24, ఫిబ్రవరి 2018, శనివారం

మన హనుమన్న యెంతో మంచివాడు


మన హనుమన్న యెంతో మంచివాడు భక్త
జనుల కుపకారములు సలుపువాడు

రామపాదభక్తురాలు రమణీమణి సీతమ్మ
కామాంధుడు రావణుచే కటకట బడుచుండ
స్వామి వార్త లెఱిగించి సంతోష పరచెను
స్వామికి సీతమ్మవారి జాడతెలియ జేసెను

మేటి రామభక్తుడు సౌమిత్రి మూర్ఛ జెందినపుడు
ధాటిగా ద్రోణగిరీంద్రమును పెకలించి తెచ్చి
చాటినాడు తన యుక్తిని శక్తిని మహనీయుడు
గాటమైన రాముని కౌగిలిలో మురిసినాడు

రామభక్తులందరకు రక్షకుడై యనిశమును
సామీరి సంచరించు ప్రేమతో నెల్లెడల
కామాది వికారములు తామసుల కృత్యములు
మోమాట మేమి లేక మొత్తి తరిమి వేయును