సెటిలర్. ఈ మాటకు అర్ధం నాకు తెలుసుననే అనుకుంటున్నాను. ఇదే కదా? "తన స్వస్థలం విడచి పరాయి ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకున్న వ్యక్తి" అని.
ఈ మాట విన్నప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది.
ఇదేదో తప్పుమాట అని కాదు. ఈమాటను తెలుగువాళ్ళు అన్వయిస్తున్న విధానం వలననే నాకు మనస్తాపం కలగతున్నది.
ఈ మాటను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో అనో లేదా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో అనో నా బాధ కాదు. తెలుగువాళ్ళే సాటితెలుగువాళ్ళ పట్ల ఎంత అవమానకరంగా ఎలా వాడుతున్నారో అని నా బాధ.
మన తెలుగువాళ్ళలో కూడా తోలుమందం మనుష్యులు కోకొల్లలుగా ఉన్నారు. కాని వాళ్ళతోపాటే నాలాంటి కొంచెం సున్నితమనస్కులు కూడా ఉన్నారు. తోలుమందం జనాభాకైతే పట్టించుకోకుండా కించిత్తూ బాధపడకుండా ఉండే హక్కు ఎలాగైతే ఉందో, నాలాంటి వారికి కొద్దో గొప్పో బాధపడే హక్కు కూడా అలాగే ఉంది. తోలుమందం జనాభాకు మౌనంగా మాటల్ని భరించే హక్కు ఎలా ఉందో (అదీ ఒక హక్కేనా అని ఎవరికన్నా అనుమానం వస్తే మంచిదే!), నాలాంటి వారికి భరించలేక తమ అభిప్రాయాన్నీ నిర్మొగమాటంగా చెప్పే హక్కూ అలాగే ఉంది. అందువలన ఒకరి అనుమతి అవసరం లేదు నా అభిప్రాయ ప్రకటనకు.
పాలపొంగు ఒకటి తెలుగుప్రజల రాష్ట్రాన్ని ఎలా రెండుముక్కలు చేసిందో అందరమూ చూసిందే. దరిమిలా ఒక తెలుగురాష్ట్రం (ప్రస్తుతానికి) రెండుగా మారి, తెలుగువారికీ రెండు రాష్ట్రాలు ఏర్పాటై, తమకు ఒక్క రాష్ట్రమేనా అని విచారించే అమృతహృదయులకు ఎలా ఊరట చేకూర్చిందో అందరికీ తెలిసిందే.
ఒకటి చివరకు రెండు ఐన తెలుగుప్రాంతంలో ఏర్పడిన ప్రభుత్వాలు చివరకు ఎలా అభివృధ్ధిపథంలో దూసుకొని పోతున్నాయో కూడా మనందరికీ బాగా అవగతం అవుతూ ఉన్నదే.
ఈ విషయంలో నాకు విచారించటానికి వ్యక్తిగతంగా కారణం ఏమీ లేదు. కాని చిక్కల్లా ఆ మహర్దినం దాకా స్వరాష్ట్రంలోనే ఉన్నవాడిని కాస్తా హఠాత్తుగా నా చిరనివాసప్రాంతంలోనే పరాయి వాడిని ఐపోవటమే. అలా ఐపోయానని నేను అనుకొనటం మానటం అంత ముఖ్యమైన సంగతి కాదు. నేను అలా పరాయివాడినీ అని ఘడియకు ఒకసారి గుర్తుచేసే సహృదయవాక్యాలను తట్టుకోవటం ఎంత కష్టంగా ఉంటుందీ అన్నదే ముఖ్యమైన సంగతి.
కాని ఈరాష్ట్రంలోనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణానికి ముందే వచ్చిన వాళ్ళు మాత్రమే తెలంగాణా వారిగానూ మిగతా వారంతా పరాయి వారుగానూ తెలంగాణా రాష్ట్రప్రభుత్వాధినేతయే చేసిన ప్రకటనలు ఎంతమందికి ఇంకా గుర్తున్నాయో నాకు తెలియదు. ఈకొద్ది సంవత్సరాలలోనే అదేదో గత త్రేతాయుగం నాటి సంగతి కదా ఇప్పుడెవ్వరికి పట్టింది అన్నట్లు మర్చిపోగల వాళ్ళకు ఒక నమస్కారం. అది నావల్ల కాదు. కానే కాదు. ఎందుకో చెప్పనివ్వండి.
నేను నలభైయేడేళ్ళ క్రిందట పొట్టచేత్తో పట్టుకొని వచ్చాను హైదరాబాదు నగరానికి. అప్పటికి అదింకా నిర్వివాదంగా తెలుగువాళ్ళ స్వరాష్ట్రానికి ముఖ్యపట్టణం. అందుచేత నేను అప్పట్లో నాస్వరాష్ట్రరాజధానికి ఉద్యోగనిమిత్తం వచ్చాను కాని ఏదో పరాయి ప్రాంతానికి ప్రవాసం పోలేదు. నేను వచ్చింది నా పొట్టపోసుకుందుకే కాని ఏదో తెలంగాణా ప్రజల పొట్టకొట్టి ఇంద్రుణ్ణో చంద్రుణ్ణో ఐపోయి పెత్తనం చేదామని కాదు. ఆ వచ్చింది కూడా భారతప్రభుత్వం అధీనం లోని సంస్థకు కాని ఇక్కడి ఏదో ప్రైవేట్ కంపెనీకి ఐనా కాదు.
నేను వచ్చిన కొద్ది కాలానికే నా కుటుంబం అంతా, మా నాన్నగారి నిర్యాణానంతరం, నా దగ్గర ఉండటానికి వచ్చారు. అందరం ఇక్కడే ఉన్నాం అప్పటినుండి. నాసోదరసోదరీమణులంతా ఈ హైదరాబాదులోనే చదువుకున్నారు. మా చెల్లెళ్ళందరినీ హైదరాబాదు వాస్తవ్యులకే ఇచ్చి వివాహాలు చేసాం.
పందొమ్మిది వందల యాభైఆరు నవంబరు కన్నా ముందుగానే దీర్ఘదర్శనులై మా తాతగారు హైదరాబాదు వచ్చి స్థిరావాసం ఏర్పరుచుకొన లేదు కాబట్టి మేమంతా పరాయి వాళ్ళం అన్న తెలంగాణా ప్రభుత్వం మాట ఎలా సబబు అని మాకు అనిపిస్తుంది చెప్పండి?
ఈ రెండురాష్ట్రాలు ఏర్పడినప్పటినుండీ నాకు 'సెటిలర్' అన్న బిరుదు ఇస్తానంటే నేనెలా ఒప్పుతాను చెప్పండి?
ఆంధ్రాప్రాంతం నుండి హైదరాబాదుకు వచ్చి అర్ధశతాబ్దం కావస్తున్నది. అక్కడివారికి ఇప్పుడు దాదాపుగా పరాయివాడిని. ఇక్కడి వారికి కూడా నేనొక 'సెటిలర్'ను అనగా పరాయివాడికి. చాలా బాగుంది. ఇదెక్కడి న్యాయం?
మా ఆఖరు తమ్ముడు ఇక్కడే జన్మించాడు. ఇక్కడే చదువుకున్నాడు. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు వాడికీ ఒక కుటుంబం ఉంది. వాళ్ళంతా కూడా 'సెటిలర్స్' అనటం అసహజం అభ్యతరకరం కాదా?
నాలాంటి వారు ఈహైదరాబాదులో కొల్లలు. ఎవరి కథ వారిది. వాళ్ళంతా పొట్ట చేతపట్టుకొని ఉద్యోగాల కోసం వచ్చినవారే.
అంద్రాప్రాంతం నుండి వచ్చిన వారంతా దుష్టులు అని అ తెలంగాణా ఉద్యమం రోజుల్లో తిట్టిపోసింది చాలు. ఒక పెద్దమనిషి, నా స్నేహితులే లెండి, అవసరం ఐతే ఆంద్రావారంతా చచ్చిపోయి ఐనా తెలంగాణా రావలసిందే అని చెప్పారు. ఉద్యమం వేడి అట. వేడి! ఎంత చక్కని మాట.
ఆంద్రావాళ్ళు బిర్యానీచేస్తే పేడలా ఉంటుంది అని వెక్కిరించి వెకిలిగా నవ్వులు చిలికించిన పెద్దమనిషి ఓట్ల అవసరం రాగానే ఆంధ్రావాళ్ళమీద కొంచెం ప్రేమ ఒలికించేమాటలూ మాట్లాడారు అనుకోండి. అంతమాత్రం చేత ఆ గుండెల్లో ప్రేమను చూడటం నావల్ల కాదు.
సరే జరిగిందేదో జరిగిపోయింది. రాజకీయాల్లో బోలెడు జరుగుతూ ఉంటాయి. వాటికి ఎవరూ ఏమీ చేయలేరు.
కాని ఇంకా అంధ్రప్రాంతం వారిని 'సెటిలర్స్' అంటూ వేరుగా చూడటం సమంజసమా? ఆప్రాంతం నుండి వచ్చి ఈతెలంగాణాలో స్థిరపడిన కుటుంబాలు మరొక ఐదువందల యేళ్ళైనా సెటిలర్స్ అనే పిలవబడుతారా?
ఈహైదరాబాదులో అంధ్రప్రాంతం నుండే కాక భారతదేశంలోని అనేక ప్రాంతాలనుండి వచ్చి 'సెటిల్' ఐన కుటుంబాలు కొల్లలు. కాని చూస్తుంటే వారెవర్నీ 'సెటిలర్స్' అన్నట్లు కనిపించదు. ఆంద్రప్రాంత నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన ఈ సాటి తెలుగువాళ్ళే తెలంగాణావారికి పరాయి వారు, 'సెటిలర్స్' అన్నమాట. భారతదేశంలోని ఏయితర ప్రాంతనుండి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారూ తెలంగాణా ద్రోహులు కారు. సాటి తెలుగువారైన ఆంధ్రాప్రాంతం వారే తెలంగాణాద్రోహులు (పుట్టుకచేతనే ఆంధ్రాప్రాంతం వారు తెలంగాణాద్రోహులు అన్నమాటనూ రాజకీయులు అనగా విన్నాను.). కాబట్టి సాటి తెలుగువారికి ద్రోహులు అని నిత్యం గుర్తుచేయటానికి వారిని మాత్రమే సెటిలర్స్ అంటారన్నమాట.
ఎన్నికలూ వగైరా అవసరాలు వచ్చినప్పుడు ఓట్లకోసం అంధ్రప్రాంతం వాళ్ళకి మెరమెచ్చు మాటల చెప్పే ఈరాజకీయులు 'ఆంధ్రానుండి వచ్చినవాళ్ళూ మావాళ్ళే' అంటూ ఉండటం విన్నదే. ఆమాటల్లో ఉన్న నిజాయితీ గురించి మేధావులు అనబడే కొందరు ఎంతో చక్కటి విశ్లేషణలు అందిస్తారనటంలో సందేహం లేదు. కాని అవన్నీ పైపై మాటలే అన్నసంగతి మాత్రమే అసలు నిజం.
నేను అమెరికాలో కొన్నేళ్ళు ఉండి వచ్చాను. ఎందరో అమెరికాలో సెటిల్ అయ్యారు మన తెలుగువాళ్ళు. కాని అక్కడ సెటిల్ ఐనా మన వాళ్ళని ఎవరూ అక్కడ 'సెటిలర్స్' అనరు.
ఏదో నాగోడు నేను చెప్పుకున్నాను. ఎందరు ఏకీభవిస్తారో, ఎవరు ఏకీభవించరో అన్నది వేరే విషయం. సత్యం కళ్ళముందే ఉంది. అటు ఆంధ్రకూ ఇటు తెలంగాణకూ చెందని రెండింటికీ చెడిన రేవడులే ఈ సెటిలర్స్ అన్నదే ఆనిజం.
ఒక్కొక్కసారి అనుకుంటూ ఉంటాను. నేను కూడా ఎంతో మంది సాటి తెలుగువారిలాగే ఆ అమెరికాలోనే సెటిల్ అయ్యుంటే ఈఅవమానకరమైన సెటిలర్ టైటిల్ నా నెత్తి మీద ఉండేది కాదు కదా అని.
4, డిసెంబర్ 2020, శుక్రవారం
సెటిలర్స్
24, నవంబర్ 2020, మంగళవారం
అసంభావితాలు?
ఈ జిలేబి గారికి బహుసరదా ఐన వ్యాపకాల్లో రెండవది తన బ్లాగులో తానే పుంఖానుపుంఖాలుగా వ్యాఖ్యలు వ్రాసుకోవటం. మొదటి వ్యాపకం గురించి అందరికీ తెలిసిందే ఎక్కడపడితే అక్కడ కందాలను పోలినవి వ్రాస్తూ వీలైన చోట్ల పుల్లలు పెడుతున్నట్లు హడావుడి చేస్తూ ఇల్లేరమ్మలాగా బ్లాగ్లోకం అంతా కలయదిరుగుతూ ఉండటం.
ఆవిడ తన ద్వంద్వం అన్న టపా క్రింద తానే వ్రాసిన ఒక వాఖ్యలో ఇలా అన్నారు.
ఇందులో రెండు అసంభావితాలున్నాయి. ఏమిటవి ? :)
చిలుకలు, సింహముల్, కరులు చెన్నుగ చక్కెర బొమ్మలాయె నా
వెలుతురు బోవ గుట్టుగ ప్రవేశము చేయుచు కూక లేకనా
యెలుకలు మత్తవారణము నీడ్చెఁ గనుండు కలుంగులోనికిన్,
పిలిచె జిలేబి యయ్యరును భీతిని చెందుచు వంటయింటిలోన్!
ఇక్కడ విన్నకోట నరసింహా రావు గారు అసంభావితాలు అంటే ఏమిటా అని సందేహం వెలిబుచ్చారు. దానికి జిలేబీ గారు వినరా వారూ మీరు తెలుగువారేనా ? అసంభావితాలు అన్న పదం తెలీక పోవడమేమిటండీ అని హాశ్చర్యం వెలిబుచ్చారు. మరి "ఆంధ్రభారతి" వారు కూడా అటువంటి పదమేమీ లేదు పొమ్మన్నారు అని విన్నకోట నరసింహా రావు గారు మరలా విన్నవించుకొన్నారు. మరి జిలేబీ గారు ఉలకరు పలకరు. చిత్రం.జిలేబీకీ సైలెన్స్ అన్నమాటకీ చుక్కెదురు కదా.
అవునూ? ఈ అసంభావితాలు అంటే ఏమిటీ?
ఈ సందేహం మీకూ వచ్చిందా?
ఐతే చదవండి.
ముందు ఒక పదం భావితం అన్నదానిని గురించి తెలుసుకోవాలి. భావితం అన్నది భావితము అనే మాటకు కొంచెం క్లుప్తరూపం.
భావన అన్న మాట గురించి తెలుసును కదా. ఆలోచన అని దానికి అర్ధం అని కూడ తెలుసును కదా. అలాగే ఇంచుక్ ప్రత్యయం చేర్చితే ఈ భావన అన్న మాటకు మనకు భావించు అన్న మాట వస్తున్నదనీ తెలుసును కదా. ఇప్పుడు ఈభావించు అన్న మాట గురించి కూడా సాధారణంగా వాడబడేమాట కాబట్టి దాని గురించి కూడా తెలుసును కదా. "భావన చేయు" అన్న అర్ధంతో భావించు అన్న మాటను వినియోగిస్తారని అందరూ సులభంగానే గ్రహిస్తారు కాబట్టి ఇక్కడ ఎవరికీ ఏ యిబ్బందీ లేదు కదా.
ఇప్పుడు ఆ భావితము అన్న మాట భావన అన్న మాట నుండి ఏర్పడింది అని సులువుగానే తెలుస్తుంది తెలుగులోకానికి. భావింంచ బడినది భావితము. మనం ఏదైనా వస్తువును గురించి కాని విషయాన్ని గురించి కాని భావిస్తూ ఉంటే, అదేనండీ భావన చేస్తూ ఉంటే ఆ వస్తువో భావనో ఇక్కడ భావితము అన్నమాట. మీరు ఆఫీసు పని చేస్తూనో ఆరో తరగతి పుస్తకం చదువుతూనో పులుసటుకుల్ని గురించి మనస్సులో ఆలోచిస్తున్నారనుకోండి. అప్పుడు ఆ భావితము ఐనది పులుసు అటులుకు అన్నమాట. అన్నమాట కేం లెండి, ఉన్నమాటే.
మీరెప్పుడైనా సంభావన అన్న మాట విన్నారా? వినే ఉంటారు లెండి. ఈసంభావన అన్న మాటకు రెండు అర్ధాలున్నాయి. గౌరవపూర్వకంగా అందిచేది, మనస్సులో చక్కగా తలచుకొనేది అని. నిజానికి మొదట చెప్పిన గౌరవపూర్వకంగా అందించేది అన్న అర్ధం కూడా మనస్సులో చక్కగా ఇష్టపూర్వకంగా తలంచుకొని ఇస్తున్నది అన్న భావన నుండే ఏర్పడిన అర్ధం. కాబట్టి సంభావన అంటే మనస్సులో చక్కగా భావించటం. మనస్సులో భావించటం అన్న అర్ధంలో భావన అంటే సం అన్న ఉపసర్గను ముందు చేర్చి సం+భావన => సంభావన అనటం ఎందుకంటే ఆ తలంచుకోవటం అన్నది ఎంతో ప్రీతితో చేయటం అని నొక్కి చెప్పటానికి తప్ప మరేమీ లేదు.
ఏమాటకామాట చెప్పుకోవాలి సంభావన ఇస్తున్నారు అంటే లెక్కప్రకారం ఎంతో ప్రీతితో అదరించి ఏదన్నా ఇస్తున్నారు అని సుళువుగానే అందరికీ బోధపడుతూనే ఉన్నా అన్ని సందర్భాల్లోనూ అది పైపైపలుకే. ఇప్పుడు అలా అంటే మనవాళ్ళకి అర్ధం అవుతూ ఉండవచ్చును కాని పూర్వమూ అంతేనూ అంటేనే గొప్ప హాశ్చర్యం కలుగుతుంది.
ఒకప్పుడు అడిదం సూరకవి గారు ఎవరింటికో పనిబడి వెళ్ళారట. సరిగ్గా ఆనాడు అక్కడ ఆ గృహస్థు ఏదో శుభకార్యం చేసుకుంటున్నాడు. ఎందరో వచ్చారు అక్కడికి సంభావనల కోసం. ఏం చేస్తారు చెప్పండి. ఈ బ్రాహ్మలంతే. నన్నయ్యే అనేశాడు కదా ఆదిపర్వంలో "వసువులు వసుహీనవిప్రులక్రియ పరగి దక్షిణాశ్రితులైరి" అని. ఈముక్కలో భలేసొగసుగా రెండర్ధాలు వస్తాయి దక్షిణాశ్రితులైరి అన్నప్పుడు. వసువులు దక్షిణదిక్కుగా పారిపోయారని చెప్పటం ఒకటి ఐతే మరొక ఆ పారిపోవటాన్ని డబ్బులేని బ్రాహ్మలు దక్షిణలను ఆశ్రయించి నట్లు అని అనటం. ఏం చేస్తారు గతిలేని వారు, ఎవరో ఇంత సంభావన అని చెప్పి పడేస్తే, ఆ అరకొరకే ఆనందపడి వారిని ఆశీర్వదించి పోవటం తప్ప. సరే ఆ గృహస్థు ఇంటికి అలా దక్షిణలకోసం బోలెడు మంది వచ్చారు. గుమ్మందగ్గర కొందరు వీళ్ళని చూసుకొందుకు ప్రత్యేకంగా ఉన్నారట. అబ్బెబ్బే వాళ్ళు దక్షిణలు ఇచ్చి పంపటానికి కాదండి. సెలెబ్రిటీ బ్రాహ్మల్ని తిన్నగా లోపలికీ, మిగిలిన జనాభాని దొడ్డిలోనికి పంపించటానికి. కార్యక్రమంలో సెలెబ్రిటీలకు దక్షిణలు ఇచ్చి ఆశీర్వాదాలూ పద్యపంచరత్న స్తుతులూ వగైరా అందుకొన్నాక గృహస్థు ఆనవాయితీగా దొడ్డిలోనికి వచ్చాడు అక్కడ పోగైన బ్రాహ్మలకి సంభావనలు ఇవ్వటానికి. అప్పట్లో సెలెబ్రిటీకి రూపాయి సంభావన. రూపాయేనా అనకండి అది నేటి ఒక ఐదొందలైనా చేస్తుంది. దొడ్డిసంభావన లెక్క పావలా. వరసగా అందరూ వచ్చి గృహస్థు దగ్గర పావలా సంభావన పుచ్చుకొని వెళ్తున్నారు. హఠాత్తుగా గృహస్థు ముందుకు వచ్చి చేయి జాచిన ఒకాయన్ను చూసి తెల్లబోయాడు. "అయ్యయ్యో ఇదేమి చోద్యం భావగారూ మీరిక్కడ ఉన్నారేమిటీ లోపలికి దయచెయ్యక" అని గడబిడపడ్డాడు. సూరకవి నవ్వేసి, ఈవేళ ప్రాప్తం ఇంతే భావగారూ అన్నాడట. ఇంతకూ ఇదంతా ఎందుకు చెప్పుకున్నాం అంటే, ఇలా ఇచ్చే దొడ్డిసంభావన అత్యంత ప్రీతిపూర్వకం కాదు కాని ఉట్టి విధాయకం అని తెలుస్తున్నది కదా, దీన్ని బట్టి సంభావన అంటే ఇలా గూడా ఉండవచ్చునూ అని తెలుసుకుందుకు అన్నమాట.
ఇప్పుడు సంభావితము అంటే ఏమిటో మీకు చూచాయగా బోధపడి ఉంటుంది. ఏ విషయం లేదా వస్తువు మనస్సులో ప్రీతిపూర్వకంగా తలచుకోబడిందో అది సంభావితము అన్నమాట. నిజంగా అంతే. ఐతే కవులు కొంచెం డాంబికంగా తమ గణాలూ గట్రా బాగా కుదరటానికీ అనిచెప్పి ఉత్తుత్తినే కూడా భావితము అనటం బదులు సంభావితము అని వాడిపారేస్తూ ఉంటారు. అది మనం గమనించి సందర్భాన్ని బట్టి ఆ 'సం' అన్న ఉపసర్గని కోవలం పూరణాయాసం క్రిందో బడాయి క్రిందో లెక్కగట్టి మరీ అంత పట్టించుకోకుండా ఉంటే సరిపోతుంది.
అలాగని కవులంతా ఊరకే సంభావిత అన్న మాటను భావిత అంటే సరిపోయే చోటకూడా బడాయికి వాడేస్తారని అనుకోకండి. మహాకవులు తెలిసే వాడుతారండీ. కావలిసి వస్తే మీరీ కవిబ్రహ్మ గారి పద్యం చూడండి.
ఉ. నీవును జూచి తట్టి సభనేని వినంబడ దేయుగంబులన్
భూవలయంబులో నది యపూర్వము సర్వమనోజ్ఞ మిష్టభో
గావహ మేక్రియం బడసె నయ్య మహాత్ముఁడు దాన నేమి సం
భావిత భాగ్యుఁ డయ్యెను బ్రభాకర తేజుఁడు ధర్మజుం డిలన్.
ఎంత గడుసుగా సొగసుగా చెప్పారో చూసారా ధర్మరాజు గారి భాగ్యం గురించి? రాజసూయం తర్వాత రగిలిపోతున్న ధుర్యోధనుడు అంటున్నాడూ, ధర్మరాజు గారి భాగ్యం అక్కడికి వచ్చిన జనం అందరిచేతా సంభావితం ఐనది అని. అంటే ఆ రాజలోకమూ తదితరులూ అందరూ ఆయన భాగ్యగరిమని మనస్సులో మిక్కిలి ప్రీతితో మనస్సుల్లో తలచుకుంటున్నారని అసూయతో రగిలిపోతూ దుర్యోధనుడు 'అయన భాగ్యం సంభావితం ఐనదీ' అంటున్నాడు. అదీ మహాకవి ప్రయోగం అంటే!
మరి అసంభావితము అంటే ఏమిటీ అన్న ప్రశ్న గురించి ఇప్పుడు ఆలోచించాలి.
ఈ 'అ' అన్న ఉపసర్గను వ్యతిరేకార్థంలో వాడుతాం అన్నది అందరికీ తెలిసిందే. అందుచేత సంభావితము కానిది అసంభావితము అన్న మాట.
మీరు పులుసటుకుల గురించి భావిస్తూ ఉంటే అది సంభావితము అనుకోవచ్చును. భేషుగ్గా అనుకోవచ్చును. మరి ఈ సందర్భంలో అసంభావితములు ఏమిటండీ? ఇక్కడ సంభావితము కానిది అని కదా. అంటే పులుసటుకులు కానిది అని అర్ధం. అందుబాటులో ఉన్నవో కానివో కాని పులుసటుకులు కాని సవాలక్ష ఖ్యాద్యపదార్దాల్లో ప్రతిదీ అసంభావితమే అన్నమాట.
ఏడ్చినట్లుంది. ఇది ఫలానా అని నిర్దేశించక ప్రపంచంలో నేను తలచుకొనే ఫలానాది కానిది అని డొంకతిరుగుడు ఏమిటీ అనవచ్చును మీరు. మరంతే. అదే అసంభావితము అన్న మాటకి అర్ధం.
ఒక్కసారి జిలేబీ పద్యాన్ని పరిశీలనగా చదివి అర్ధం చేసుకోండి.
అయ్యబాబోయ్ అంటారా. నేనూ అదే అంటానండీ.
ఊరికే మాటవరసకి అర్ధం చేసుకోండి అన్నాను. అందులో జిలేబి సంభావించినవి ఏమన్నా ఉంటే మిగిలినవన్ని అసంభావితాలు అన్నమాట.
అదీ జిలేబీ "ఈ పద్యంలో రెండు అసంభావితాలున్నాయి. ఏమిటవి?" అనటం వెనుక ఉన్న ఆంతర్యం. మరింకేం అవుతుందీ? అంతే కావాలి.
కాని ఎక్కడో తేడా కొడుతున్నదా.
మీరు సరిగానే గమనించారు. జిలేబీ గారి పద్యం (పద్యం లాంటిది!?) చదివిన తరువాత కూడా మీ బుఱ్ఱలు అమోఘంగా పనిచేస్తున్నాయంటే గట్టిబుఱ్ఱలే! అభినందనలు.
నేనైతే అంత సాహసం చేయలేదు. ఈ వ్యాసం వ్రాయాలి కదా! బుఱ్ఱని జాగ్రతగా చూసుకోవాలి కదా!
సరే విషయంలోనికి వస్తున్నాను.
మీరెప్పుడన్నా కావ్యదోషాలు అన్న మాట విన్నారా?
మూడురకాల దోషాలను కావ్యంలో జాగ్రతగా కవులు పరిహరించాలీ అని పెద్దలు చెప్తారు. అవి అతివ్యాప్తి, అవ్యాప్తి, అసంభవం అనేవి.
అతివ్యాప్తి అంటే అక్కడొక నల్లని కాకి ఉంది అని చెప్పటం లాంటిది. కాకులన్నీ నల్లగానే ఉంటాయికదా. (కోటి కొక బొల్లికాకి ఉంటే ఉండనీండి). కాకి అంటే సరిపోయే దానికి నల్లనికాకి అని చెప్పటం అనవసరం. ఇది అతివ్యాప్తి అంటారు.
అవ్యాప్తి అంటే అరుదైన విషయాన్ని సాధారణం అన్నట్లు చెప్పటం. అక్కడ పదో పదిహేనో త్రాచుపాములున్నాయి, ఒక్కోటీ పది పది-పన్నెండు అడుగుల పొడవుంది అని చెప్పటం. త్రాచుపాము ఎక్కడన్నా అరుదుగా ఒకటి పదడుగులు ఉందంటే అది వేరే సంగతి కాని ఓ గుంపు త్రాచులు పన్నెండేసి అడుగులున్నవి ఉన్నాయని చెప్పటం బాగోదు. అలా ఎక్కడా ఉండదు. ఇటువంటివి అవ్యాప్తి.
ఇంక అసంభవం అంటే, వాడా గుఱ్ఱాన్ని రెండుకొమ్ములూ గట్టిగా పట్టుకొని లొంగదీసుకున్నాడు అని చెప్పటం వంటిది. కొమ్ములుండవు గుఱ్ఱాలకి. అందుచేత గుఱ్ఱాన్ని రెండుకొమ్ములూ గట్టిగా పట్టుకొని లొంగదీసుకోవటం అసంభవం.
ఇకపోతే నాదృష్టిలో మరొక మూడు కావ్యదోషాలున్నాయి. అవి అనుచితం,అసందర్భం, అసభ్యం అని. ఏదైనా సందర్భంలో ఉచితం కాని విధంగా విషయం గురించి చెప్పటం అనుచితం ఐతే సందర్భానికి అతకని విషయాన్ని చెప్పటం అసందర్భం. ఇంక అసభ్యం అంటే వేరే చెప్పలా? ఏది (పదుగురు ఉండే) సభలో ప్రస్తావించటం నాగరికప్రవర్తన కాదో అటువంటిది పదుగురినీ చదవమని కావ్యంలో వ్రాయటం.
జరగటానికి వీలే లేని విషయాలు అసంభవాలు కదా. తన పద్యంలో అసంభవమైన విషయాలు రెండు ఉన్నాయని సూచించటానికి జిలేబీ గారు "రెండు అసంభావితాలున్నాయి" అని ఉండవచ్చును అనుకుంటున్నాను. రెండు అసంభవాలు అనే అనవచ్చును కదా మరి అసంభావితాలు అనటం ఎందుకు అని మీరు అడగవచ్చును.
బాగుండండోయ్ నన్నడుగుతారేమిటీ?
ఏమో కొంచెం డాంబికంగా గంభీరంగా ఒక ముక్క వాడుదాం అని అనుకొని అలా అన్నారేమో మరి జిలేబీగారు.
నాకు తెలియదు. ఆ జిలేబీ గారికే తెలియాలి.
మరైతే ఈ వ్యాసం ఎందుకు వ్రాసినట్లూ.
ఎందుకంటే జిలేబీకి ఇంకేపనీ తోచక ఒక పద్యం. నాకేమో మరేమీ తోచక ఈ వ్యాసం.
3, జులై 2020, శుక్రవారం
దగాకోర్లూ మోసగాళ్ళూ అందరూ ఉన్నత కులజులేనా?
ఇక్కడ చర్చకోసం వైద్యరంగాన్ని కూడా కలిపి ప్రసంగిస్తున్నాను. అంతమాత్రం చేత ఆ వైద్యరంగం పట్ల నాకేదో ద్వేషం వంటిదేదో ఉందనో లేదా జ్యోతిషం పట్ల నాకు మితిమీరిన ప్రేమ ఉందనో భావించవద్దని మనవి.
రాజారావు గారు ఒక మాట అన్నారు, నమ్మకమే జ్యోస్యుల వ్యాపార పెట్టుబడి అని. వారి భావాన్ని ప్రత్యేకించి విశ్లేషించి చెప్పనవసరం లేదు. వారు సూటిగానే చెప్పారు. ఒకముక్క అడుతున్నాను. మనం హాస్పిటళ్ళచుట్టూ తిరుగుతున్నాం. ఒకప్పుడు ఇంత లేదు. ఇప్పుడు అంతా కార్పొరేట్ వైద్యం. ఫామిలీ డాక్టర్ అన్న పధ్ధతి లేకుండా పోయింది. ప్రతి చిన్న సమస్యకు కూడా స్పెషలిష్టు దగ్గరకు పరుగెడుతున్నాం. మళ్ళా కార్పొరేట్ హాస్పిటళ్ళలో వైద్యం పేర దోపిడీ జరుగుతోందనీ నిత్యం గోల పెడుతూనే ఉన్నాం. మరి ఆ దోపిడీకి కారణం ఏమిటి? మన నమ్మకమే పెట్టుబడిగా ఆ హాస్పిటళ్ళు దోపిడీ చేయటం లేదా? అవసరం లేని టెష్టులు చాలా అవసరం అని ఆ హాస్పిటళ్ళలో డాక్టర్లు మనని నమ్మించటం లేదా? అవసరం ఏమాత్రం లేకపోయిన సందర్భాల్లో కూడా అతితరచుగా ఈమధ్య పేషంట్లని ఈ డాక్టర్ల చేత అక్షరాలా చెప్పించి మరీ ఐసీయూల్లో కుక్కటం లేదా ఈ కార్పొరేట్ హాస్పిటళ్ళు? కాని మనం తొందరగా నమ్మకమే డాక్టర్ల వ్యాపార పెట్టుబడి అనో నమ్మకమే హాస్పిటళ్ళ వ్యాపార పెట్టుబడి అనో ఎందుకని అనటం లేదూ? ఎందుకంటే ఆధునిక విజ్ఞానం ఈ డాక్టర్లు వాడుతున్నారు కాబట్టీ ప్రాచీనమై తుప్పుపట్టిన జోస్యాన్ని జ్యోతిష్యులు వాడుతున్నారు కాబట్టీ కదా?
విన్నకోట నరసింహారావు గారు అన్నట్లు అంతావ్యాపారమయం ఐపోయింది. అలా జ్యోతిషాది పాత శాస్త్రాలే కాదు అధినిక వైద్యాది విజ్ఞాన శాస్త్రాలూ నేడు వ్యాపారమయం ఐపోయాయి. నిజం.
చాలామంది జ్యోతిషాన్నిఆధునిక వైద్యం ఎదురుగా నిల్చోబెట్టటాన్ని హర్షించలేక పోవచ్చును. కాని మనం ఏమనుకుంటున్నాం అన్నది అటుంచి జ్యోతిషం ఒక వేదాంగం. ఒక శాస్త్రం. మనం నమ్మినా నమ్మకపోయినా ఏశాస్త్రమూ కూడా శాస్త్రం కాక పోదు.
పొట్టకూటి వేషగాళ్ళు చేరి భ్రష్టుపట్టించనిది ఏదన్నా శాస్త్రం ఉందా? అది సంప్రదాయిక వైదిక శాస్త్రాల్లో ఐనా, ఆధునిక విజ్ఞానశాస్త్రాల్లో ఐనా? అందుకే ఇక్కడ పోలికతెచ్చి విశ్లేషించి చూపటం. దయచేసి అర్ధం చేసుకోగలరు.
ఆధునికవైద్యశాస్త్రాన్ని సొమ్ములు సంపాదించుకొనేందుకే ఎక్కువగా వాడుకుంటున్నారా లేదా నేటి డాక్టర్లలో హెచ్చుమంది? అంత మాత్రాన ఆధునికవైద్యం బూటకం అని మనం అనలేం కదా. కాని సుళువుగా పొట్టకూటి జోస్యులను చూపి జ్యోతిషశాస్త్రం బూటకం అనటంలో అంత న్యాయం లేదేమో అన్నది ఆలోచించాలి.
ఇద్దరు మంచి డాక్టర్లే ఐనా చేసే చికిత్సలో పైకి ఐనా తేడా ఉంటోంది కదా, అది మనం అర్ధం చేసుకుంటున్నాం కదా సహజమే అని? కాని ఇద్దరు జోస్యులు విభిన్నమైన ఫలితాలు చెప్పినంత మాత్రాన అదిదో చూడండి జ్యోతిషం శాస్త్రం కాదు బూటకం అని వేరే ఋజువు కావాలా అనటంలో తొందరపాటుదనం ఉందేమో అని కూడా ఆలోచించాలి.
ఆవలివాడి భయం అన్నది సొమ్ము చేసుకుందుకు లేదా భయపెట్టి మరీ ఆ భయం నుండి లాభపడటానికి ప్రయత్నించటం అన్నది తప్పుడు మనుషుల ఆలోచనావిధానం. అటువంటి విధానంలో జోస్యులు దిగ్విజయంగా బ్రతగ్గలిగితే వారిలో అత్యధికులు కోటీశ్వరుగా ఉండాలి. కాని అత్యధికులు ఏదో పొట్టకూటికోసం జ్యోతిషాన్ని నమ్ముకొనే వారిగా ఉన్నారన్నది గమనించ దగిన సంగతి. అదే సమయంలో విజ్ఞులు మరొక విషయం గమనించగలరు. నేటి డాక్టర్లలో హెచ్చుమంది రోగుల భయపెట్టి మరీ ధనసంపాదన చేస్తున్నారు. వారిలో అత్యధికులు దినదిన గండంగా యేమీ బ్రతకటం లేదు.
భవిష్యత్తును ముందుగా తెలుసుకోవాలనుకోవడం దురాశ . ఈ మాట తప్పక ఒప్పుకోవాలి. ఎంతో నిజం. ఒక జోస్యుడి దగ్గరకు వెళ్ళే సగటుమనిషి రాబోయే కాలంలో అన్నా కాస్త పరిస్థితులు మెరుగుపడతాయా అన్న ఆశతో వెళ్తున్నాడు కాని, రేపు ఎన్నిమేడలు కట్టబోతున్నానో అన్న దురాశతో వెళ్ళటం లేదు. నిజానికి అంతా బాగున్నప్పుడు ఎవడూ వైద్యుడి దగ్గరకూ వెళ్ళడు జోస్యుడి దగ్గరకూ వెళ్ళడు!
జోస్యుడిని ఎంత త్వరగా పరిస్థితులు మెరుగౌతాయీ అని అడుగుతాడు సగటుమనిషి. వాడే డాక్టరును జబ్బు ఎంత తొందరగా నయం అవుతుందీ అనీ అడుగుతున్నాడు. డాక్టరును అడిగినప్పుడు అది ఆశగానూ జోస్యుడిని అడిగినప్పుడు దురాశగానూ చెప్పవచ్చునా? అలా చూడటం సబబు కాదేమో అని యోచించ వలసింది.
రాజారావు గారు జ్యోతిష్యం నమ్మడం , కార్తాంతికులు నమ్మబలకడం మోసం ,దగా అని నిష్కర్ష చేసారు. నిజానికి ఎవరన్నా అసత్యపూర్వకంగా మరొకరిని నమ్మబలకటం ఎప్పుడూ దగా క్రిందకే వస్తుంది. ఆనమ్మబలికే వాడు కార్తాంతికుడైతే మాత్రమే కాదు అలాంటి వాడు కార్పొరేట్ హాస్పిటల్ డాక్టర్ ఐనా సరే మనం మోసం దగా అనే అనాలి.
అన్నిరంగాల్లోనూ ఈ మోసం దగా ఉన్నదని మనకు తెలుసును. పిల్లలను మళ్ళా కార్పొరేట్ బళ్ళలో వేస్తున్నాం. వాళ్ళు లక్షల్లో ఫీజులు గుంజుతున్నారు. కాని అరకొర చదువులు చెప్తున్నారని తల్లిదండ్రులు అంటున్నారు. అప్పుడు ఆ కార్పొరేట్ విద్యావ్యవస్థనిండా మోసం దగా ఉన్నదని మనం ఒప్పుకోవాలా లేదా?
నమ్మి ఓట్లు వేసాక రాజకీయవ్యవస్థలో జనానికి అందుతున్నది సాధారణంగా నమ్మకద్రోహాలే. అక్కడా మోసం దగా తప్ప మరేమీ లేదు. అదీ మనం ఒప్పుకుంటున్నాం.
ఇన్ని చోట్ల, మరిన్ని చోట్ల, నిజానికి అన్ని చోట్లా మోసం దగా వంటివి మాత్రమే చూస్తూనే కేవలం పొట్టకూటి జోస్యులను మాత్రమే మోసగాళ్ళు దగాకోర్లు అని శపిస్తూ జ్యోతిషం అంతా హంబగ్ అనేయటం ఏమంత న్యాయమైన పనో మనం ఆలోచించవలసి ఉంది తప్పకుండా.
ఇంక ముగించే ముందు ఒక్క సంగతి మనవి చేయదలచుకున్నాను. అందరున్నత కులజులే అని తమ యీ టపాకు పేరు పెట్టారు రాజారావు గారు. అంత సబబుగా అనిపించలేదు నాకు. అలాగని వారి అభీష్టాన్ని అధిక్షేపించటం లేదు. వినయంగా ఒక్క మాట అడుగుతున్నాను. రాజారావు గారు తమ పద్యాన్ని ముగిస్తూ "అంద రున్నత కులజులే , అందులోను శాస్త్ర పాండితీ ధిషణులే , చదువు నింత ఘనముగా వాడుచున్నారు కడుపు కొఱకు" అన్నారు. జ్యోతిర్విద్య కేవలం అగ్రవర్ణాలకే పరిమితం ఐనది కాదండీ. ఒకప్పుడు అలా ఉండేది అని అనుకున్నా, నేడు అందరికీ అందుబాటులోనే ఉంది. ఎందరో అగ్రవర్ణాలకు చెందని వారూ జ్యోతిష్యపండితులు ఉండవచ్చును. కేవలం అగ్రవర్ణాలవారు మోసం దగా కోసం జ్యోతిషం అనే నాటకం ఆడుతున్నారని అని నిందించటం అంత ఉచితం అంటారా? నేటి సర్వరంగాల్లోనూ నడుస్తున్న మోసాలూ దగాలూ కేవలం అగ్రవర్ణాలే చేస్తున్నాయంటే చెప్పగలగింది ఇంకేమో లేదు. కాని అది మానవుల దురాశ కారణంగా నడుస్తున్న వ్యవహారం అని అందరకూ తెలిసిందే. కేవలం అగ్రవర్ణాలను మాత్రమే నిందించటం అంత హర్షించలేక పోతున్నాను మన్నించాలి.
23, ఫిబ్రవరి 2020, ఆదివారం
బ్లాగుల్లో తెలుగుపద్యాలూ అచ్చుతప్పులూ...
కొద్ది రోజుల క్రిందట సాహితీనందనం బ్లాగులో నుతజలపూరితంబులగు నూతులు .. అన్న టపాలో చివరన ఇచ్చిన శతకూపాధిక దీర్ఘిక అన్నపద్యంలో చివరి పాదంలోని గణభంగం గురించి నేను ప్రస్తావించటం పైన కొంత రగడ జరిగింది. చాలా వరకు అది అనవసమైన రగడ.
ఆ టపాలో ఇచ్చిన కందంలో చివరి పాదం శతంబున కెక్కు డొక్క సత్యోక్తి నృపా! అని ఉంది. అలా ఉండి ఉండకూడదు. బహుశః శతకంబున కెక్కుడొక్క అని ఉండి ఉండవచ్చును. కందపద్యాల నడక తెలిసిన వారి కెవరికైనా ఇది ఇట్టే మనస్సుకు తోస్తుంది. పాఠశాలా విద్యార్ధులకైనా గణవిభజన చేస్తే ఇందులో ఉన్న దోషం సులువుగానే బోధ పడుతుంది.
నేను తెలుగుసాహిత్య అకాడమీ వారి (1969సం) భోజరాజీయం పుస్తకాన్ని archive.org నుండి download చేసి చూసాను. ఆపుస్తకం వివరం 2015.386140.bhoojaraajiiyamu. ఈ పద్య భాగం తిలకించండి అక్కడెలా గున్నదీ
అందుచేత సాహితీనందనం వారు ఈపద్యాన్ని తమబ్లాగులోనికి ఎక్కించేటప్పుడు చిన్న పొరపాటు దొరలింది అనటంలో సందేహం లేదు. ఐతే ఈపద్య సంఖ్య ఈప్రతిలో 6-92 కాక 6-84. అంటే బ్లాగు వారు చూచిన అచ్చు ప్రతి వేరే అని తేలుతున్నది. అందులో కాని అచ్చుతప్పు ఉంటే ఉండి ఉండవచ్చును. గణభంగాన్ని సాహితీనందనం వారు గమనించి ఉండకపోవచ్చును.
ఐతే అక్కడ ఒక వ్యాఖ్యాత గారు నా మాటలను ఖండిస్తూ అన్న మాటలు చూడండి.
శతంబునకంటె అని ..మహాకవి పద్యంలో వున్నది.. శ్యామలీయం వారు శతకంబని..సవరణ చేయటం సముచితంకాదు.
చిత్రం. మహాకవి పద్యంలో ఎలా ఉన్నదో ఆ వ్యాఖ్యత చూసారా? మహాకవి స్వయంగా గణభంగం చేసారని వారి ఉద్దేశమా?
ఆ తరువాత రగడ మొదలయ్యింది. ఎవరెవరో అనామకులు నోటికి వచ్చింది మాట్లాడారు! ఆ తరువాత మొదటి వ్యాఖ్యాత మరింత సూటిగా మరొక వ్యాఖ్య చేస్తూ నావి "కోడిగ్రుడ్డుపై ఈకలు పీకటం లాంటి వ్యాఖ్యలు" అన్నారు. ఇలాంటి అజాగళస్తనసగోత్రులను ప్రక్కన పెడదాం.
కాని ఇంకా ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి. తమ బ్లాగులో అచ్చు తప్పు పడటం గురించి తమ యెఱుక లోనికి వచ్చిన తరువాత కూడా సాహితీ నందనం వారు ఆ పద్యంలోని అచ్చుతప్పును సవరించుకొన లేదు.
అంటే ఏమన్న మాట? సమాధానాన్ని చదువరులే ఆలోచించుకోవలసి ఉంది.
అదే బ్లాగరు గారి చిత్రకవితా ప్రపంచం బ్లాగులో శివస్తుతి అన్న మొన్న 21వ తారీఖు నాటి టపాలో కూచిమంచి తిమ్మకవి వ్రాసిన రసికజనమనోభిరామం లోనుండి ఒక పద్యాన్నిచ్చారు. అందులో కూడా కొన్ని అచ్చుతప్పులున్నాయి. తప్పులు పట్టటం నా ఉద్యోగం కాదు. నా అభిరుచీ కాదు. కాని అవి కనిపిస్తే ఇబ్బందిగా అనిపించటం నా దౌర్భాగ్యం అనుకోండి. దానికి నేనేమీ చేయలేను. పదేపదే అవే తప్పులు చేసే చోట్లకు పోవటం మానటం తప్ప!
అందుచేత చిత్రకవితా ప్రపంచం వారికి ఈరోజు ఒక వ్యాఖ్యను ఉంచాను. అచ్చుతప్పుల గురించి జాగ్రత వహించమని విన్నవించటానికి ఒక లేఖ అది వ్యాససమగ్రత కోసం ఆ లేఖను ఇక్కడ ఉంచుతున్నాను.
మిత్రులు రమణ రాజు గారు,
దయచేసి పద్యాలను ఛందోదోషాలు లేకుండా ప్రచురించండి. మరీ తరచుగా తప్పుపాఠాలు వస్తున్నాయి.
మీకు లభించిన పద్యపాఠాల్లోనే అచ్చుతప్పులు ఉండవచ్చును. లేదా మీరు బ్లాగులో వాటిని వ్రాస్తున్నప్పుడు తప్పులు పడవచ్చును - వాటిని మీరు సరిచూచుకొని ప్రచురించటం చాలా చాలా అవసరం. పద్యం తప్పులతో కనిపిస్తుంటే మనస్సు విలవిల లాడుతుంది.
పొరపాటును మీదృష్టికి తేవటం అందుకే. కాని అలా చేసినందుకు కొందరు నిరసించటమూ, వెక్కిరించటమూ దూషించటమూ చేస్తున్నారు. బ్లాగులోకంలో అవకాశం చూసుకొని ఇతరులను మాటలనే వారికి కొదవలేదని అందరికీ తెలిసిందే.
మీరు కవిత్వం అనీ సాహిత్యం అనీ బ్లాగులకు పేర్లు పెట్టుకున్నారని, ఏదన్నా విషయం ఉంటుందనీ, నాబోంట్లు మీ బ్లాగులకు రావటం. మంచి చెప్పి మాటలు పడటానికి కాదు. మీరు శ్రద్ధతో సరిగా నిర్వహించని పక్షంలో మీబ్లాగులను విసర్జించక తప్పదు.
ప్రస్తుత పద్యాన్ని మీరు ప్రకటించిన పాఠం చూదాం. ఇది సీసపద్యం. మొదటి పాదంలో ప్రధమార్ధం "రవిశశినేత్ర భువనరక్షణమాత్ర" అని ముద్రించారు. రవి-భువ ప్రాసయతి బాగుంది. రవిశశినేత్ర అన్నప్పుడు అది రెండు ఇంద్రగణాలకు సరిపోవటం లేదు కదా! ఉదాహరణకు రవిశశిశుభనేత్ర అన్నారనుకోండి అప్పుడు సరిపోతున్నది. కాని మూలప్రతిలో ఎలాగున్నదో మరి. అలాగే ""విజితశాత్రవగోత్త" అని పడింది ముద్రారాక్షసం "విజితశాత్రవగోత్ర"కు బదులుగా.
మీరు ఎంచుకొన్న సందర్భాలూ ఉదహరిస్తున్న పద్యాలు బాగుంటున్నాయి. కాని పద్యాలను కొంచెం పరిశీలగా చూచి బ్లాగులో వ్రాయండి. ఒక్కొక్క సారి ముద్రిత ప్రతుల్లోనూ తప్పులుంటాయి. తెలుగు పుస్తకాలు కదా! అందరూ వావిళ్ళ వారిలాగూ పండితపరిష్కరణలూ పండితపరిశీలనలనూ చేసి అచ్చువేయరు. అందుచేత జాగ్రత అవసరం. అలాగే బ్లాగులోనికి ఎక్కించేటప్పుడు రకరకాల కారణాలవలన తప్పులు వస్తాయి. కొంచెం ఓపికగా సరిచేసుకొనకపోతే పాఠకులకు ఇబ్బంది. ముఖ్యంగా సాహిత్యాభిమానులకూ, సాహిత్యవిద్యార్ధులకూ ఆ ఇబ్బంది ఎక్కువ.
ఏదో పద్యం కోసం గాలించటమూ అది ఏదో ఒక బ్లాగులోనో మరొకచోటనో దర్శనం ఇవ్వటమూ నాకే చాలా సార్లు అనుభవం ఐనది. ఐతే ఇంచుమించు ప్రతిసందర్భంలోనూ ఆ పద్యాన్ని అనేకులు తప్పుపాఠంతో ప్రచురించటమూ గమనికకు వచ్చింది. ఉత్సాహానికి వారలను అభినందించవలసిందే ఐనా, నిర్లక్ష్యానికి తప్పుపట్టకుండా ఉండటం సాధ్యం కాదు. ముఖ్యంగా అనేకులు ఇలా వెబ్‍లో కనిపించిని ఏదన్నా సరైన పాఠమే అనుకుంటూ ఉన్నారని తెలిసిన తరువాత. అందుచేత మీకు మరొకసారి విన్నపం చేస్తున్నాను. పద్యాల పట్ల కొంచెం ఎక్కువ శ్రధ్ధ తీసుకొని ప్రకటించండి. అందరికీ ఆనందంగా ఉంటుంది.
మీరు ఈ నా సూచనను పట్టించుకొనకపోతే నేను చేయగలిగినది ఏమీ లేదు. మీ బ్లాగు(ల)కు ఒక నమస్కారం పెట్టి ప్రక్కకు పోవటం తప్ప.
చివరిగా ఒకమాట. ఇలా నేను చెప్పటం అసమంజసం అనో పొగరు అనో వ్యాఖ్యానించే వారికి ఒక నమస్కారం. వారితో వాదనకు దిగేందుకు నాకు ఓపికా తీరికా రెండూ లేవు. (దీన్నే పారిపోవటం అంటారని ఎవరన్నా వ్యాఖ్యానించినా నాకు ఇబ్బంది లేదు. నేను చెప్పవలసింది బాధ్యతగా చెప్పాను. అంతవరకే నా పాత్ర)
ధన్యవాదాలు.
అసలు ఆ పద్యం రసికజనమనోభిరామంలో ఎలా ఉన్నదీ అన్నది చూదాం. ఈ పుస్తకం కూడా నాకు archive.org లో లభించింది. ఆ పుస్తకం వివరం 2015.386499.Rasikajanamamobhiramamu. అ పుస్తకంలో ఉన్న పద్యం ఇలా ఉంది.
ఈ పై పద్యప్రతి వావిళ్ళ వారి 1910వ సంవత్సరంలో ముద్రించిన రసికజనమనోభిరామము లోనిది. 6వ ఆశ్వాసంలోని 177వ పద్యం. వావిళ్ళవారి పుస్తకాల్లో అచ్చుతప్పులు మహా అరుదు. వారి ప్రచురణలను సాహితీలోకం ప్రామాణికంగా పరిగణిస్తుంది. పైన ఉన్న వావిళ్ళ వారి ముద్రణలో పద్యం రవిశశిశిఖినేత్ర అని మొదలైనది. వావిళ్ళ వారి గురించి తెలియని వారు అక్షేపించితే వారికి వావిళ్ళ వారి గురించి బోదించే తీరిక లేదు నాదు.
ఈ వివరం ఇవ్వకపోతే అత్యుత్సాహం కల వ్యాఖ్యాత గారు మళ్ళా మరొక మహాకవికే నేను వంకలు పెడుతున్నానని అక్షేపించ గలరు. ఇచ్చినా మరేమని ఆక్షేపిస్తారో తెలియదు - అది వేరే సంగతి.
నేను ఈరోజున వ్యాఖ్యలో చెప్పినట్లు తెలుగుపద్యాలను చాలా మంది అచ్చు తప్పులతో తమతమ సైట్లలో ఉంచుతున్నారు. దీని వలన చాలా అనర్ధం జరుగుతున్నది. ఆ వ్యాఖ్యాత వంటి వారు అవే కవుల అసలు పద్యాలని అనుకొంటున్నారు. ఇది దారుణం.
ఒక పద్యం విషయంలో కష్టేఫలి బ్లాగరు శర్మ గారు కూడా ఇలాగే ఇబ్బంది పడ్దారు. వారి మాటల్లోనే చెప్పాలంటే కొంచెం బధ్ధకించి ఒక భారత పద్యాన్నిఇలాగే నెట్‍లో చూచి తీసుకున్నారు. తీరా చూస్తే అందులో గణదోషాలతో ఉంది సాహిత్యం. వారికి మనవి చేస్తే చూసి అప్పుడు భారతం తిరుగవేసి అసలు పాఠాన్ని తమ టపాలో ఉంచారు.
ఆ పద్యం నుతజల పూరితంబులగు నూతులు నూఱిటికంటె.. అన్న నన్నపార్యుని పద్యమే. అది నాకు వేరొక చోట అంటేసాహితీనందనం బ్లాగులో కనిపించింది కాని అక్కడా కొన్ని తప్పులతోనే ఉంది. గరికపాటివారి సైట్‍లో కూడా కొంచెం తప్పుగానే ఉంది. తెలుగువికీ పేజీలో కూడా ఒకతప్పుతో ఉంది. ఇలా చాలా చోట్ల చిన్నాచితకా తప్పులతోనే ఉన్నది. ఈ విషయం మనవి చేయటమూ శర్మ గారు నేరుగా భారతాన్ని సంప్రదించటమూ చేసారు. ఈ సంఘటన గన సంవత్సరం డిసెంబరులో జరిగింది.
అదుచేత అందరు బ్లాగర్లకూ నా సవినయమైన విన్నపం యేమిటంటే దయచేసి ఇతరులను ఉటంకించేటప్పుడు, ముఖ్యంగా కవుల పద్యాలను తమ టపాల్లో ఉంచేటప్పుడు తగిన జాగ్రతలు తీసుకొన వలసింది. అలా చేయటం వలన పాఠకులకూ ఆకవులకూ కూడా న్యాయం చేసిన వారు అవుతారు.
1, జనవరి 2020, బుధవారం
నిద్రాభోగం
నిద్రాభోగం అనటం బదులు నిద్రాసుఖం అనవచ్చును. సుఖనిద్ర అన్నమాట అందరూ వింటూనే ఉంటారు కదా. అందుచేత సుఖనిద్ర అంటే బాగుంటుందేమో. ఈ వ్యాసానికి పేరుగా అదే అనుకున్నాను ముందుగా. కాని అలోచించగా అది సరిపోదని తోచింది.
నిద్రాభాగ్యం అని కూడా ఒక ముక్క తోచింది. ఇదీ బాగుందే అనుకున్నాను. ఎందుకో చెప్తాను. భోగభాగ్యాలు అన్న మాటను మీరంతా వినే ఉంటారు. అసలు అవేమిటో ఒకసారి చూదాం. సాధారణంగా భాగ్యం అంటే సంపద అనీ అదృష్టం అనీ అర్ధం తీస్తూ ఉంటాం. ముఖ్యంగా సంపద అని ఎక్కువగా వాడుక.
దేవుడికి భగవంతుడు అన్న పర్యాయ పదం అందరికీ తెలిసిందే. ఈమాటకు అధారం భగం అన్న శబ్దం. ఈ భగ శబ్దమే భాగ్యం అన్న పదానికీ ఆధారం.
భగం అంటే శ్రీ అనీ, సంపద అనీ, తెలివీ, ఇఛ్చా జ్ఞాన వైరాగ్యాలనీ, ఐశ్వర్యం అనీ, బలమూ, కీర్తీ, ప్రయత్నమూ, ధర్మమూ మోక్షమూ అనీ ఇలా చాలానే అర్ధాలున్నాయి. సంపద దండిగా ఉన్నవాడిని భాగ్యవంతుడు అనేస్తున్నాం. ఇవన్నీ ఉన్నవాడు ఒక్క దేవుడే. కాబట్టే ఆయన్ను భగవంతుడు అనటం. స్త్రీయోనికి కూడా భగం అన్న పేరుంది. ఇదెక్కువగా ప్రచారంలో ఉన్నట్లుంది.
వేదాంత పదకోశికలో శ్రీ, జ్ఞానం, వైరాగ్యం, ఐశ్వర్యం, యశస్సు, ఆనందం అనే ఆరింటికీ కలిపి భగం అని పేరు అనీ ఈ ఆరులక్షణాలూ ఉన్నాయి కాబట్టి దేవుణ్ణి భగవంతుడు అంటాం అనీ ఉంది.
భగమును కలిగి ఉండటమే భాగ్యం. అంటే భగవల్లక్షణాల్లో ఒకటో అరో ఉంటే వాడు ఎంతో కొంత భాగ్యవంతు డన్నమాట నిజానికి.
విషయానికి వద్దాం. మంచి నిద్ర కూడా ఒక సంపద అన్న సంగతిని గుర్తించాలి. అందుచేత నిద్రాభాగ్యం అంటే నిద్ర అనే మంచి సంపద అని నా ఉద్దేశం. భాగ్యం అంటే అదృష్టం కూడా. కాబట్టి మంచి నిద్రకు నోచుకోవటం అని చెప్పుకోవచ్చును.
ఐనా బాగా అలోచించి చివరికి నిద్రాభోగం అని ఖరారు చేసాను. సుఖం అన్న పేరు చాలా సాదాసీదాగా ఉంది. భోగం అన్న పేరు కొంచెం దర్జాగా ఉంది. నిజానికి భోగం అన్నా సుఖమే. అయితే కించిత్తు తేడా ఉంది. కనీసం నా ఉద్దేశంలో ఉంది.
సుఖం అన్నది ఒక స్థితి. అది మానసికం. ఒక సమయంలో మనం ఆనందంగా ఉండటాన్ని తెలియజేస్తుంది. అది అవిఛ్ఛిన్నమా కాదా అన్నది అక్కడ అర్ధంలో అస్పష్టం. భోగం అనేదీ మానసిక స్థితినే చెప్తుంది. కాని అది ఒక వ్యక్తి యొక్క స్థితిని బయటకు వ్యక్తీకరించే పదం. అందులో ఆ వ్యక్తి అప్పుడప్పుడూ అని కాక నిత్యం సంతోషంగా సుఖంగా ఉండటాన్ని చెప్తున్నది.
అందుచేత భోగభాగ్యాలు అన్నప్పుడు సంపదను కలిగి ఉండటాన్నీ, దాన్ని అనందంగా అనుభవించటాన్నీ కలేసి చెప్పుకోవటం అన్నమాట.
అందుచేత ఎవడికన్నా సాధారణంగా నిత్యం హాయిగా నిద్రపోయే అదష్టం ఉందనుకోండి. అది వాడి భాగ్యం. అలా ఉండటాన్ని వాడు అనందించగలగటం వాడి భోగం అన్నమాట.
అందుకని నిద్రాభోగం అన్నాను. తెలిసింది కదా.
ఈ నిద్రాభోగం అందరికీ దొరికేది కాదు. మనక్కావాలంటే దాన్ని దొరకబుచ్చుకోవటం కూడా అంత సుళువు కూడా కాదు.
ఒకాయన ఉన్నాడు. ఆయన భార్య బ్రహ్మాండంగా గురకపెడుతుంది. ఆ మానవుడికి నిద్రాభోగం దూరమే కదా. తద్విపరీతం కూడా అంతే నిజం. ఆయనే గురకేశ్వర రావు ఐతే ఆ యింటి పార్వతీదేవమ్మకి నిద్రాభోగం గగనకుసుమమే. ఈరోజుల్లో ఐతే ఎవ్వరూ ఏడింటి దాకా లేవటం లేదు. పూర్వం ఐతే ఆడవాళ్ళు మూడున్నరకో నాలుక్కో లేవవలసి ఉండేది పాపం.
కొందరు నిద్రలో కలలు వచ్చి పొలికేకలు పెడతారు. అప్పుడప్పుడే లెండి అస్తమానూ కాదు. ఆకేకలు విన్నవాళ్ళకు ఎంత నిద్రలో ఉన్నా మెలుకువ రావటం ఖాయం. గుండెలు మహావేగంగా డబాడబా కొట్టుకోవటం ఖాయం. అలాంటి వాళ్ళ ప్రక్కనున్న జీవులకు నిద్రాభోగం ఎంత అపురూపమో ఆలోచించండి. ఎందుకలా కేకలు పెడతారూ నిద్రలో అంటే వాళ్ళలో గూడుకట్టుకొన్న భయాలూ అభద్రతాభావాలూ వంటివి కారణం అంటారు.
అభద్రతాభావం అంటే గుర్తుకు వచ్చింది. పనివత్తిడి వంటివి కూడా అభద్రతకు కారణమే. వత్తిడి ఒకమాదిరిగా ఉన్నప్పుడు వారి అభద్రతాభావం కారణంగా పీడకలలు వస్తాయి. వత్తిడి మరీ ఎక్కువైన పక్షంలో అసలు నిద్రకే దూరం కావచ్చును.
పని వత్తిడి అంటే నాకు సాఫ్ట్‍వేర్ జనాభా గుర్త్తుకు వస్తారు. అదేదో సినిమాలో బ్రహ్మీ ది సాఫ్ట్‍వేర్ ఇంజనీరుగా బ్రహ్మానందాన్ని పెట్టి వాళ్ళను జోకర్లను చేసారు. కాని వాళ్ళెప్పుడూ పాపం డెడ్‍లైన్ల మీదే బ్రతుకీడుస్తూ ఉంటారు. అది అసలే అభద్రమైన ఉద్యోగరంగం. వాళ్ళకు కార్మికసంఘాల్లాంటివి ఉండవు కదా. ఎప్పుడు ఉద్యోగం పీకినా నోర్మూసుకొని బయటకు పోయి మరొకటి వెతుక్కోవాలి. అందుచేత వాళ్ళకు ఉద్యోగంలో ఉన్నా నిద్రాభోగం ఉండదు ఉద్యోగం లేకపోయినా ఉండదు. ఏమాట కామాట చెప్పుకోవాలి. ఈకాలంలో కార్మికసంఘాలకు యాజమాన్యాలు ఆట్టే విలువ ఇస్తున్నట్లు లేదు. ఈమధ్య గవర్నమెంట్లూ ఆట్టే విలువ ఇవ్వటం లేదు. ఈమధ్య అనకూడదు లెండి. జార్జి ఫెర్నాండెజ్ గారి నాయకత్వంలో ఎనభైలో కాబోలు ఎనభై రోజులు సమ్మె చేస్తే ఇందిరమ్మ ఖాతరు చేయలేదుగా.
అనారోగ్యం అన్నది కూడా నిద్రను దూరం చేస్తుంది తరచుగా. చివరికి చెయ్యి బెణికినా సరే అది సర్ధుకొనే దాకా నిద్రుండదు కదా. మన అనారోగ్యం అనే కాదు, కుటుంబసభ్యుల్లో ఎవరికి అనారోగ్యం కలిగినా నిద్రాభోగం లేనట్లే.
ఒక్కొక్క సారి అనారోగ్యం కలిగిన వారు హాయిగా నిద్రపోతూ ఉండవచ్చును. కాని మిగిలిన వాళ్ళకే సరిగా నిద్రుండదు. వారిని గమనిస్తూ ఉండాలి జాగ్రతగా. మాటవరసకు మధుమేహం ఉన్నవాళ్ళకి రాత్రి నిద్రలో సుగర్ డౌన్ ఐతే? చాలా ప్రమాదం కదా. వాళ్ళు నిద్రపోతున్నప్పుడు అలా డౌన్ ఐనా సరే నీరసం వచ్చినా మెలకువ రాకపోయే అవకాశం ఉంది. ఎవరూ గమనించక పోతే అది కోమాకు దారి తీయవచ్చును. కాబట్టి వాళ్ళు నిద్రపోతున్నప్పుడు తరచుగా ఒంటి మీద చేయి వేసి మరీ పరీక్షిస్తూ ఉండాలి చెమటలు పడుతున్నాయేమో అన్నసంగతిని. ఈకాపలాదారులకు నిద్రాభోగం ఎక్కడిది?
అసలు పిచ్చిగా ఏదన్నా ధ్యాసలో పడ్డా నిద్ర పారిపోవచ్చును. కొందరికి విజ్ఞానదాహం ఉంటుంది ఎప్పుడూ ఆలోచిస్తూనో పరిశోధిస్తూనో ఉంటారు. నిద్రా సమయంలో ఏదన్నా ధ్యాస వచ్చిందా నిద్ర గోవిందా. న్యూటన్ మహశయుడైతే దాదాపు తెల్లవారుజాము దాకా పనిచేసుకుంటూనే ఉండే వాడట. ఐనా, ఎంత కాదనుకున్నా అలసి నిద్రపోవలసి వస్తుంది కదా. ఆయన గారి పెంపుడు పిల్లి బయట డిన్నరు చేసొచ్చి తలుపు కొట్టే సమయమూ ఆయన నడుం వాల్చే సమయమూ తరచు ఒక్కటయ్యేవట. దానితో ఆయన వడ్రంగిని పిలిచి వీధి తలుపుకు రెండు కన్నాలు చేయమన్నాడట. పిల్లి గారి కొకటి. ఆపిల్లి గారి పిల్లగారి కొకటి. అది కూడా తల్లితో పాటే డిన్నరు చేసి వచ్చేది కదా మరి. అసలు సైంటిష్టులు మనలా ఆలోచిస్తే ఎలా? వాళ్ళకీ మనకీ ఆమాత్రం తేడా ఉండద్దూ ఆలోచనల్లో.
పిచ్చి అంటే పని పిచ్చి అనే కాదు. తిండి పిచ్చి కూడాను. ఒక ముద్ద ఎక్కువ తింటే నిద్ర రానుపో అనవచ్చును. ఐనా సరే ఒక ముద్ద తక్కువ తినటానికి అలాంటి వాళ్ళలో ఎవరూ సిధ్ధపడరు మరి. ఈ తిండిపిచ్చి నేరుగా నిద్రమీద దాడి చేయకపోయినా మెల్లగా ఏదో అనారోగ్యానికి దారి తీస్తుంది. అప్పుడు అది నిద్రకు ఎసరు పెడుతుంది.
ఇంటి బాద్యతలతో నిద్రాభోగం చాలా మందికి అందదు. వయస్సు కాస్తా మీదపడిందా, ముప్పాతిక మువ్వీసం మందికి నిద్రాభోగం తగ్గిపోతుంది. దానికి తోడు అనారోగ్యాలు కూడా పలకరించాయా నిద్ర పలకరించటం మానేస్తుంది. ఇంటికి కాని పెద్దకొడుకుగా పుట్టాడా వాడికి మంచి వయస్సులో ఉన్నా ఆట్టే నిద్రాభోగం ఉండదు. అంటే వెరసి యావజ్జీవం అలాంటి వాళ్ళకి నిద్రాభోగం అందని మ్రాని పండే అన్నమాట.
మంచి వయస్సులో ఉన్న వాళ్ళు అంటే గుర్తుకు వచ్చింది. వాళ్ళకి నిద్రాభోగాన్ని దూరం చేసేది పిల్లపిడుగులు. వాళ్ళు రాత్రి అంతా గుక్క త్రిప్పుకోకుండా కచేరీ చేయగలరు. వాళ్ళు కాస్త పాపం పెద్దవాళ్ళని పడుకోనిధ్ధాం అనుకొనే వయస్సుకు వచ్చే దాకా తిప్పలు తప్పవు. ఈబీ నాష్ అని పూర్వం ఒక హోమియోపతీ వైద్యశిఖామణి ఉండే వాడు. అయనింకా శిఖామణి స్థాయికి రాక ముందు వచ్చిన ఒక కేసు గురించిన ముచ్చట చూడండి. ఒకావిడ బిడ్డను తీసుకొని వచ్చింది. రాత్రంతా ఏడుపే, మందివ్వండి అని. ఒకటేమిటి, కుర్రడాక్టరు గారు చాలా మందులే ప్రయత్నించారు. ఫలితం ఏమిటంటే బిడ్డ ఇప్పుడు రాత్రీ పగలూ అని తేడా చూడటం లేదు. ఒకటే ఏడుపు. ఇలా మానవప్రయత్నాల్లో భాగంగా ఆయన జలాపా అన్న మందుని ఇచ్చారట. అది పని చేసింది. అదీ జలాపా ప్రయోజనం అని నాష్ గారు ఆ మందుని వివరించారు.
కొంచెం పెద్దపిల్ల లుంటారు. వాళ్ళకీ నిద్రాభోగం దొరకటం కష్టమే. పోటీపరీక్షల కోసం కోచింగు సెంటర్లవాళ్ళు హడలేసి రాత్రీపగలూ అనకుండా తోముతూ ఉంటే, నిద్ర అన్నది వాళ్ళకి అందని మహాభోగంగా మారిపోతుంది.జీవితం అంటే డబ్బు సంపాదన. దానికి ఆధారం మంచి కెరీర్. దానికి దారి పోటీపరీక్షలు అని బుర్రల్లోకి బాగా ఎక్కించటం కారణంగా ఎక్కడ దెబ్బతిన్నా కొందరు పిల్లలు ఐతే డిప్రెషన్ లోనికి వెళ్తున్నారు లేదా మనని విడిచి పోతున్నారు. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు తల్లిదండ్రులకు అన్నీ కాళరాత్రులే సంవత్సరాల తరబడి.
రాత్రి నిద్ర చాలకపోతే ఏంచేస్తాం. వీలు కుదిరితే పగలు కొంచెం పడక వేస్తాం. వినటానికి బాగానే ఉంది. కాని వీలే కుదిరి చావదు. సెలవు రోజు కాకపోతే ఎలాగూ అది కుదరదు. కాని సెలవు రోజున మాత్రం కాస్త ఆ నిద్రాభోగం కోరుకోవటం మామూలే. ఆట్టే తప్పు కాదు కూడా. ఏవో ఇంటి పనులుంటాయి. లేదా కుటుంబసభ్యులు సినిమా అనో మరొకటో చెప్పి బయలుదేర దీస్తారు.
అదేం లేదు. కుదిరింది. ఇంకేం పడక వేసారు. కొంచెం మాగన్ను పడగానే మొబైల్ మోగుతుంది. ఎవరన్నా స్నేహితులు కావచ్చును కదా అని ఫోన్ ఎత్తుతారు. ఏదో బ్యాంకి వాడు. మీకు లోన్ ఇస్తానంటాడు. తిట్టి పెట్టేస్తారు. మళ్ళీ పడుకుంటారు. ఇంతలో మరొక ఫోన్. ఈసారి ఎవడో ప్లాట్లు కావాలా అని మొదలు పెడతాడు. ఏడుపూ వస్తుంది. తిక్కా పుడుతుంది. ఓసారి నాకలాగే తిక్కరేగి రూపాయి కెన్నిస్తున్నారూ ప్లాట్లూ అని అడిగాను. పోనీ లెండి నిజంగానే ఎవరో తెలిసిన వాళ్ళ ఫోన్ అనుకుందాం. వాళ్ళు ఫోన్ వదలరు. మీకు నిద్ర వదిలి పోతుంది. ఇంక రోజంతా తిక్కతిక్కగా ఉంటుంది.
మీకు ఉపాయం తెలిసింది కదా? మొబైల్ పీక నొక్కి మరీ పడుకోవాలీ అని!
ఒక్కోసారి హఠాత్తుగా కాలింగ్ బెల్ మోగుతుంది. మీ మధ్యాహ్ననిద్రాప్రయత్నం మీద దెబ్బకొడుతూ. ఇంటికి అతిథులు వస్తారు. అందరి చేతుల్లోనూ ఒకటో రెండో మొబైలు ఫోనులు ఉంటాయి. మళ్ళా ఒక్కొక్క దాని లోనూ ఒకటో రెండో సిమ్ కార్డు లుంటాయి. ఐనా మీకు ఏ ఒక్కరూ కాల్ చేయరు. నేరుగా వచ్చి మీ బ్యూటీస్లీప్ మీద దాడి చేస్తారు. ఇంకా తమాషా ఏమిటంటే మీరు తలుపు తీసే సరికి ఆ వచ్చిన అతిథుల్లొ కొందరు తమ ఫోన్ల మీద చాలా బిజీగా ఉంటారు. వాళ్ళు ఎవరెవరితోనో మాట్లాడుతూ ఉంటారు. అదీ మీ యింటి గుమ్మం ముందు నిలబడి. ఏదో ఒకటి మీకు నిద్రాభోగం లేదంతే.
ఒక వేళ మీరు కాని మొబైల్ పీకనొక్కి మరీ నిద్రపోతుంటే అప్పుడొస్తుంది డైలాగ్. అతిథుల నుండే లెండి. వాళ్ళలో ఒకరు తప్పకుండా అంటారు. కాల్ చేస్తే తీయలేదూ. పనిలో ఉన్నారో లేక మీఫోను ఛార్జింగులో ఉందో అనుకున్నాం. ఎలాగూ ఈప్రాంతానికి వచ్చాం కాబట్టి ఉన్నారేమో చూసి వెళ్దామని వచ్చాం అంటారు. మీకు ఏడవాలో నవ్వాలో తెలియదు. అదంతే.
ఒక్కొక్క సారి, ఇంటి నుండి పారిపోవాలీ అనిపిస్తుంది. ఎక్కడికన్నా పోయి నాలుగు రోజులు ఉండాలీ అనిపిస్తుంది. అదీ ఈ దిక్కుమాలిన ఫోన్ నోరు మూసి మరీ. అబ్బే కుదిరే పని కాదు లెండి. అన్ని వ్యవహారాలూ ఈఫోను మీదనే కదా. అది కాస్తా మూసుకొని కూర్చుంటే ఏమన్నా ముఖ్యమైన సమాచారాలూ వగైరా తప్పిపోవచ్చును కదా. అస్సలు మన చేతిలో లేదండీ మన జీవితం.
ఈ మొబైల్ ఫోనుల కారణంగా నిష్కారణంగా నిద్రాభోగాన్ని చెడగొట్టుకునే వాళ్ళూ ఉన్నారు. వాళ్ళకు తెలియటం లేదు పాపం. కళ్ళు పొడిబారి నిద్ర దూరం అయ్యేదాక రాత్రంతా ఆ దిక్కుమాలిన ఫోనుతో కాలక్షేపం చేస్తారు. వాటిలో సినిమాలు చూసే వాళ్ళున్నారు. వాటిలో ఏవేవో పిచ్చిపిచ్చి గేమ్స్ ఆడుతూ కూర్చునే వాళ్ళున్నారు. ఇదంతా కేవలం కుర్రకారు వ్యవహారం అనుకోకండి. కొందరు పెద్దలదీ ఇదే తీరు. వీళ్ళు నిద్ర ఎంత అవసరమో గుర్తించటం లేదు. మంచి నిద్ర ఎంత గొప్ప భోగమో తెలుసుకోవటం లేదు.
భగవద్గీతలో ఒక ముక్క ఉంది. మనవి చేస్తాను. "యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమీ యస్యాం జాగ్రతి భూతాని సా నిశా పశ్యతః మునేః" అని రెండవ అధ్యాయంలో వస్తుంది ఒక శ్లోకం. అది అరవై తొమ్మిదవది అక్కడ. జీవులంతా రాత్రి నిద్రపోతుంటే యోగులు ఆ సమయంలో మెలకువగా ఉంటారని ఈశ్లోకం చెబుతోంది. ఐతే ఆ ప్రాణులన్నీ మెలకువగా లౌకిక వ్యవహారాల్లో మునిగి తేలే పగళ్ళు యోగులకు మాత్రం రాత్రులట. లౌకిక వ్యవహారాలకు కదా పగలు. అవి లేని సమయం రాత్రి. యోగులకు లౌకిక వ్యవహారాలు పట్టవు కాబట్టి ఆపగళ్ళు వాళ్ళకు రాత్రుల వంటివే అన్నమాట. రాత్రులు వారు పారలౌకిక వ్యవహారాల్లో నిమగ్నమై ఉంటారు. కాబట్టి మన రాత్రులు వాళ్ళకు పగళ్ళ వంటివి. వడ్ల గింజలో బియ్యపు గింజ.
ఏతావాతా యోగులు రాత్రులు నిద్రపోరు. రోగులూ నిద్రపోరు. నిద్రాభోగం లేక రోగులు తమ గురించీ ప్రపంచవ్యవహారాల గురించీ ఆలోచిస్తూ ఎప్పుడు తెల్లవారుతుందా అని చూస్తూ ఉంటారు. యోగులు మాత్రం భగవంతుడి గురించిన ఆలోచనల్లో ఎప్పుడు తెల్లవారినదీ కూడా సరిగ్గా గమనించే స్థితిలో ఉండరు.
నేనే మంతగా చెప్పుకోదగిన యోగిని కాదు. ఆ మాటకు వస్తే యోగిని అని చెప్పుకోదగిన వాడినే కాదు. కాని తరచూ నా రాత్రులు కూడా ఆ కోవలోనికి వచ్చేస్తున్నాయి. ఈ రాము డొకడు. ఈయన పుణ్యమా అని చాలా రాత్రులు నిద్ర పట్టటం లేదు.
ఇన్నేళ్ళుగా ఈ ఉపాధిలో ఉన్న జీవుడి నుండి వందలాది రామకీర్తనలు వచ్చాయి. అందులో అనేకం ఆయన పుణ్యమా అని వేళాపాళా లేకుండా రాత్రిపూటల్లో వచ్చినవే! అలా యెందుకు రావాలీ అంటే అది ఆయన యిష్టం. అవి ఎప్పుడు రావాలో చెప్పటానికి నేనెవడిని.
ఇలా రామచింతన నన్ను నిద్రాభోగానికి దూరం చేసింది. అందుకని చింత యేమీ లేదు. యోగసాధనలో భోగత్యాగం వీలైనంతగా చేయవలసిందే. ఐతే ఈముక్క కూడా ఎందుకు చెప్పటం అనవచ్చును. బాగుంది. చెప్పకుండా దాచుకోవటం మాత్రం ఎందుకు? అదేం తప్పుపని కాదే సిగ్గుపడి దాచేసేందుకు. పైగా ఈనా అనుభవం మరొకరికి పనికి రావచ్చును. గీతలో బోధయంత పరస్పరం అన్నాడు కదా. ఏమో ఈ విషయం ఎవరికి ఉపయోగపడుతుందో. పడనివ్వండి. చెప్పటం ఐతే నావంతుగా చెప్పేసాను.
- భగవద్గీతలో "యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖహా" అని ఒక శ్లోకం ఉంది భగవా నువాచగా. స్వప్నావబోధ అంటే కలల లోకం నుండి ఇహలోకం లోనికి విచ్చేయటం. అసలు ముందు మనం స్వప్నజగత్తులోనికి అడుగుపెట్టాలి కదా. అంటే నిద్రాభోగం ఉండి తీరాలి కదా. వత్తిడిలో ఏదో నిద్ర పట్టిందని పించుకున్నా అప్పుడు పీడకలలు వస్తాయి తరచుగా. అబ్బే అది యుక్త స్వప్నావబోధ చచ్చినా కాదు. ఇంక అదేం ఉపకరిస్తుంది మనకి. యోగి కావటం మాట దేవుడెరుగు.
అందుచేత యావన్మంది ప్రజలారా, సరైన నిద్ర అనేది ఒక భోగం అని గుర్తుపెట్టుకోండి. దాన్ని మాత్రం నిర్లక్ష్యం చేయకండి.