14, జనవరి 2018, ఆదివారం

మరలిరాక హరిని కలియు మార్గ మొక్కటే


మరలమరల తిరిగివచ్చు మార్గములా పెక్కులు
మరలిరాక హరిని కలియు మార్గ మొక్కటే

పున్నెము లాచిరించి పొందెడు సత్ఫలము లేమి
యన్నోదకములు సిరులు కొన్నికొన్ని పదవులు
కొన్నాళ్ళు స్వర్గములో కులికి తిరిగి వచ్చుటలు
అన్నన్నా యీరీతిగ నెన్ని జన్మలైన దొరలు

చదువులెన్ని చదివినా జ్ఞానమెంత కలిగినా
వదలవురా కర్మములు వదలవు భవబంధములు
ఉదితమై రామభక్తి యుప్పొంగు నందాక
చదువులు చదువులే జన్మములు జన్మములే
 
ఉన్నది ఆ రాముడొకడె యుధ్ధరించు వాడనగ
ఉన్నదొక్క జన్మమే యుధ్ధరించబడగ నీకు  
ఉన్నదొక్క మార్గమే యుధ్ధరించ బడుటకు
అన్నా అది రామచరణారవిందయుగళ భక్తి


వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి.