ఇంక వెంకన్నగారు అసామాన్యకవీంద్రులని అనిపించి రాజుగారు ఆయనకు ఉచితసత్కారం చేయాలనుకున్నారని చెప్పానుకదా. అందుకని అయ్యా గంటకు ఎన్ని పద్యాలు చెప్పగలరూ అన్న ప్రశ్నతో ప్రస్తావన చేసారు. కవిగారు వెంటనే ఊరకనే పద్యాలు చెప్పటమేం, కావలస్తే పరీక్షించుకోండి ఆశువుగా సమస్యలనూ పూరించగలం అన్నారు.
ఆపైన రాజుగారు వరుసగా సమస్యలను ఇవ్వటమూ వాటిని వెంకన్నగారు పూర్తి చేయటమూ జరిగింది.
రాజుగారు ఇచ్చిన మొదటి సమస్య దృఢసత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాడఁగన్ అన్నది.
ఇది వినటానికే విడ్డూరంగా లేదూ. చీమ యేమిటీ మాంచి బలంగా ఢామ్మని తుమ్మటం యేమిటీ ఆమహాధ్వనికి దిగ్గజాలు ఆల్లాడటం యేమిటీ చిత్రం!
దీనికి వెంకన్న గారు చేసిన పూరణ చూడండి.
సఢులీశోర్వి చలింప నిర్జరవరుల్ శంకింప భేరీనికా
య ఢమత్కారత నిద్రలేచి దశకంఠామర్త్యవిద్వత్పరీ
వృఢసోదర్యుఁడు లేచి రా వ్యధ యొనర్చెన్ నాసికాంతస్థ్సమై
దృఢసత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాడఁగన్
ఈ పద్యంలో బోలెండంత సంస్కృతం ఉండి చాలా హడావుడిగా ఉన్నా దీనిని అర్థం చేసుకోవటం మరీ అంత కష్టం కాదు..
ఢులి అంటే తాబేలు. కూర్మావతారం అన్నమాట,.
అసలు మన భూగోళాన్ని ఎవరు మోస్తున్నారూ అన్న దానిమీద బోలెడంత గందరగోళం ఉంది. సైంటిఫిక్ యుగంలో ఏమిటీ నాన్సెన్స్ అని ఏ గోంగూరబాబో తిట్టే లోపలే ఒక వివరణ కూడా చెప్పుకుందాం. ఆపాటి సైన్సు మనకీ తెలుసునూ ఉన్నదంతా పౌరాణిక గందరగోళం మాత్రమే అని.
కొన్ని చోట్ల ఈ భూమిని అష్టదిగ్గజాలు మోస్తున్నాయంటారు.
ఒక్కో సారి దీన్ని ఆదిశేషుడు మోస్తున్నాడంటారు.
అన్నట్లు కొన్ని చోట్ల కూర్మావతారం మోస్తోందీ అనీ అంటారు.
సౖంటిఫిక్ టెంపర్మెంటు దిట్టంగా ఉండి భారతీయం అంటేనే ట్రాష్ అనే కొందరికి చెప్పాల్సిన ముక్కొకటి ఉందిక్కడ. గ్రీకులు కాబోలు దీన్నెవరో అట్లాసో హెర్కులిసో మోస్తున్నాడంటారు!
సరిసరి శాఖాచంక్రమణం ఆపి పద్యం చూదాం. ఇందులో ఉన్న ఢులి అంటే భూగోళాన్ని మోస్తున్న కూర్మావతారం అన్నమాట. ఇంక సఢులీశోర్విచలింప అంటే ఆ భూగోళంతో సహా సాక్షాత్తూ ఆ మహాకూర్మస్వామి కూడా కాస్త కదిలిపోయేటట్లుగా అన్నది అర్థం. అంత గొప్ప సంఘటన ఏమిటబ్బా అన్నది మిగతా పద్యం చెప్పాలి మరి.
ఆ సంఘటన దొడ్డతనం ఎటువంటిదీ అంటే నిర్జరవరుల్ శంకింపగా ఉందిట. జర అంటే ముసలితనం. (ఊరికే నిఘంటువులో వెదికి జర అంటే జర అనే రాక్షసి, భారతంలో కనిపిస్తుంది అని అర్థం చెప్పకండేం. అదిక్కడ పొసగదు. ఎక్కడ ఏ అర్థం చెప్పాలో కాస్త నిదానించాలి.) జర ఉన్నవాళ్ళు మామ్మూలు జనం. నరులైనా సరే రాక్షసులైనా సరేను. నిర్జరులు అంటే దానికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళు. అంటే అస్సలు ముసలితనం లేని వాళ్ళు. దేవతలు. వాళ్ళకి ముసలితనం లేకపోగా అసలు నడివయస్సు కూడా లేదు. వాళ్ళ వయస్సు ఎప్పుడూ కూడా సరిగ్గా ముఫై మాత్రమే. సినీ తారమ్మలకి ఎప్పుడూ పదహారే అనే అంటారు చూడండి. అలాగన్న మాట. నిజంగా అలాగంటే అలా కాదు. వాళ్ళు ముఫై ఏళ్ళ వాళ్ళలా కనిపించటమే కాదు. అలాగే నిజంగా ఉండిపోతారన్నమాట. అన్నట్లు అందుకే వాళ్ళను త్రిదశులు అని కూడా అంటారు.
ఆ దేవతలకు అనుమానం కలిగేలా జరిగిన సంఘటన అట. ఏం టబ్బా అని. అసలు మన దేవతల కందరికీ ఎప్పుడూ ఒకటే అనుమానం. ఎవడన్నా రాక్షసుడు వచ్చి వాళ్ళ భోగాలన్నీ లాగేసుకొని అడవుల పాలు చేస్తాడేమో అని ఆ సుకుమారులకు ఎప్పుడూ ఒకటే శంక. అందుకని ఏదైనా నమ్మశక్యం కాని ఒక పెద్ద సంఘటన తటస్థించిందా వాళ్ళ కుశ్శంక పైకి లేచిందన్నమాటే. ఏంజరిగిందో ఇప్పుడు!
ఈ దశకంఠామర్త్యవిద్వత్పరీవృఢసోదర్యుఁడు అన్న డాబుసరి సమాసం చూసారా? దీనిలో దశకంఠుడూ అంటే అలాగే దశకంఠామర్త్యుడూ అంటే మనకి తెలిసిపోతూనే ఉంది. వాడే రావణాసురుడు కదా అని. నిజమే. వాడే. సోదర్యుడు అంటే సోదరుడూ అనే అర్థం. మరి అందరికీ తెలిసిన సోదరుడు అన్న మాటే వాడొచ్చు కదా అంటే వాడొచ్చును కాని ఇక్కడ వాడకూడదు - ఈ పద్యం ఛందస్సు ఒప్పుకోదు. అందుకనే సరిపడే మాటను ఎన్నుకోవటం. విభీషణ కుంభకర్ణుల్లో ఒకడై తీరాలి మరి. చూదాం.
మధ్యలో విద్వత్తూ పరీవృడత్వమూ తెచ్చి విద్వత్పరీవృఢ అన్న విశేషప్రసంగం ఒకటి చేసారు వెంకన్న గారు. పరీవృఢుడు అంటే అధికారి - అంటే రాజన్న మాట. ఈ రాజశబ్దానికి విద్వత్తును కట్టబెట్టటం ఎందుకూ అంటారా మళ్ళా పద్యంలో సౌలభ్యం కోసం ఎన్నుకున్న పదమే కాని తదన్యం కాదు. అది పెద్ద ఇబ్బంది కాదు.
ఐనా ఈ ఢకారప్రాసా వైభవమూ అట్టహాసమూ చూస్తుంటే వీడు కుంభకర్ణుడు కాక తప్పేలా లేదు. అదీ కాక వాడు భేరీనికాయ ఢమత్కారత నిద్రలేచినట్లుగా చెబుతున్నారు కదా పద్యంలో. అంటే పెద్దపెద్ద డప్పులు పెద్ద సమూహంగా తెచ్చి గోలగోలగా వాయిస్తే నిద్రలేచి వచ్చాడు అని చెబుతున్నాక ఇంక వాడు కుంభకర్ణుడే అని ఋజువౌతున్నది కదా మనకి. హమ్మయ్య, ఇప్పుడు కొంత బోధపడింది.
ఈ కుంభకర్ణుడు లేచి రా వ్యధ యొనర్చెన్ నాసికాంతస్థ్సమై దృఢసత్త్వంబున చీమ అంటున్నారు. అంటే ఏమిటో చూదాం. నాసిక అంటే ముక్కు కదా. అందుచేత నాసికాంతస్థమై అంటే ముక్కులో దూరి అని అర్థం ఫెడీమని తడుతున్నది. ఆముక్కులో దూరింది ఏమిటయ్యా అంటే అది ఒక చీమ అట. అది వాడి ప్రాణానికి వ్యధ యునర్చెన్ అంటే వాడికి బాగా నొప్పి పుట్టే టట్లుగా కుట్టిందీ అని పిండితార్థం.
ఎవడి ముక్కులో నైనా ఒక ధూళికణం కొంచెంగా చిరాకు కలిగిస్తే? ఆంగ్లంలో బడాయిగా చెప్పాలంటె ఇరిటేషన్ కలిగిస్తే? ఏమౌతుందీ? ఎవడైనా సరే ఉన్నపాటున ఢాం అని తుమ్ముతాడు. తుమ్మక చస్తాడా!
పాపం అంత లావు కుంభకర్ణుడూ తుమ్మక తప్పని పరిస్థితిమరి. (అయ్యా లావు అంటే బలం అన్న అర్థం కూడా ఉందని దయచేసి గమనించ ప్రార్థన. అంతలావు కుంభకర్ణుడు అంటె అంత బలవంతుడైన కుంభకర్ణుడు అని అర్థం కాని వాడు డేనియల్ లాంబర్ట్ లాగా గుమ్మాలు పట్టనంత లావుగా ఉన్నాడని నా అభిప్రాయం కాదని విన్నవించుకుంటున్నాను.)
మామ్మూలు మనిషి హఠాత్తుగా తుమ్మితేనే దాని దెబ్బకి పక్కవాళ్ళు జడుసుకోవటం కూడా అప్పుడప్పుడు జరుగుతుంది .
ఈ కుంభకర్ణుడేమో మహాబలశాలి. అస లందుకనే కదా నిద్దరపోతున్నాడన్న జాలికూడా లేకుండా లబలబలాడుతూ రావణాసురుడు వాణ్ణి లేవగొట్టించిందీ?
అంత బలశాలి తుమ్మితే ఇంకేమన్నా ఉందా చెప్పండి?
కవిగారు చెబుతున్నారూ వాడు తుమ్మెఁ గదరా దిగ్దంతు లల్లాడఁగన్ అని. అంటే భూమిని మోసే అష్టదిగ్గజాలూ కూడా అల్లల్లాడిపోయేలా అదురుపుట్టిందట వాడి తుమ్ము దెబ్బకి.
ఈ చప్పుడుకే మరి దేవతలు మళ్ళా ఎవడన్నా యుధ్ధభేరీలు మోగిస్తున్నాడా అమరావతి ముంగిట్లో అని శంకించటమూ. భూమీ అష్టదిగ్గజాలతొ పాటే కూర్మావతారమూ కొద్దోగొప్పో కంపించటమున్నూ.
ఇప్పుడు అంతా సరిగ్గా తెలిసిపోతున్నది కదా. అవసరమైతే పద్యాన్ని మరొక్కసారి చదివి ఆనందించండి.
ఇక్కడ సమస్య ఏమిటీ అంటే రాజు గారు దృఢసత్త్వంబునఁ జీమ తుమ్మెఁ గదరా అన్నారు. కవిగారేమో చీమకు అంత గొప్పగా దడదడలాడేంత ఘాట్టిగా తుమ్మగల సత్వం ఇవ్వటం కుదరదు కాబట్టి ఆ తుమ్ము హడావుడి కుంభకర్ణుడికీ కుట్టటం మాత్రం చీమకీ పంచి మంచి వినోదభరితమైన పద్యం అందించారు.
అయ్యా అదీ సంగతి.
మంచి వ్యాఖ్యానం. కవి పద్యం మాత్రం అన్వయంలో కొంత ద్రావిడ ప్రాణాయామం చేసింది.
రిప్లయితొలగించండిమీ 'రాముని నేను నమ్మితిని'... 'రాముడు నాకు స్నానమగు'ను జ్ఞప్తికి తెచ్చింది. బాగుంది.
చరాచర సృష్టిని నాడవచ్చి ...అనండి. సరిపోతుంది.