13, ఫిబ్రవరి 2018, మంగళవారం

జీవన్ముక్తి నారాయణకృపచే నగును


ఇది భగవంతుని యాజ్ఞ యిది శ్రీరాముని యాజ్ఞ
హృదయము నిర్మలమైతే కాని యీయబడదు ముక్తి

జీవభావమును చెందిన చిత్కళ జీవభావమును విడువకను
యేవిధమైన ప్రయత్నములైన నీషణ్మాత్రము ఫలించవు
సావాసము యీ ప్రకృతితో కొనసాగుచు నుండెడు నన్నాళ్ళు
జీవుడు సర్వకళామయుడైన దేవుని తత్త్వము గ్రహించడు

దుర్భరమగు యీ ప్రకృతిమాయకు దొఱకి భ్రమించే జీవునకు
గర్భనరకముల మాటిమాటికి గడుపక తీరనిదై యుండు
నర్భకు లట్టి జీవులందరకు హరియొక్కడె దిక్కై జ్ఞానా
విర్భావమునకు దారిచూపును వేరొక దిక్కనగ లేదు

తిరిగి తిరిగి యీ పృకృతిలోన తెలివి కలిగిన జీవునకు
పరిణతమై వైరాగ్యము జీవభావము దగ్ధబీజమగు
పరమనిర్మలహృదయుడు వాడు పరబ్రహ్మమే తానగును
నరులారా యీ జీవన్ముక్తి నారాయణకృపచే నగును