్ధృతికి గట్టు బుధాళికి వేల్పుఁ జెట్టు వా
గ్దిట్టల కున్కి పట్టును మదీయ నివాసము యాచభూపతీ

ఈ ఆశువుగా వచ్చిన అంత్యానుప్రాసలతో నిండి మనోహరంగా ఉన్న పద్యం విని రాజుగారు మహదానంద పడ్డారు. స్వరం మారింది

అయ్యా తమపేరేమి?

నా పేరు వెంక నందురు
భూపాలకమకుట నీలపుంజమిళిందో
ద్ధీపితపాదాంబుజ కరు
ణాపర వెలుగోటి యాచనరనాథేంద్రా

రంగం సిధ్ధమైంది. రాజు గారికి కవిగారిని సత్కరంచాలని కోరిక కలిగింది, సభాసదులకు కవి ప్రతిభను మరింతగా వెల్లడించి ఆపని చేస్తే బాగుంటుంది కదా.

రాజు గారి ప్రశ్న. అయ్యా తమరు గంటకు ఎన్ని పద్యాలు చెప్పగలరు?
(ఇక్కడ నాదొక సందేహం గంట అనా ఘడియ అనా అని? దీపాల పిచ్చయ్య శాస్త్రి గారు గంట అన్నారు)

వెంకన్న గారి జవాబు చూడండి. ఊరక పద్యములు చెప్పుట కాదు. ఆశువుగా సమస్యలనే పూరించగలను. కావలసినచో పరీక్షించుకొనవచ్చును.

ఇంకేమి సమస్యలే సమస్యలు పూరణాలే పూరణాలు. అదీ ఆశువుగా.

ఒకటా రెండా? ఇంచుమించు ఒక యాభై దాకా సమస్యాపూరణాలు.

అవన్నీ మనం వచ్చే టపాల్లో చూదాం.


6 వ్యాఖ్యలు:

 1. మీ తెలుగు సిరి
  తెలుగును వెలిగించుటలో మీకు మీరే సరి
  మీ తెలుగుదనం
  మా ఉల్లములలరించే తెలుగు-ధనం

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సంతోషం!
  మోచెర్ల వెంకన్న గారి సమస్యాపూరణలను 'శంకరాభరణం' బ్లాగులో 18-5-2011 నుండి 6-7-2011 వరకు రోజు కొకటి చొప్పున 'చమత్కార పద్యాలు (మోచెర్ల వెంకన్న కవి సమస్యాపూరణలు) అనే శీర్షికతో ప్రకటించాను.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఇదే వ్యాఖ్యను మీ శంకరాభరణంలో చూసి స్పందించానండీ. ఇంక నేను వ్రాయవలసిన అవసరం ఉందా అని సందేహం.

   అదటుంచి
   మీ వచ్చుట అఱుదు కదా
   యీ విషయము మీద వచ్చి రిదియును మేలౌ
   నీ వెంకన్నకు మీకును
   నా వెంకన్నకు కృతజ్ఞతాంజలు లివియే
   ధన్యోస్మి.

   తొలగించు


 3. శ్యామలీయం వారు

  మీ బాణి మీది ఆ సమస్యా పూరణ ల మీద మీ వ్యాఖ్యానం తో సహా చదవటం అదో కిక్కు

  కాబట్టి మీ టపా పరంపర కొనసాగిస్తేనే బాగుంటుంది


  చీర్స్
  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 4. శ్యామలీయం గారూ, ఉత్తమ కవిని ఎన్నుకున్నారు. మోచెర్ల వెంకన్న మహానుభావుడు. మహితాశుకవిత్వ ధారా ధురీణుడు. కొనసాగించండి.

  ఘడియకని సందేహమెందులకు వచ్చినట్లు?
  గంటకిన్ని పద్యాలు అనే కొలత పండిత లోకంలో సర్వ సాధారణమే.
  కొప్పరపు సోదర కవులు గంటకు ఏడు వందల పద్యాలతో ఆశుకావ్య నిర్మాణం ( అరగంటకు మూడు వందలా యాభై కనుక ఆ దామాషాలో) ఎన్నో మార్లు చేశారని ప్రతీతి. అవి రికార్డులకెక్కాయి కూడా.

  ఇక ఇటీవలి వారిలో ప్రస్తుత కుర్తాళం పీఠాధిపతులు - పూర్వాశ్రమంలో ప్రసాదరాయ కులపతులుగా ఉన్న కాలంలో-

  "గంటకు నూరు పద్యములఖండిత వీర మహాశుధారతో
  గొంటుదనమ్ము లేక రసికుల్ దలలూపఁగఁ బల్క బంగరుం
  గంటలు గట్టి మెచ్చిరి ప్రకాండులు పండితులాంధ్ర భూమి నే
  గుంటురి వాఁడ సత్కవులకున్ కడు నచ్చిన వాఁడ నెప్పుడున్!"

  అని పలికింది రసజ్ఞ లోకంలో ప్రసిద్ధమే.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. విష్ణునందనుల వారూ, మోచర్ల వారు పదునేడవ శతాబ్దివాడని చెబుతారు. ఈ గంట అన్న మాటవాడుక తెలుగువారి వాడుకలోనికి ఎప్పుడు వచ్చిందో సరిగా తెలియదు. కాని గతశతాబ్దిలో కూడా ఘడియ అన్నమాట మాత్రం మంచి వాడుకలో ఉందికదా. అందుకని నా సందేహం.

   ఐతే మోచర్లవారి గురించి శంకరయ్యగారు తమబ్లాగులో ఇప్పటికే దారావాహికగా చేసిన సంగతిని నేను గమనించకపోవటం నాతప్పిదమే. ఇప్పుడు నేను పోటిగా వ్రాస్తున్నానన్న శంక వస్తుంది. వారితో పోటీ పడి వ్రాసేటంత స్థాయి నాకేమాత్రమూ లేదు.

   ప్రసాదరాయకులపతి గొప్పవారు. వారిపట్ల నాకు ఆరాధనాభావం ఉన్నది. గంటకు నూరుపద్యములఖండత జేసెడు వారలేడ! నే గంటకు నాల్గుపద్యముల గట్టిన ధన్యుడగా తలంతునే! మీరు వారి ప్రస్తావన జేసినదే చాలును - ఈ చిరు బ్లాగుకు వారే స్వయంగా విచ్చేసినంత మహదానందం కలిగించింది.

   తొలగించు

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.