19, ఫిబ్రవరి 2018, సోమవారం

ఎంతో చదివి యొంతో చూచి

ఎంతో చదివి యెంతో చూచి యెంతో చేసి యోగ్యుడై
యింతవా డంతవా డితడే ననిపించుకొని

ఎవడెవడా చదువులకు సారమెఱుగు చున్నాడు
కువలయమున తన యునికి గూర్చి యెఱుగు చున్నాడు
భవముదాటు విధ మేదని పరితపించు చున్నాడు
చివరి వరకు విరాగియై జీవించు చున్నాడు

భువి నెవడు తన యునికి మూల మెఱుగు చున్నాడు
భువి నెవడు తన రాకపోక లెఱుగు చున్నాడు
భువి నెవడే బంధములను పోద్రోచు చున్నాడు
వివరింపగ నందరివలె వెడలి పోవు చున్నాడు

జనులార కోటి కొకడె చదువులకు సారమైన
యినకులపతి తత్త్వ మొక్కింత యెఱుగు చున్నాడు
ఘనుడువాడె స్వస్వరూప జ్ఞానమొందుచున్నాడు
కనుక రామభక్తులై గడచు డయ్య భవమును