15, ఫిబ్రవరి 2018, గురువారం

ఎంత చిన్నమంత్రమౌ ఎంత సులభమంత్రమో


ఎంత చిన్నమంత్రమౌ ఎంత సులభమంత్రమో
ఎంత మంచిమంత్రమో ఎంత గొప్పమంత్రమో

అంతులేని సుఖశాంతుల కాకర మగు మంత్రము
చింతలేని జీవనమును చేకూర్చే మంత్రము
పంతగించి కలిచెడుగుల కంతు జూచు మంత్రము
అంతకంతకు మహిమ నతిశయించు మంత్రము

మదమోహకామములను మట్టుపెట్టు మంత్రము
హృదయము నిర్మలముచేయు నింపైన మంత్రము
చదువు లన్నింటి కదే సారమైన మంత్రము
ముదమార కొలిచితే మోక్షమిచ్చు మంత్రము

అదే యోగివరులు కొలచు నట్టి దివ్యమంత్రము
అదే యుపాసించదగిన యందమైన మంత్రము
అదే రామభక్త జనుల కన్నము పానీయము
అదే రామమంత్రము - అదే రామమంత్రము