25, ఫిబ్రవరి 2018, ఆదివారం

చాలానే ప్రత్యేకసీమలు కావాలి ప్లీజ్.


ఈ మధ్య బీజేపీ వాళ్ళు ఎదురు దాడి చేస్తున్నారు.

ఎవరిమీదా అంటే ఆంద్రులమీద అనే చెప్పాలి.

గత ఎన్నికలలో అరచేతిలో స్వర్గం చూపించారు నమ్మశక్యం కానంత మంచి మంచి వాగ్దానాలతో.

కాంగ్రెసువాళ్ళు ఐదేళ్ళిస్తాం ప్రత్యేకహోదా అంటే మన వెంకయ్య నాయుడు గారు కాదు పదేళ్ళివ్వండి అని ప్రాధేయపడి ఎంతమంచి వాడూ అని అనిపించుకున్నాడు.

తీరా కాంగ్రెసు వాళ్ళు అలా కుదరదు కేవలం ఐదేళ్ళే ఇస్తాం అంటే పోనివ్వండి, మే అధికారంలోకి వచ్చి దాని పదిహేనేళ్ళు చేస్తాం అని వెంకయ్యగారు గొప్పగా చెప్పటం అందరికీ అప్పట్లో ఎంతో కర్ణామృతంగా అనిపించింది.

అందరూ ఎంతో సంతోషించారు మోదీ ప్రభంజనంతో బీజీపే గద్దెకెక్కగానే.

తీరా ఆ బీజేపీ కాస్తా అట్టుతిరగేసి అసలు ప్రత్యేకహోదా ఇవ్వటం కుదరదంటే కుదరదూ అని కుండబద్దలు కొట్టినప్పుడు కాని బీజేపీ నిజస్వరూపం బయటపడలేదు!

ఆంధ్రాకు ఇవ్వలేకపోవటమే కాదు ముందుముందు ఏరాష్టానికీ ఇవ్వటమూ కుదరదూ, అసలు ఇప్పుడు ఆ హోదా ఉన్న రాష్ట్రాలకూ అది పొడిగించటం కుదరదూ అన్నారు.

ఆంధ్రా జనం కాబోలు అనుకున్నారు.

పోలవరం ప్రాజెక్టును కేంద్రమే దగ్గరుండి సహాయం చేసి కడుతుందని నమ్మబలికి, తొలి బడ్జెట్‍లో ముష్టి వందకోట్లు కేటాయించినప్పుడే వీళ్ళ రంగు బయటపడింది. నీ యిల్లు నేనే కట్టిస్తానూ నాఖర్చుతో- ఇదిగో  ఈ పదినోటు నా మొదటి విడత అన్నట్లు మాట్లాడినప్పుడే వీళ్ళ దొంగవేషం ఆంద్రులకు తెలిసింది.

అన్నీ పచ్చి అబధ్దాలు.

బయటపడినా కేంద్రం దొంగాటకం, ఎలాగో అలాగ బ్రతిమాలి పని జరిపించుకోవా లనుకున్న ప్రయత్నాలు ఫలించలేదు!

తెలుగురాష్ట్రాన్ని పరమకిరాతకంగా విభజించిన డ్రామాలో ఆ కాంగ్రెసు వాళ్ళూ ఈ బీజీపే వాళ్ళూ కూడా సమపాపులే.

అసలెందుకు బీజేపీ వారు విడగొట్టటంకోసం తొడగొట్టారూ అంటే వారిదీ కాంగ్రెసుమార్కు వాదనే. వారికి తెలంగాణాలో ఏదో అమోఘమైన అధికారం సంపాదించగల అవకాశం పుష్కలంగా ఉందన్న పిచ్చిభ్రమ ఉండేది. అంతే.

ఎంత అరిచిగీపెట్టినా బీజేపీకి ఆంధ్రాలో అధికారం అనేది కల్ల. గగనకుసుమం కన్నా అబధ్ధం. అది నిజం. ఎప్పటికీ అంతేను.

ఎలాగూ మనకు అధికారం అప్పగించని ప్రాంతానికి ఎందుకు చేయాలీ సాయం అన్న హీనబుధ్ధి ఈ బీజేపీది.

దేశానికి చిన్నచిన్న రాష్ట్రాలే శ్రేయస్కరం అని ఈ బీజేపీ వాళ్ళెప్పుడో తీర్మానం చేసేసుకున్నారట. అందుకని తెలుగురాష్ట్రాన్ని ముక్కలు చేయాల్సిందే అని వాళ్ళు పట్టుబట్టారు అప్పట్లో.

మరి ఇంకాకొన్ని చిన్నరాష్ట్రాల డిమాండ్లు దేశంలో ఉన్నాయి కదా?

ఇంకొక్క చిన్న రాష్ట్రం ఊసైనా ఎత్తారా ఈ నాలుగేళ్ళల్లో అధికారం చేజిక్కించుకున్న బీజేపీ వాళ్ళూ అని?

నాలుగేళ్ళపాటు బ్రతిమాలటం బామాలటంతోనే తిప్పలుపడుతున్న ఆంద్రులు ఓపికచచ్చి బీజేపీమీద విరుచుకు పడుతున్నారంటే అది వాళ్ళ తప్పా?

తప్పే నంటున్నాయి ఒకట్రెండు చిల్లర పార్టీలు కూడా.

ఇరుకున బడ్డ బీజేపీకి అర్జెంటుగా ఒక అస్త్రం కావలసి వచ్చింది.

ఉందిగా ఒకప్పుడు పనిచేసిన చిన్నరాష్ట్రం మిన్నరాష్ట్రం అన్న నినాదం.

అది మళ్ళీ ముందుకు తెచ్చారు.

ఇప్పుడు అక్షరాలా ఘనతవహించిన బీజేపీ వారికి రాయలసీమ కష్టం గుర్తుకు వచ్చింది.

ప్రత్యేక రాయలసీమ అన్న నినాదం తెరమీదకు తెస్తున్నారు.

అంటే ఆంధ్రప్రదేశము చాలా పెద్ద ప్రదేశమూ, దాన్ని రెండు ముక్కలు చేయాలీ అన్నమాట.

మరి ఉత్తరప్రదేశము పెద్దప్రదేశమూ దాన్ని నాలుగుముక్కలు చేయాలీ అన్న మాటొకటి నానుతోంది కదా. అది ఎందుకు ప్రస్తావించరూ అని!

తెలుగుప్రజలారా!

ఆనందించండి. తెలుగువారికి ఇన్నాళ్ళకు రెండు రాష్ట్రాలు వస్తున్నాయని ఆనందించమని అప్పట్లో అన్నారు గుర్తుందా?

ఇప్పుడు ఇంకా అనందించండి.

బీజేపీ వారు తలచుకుంటే తెలుగురాష్టాలు రెండు కాదు మూడవుతాయి.

అద్భుతం కదూ!

అందుకని బీజేపీ వారికి నా విన్నపం ఒకటి చేస్తున్నాను.

అయ్యా ఆ రాయలసీమ రాష్ట్రం అనేది ఇవ్వటం గురించిన ఆలోచన ఉంటే వెంటనే ఇవ్వండీ దయచేసి. మరొక ముప్పై యేళ్ళో అరవైయేళ్ళో నాన్చి మళ్ళా సర్వం వారికే ఇచ్చే మరొక దిక్కు మాలిన విభజన కన్నా అది ఎంతో నయం. ప్రతిసారీ మమ్మల్ని దోపిడీ గాళ్ళూ అని ఎవరెవరో అరిచి ఆనక సర్వసంపన్నులుగా వాళ్ళూ అతిబీదవాళ్ళుగా మేమూ మిగిలే చిత్రాతి చిత్రమైన విభజన వద్దనే వద్దు.

కాని అయ్యా బీజేపీ వారూ, మీకు ఇంకా తెలుగునేల మీద సరిగ్గా అవగాహన కుదరటం లేదని నా అనుమానం.

కోనసీమ అని ఒకటుంది. అది స్వాతంత్రం వచ్చినతరువాత కూడా అభివృధ్ధి అనేదానికి కాంతిసంవత్సరాల దూరంలోనే ఉండిపోయింది.

ఆ మా కోనసీమకు కూడా ప్రత్యేకరాష్ట్రం ప్రసాదించండి దయచేసి.

పల్నాటిసీమ అన్న పేరు విన్నారా? లేదా? మా తెలుగు కవుల్లో శ్రీనాధుడు అని ఒకాయన ఒక పద్యంలో పల్లనాటిసీమ పల్లెటూళ్ళు అన్నాడు.  అదీ అభివృధ్ధికి ఆట్టే  నోచుకున్నది కాదని విన్నారా?

దానికీ ఒక ప్రత్యేకరాష్ట్రం ప్రసాదించండి.

అన్నట్లు 77లో పెద్ద ఉప్పెన వచ్చి ఆ ప్రళయంలో అనేకవేల మంది జనం చచ్చిపోయిన మా తెలుగు ప్రాంతం ఒకటి దివిసీమ అన్నది ఉన్నది. అక్కడా అభివృధ్ధి అనేది లేదని తీర్మానించేయరూ దయచేసి.  దివిసీమ రాష్ట్రం కూడా ఇచ్చేస్తే ఎంతో బాగుంటుంది.

చిన్నరాష్ట్రాల నమూనాలో మీరు ఎంత చిన్న రాష్ట్రం ఐతే అది మరీ చిన్న రాష్ట్రం అన్న ఏ తర్కాన్నీ ప్రస్తావించలేదని భావిస్తున్నాను. కాబట్టి మీరు మరికొన్ని నెలల్లో గద్దె దిగటం జరిగేలోగా, తెలుగునేలమీద వీలైనన్ని రాష్ట్రాలను ఏర్పాటుచేయండి.

మీ మేలు ఇప్పటికే మరువరానిదీ మరువలేనిదీ అన్నట్లుంది.

అది ఆచంద్రతారార్కం  అయ్యేలా చేసుకోండి మీ శాయశక్తులూ ఒడ్డి.

అది మీకు అసాధ్యం అనుకోము. మీకు సహాయం చేయటానికి మా అనైక్యతాపూర్ణమైన తెలుగునేలమీద బోలెడన్ని చిల్లరమల్లర రాజకీయపార్టీలున్నాయి.

ఐనా ఒక్కటి గుర్తుంచుకోండి. ఇంగ్లీషులో ఒక సామెత ఉంది Nothing recedes like success అని. మీ అధికారమూ శాశ్వతం కాదు, మీ ఉనికీ శాశ్వతం కాదు. మీరు బొక్కబోర్లా పడేలోగానే ఏర్పాటు చేయాలి మరి తెలుగునేలను మరిన్ని రాష్ట్రాలుగా!

కేంద్రంలో ఏ దిక్కుమాలిన పార్టీ అధికారంలో ఉన్నా చిన్నచిన్న రాష్ట్రాలుగా విడిపోయి కొట్టుకుంటున్నప్పుడు  ఆ రాష్ట్రాలలో దేనికీ కేంద్రాన్ని ఇబ్బందిపెట్టేంత ధైర్యసాహసాలుండవు. మీ చిన్న రాష్ట్రాల పాటవెనుక ఉన్న ఉద్దేశం ఇదే అని అందరికీ తెలుసును.

కాని మిగతా చోట్ల మీరు మీ రాష్ట్రాల పునర్విభజనలను చేయలేకపోయారూ అంటే అక్కడ మీ పప్పు లెందుకు ఉడకలేదో పాపం.  యధాప్రకారం తెలుగునేల మాత్రం మీ హాయిగొలిపే కత్తివాదరదెబ్బలకు ఎదురుచూస్తూ ఉన్నదని మరువకండి.


8 కామెంట్‌లు:

 1. కళింగ సీమ (ఉత్తరాంధ్ర) .... కూడా ఉందండోయ్. Machiavellian రాజకీయాలండి.

  రిప్లయితొలగించండి
 2. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేస్తారేమో. ఇప్పటికే తెలుగువాల్ల పరిస్థితి బుచికోయమ్మ బుచికి అయింది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. అందరికీ లోకువ ఆంధ్రుడే కదా
   అందుకనే నాటకా లాడుతోంది బీజేపీ.
   కుక్కలు చింపుతున్న విస్తరి అంటే బాగుంటుందేమో!

   తొలగించండి
  2. మొన్న భారతదేఅశం ఎందుకు విడిపోయిందో నిన్న ఆంధ్రా కూడా అందుకే విదిపోయింది పంపకాల లెక్కలు సరిపోని పైస్థాయి పెద్దలకి భోజనవసతి కోసం విడిపోయాయి.రేపు రాయలసీమలోనూ నిన్న తెలంగాణలో పుట్టిన ఉద్యమవీరుల లాంటి వాళ్ళు ఉంటే రాయలసీమ కూడా ఆంత వీరోచితంగానూ విడిపోతుంది - ఉంటే ఏమిటి, పుట్టిస్తారు. పెట్టుబడి పెట్టి మరీ తమ కోసం వొళ్ళు కాల్చుకు చచ్చే శ్రీకాంతాచారుల్ని ఇక్కడా తయారు చేస్తారు!

   తొలగించండి
  3. క్షమించాలి. నా వ్యక్తిగత అభిప్రాయం వేరు ఈ so called ఆత్మాహుల విషయంలో! ఇవన్నీ genuine కాకపోవచ్చును అనుకుంటున్నాను. ఉద్యమం పేరిట కొందర్ని బలిపశువుల్ని చేసి ఉండవచ్చునని నా అనుమానం. ఇది నిజం కాకపోవటానికి ఎంతో కొంత అస్కారం ఉంది. అలాగే ఈ అనుమానం నిజం కావటానికీ ఎంతో కొంత అస్కారం ఉందని నా నమ్మకం. ఆ మాటకు వస్తే శ్రీ కేసీఆర్ గారి నిరాహారదీక్ష మీద కూడా నాకు ఆట్టే నమ్మకం లేదు. నిరాహార దీక్షలో కృశించుతున్నాడనీ ఆందోళనకరంగా పరిస్థితి ఉందనీ వార్తలు వచ్చాయి. తీరా ఆయన పట్టు గెలిచి నిరాహారదీక్ష విరమించి ఆ మర్నాడే టీవీల్లో ఎలా దర్శనం ఇచ్చాడూ - పెళ్ళికొడుకులా ఆరోగ్యంగా - ఇదీ నా వ్యక్తిగతమైన అభిప్రాయమే. ఇలా అన్నందుకు ఖండనమండనలు వస్తాయేమో అది వేరే విషయం. రాజకీయ ఉద్యమాల ధోరణులమీద నాకున్న అపనమ్మకం గురించి ప్రస్తావించటానికే ఇది వ్రాయవలసి వచ్చింది.

   ఈ రోజుల్లో ఏ రాజకీయనాయకుడూ 100% నమ్మదగిన వాడు కాదు. అలాగే ఏ రాజకీయ ఉద్యమమూ 100% నమ్మదగినది కాదు. అందరు నాయకులూ వాళ్ళ ప్రయోజనాలకోసమే వస్తారు - పోతారు. మధ్యలో ప్రజలకోసం అన్న ఆందమైన Tag line వేసి మరీ రాజకీయాలూ ఉద్యమాలూ నడుపుతారు! తమాషా ఏమిటంటే ప్రజలూ ఆ నాయకులకోసమూ, ఈ ఉద్యమాల కోసమూ ఉద్రేకంతో ఊగి పోతూ బలికావటానికి సిధ్ధంగా ఉంటారు. అ అశ్చర్యం ఏమిటంటే మన దేశవాళీ మేతావులు కూడా ఏదో నాయకత్వానికో ఏదో ఉద్యమానికో కొమ్ముకాయకుండా ఎదగలేమన్న భ్రమతో తందానతాన అంటూ ఉంటారు. ముందుముందు ఇంకా ఎలాంటివి చూడబోతున్నామో తెలియదు.

   తొలగించండి
 3. రాయలసీమ రాష్ట్రం అక్కడి ప్రజలు కోరుకుంటే వస్తుంది తప్ప ఎదో ఒక పార్టీ చెప్తే రాదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇప్పుడు ఆంధ్రులు పడుతున్న కడగండ్లు అన్నీ కూడా ప్రజలు కోరుకున్నవేనా? ప్రజల పేరున జరిగేవన్నీ రాజకీయపక్షుల స్వార్థఫలితాలే. ప్రత్యేక రాష్ట్ర నినాదాలూ ఆ కోవలోనివే.

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.