21, జనవరి 2018, ఆదివారం

మోచర్ల వెంకన్న గారి సమస్యాపూరణాలు -3

గత టపా మోచర్ల వెంకన్న గారి సమస్యాపూరణాలు -2 లో వెంకన్నగారి ప్రస్తిధ్ధమైన సమస్యాపూరణాల నేపధ్యం గురించి కొంత చర్చించాం. ఈటపాతో ఆచర్చకు ముగింపు పలుకుదాం.

రాజుగారికి వెంకన్న గారు చేసిన వర్తమానం తెలుగుకవులము వచ్చామూ అని.  రాజుగారికి తెలుగు కవిత్వం వినటంపై ఆసక్తి మెండైతే అందులో అభినందించవలసినదే కాని ఆక్షేపించవలసినది యేమీ లేదు.  నిజానికి తెలుగుకవులమూ అని చెప్పుకొనేవాళ్ళు ముప్పాతికమువ్వీసం మంది చెప్పే తెలుగుకవిత్వం ఎటువంటిది అన్నది చూడండి. వాళ్ళు ముఖ్యంగా సంస్కృతవృత్తాలను ఎక్కువగా సమాదరిస్తారు.  తెలుగు జాత్యుపజాతుల పద్యాలను చెప్పరని కాదు దాని అర్థం. వారు చెప్పే పద్యాలనో పదికి ఎనిమిది తొమ్మిది దాకా సంస్కృతపదాలో తత్సమాలో తప్ప అచ్చమైన తెలుగుమాటలు తక్కువ. అంటే సంస్కృతపాండిత్యం ముఖతః ఉంటే తప్ప తెలుగుకవిత్వం లేదు. నన్నయ కాలం నుండీ అదే పరిస్థితిమరి.  నిజానికి తెలుగుభారతమే ఒక సంస్కృతశ్లోకంతో ఆరంభమైనది కదా

శ్రీవాణీగిరిజా శ్చిరాయ దధతో వక్షోముఖాజ్గేషు యే
లోకానాం స్థితి మావహ న్త్యవిహతాం స్త్రీపుంసయోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రిపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమామ్బుజభవశ్రీకన్ధరా శ్శ్రేయసే.

అని.

అదికాదయ్యా అది ఏదో శుభమా అని మంత్రోఛ్ఛారణంలాగా దేవభాషలో అలా ఉపక్రమించారు ఆదికవి అంటారా,  లోపలికిపోయి మరో పద్యం చూదాం.

విపరీతప్రతిభాష లేమిటికి నుర్వీనాథ! యీ పుత్త్రగా
త్రపరిష్వంగసుఖంబు సేకొనుము ముక్తాహార కర్పూర సాం
ద్రపరాగ ప్రసరంబుఁ జందనముఁ జంద్రజ్యోత్స్నయుం బుత్త్రగా
త్రపరిష్వంగమునట్లు జీవులకు హృద్యంబే కడున్‌ శీతమే.

ఈపద్యంలో మాటలను భాషాపరంగా వేరుచేయాలంటే తెలుగుమాటల్ని వెతుక్కోవాలా? సంస్కృతం మాటల్ని వెతుక్కోవాలా చెప్పండి?

ఏమాటకామాట చెప్పుకోవాలి. నన్నయనాటికి తెలుగులో కవిత్వప్రక్రియ వ్యవస్థీకృతంగా లేదు, ఎవరూ కావ్యనిర్మాణాలు చేయటం లేదు. ఆ పరిస్థితిని మార్చాలనే రాజరాజనరేంద్రుడనే తెలుగురాజూ, ఆయన ఆస్థానకవి ఐన నన్నపార్యుడూ పూనుకొన్నారు.  ఉన్నపాటున నూటికినూరుతెలుగుపదాలతో కావ్యనిర్మితిచేసి అప్పటిపండితపామర లోకాల్ని మెప్పించటం కుదరదు కాబట్టి కలగలుపుగా సాగింది నన్నయ విధానం. మరో నాలుగువందల ఏళ్ళ తరువాత తిక్కన్న గారు అందిపుచ్చుకొని తెలుగుపాళ్ళు బాగా పెంచి నెల్లూరుప్రాంత మాండలికానికి పెద్దపీటను కూడా వేసారు.

ఐనా తెలుగుకవిత్వంలో సంస్కృతం పెత్తనం ఏమీ చెప్పుకోదగినంతగా తగ్గలేదు. వృత్తాడంబరమూ వాటిలో సంస్కృతధాటీ ఐతేనే తెలుగుకవిత్వంగా ఉండిపోయింది.

అందుచేత మనతెలుగు మనతెలుగు అని మనసు కొట్టుకొనే రాజెవడన్నా తెలుగుకవులకు ప్రత్యేక గౌరవం అంటూ  తెలుగు మధురిమతో కవిత్వం చెప్పేవారిని ప్రోత్సహంచటం మెచ్చుకోదగ్గదే.

అందులోనూ ఈ రాజుగారు ఈవిషయంలో కొంచెం తీవ్రవాదిలాగా ఉన్నారు. సంస్కృతకవినే అంటే దర్శనం కూడా ఇవ్వడేమో మరి!

మాఊరిపేరు తెట్టు అంటే రాజుగారు కావాలనో నిజంగానో కొంచెం తేలికపరిచారు. కొంచెం కోపించి వెంకన్నగారు చెప్పిన పద్యం చూడండి.

తెట్టు కుమారకృష్ణజగతీవరనందన రాజ్యలక్ష్మికిం
బట్టు ధరాంగనామణికిఁ బాపట బొట్టు రిపూరగాళి
వా కట్టు సముజ్వలధ్ధృతికి గట్టు బుధాళికి వేల్పుఁ జెట్టు వా
గ్దిట్టల కున్కి పట్టును మదీయ నివాసము యాచభూపతీ

మాఊరిపేరు తెట్టు అంటే సామాన్యం అనుకున్నావా అని గద్దిస్తూ ఆఊరి విశేషాలు అంత్యానుప్రాసలు వేసి మరీ దిట్టంగా చెప్పారు కదా తెట్టు-పట్టు--బొట్టు-కట్టు-గట్టు-చెట్టు అంటూ. ఆ శబ్దాలంకారాలను దాటి పద్యంలోపల చూదాం.

మొదటిది కుమారకృష్ణజగతీవరనందన అన్నది. కవి అన్నవాడు రాజదర్శనం చేసి రాజును సమ్ముఖంలో స్తుతించటం విడ్డూరం కాదు కదా.  కాని గడుసుదనం అంతా ఓ కుమారకష్ణజగతీవరనందనా, తెట్టు రాజ్యలక్ష్మికి పట్టు అని చెప్పటంలో ఉంది. ఏమయ్యా మాఊరంటే ఏమనుకున్నావు? అది మన రాజ్యం యొక్క వైభవానికి మూలస్థానం అని చెబుతూ పద్యం అందుకోవటం వెంకన్న గారి ధీమాను తెలుపుతున్నది.

నాకు రిపూరగాళి వాకట్టు అన్న ప్రయోగం బాగా నచ్చింది.  రిపు+ఉరగ -> రిపూరగ అంటే శత్రువు అనే పాము.  లోకంలో శత్రువులు లేని వాళ్ళు అరుదు.  ఈ శత్రువులు రెండు రకాలు. ఎదటపడి ధైర్యంగానే శత్రుత్వం సాధించేవాళ్ళూ, లోపల్లోపలే కుళ్ళుకుంటూ అవకాశంకోసం ఎదురుచూసేవాళ్ళూ అంటూ. మొదటిరకం వారు నయం. వారితో అమీతుమీ తేలుతుంది ఎలాగూ.  రెండవరకం వారు  మనని ఏమీ చేయలేక సూటిపోటి మాటలతో బాధించేవారుగా ఉంటారు.  కొందరు మనముందూ అలా ఉంటారు మనపరోక్షంలోనూ అలాగే ఉంటారు. వారిసంగతి తెలిసిందే కాబట్టి వారి గురించి బెంగలేదు. కాని కొందరు రెండునాలుకల వాళ్ళుంటారు. మనముందు మంచిగా మాట్లాడుతారు. మనవెనుక మనగురించి అందరికీ చెడుమాటలు చెబుతుంటారు. ఒకనాలుకతో మన మంచినీ మరొకనాలుకతో మనచెడునూ వర్ణించటంలో సమయసంధర్భాలు చూసుకొని మరో అనువైన నాలుకను అనువైన చోట ప్రదర్శిస్తూ పండగచేసుకుంటూ ఉంటారు. ఇలా రెండునాలుకలు ఉండే జీవులు వీళ్ళు.

మరి రెండునాలుకలు ఉన్న జీవి పాము కదా. అందుకని ఇల్లాంటి శత్రువులను పాములనే అనాలి కదా. అదే వెంకన్నగారి పదప్రయోగం కూడాను.  మాఊరు రిపూరగాళి వాకట్టు అంటున్నారు. వాకట్టు అంటే తెలుసు కదా! నోటికితాళం అన్నమాట.

మా ఊళ్ళో పాముల్లాంటి శత్రువుల నాలుకలకు తాళమయ్యా అంటున్నారు.  అంటే అర్థం ఏమిటీ? ఇతరుల గురించి చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళకు మాఊళ్ళో పప్పులుడకవూ అందరూ వివేకవంతులూ ఎవరూ చెప్పుడు మాటలు ఎవరినీ చెప్పనివ్వరూ వినరూ అని అనటం.

పిండితార్థం ఏమిటీ అంటే మాఊళ్ళో అందరూ మంచి వివేకవంతులు అని తమ ఊరిని ప్రస్తుతిస్తున్నారు వెంకన్న గారు.

బుధాళికి వేల్పు చెట్టు అన్న మరో ప్రయోగం చూడండి. దీని అర్థం మా ఊరు పండితులకు కల్పవృక్షం అని చెప్పటం.  పండితులు ఎవరో ఒకర్ని ఆశ్రయించి సుఖజీవనం చేస్తారని కదా ఆర్యుల మాట! నిరాశ్రయా న శోభంతే పండితా వనితా లతా అని ప్రచారంలో ఉన్నదే. మాఊరు కల్పవృక్షమయ్యా ఎవరినీ ఆశ్రయించవలసి అవసరంలేదు మా ఊరి పండితులకూ అని చురకవేస్తున్నారు వెంకన్నగారు రాజుకు! పైగా పద్యంలో మొదటే రాజ్యలక్ష్మికిం బట్టు అన్నారు కదా - అంటే రాజ్యం యొక్క లక్ష్మీ స్థానం మాఊరి వైభవం అని ముందే చాటారు.

తెట్టు అనే ఊరు వాగ్దిట్టలకు ఉనికి పట్టు అని కూడా అన్నారు. చక్కగా శాస్త్రాభ్యసనం చేసి మహాపండితులైన వారికి మాఊరు నిలయం. ఎవరైనా వాదానికి వచ్చినా మా ఊరిని జయించలేరూ అని దాని అర్థం.

మిగిలిన విశేషణాలను వివరించటం లేదు విస్తరభీతితో.

ఈ పద్యం విన్నాక రెండు విషయాలు రాజుగారికి బోధపడ్డాయి. ఎదుట నిలుచున్న కవి మంచి వాగ్ధాటి కలవ్యక్తి.  సంస్కృతాంధ్రాల్లో మంచి ధిషణ కలవాడు అన్నది మొదటిది, దానికి తోడుగా మంచి సందర్భోచిత వాగ్వైఖరి కలవాడు అని రెండవది ఈ బోధపడ్డ అంశాలు. అందుకే వెంకన్న గారి పైన గొప్ప ఆదరం వెంటనే కలిగింది

తన పేరు తెలుపమని రాజుగారు కోరినప్పుడు వెంకన్నగారు  ఒక చిన్న కందపద్యం చెప్పారు.

నా పేరు వెంక నందురు
భూపాలకమకుట నీలపుంజమిళిందో
ద్ధీపితపాదాంబుజ కరు
ణాపర వెలుగోటి యాచనరనాథేంద్రా

అందులోనూ విశేషం గమనించండి. భూపాలకమకుటనీలపుంజమిళిందోద్దీపితపాదాంబుజ అన్న దీర్ఘసమాసం వేసి మరీ మరొక్కమారు రాజును ప్రస్తుతిస్తూ మరీ చెప్పారు. మొదట తమ ఊరిని ప్రస్తావించవలసినప్పుడు దానిని పెద్దచేస్తూ సాలంకృతం చేస్తూ ఒక వృత్తం చెప్పారు. తనను గురించి చెప్పుకొన వలసి వచ్చినప్పుడు మాత్రం బాగా తగ్గి చిన్న కందంలో చెప్పారు.  అందునా తనను గురించి ఒక పాలూ తమరాజు గురించి మూడు పాళ్ళూగా స్థానం ఇచ్చారు.

పెద్దలు తమగురించి తాము అతిశయంగా చెప్పుకోవటం సముదాచారం కాదు. అందుకే నా పేరు వెంకన అన్నారే కాని తనగురించి మరేమీ వివరించనే లేదు. అవును మరి తనను గురించి ఏమన్నా చెప్పాలంటే అది తన కవిత్వమే చెబుతుంది కదా!

2 కామెంట్‌లు:


 1. అద్భుతః

  కొనసాగే సశేషం కోసం వేచి ...


  BTW

  నాలుగువందల ఏళ్ళ తరువాత తిక్కన్న గారు అందిపుచ్చుకొని తెలుగుపాళ్ళు బాగా పెంచి నెల్లూరుప్రాంత మాండలికానికి పెద్దపీటను కూడా వేసారు....

  అప్పటికి మాండలికం
  ఇప్పటి కాలానికి వ్యావహారికాలను కూడా
  తీసుకు రావాలేమో పద్యం నిలవడానికి ?

  ఏమంటారు ?


  జిలేబి

  రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.