1, ఫిబ్రవరి 2018, గురువారం

పాహిరామప్రభో శ్రీరఘురామ నాదయిన చిత్తము నిన్ను భజించు


ఉ. శ్రీరఘురామ నాదయిన చిత్తము నిన్ను భజించు నన్యులన్
చేరి భజించు తప్పెపుడు చేయదు చేయదు చేయదెన్నడున్
తామసులైన మానవుల దాల్చగ నేల మనంబునన్ పరం
ధామ నిలింపులైన తమ దాసులె గావున నిన్నె గొల్చెదన్

పాహి రామప్రభో.

నీవు జగద్విభుడవు.

నీకు సమానులైన వారూ లేరు, నీకంటే అధికులూ లేరు.

అందుచేత నా చిత్తం ఉందే అది నిరంతరం నిన్నే భజించుతూ ఉంటుంది.

దానికి బుధ్ధి ఉంది కాబట్టి, వేరే ఎవ్వరినీ భజించే పొరపాటు పనిని ఎన్నడూ చేయదు.

చేయదు. చేయదు కాక చేయదు. చేయదంటే చేయదయ్యా.

ఈ లోకంలో అందరూ తమతమ అవసరాల కోసం ఎవరెవర్నో భజిస్తూ ఉంటారు కదా.  నువ్వూ ఈలోకంలో పడి ఉన్నవాడివే కదా అనవచ్చును. దానికేం.

మా మనుష్యుల సంగతి అంటావా  మాలో అందరూ  తామసబుధ్ధి కలవారు కదా.

నిత్యం నేనూ నావాళ్ళూ అనుకుంటూ చరించటం అనే ఈ తామసబుధ్ధి కలవాళ్ళను సేవించటం ఏమిటీ దరిద్రం. వాళ్ళు ఏమిస్తారూ వాళ్ళిచ్చేది ఎందుకు పనికివస్తుందీ. వాటిల్లో ఏమి కూడా పట్టుకొని పోతానూ అని.

నిత్యం పుడుతూ గిడితూ తామసికమైన జీవితాలు గడిపే  అశాశ్వతులైన మానవులు ఇచ్చేది ఏదైనా అశాశ్వతమే కదా. అటువంటి స్వల్పాలకోసం లబలబలు ఎందుకు నాకు. వద్దనే వద్దు మహాప్రభో. వద్దు కాక వద్దు.

ఇకపోతే లోకంలో అందరూ ఎవరెవరో దేవతలను ఆశ్రయించి వాళ్ళకు పూజాపునస్కారాలు చేసి మంచిమంచి ప్రతిఫలాలు పొందుతూ వాళ్ళకు ఊడిగం చేస్తున్నారు కదా, దేవతలిచ్చేవి మానవులిచ్చే వాటికన్నా శ్రేష్ఠమైనవే కదా అనవచ్చును. అవును నిజమే.

ఐనా ఆ దేవతలు మాత్రం శాశ్వతమైనది ఏదీ ఇవ్వలేరు కదా. మోక్షాన్ని వాళ్ళు ఇవ్వగలరా చెప్పు మరి.

ఈ ప్రపంచానికి నువ్వే ప్రభువుగా ఉన్నావు.

నువ్వే మోక్షం ఇవ్వగల వాడవు.

పరంధాముడవైన నీకు ఈ దేవతలంతా సేవకులే.

నేనూ నీ సేవకుణ్ణే  - వాళ్ళూ నీ సేవకులే.

మరింకా వాళ్ళ గొప్ప ఏమీ లేదు.

వాళ్ళకు ఏదైనా గొప్పదనం ఉందీ అనుకుంటే ఆ గొప్పదనం వలన ఏమన్నా ప్రయోజనం ఎవరికైనా ఉంటే గింటే వారికి ఆ దేవతల గొప్పదనం కనబడవచ్చును. నిర్థారణగా చూస్తే మాత్రం ఏమీ లేదు. ఈ చరాచరసృష్టిలో నువ్వు తప్ప అందరూ సమానమేను దాసత్వంలో.

అందుకనే అందరికీ అన్నివేళలా ప్రభువు వైన శ్రీరామచంద్రుడా, నిన్నే నిత్యం భజిస్తున్నాను.

పాహి పాహి రామప్రభో. దయుంచు మరి.

2 కామెంట్‌లు:

  1. గురువు గారు
    మీరు పద్యాలు రాసేటప్పుడు పద్యం ఏమి వృత్తమో ఎందుకు రాయరు? నాలాంటి తెలుగురాని వాళ్ళకి, మిగతా ఛందస్సు తెలీని వాళ్లకి ఉపయోగంగా ఉంటుంది కదా? లేకపోతే ప్రతీ పద్యానికీ గణాలు విభజించుకుంటూ చూసుకోవాల్సి వస్తోంది. ఇలా ఏడిపించడం వల్ల రాముడు మీ చేత మరో వేయి పద్యాలు - మీ బద్ధకం వదిలించి, ముక్కుతాడు కట్టి మరీ - రాయిస్తాడు గాక!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రన్నది నిజమే. ఎందుకు వ్రాయనొ కాని పద్యం ముందు ఉ. చ. శ. అంటూ వ్రాయటం విషయంలో మాత్రం బధ్ధకిస్తున్నాను.

      ఇకపోతే పద్యానికి చదువరులు గణవిభజనలు చేసుకోవటం ఎందుకండీ, మరీ ఛందస్సు నేర్చుకుందుకు తాపత్రయం పడుతున్నప్పుడు తప్ప? హాయిగా పద్యాన్ని చదివి ఆనందించటమే హెచ్చుమందికి కావలసినది కదా. ఐనా కొంత కుతూహలం ఉండవచ్చును ఏపద్యం ఏఛందస్సా అని.

      చ. మరియొక వేయి పద్యములు మానక రాముడు వ్రాయ బంచుచో
      వరమది నాకు రామున కవారిత దీక్షను పద్యమాలికా
      పరమగు పూజచేయుటకు పట్టిన భాగ్యమఖండమౌట యీ
      నరునకు చాలు నయ్యది వినాశనహీనపథంబు గూర్చదే.

      మీ వాక్యం ఫలించాలని నా ఆశ. అంతా రామేఛ్ఛ.

      తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.