4, డిసెంబర్ 2020, శుక్రవారం

సెటిలర్స్

తరచుగా ఆంధ్రాప్రాంతం వారిని ఉద్దేశించి సెటిలర్స్ అని సంబోధించటం గమనించవచ్చును. ఇప్పటికీ ఆ దిక్కుమాలిన సంబోధన మారటం లేదు. ఇదిగో ఈరోజున కొండలరావు గారు కూడా తన బ్లాగులో ఒకవ్యాఖ్యలో ఈ రోజున "ఇప్పటివరకూ విశ్లేషణలు చూస్తుంటే సెటిలర్స్ మాత్రమే టీ.ఆర్.ఎస్ ను కాపాడారనిపిస్తోంది." అని ఆ పదాన్ని ప్రయోగించారు. ఎంతో‌ విచారం కలుగుతూ ఉంటుంది ఆ సెటిలర్ అన్న మాట తటస్థించినప్పుడల్లా. మరొకరూ ఆసెటిలర్స్ అన్నపదాన్ని కొనసాగించారనీ మనం అక్కడ గమనించవచ్చును.

సెటిలర్. ఈ మాటకు అర్ధం‌ నాకు తెలుసుననే అనుకుంటున్నాను. ఇదే‌ కదా? "తన స్వస్థలం విడచి పరాయి ప్రాంతంలో స్థిరనివాసం ఏర్పరచుకున్న వ్యక్తి" అని.

ఈ‌ మాట విన్నప్పుడల్లా నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది.

ఇదేదో తప్పుమాట అని కాదు. ఈమాటను తెలుగువాళ్ళు అన్వయిస్తున్న విధానం వలననే నాకు మనస్తాపం కలగతున్నది.

ఈ మాటను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో అనో లేదా దేశవ్యాప్తంగా ఎక్కడ ఎవరు ఎలా వాడుతున్నారో అనో నా బాధ కాదు. తెలుగువాళ్ళే సాటితెలుగువాళ్ళ పట్ల ఎంత అవమానకరంగా ఎలా వాడుతున్నారో అని నా బాధ.

మన తెలుగువాళ్ళలో కూడా తోలుమందం మనుష్యులు కోకొల్లలుగా ఉన్నారు. కాని వాళ్ళతో‌పాటే నాలాంటి కొంచెం‌ సున్నితమనస్కులు కూడా ఉన్నారు. తోలుమందం జనాభాకైతే పట్టించుకోకుండా కించిత్తూ బాధపడకుండా ఉండే హక్కు ఎలాగైతే ఉందో, నాలాంటి వారికి కొద్దో గొప్పో‌ బాధపడే  హక్కు కూడా అలాగే ఉంది. తోలుమందం జనాభాకు మౌనంగా మాటల్ని భరించే హక్కు ఎలా ఉందో (అదీ‌ ఒక హక్కే‌నా అని ఎవరికన్నా అనుమానం వస్తే మంచిదే!), నాలాంటి వారికి భరించలేక తమ అభిప్రాయాన్నీ నిర్మొగమాటంగా చెప్పే‌ హక్కూ‌ అలాగే ఉంది. అందువలన ఒకరి అనుమతి అవసరం లేదు నా అభిప్రాయ ప్రకటనకు.

పాలపొంగు ఒకటి తెలుగుప్రజల రాష్ట్రాన్ని ఎలా రెండుముక్కలు చేసిందో అందరమూ చూసిందే. దరిమిలా ఒక తెలుగురాష్ట్రం (ప్రస్తుతానికి) రెండుగా మారి, తెలుగువారికీ రెండు రాష్ట్రాలు ఏర్పాటై, తమకు ఒక్క రాష్ట్రమేనా అని విచారించే అమృతహృదయులకు ఎలా ఊరట చేకూర్చిందో అందరికీ తెలిసిందే.

ఒకటి చివరకు రెండు ఐన తెలుగుప్రాంతంలో ఏర్పడిన ప్రభుత్వాలు చివరకు ఎలా అభివృధ్ధిపథంలో దూసుకొని పోతున్నాయో కూడా మనందరికీ‌ బాగా అవగతం అవుతూ ఉన్నదే.

ఈ విషయంలో నాకు విచారించటానికి వ్యక్తిగతంగా కారణం ఏమీ‌ లేదు. కాని చిక్కల్లా ఆ మహర్దినం దాకా స్వరాష్ట్రంలోనే ఉన్నవాడిని కాస్తా హఠాత్తుగా నా చిరనివాసప్రాంతంలోనే పరాయి వాడిని ఐపోవటమే. అలా ఐపోయానని నేను అనుకొనటం‌ మానటం అంత ముఖ్యమైన సంగతి కాదు. నేను అలా పరాయివాడినీ‌ అని ఘడియకు ఒకసారి గుర్తుచేసే సహృదయవాక్యాలను తట్టుకోవటం ఎంత కష్టంగా ఉంటుందీ‌ అన్నదే‌ ముఖ్యమైన సంగతి.

కాని ఈరాష్ట్రంలోనికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రావతరణానికి ముందే వచ్చిన వాళ్ళు మాత్రమే తెలంగాణా వారిగానూ మిగతా వారంతా పరాయి వారుగానూ తెలంగాణా రాష్ట్రప్రభుత్వాధినేతయే చేసిన ప్రకటనలు ఎంతమందికి ఇంకా గుర్తున్నాయో నాకు తెలియదు. ఈకొద్ది సంవత్సరాలలోనే అదేదో గత త్రేతాయుగం నాటి సంగతి కదా ఇప్పుడెవ్వరికి పట్టింది అన్నట్లు మర్చిపోగల వాళ్ళకు ఒక నమస్కారం. అది నావల్ల కాదు. కానే కాదు. ఎందుకో చెప్పనివ్వండి.

నేను నలభైయేడేళ్ళ క్రిందట పొట్టచేత్తో పట్టుకొని వచ్చాను హైదరాబాదు నగరానికి. అప్పటికి అదింకా నిర్వివాదంగా తెలుగువాళ్ళ స్వరాష్ట్రానికి ముఖ్యపట్టణం. అందుచేత నేను అప్పట్లో నాస్వరాష్ట్రరాజధానికి ఉద్యోగనిమిత్తం వచ్చాను కాని ఏదో పరాయి ప్రాంతానికి ప్రవాసం పోలేదు. నేను వచ్చింది నా పొట్టపోసుకుందుకే‌ కాని ఏదో తెలంగాణా ప్రజల పొట్టకొట్టి ఇంద్రుణ్ణో చంద్రుణ్ణో ఐపోయి పెత్తనం చేదామని కాదు. ఆ వచ్చింది కూడా భారతప్రభుత్వం అధీనం లోని సంస్థకు కాని ఇక్కడి ఏదో‌ ప్రైవేట్ కంపెనీకి ఐనా కాదు.

నేను వచ్చిన కొద్ది కాలానికే నా కుటుంబం అంతా, మా నాన్నగారి నిర్యాణానంతరం, నా దగ్గర ఉండటానికి వచ్చారు. అందరం ఇక్కడే ఉన్నాం అప్పటినుండి. నాసోదరసోదరీమణులంతా ఈ హైదరాబాదులోనే చదువుకున్నారు. మా చెల్లెళ్ళందరినీ హైదరాబాదు వాస్తవ్యులకే ఇచ్చి వివాహాలు చేసాం.

పందొమ్మిది వందల యాభైఆరు నవంబరు కన్నా ముందుగానే దీర్ఘదర్శనులై మా తాతగారు హైదరాబాదు వచ్చి స్థిరావాసం ఏర్పరుచుకొన లేదు కాబట్టి మేమంతా పరాయి వాళ్ళం అన్న తెలంగాణా ప్రభుత్వం‌ మాట ఎలా సబబు అని మాకు అనిపిస్తుంది చెప్పండి?

ఈ రెండురాష్ట్రాలు ఏర్పడినప్పటినుండీ నాకు 'సెటిలర్' అన్న బిరుదు ఇస్తానంటే నేనెలా ఒప్పుతాను చెప్పండి?

ఆంధ్రాప్రాంతం నుండి హైదరాబాదుకు వచ్చి అర్ధశతాబ్దం కావస్తున్నది. అక్కడివారికి ఇప్పుడు దాదాపుగా పరాయివాడిని. ఇక్కడి వారికి కూడా నేనొక 'సెటిలర్'ను అనగా పరాయివాడికి. చాలా బాగుంది. ఇదెక్కడి న్యాయం?

మా ఆఖరు తమ్ముడు ఇక్కడే‌ జన్మించాడు. ఇక్కడే చదువుకున్నాడు. ఇక్కడే ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు వాడికీ ఒక కుటుంబం ఉంది. వాళ్ళంతా కూడా 'సెటిలర్స్' అనటం‌ అసహజం అభ్యతరకరం కాదా?

నాలాంటి వారు ఈ‌హైదరాబాదులో కొల్లలు. ఎవరి కథ వారిది. వాళ్ళంతా పొట్ట చేతపట్టుకొని ఉద్యోగాల కోసం వచ్చినవారే.

అంద్రాప్రాంతం నుండి వచ్చిన వారంతా దుష్టులు అని అ తెలంగాణా ఉద్యమం రోజుల్లో తిట్టిపోసింది చాలు. ఒక పెద్దమనిషి, నా స్నేహితులే‌ లెండి, అవసరం ఐతే ఆంద్రావారంతా చచ్చిపోయి ఐనా తెలంగాణా రావలసిందే అని చెప్పారు. ఉద్యమం వేడి అట. వేడి! ఎంత చక్కని మాట.

ఆంద్రావాళ్ళు బిర్యానీ‌చేస్తే పేడలా ఉంటుంది అని వెక్కిరించి వెకిలిగా నవ్వులు చిలికించిన పెద్దమనిషి ఓట్ల అవసరం రాగానే ఆంధ్రావాళ్ళమీద కొంచెం ప్రేమ ఒలికించే‌మాటలూ మాట్లాడారు అనుకోండి. అంతమాత్రం చేత ఆ గుండెల్లో ప్రేమను చూడటం నావల్ల కాదు.

సరే జరిగిందేదో జరిగిపోయింది. రాజకీయాల్లో బోలెడు జరుగుతూ ఉంటాయి. వాటికి ఎవరూ ఏమీ చేయలేరు.

కాని ఇంకా అంధ్రప్రాంతం వారిని 'సెటిలర్స్' అంటూ వేరుగా చూడటం సమంజసమా?  ఆప్రాంతం నుండి వచ్చి ఈతెలంగాణాలో స్థిరపడిన కుటుంబాలు మరొక ఐదువందల యేళ్ళైనా సెటిలర్స్ అనే పిలవబడుతారా?

ఈ‌హైదరాబాదులో అంధ్రప్రాంతం నుండే‌ కాక భారతదేశంలోని అనేక ప్రాంతాలనుండి వచ్చి 'సెటిల్' ఐన కుటుంబాలు కొల్లలు. కాని చూస్తుంటే వారెవర్నీ 'సెటిలర్స్' అన్నట్లు కనిపించదు. ఆంద్రప్రాంత నుండి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయిన ఈ  సాటి తెలుగువాళ్ళే తెలంగాణావారికి పరాయి వారు, 'సెటిలర్స్' అన్నమాట. భారతదేశంలోని ఏయితర ప్రాంతనుండి ఇక్కడికి వచ్చి స్థిరపడిన వారూ తెలంగాణా ద్రోహులు కారు. సాటి తెలుగువారైన ఆంధ్రాప్రాంతం వారే తెలంగాణాద్రోహులు (పుట్టుకచేతనే ఆంధ్రాప్రాంతం వారు తెలంగాణాద్రోహులు అన్నమాటనూ రాజకీయులు అనగా విన్నాను.). కాబట్టి సాటి తెలుగువారికి ద్రోహులు అని నిత్యం గుర్తుచేయటానికి వారిని మాత్రమే‌ సెటిలర్స్ అంటారన్నమాట.

ఎన్నికలూ వగైరా అవసరాలు వచ్చినప్పుడు ఓట్లకోసం అంధ్రప్రాంతం వాళ్ళకి మెరమెచ్చు మాటల చెప్పే ఈరాజకీయులు 'ఆంధ్రానుండి వచ్చినవాళ్ళూ మావాళ్ళే' అంటూ ఉండటం విన్నదే. ఆమాటల్లో ఉన్న నిజాయితీ గురించి మేధావులు అనబడే‌ కొందరు ఎంతో చక్కటి విశ్లేషణలు అందిస్తారనటంలో సందేహం లేదు. కాని అవన్నీ పైపై మాటలే అన్నసంగతి మాత్రమే అసలు నిజం.

నేను అమెరికాలో‌ కొన్నేళ్ళు ఉండి వచ్చాను. ఎందరో అమెరికాలో సెటిల్ అయ్యారు మన తెలుగువాళ్ళు. కాని అక్కడ సెటిల్ ఐనా మన వాళ్ళని ఎవరూ అక్కడ 'సెటిలర్స్' అనరు.

ఏదో నాగోడు నేను చెప్పుకున్నాను. ఎందరు ఏకీభవిస్తారో, ఎవరు ఏకీభవించరో అన్నది వేరే‌ విషయం. సత్యం కళ్ళముందే ఉంది. అటు ఆంధ్రకూ ఇటు తెలంగాణకూ చెందని రెండింటికీ చెడిన రేవడులే ఈ సెటిలర్స్ అన్నదే ఆనిజం.

ఒక్కొక్కసారి అనుకుంటూ‌ ఉంటాను. నేను కూడా ఎంతో‌ మంది సాటి తెలుగువారిలాగే ఆ అమెరికాలోనే సెటిల్ అయ్యుంటే ఈ‌అవమానకరమైన సెటిలర్ టైటిల్ నా నెత్తి మీద ఉండేది కాదు కదా అని.

33 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. యధాప్రకారం తలాతోకాలేని కామెంటు! పబ్లిష్ చేయాలా వద్దా అని బోలెడు సమయం ఆలోచించవలసి వచ్చింది.

   తొలగించండి
 2. స్టాక్‌హోం సిండ్రోం అన్న దాని గురించి మీరు కొంచెం తెలుసుకోండి శ్యామలీయం గారు. మన ఆంధ్రుల పరిస్థితి మీకు క్లియరుగా అర్థమవుతుంది అక్కడ.

  రిప్లయితొలగించండి
 3. సాటి తెలుగు వారి కన్నా ఇతర రాష్ట్రాల / ఇతర భాషల జనాలంటే ముద్దు.

  ప్రజలను రెచ్చగొట్టి తమ పబ్బం గడుపుకునే వారికి finer feelings ఎందుకుంటాయండీ?

  అమెరికాలోని తెలుగు వారి గురించి అంత భరోసాగా ఉండకండి. అక్కడి తెలుగు సంఘాలను నిలువుగా చీల్చారు. చీలిపోయిన వారు హైదరాబాదులోను, తదితర తెలంగాణా ప్రాంతాల్లోనూ నివసిస్తున్న ఆంధ్రులను ఉద్దేశించి “సెటిలర్లు” అంటున్నా ఆశ్చర్య పోనవసరం లేదు.

  అయినా ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రులను అనాలి. అభివృద్ధి అంతా హైదరాబాదులోనే కేంద్రీకృతం చెయ్యడం వారు చేసిన Himalayan blunder, monumental mistake (చాలా సార్లు విదేశీ ఋణాలు కూడా తీసుకొచ్ని మరీ) నేనొకసారి లెక్క పెట్టాను - 15, 16 ప్రభుత్వరంగ సంస్ధలు హైదరాబాదులో ఉండేవి. మరి వాటికి కావలసిన అనుబంధ పరిశ్రమలు వెలిసాయి (ancillary industrial units). అవి గాక బ్యాంకులు తమ హెడ్ ఆఫీసులు / ప్రాంతీయ హెడ్ ఆఫీసులు ఇక్కడే పెట్టారు. పారిశ్రామికవాడలు (industrial estates) పెట్టారు. . దాంతో ఉద్యోగావకాశాలు ఇక్కడే అధికంగా ఉండేవి కాబట్టిన్నూ, మన రాష్ట్రమే కదా మన రాజధానే కదా అనుకుంటున్నూ ఆంధ్రులు ఇక్కడకు వచ్చేవారు. నిజాం గారి పాలనలో కూడా జరగక పోలేదు - కాస్త చదువుకున్న ఆంధ్రులు నైజాం గారి రాజ్యంలో ఉద్యోగం దొరకడంతో ఇక్కడకు వచ్చేవారు - ముఖ్యంగా స్కూళల్లో టీచర్లు గాను, రైల్వేలో ఉద్యోగులు గానూ. ఆ రోజుల్లో వారిని “సెటిలర్స్” అనే వారని దాఖలాలు లేవు.

  రాజకీయ నాయకులు అలా అనడం వేరు, కొండలరావు గారు కూడా అలా అనడం ఆశ్చర్యం.

  రిప్లయితొలగించండి
 4. ఆంధ్రా నుండి వచ్చి హైదరాబాద్ లో నివసించేవారిని సెటిలర్స్ అనకుండా ఏమని పిలవాలి ? మీరొక పదం చెప్పండి.
  రోహింగ్యాలని పిలిస్తే మీకు బాగుంటుందా ?
  భారతీయ అమెరికన్ కమలా హారిస్ అంటున్నారు, ఆవిడకి భారతీయులందరూ ఎగబడి మరీ ఓటు వేసారు కదా ?
  అలాగే ఈ సెటిలర్స్ కూడా ఎప్పటికైనా ఎన్నుకోబడకూడదని రూలు లేదు కదా ?
  తమ మూలాలను ఎవరూ వదులుకోరు, మీరు మాత్రం తెలంగాణా వాసిగా గుర్తింపబడాలని ఎందుకు కోరుకుంటున్నారు ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నీహారిక గారు,
   నేను తెలంగాణావాసినే అవుతాను ఎవరో గుర్తించినా మానినా. కాని నన్ను నేను తెలంగాణావాడిని అనో ఆంధ్రావాడిని అనో చెప్పుకుందుకు ఇష్టపడను. నేను తెలుగువాడిని. తెలంగాణాకు చెంది ఆంధ్రాకు చెందకపోవటమూ ఆంద్రాకు చెంది తెలంగాణాకు చెందకపోవటమూ‌ అన్నవి రెండూ‌ సమ్మతం‌ కావు నాకు. నా మూలాలనూ నేను వదులుకుందుకు ఇష్టపడను - నా నివాసస్థలానికి పరాయివాడిగా ఉండటానికీ ఇష్టపడను. ఇలా సెటిలర్స్ అనిపించుకుంటున్న వాళ్ళు ఎన్నికల్లో పోటీ చెయ్యవచ్చును కాబట్టి గెలిచే అవకాశమూ ఇవాళ కాకపోతే రేపైనా ఉండవచ్చును. సెటిలర్స్ అన్న పదం మీకు ఇష్టం కావచ్చును కాని నాకు నచ్చదు. పదేపదే సెటిలర్స్ అని విడదీసి మాట్లాడటం అవసరమూ‌ కాదు గౌరవమూ‌ కాదు.

   తొలగించండి
  2. నీహారిక గారూ, స్వ. వల్లూరి బసవరాజు (వీబీ రాజు) ఎప్పుడో ఎమ్మెల్యే & మంత్రి కూడా చేసారు. 1969 తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా వారు రాజీనామా చేస్తే, స్వ. మదన్ మోహన్ గారు ఉప-ఎన్నికలో భారీ మెజారిటీతో గెలిచారు. ఇప్పటి వారిలో కోనేరు కోనప్ప & నల్లమోతు భాస్కర రావు గార్లతో సహా ఎంతో మంది సెటిలర్లు ఎన్నెన్నో పదవులు అలంకరించారు.

   ఇకపోతే ఎవరి ఇష్టం వారిది. మా బంధుమిత్రులలో తాము సెటిలర్లమని చెప్పుకునే వాళ్ళూ ఉన్నారు, ఆంధ్రోళ్లమని (లేదా మరాథోళ్లమని వగైరా) అనే వాళ్ళూ ఉన్నారు.

   అందరూ సమానమే & అవసరమే. తెలంగాణా మిశ్రమ సంస్కృతి స్వభావం సలాడు బౌలు వంటిది, అమెరికా లాగా మెల్టింగ్ పాటు కాదు.

   తొలగించండి
 5. సాటి తెలుగువాడిగా మీకు సంఘీభావం ప్రకటిస్తున్నాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నేను తూ.గో.జి. లో "సెటిలర్"నండీ. మా తండ్రి గారి బదిలీ మూలాన 60 యేళ్ళ క్రితం తూ.గో.జి. కు వచ్చాం. మా తమ్ముళ్ళు, చెల్లెలు అక్కడే పుట్టారు, పెరిగారు, చదువుకున్నారు. అవ్విధంబున మా కుటుంబం తూ.గో.జికు "సెటిలర్స్" అన్నమాట 😀.

   తొలగించండి
  2. విన్నకోట వారు, ఇలా జిల్లాల్లెక్కన తాలూకాల్లెక్కన కూడా సెటిలర్స్ అంటే మరీ‌ అన్యాయం కదుటండీ. పక్కఊరికి నివాసం మార్చినా సెటిలర్ అనేస్తారా! ఏమో‌ మరి. తమ ఉనికి ఏమాత్రమూ కాని వేరే చోట స్థిరపడితేనే‌ సెటిలర్ అనాలి. మనప్రాంతం, మన భాష, మనసంస్కృతి ఉన్నాసరే‌ పక్కకు జరిగివచ్చావు సెటిలర్ అనేస్తే ఎలాగండీ బాబూ.

   తొలగించండి
  3. అన్యాయం అంటే అన్యాయమే మరి. స్వార్ఢపూరిత రాజకీయాలు రాజేసి ఎగదోస్తుండే చిచ్చు, తందానతానా అనే ప్రజలు. ఇంకెలా ఉంటుంది?

   అన్య్యాయం అని నా వంతు కూడా ఎత్తిచూపుదామనే పైన నా వ్యాఖ్య పెట్టాను.

   తొలగించండి
 6. Srikanth Mabbu గారు,
  తెలంగాణాలో ఆంధ్రులను “సెటిలర్స్” అనడానికీ, Stockholm Syndrome కు సామ్యం ఏమిటి, శ్రీకాంత్ గారు ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Stockholm syndrome occurs abuse victims bond with their abusers. ఇది తెలంగాణాలో ఉన్న ఆంద్రులకు వర్తిస్తుందా అన్నది ఆలోచనీయాంశం.

   తొలగించండి
  2. మొన్నటి ఎన్నికలలో గెలిచిన పార్టీకి ఓట్లు వేసిన ఆంధ్రులు (సో కాల్డ్ "సెటిలర్స్") ఉన్నారంటే మరి అది స్టాక్‌హామ్ సిండ్రోమే అవుతుందేమో?

   తొలగించండి
  3. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు పోయిన ఎన్నికలలో గెలిచిన ట్రంప్ కు వోట్ వేసుంటే అదీ స్టాక్‌హామ్ సిండ్రోమే అవుతుందేమో? కదా? కానీ వాళ్ళని ట్రంప్ "సెటిలర్స్" అన్నాడంటారా?

   తొలగించండి
 7. రాజస్థాన్ నుండి *కొన్ని వందల సంవత్సరాల ముందు* వచ్చిన వాళ్ళు మీరు ఏమటోళ్లు అంటే మార్వాడీలు అంటారు. కాయస్తుల లాంటి కొందరు కులం చెప్పుకుంటారు.

  ఎవరి అస్తిత్వ నిర్వచన వారి సొంతం. వారివారి స్వీయ వర్ణననే ఆమోదించడం తెలంగాణా సంస్కృతి తప్ప రాజస్థానీ, బిహారీ గట్రా అంటూ రుద్దడం లేదు.

  సెటిలర్లు అన్న పదం తెలంగాణా వారు ఆంధ్రులకు ఇచ్చింది కాదు. హైదరాబాదు సంస్థానంలో స్థిరనివాసం ఏర్పరుచుకున్న మదరాసు ప్రాంతీయులు *తమను తాము* సెటిలర్లు అని పిలుచుకునే వారు. బొందిలీలు, మార్వాడీలు వగైరాల కోరికలలను ఎలా మన్నించారో వీళ్ళకే అంతే తక్కువా కాదు చులకనా లేదు.

  ఆంధ్ర ప్రాంతాల నుండి వచ్చిన వారిని ఆంధ్రులు అనాలన్నదే మీ కోరికయితే ఎటువంటి అభ్యంతరం లేదు. Identification is derived from affiliation.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మదరాసు ప్రాంతీయులు *తమను తాము* సెటిలర్లు అని పిలుచుకునే వారా? News to me. నాకు నిజంగా తెలీదు. అదటుంచి మదరాసు ప్రాంతీయులు కారే‌ ఆంధ్రప్రాంతం‌ నుండి వచ్చిన వారు. మీరు ఆంద్రావాళ్ళని ఇంకా మద్రాసీలు అనే గుర్తించుతున్నారా? బలే.

   తొలగించండి
  2. సెటిలర్లు అనబడే వారు ఎక్కువగా సిర్పూర్, బోధన్, బాన్సువాడ, పరకాల, కోదాడ, మిర్యాలగూడెం ప్రాంతాలలో ఉంటారు. ఊళ్ళ పేర్లు గుంటూరుపల్లె, కమ్మవాడ తరహాలో ఉంటాయి. హైదరాబాదులో చిక్కడపల్లి, విజయ నగర్ కాలనీ, ఆనంద నగర్ వంటి కాలనీలలో కూడా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు దాదాపుగా సింహభాగం మేము తెలంగాణోళ్ళము అంటున్నారు.

   PS: నేను ఆంధ్రులను మదరాసీ ఎప్పుడూ అనలేదండీ.

   తొలగించండి
 8. సెటిలర్లు అనే కంటే ప్రవాసాంధ్రులు అంటే బాగుంటుంది కదా!
  నేను పాతికేళ్ళకు పైగా ప్రవాసాంధ్రుడిని, కాని హైదరాబాదు లో ఎప్పుడూ నివసించలేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. భలేవారే, బోనగిరి గారూ. తెలుగు కన్నా ఆంగ్లం ముద్దు కదా. టివీ ఏంకరులను చూసి తెలుసుకోండి. పైగా పలకటానికి తేలిక. మీరేదో పెద్ద పెద్ద పదాలు చెబితే పలకడానికి కష్టం కదా?

   తొలగించండి
 9. ''బాహిరి మను'' అనగా బయటి మనిషి అని అర్ధం, మీకు తెలియండి కాదు. బంగాలీలో జిలేబి మాట.

  అవును మీరు మాకు బాహిరి మను
  మిమ్మల్ని కని పెంచి పెద్దవాళ్ళని చేసింది మా ప్రాంతం, మీకో వ్యక్తిత్వం ఇచ్చిందీ చోటు.
  పొట్ట చేతబట్టుకుని ప్రవాసం పోయినరోజే మీరు మా వాళ్ళు కారు. కుండ వేరైతే గుణం వేరని సామెత.
  మీకు ఇక్కడ ఇంకా అక్కడక్కడా బొడ్డు తాడు సంబంధం ఉన్నా అది అంతంత మాత్రమే! మరో సారి మీరు మా వాళ్ళు కారు.

  ఇక మిమ్మల్ని అక్కడ సెట్లర్స్ అంటున్నవాళ్ళంతా మీరు నిత్యం నావాళ్ళూ అని నెత్తిన పెట్టుకు ఊరేగుతున్నవాళ్ళే! పొట్ట చేతబట్టుకుని వచ్చారు గనక వాళ్ళు మిమ్మల్ని సెట్లర్స్ అంటున్నారు, ఎగతాళి చేస్తున్నారని బాధ పడుతున్నారా! ఇప్పుడు ఎవరు మీవాళ్ళో తేల్చుకోండి.మేము మీవాళ్ళం మాత్రం కాదు!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. తమ మూలాలు ఉన్న ప్రాంతంపై మక్కువ ఉండడం మానవసహజం, దీన్ని తప్పు పట్టలేం. కాకపొతే పెక్కు మందికి ఎమోషనల్ (లేదా టీవీ ఆధార) అటాచ్మెంట్ తప్ప క్షేత్రస్థాయి కనెక్షన్ ఉండదు. కొందరికయితే తాము ఎప్పుడో వదిలేసిన ఊరు ఇంకా frozen-in-time తరహాలో లేదేమా అని రంది, పైగా గుస్సా కూడా.

   తొలగించండి
 10. మాస్టారూ లోకులు పలు కాకులు. ఒక్కొక్కరూ ఒక్కో రకం. ఏం మాట్లాడినా రాజకీయం చేసే.. అసలు "రాజకీయం" అనే పదాన్నే గబ్బు పట్టించిన మనుషులున్న లోకం ఇది. ఏ విషయాన్నైనా తనకిష్టమైన వారికి అనుకూలంగా అన్వయించి మాట్లాడి మేధావులమని పోజు కొట్టే వెధవాయిలున్న ప్రపంచం ఇది.ఓ రాష్ట్రానికి రాజధానే అక్కర్లేదని వాదించే మూముకొ లు ఉన్న దేశం ఇది. అలాంటిచోట మీరు వాదించి గెలవడం మాట తరువాత, అటువైపు వారిలో చిన్న కదలిక తీసుకురావడం కూడా ఇసుకలోంచి నూనె తీయడం కన్నా కష్టమైంది.
  అందుచేత ప్రాపంచిక విషయాలు వదిలేసి ఆ రాముడిని స్మరించుకుంటే బోలెడు ఆత్మానందం కలుగుతుంది.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరన్నది నిజమే. నామస్మరణాదన్యోపాయం నహి పశ్యామో భవతరణే.

   తొలగించండి
 11. ఐతే ఇపుడొక ఉదాహరణ.. ఇందులో ఎవరు సెటెలర్స్ మీరే చెప్పండి..
  బ్రిటీషర్స్ ఒకపుడు బ్రిటేయిన్ నుండి ఇండియకు కోల్కతలో ఉండినారు.. హ్యావ్లాక్ బ్రిడ్జ్ గోదావరిపై నిర్మించారు.. రజాకార్లు భారతావని ఆవల నుండి వచ్చినారు.. పృథ్వీరాజ్ చౌహాన్ రాజ్యాన్ని అతలాకుతలం చేసిన వారి వలన జిప్సిలుగా కొంత మంది మారారు.. హెదరాబాద్ శివార్లలో షా అలి బండ, అసఫ్ జాహి, కులి కుతుబ్ షా, గోల్కొండ, భాగమతి, బంజారా హిల్స్, లక్డి-కా-పుల్, ఆ తర్వాత.. ఉద్యోగ రిత్య కొంత మంది ఆంధ్ర కర్ణాటకీయం, ఇంకొంత మంది కేరళితమిళీయం, మరి కొందరు బంగ్లఓడియం, కొందరైతే తెలంగాణాంధ్రీయం, తతిమ వారు రాయలసీమాంధ్రీయం, తక్కిన వారు లోకలోకల్లోలోకం.. ఏవిటౌ..!! గజిబిజి..!!!

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కొన్ని సవరణ/వివరణలు:

   "రజాకార్లు" అనే పదం రాజకీయ పార్టీకి సంబంధించింది తప్ప ప్రాంతీయతకు/మూలాలకు సంకేతం కాదు. మీరు హబ్సీ (సిద్దీ) లేదా చావుష్ అనబోయినట్టున్నారు.

   ఇకపోతే షా అలి బండ (కొందరు తప్పుగా శాలిబండ లేదా సాలిబండ అని కూడా అంటారు) "శివార్లలో" కాదు. నడిబొడ్డున ఉంది.

   తొలగించండి
  2. రజాకార్లు రాజకీయ పార్టీ‌వాళ్ళు కాదనే అనుకుంటున్నాను.
   కాని శేషించిన రజాకార్ల నుండే ఒక ప్రసిధ్ధరాజకీయ పార్టీ పుట్టినట్లు తోసున్నది.
   తమాషా ఏమిటంటే మతతత్త్వపార్టీలు అంటే అంతెత్తున లేచే కుహనాలౌకిక పార్టిలు ఆ రజాకార్లవారసులు స్థాపించిన పార్టీతో‌ అంటకాగడానికి మాత్రం ఏమాత్రం సిగ్గుపడరు!

   తొలగించండి
  3. Some background history:

   మజ్లిస్ (Majlis-e-Ittehadul Muslimeen) పార్టీ బహదూర్ యార్ జంగ్ కాలంలో స్థాపించారు. అతడి అనూహ్య అకాల మరణం (నిజాం ఉస్మాన్ కుట్రా అని కొందరి అనుమానం) పిదప ఖాసీం రాజ్వీ పార్టీ గద్దె ఎక్కాడు.

   రజాకార్ అనే పదానికి స్వయంసేవకులు (~= RSS) అని అర్ధం.

   రెండో ప్రపంచ యుద్ధం దరిమిలా నిజాం తన బలగాలను ఇంగ్లాండ్ తరఫున యుద్ధం కొరకు పంపాడు. అంచేత సంస్థానంలో సిబ్బంది కొరత ఏర్పడింది కాబట్టి తమ వారిని కూడా వాడుకోమని చెప్పి, రాజ్వీ తెలివిగా రజాకార్లకు శిక్షణ ఇప్పించాడు.

   తెలంగాణా సాయుధ పోరాట సందర్భంగా భూస్వాముల అరాచకాలకు రజాకార్లు వంత పాడారు. ఉ. బైరానపల్లి ఊచకోత.

   రాజ్వీ ఆపరేషన్ పోలో దరిమిలా జైలు పాలయ్యాడు కానీ పాకిస్తాన్ వలస వెళ్లాననే ఒప్పందం చేసుకొని (~+ Savarkar) విడుదల అయ్యాడు. అబ్దుల్ వహీద్ ఒవైసి నాయకత్వం లో మజ్లిస్ పార్టీ తన పంధా మార్చుకొని భారత సంవిధానానికి జై కొట్టి (~= DMK, IUML, Hindu Mahasabha, SAD) రాజకీయాలలోకి పునః ప్రవేశం చేసింది.

   ఏదేమయినా, రజాకార్ అంటే ప్రాంతీయతకు/మూలాలకు సంకేతం కాదు, నా
   8 డిసెంబర్, 2020 6:38 PM వ్యాఖ్యలో ప్రధానోద్దేశ్యం ఇదే.

   తొలగించండి
  4. ధన్యవాదాలు జైగారు. కాని రజాకార్ల వైపు చర్చ మరలటం అనవసరమైన శాఖాచంక్రమణం. నావ్యాసం గురించిన చర్చకు ఏమీ అవసరమైన విషయం కాదు.

   తొలగించండి
  5. జై గారు, శ్యామల్ రావు సర్ నన్ను మన్నించాలి. హైదరాబాద్-సికింద్రాబాద్ లలో నేను తిరిగిన చోట్లు చాలా తక్కువనే చెప్పాలి.. వెస్ట్ మారెడ్ పల్లి, తార్ నాకా, అఫ్జల్ గంజ్, మియాపూర్, మలక్ పేట, నిజాంపేట, బోవెన్ పల్లి, రామాంతపూర్, గౌలిగుడ, ఏయస్ రావు నగర్, కాప్ర, గోల్కొండ, ఫతే మైదాన్, నెక్లెస్ రోడ్, బోలారం, అమీర్ పేట, హయత్ (బక్షి బేగం) నగర్, చార్ మినార్, కొండాపుర్, హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజి ఇంజినియరింగ్ కన్సల్టెన్సి సిటి, పద్మారావు నగర్, శంషాబాద్, కూకట్ పల్లి.., మరి ముఖ్యంగా మా తాతగారి నోట విన్న హిస్టరి లో పదాలే ఈ రజాకార్లు.. ఓసారి మీరెప్పుడు పుట్టారు తాత అనే ప్రశ్న కు రజాకారులు వచ్చినపుడు వారికి మూడో యేట అన్నారు. అప్రస్తుతమే కాని శ్యామల్ రావు గారు సెటెలర్ల గూర్చి వ్యాసం లో చెప్పినపూడు నాకు ఆ సంగతి గుర్తుకు వచ్చి వ్రాశాను. అంతే..! ఏదేని తప్పుగా అనిపిస్తే మన్నించేదురు.

   తొలగించండి
  6. @Sri[dharAni]tha:

   మీ 8 డిసెంబర్, 2020 2:22 PM వ్యాఖ్య చక్కటి సమాచారం ఇచ్చారు. అంతే స్థాయిలో 10 డిసెంబర్, 2020 3:17 PM వ్యాఖ్య కూడా.

   ఎప్పటిలాగే మీ బహుళ విషయ విస్తార పరిచయం టూ గుడ్. Great breadth & width of knowledge & information, thank you.

   నేను నాకు తోచిన (లేదా తెలిసిన) స్వల్ప మైనర్ కరెక్షన్ చెప్పాను అంతే.

   తొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.