16, డిసెంబర్ 2020, బుధవారం

ధనమేరా అన్నిటికీ‌ మూలం.

ధనమేరా అన్నిటికీ‌ మూలం‌ అనగానే కొంతమందికి ఒక మంచి సినిమాపాట గుర్తుకు వస్తుంది. ఇదిగో ఆపాట. అన్నట్లు కొంతమందికే‌ గుర్తుకు వస్తుందీ అని ఎందుకనటం అంటే ఆధునికుల్లో అనేకులు తెలుపు-నలుపు సినిమా అంటే చచ్చినా చూడరు. అ పాతచింతకాయపచ్చడి సినిమాల్లో ఏముంటుందీ అనేస్తారు. రంగురంగుల హంగుల సినిమాల్లోనే ఎంతో గొప్పగొప్ప కథలూ నీతులూ అదేదో‌ ఎంటర్‌టైన్‌మెంట్ అంటారే అదీ, ఇంకా బోలెడు విలువైనవీ ఉంటాయని వాళ్ళ గాఠ్ఠి నమ్మకం మరి. 

వార్తాపత్రిక తెప్పించటం మానివేసి చాలాకాలం ఐనది. ఎప్పటి నుండీ అని అడక్కండి. నాకూ తెలుసు, మీకూ తెలుసు కరోనాకాలం మొదలైనప్పటినుండి అని. కరోనామూలంగా వాడు పేపర్ వేయటానికి లేకుండా పోయింది. ఈమధ్య మళ్ళా పేపర్ వేస్తానూ అంటూ ఫోన్ చేస్తే, వద్దులే నాయనా మేం ఇలా అలవాటుపడిపోయాంలే అని చెప్పేసాం.

నిజానికి పేపర్ వస్తున్నాసరే బహుకాలంగా వార్తలకోసం టీవీలోని వార్తాఛానెళ్ళూ వివిధపత్రికలవాళ్ళ అంతర్జాలపత్రికలూ ఉపయోగించటం చేస్తున్నాం.

ఒకప్పుడు కొత్తవార్తలు అంటే అవి ఉదయం వచ్చే వార్తాపత్రికతోనూ లేదా రేడీయోలో సమయప్రకారం వచ్చే వార్తాప్రసారాలతోనూ మనదాకా వచ్చేవి. ఆ రేడియోల కాలం పోయింది. ఇప్పుడు ఎఫ్‌ఎమ్‌ అంటూ రణగొణధ్వానాల స్టేషన్‌లు వచ్చాయి కాని వాటిని వినే ఓపిక మాకు లేదు. ఇక టీవీలో ఐతే వచ్చే వార్తలకన్నా నరజీవులకుండే ఓపికను పరీక్షించే అడ్వర్టైజ్‌మెంట్ల గోలే చాలా ఎక్కువ.

అందుచేత తీరిక దొరికినప్పుడు అంతర్జాలంలో చూస్తాను వార్తల కోసం. 

అలా ఈఉదయం‌ కంటబడ్డది నయనకంటకమైన వార్త ఒకటి - కన్నతల్లిదండ్రుల ఫోటోకు చెప్పుల దండ వేసిన ప్రబుధ్ధుల గురించి.(పైన ఇచ్చిన ఫోటో, ఆంధ్రజ్యోతి వారి వార్తతో ప్రచురించినది.)

ఏమిటీఅన్యాయం!

నిన్న టీవీలో వార్త చూశానన్నారు మిత్రులు విన్నకోట వారు.   అన్ని విలువలనూ పూర్తిగా వదిలేసిన సమాజంలాగా తయారవుతోంది. మీడియా, సినిమాలు, వ్యాపారులు ఈ రుగ్మతకు కారణం అంటున్నారు వారు.

కలికాలం అన్నారు మిత్రులు శర్మ గారు.

నిజం చెప్పాలంటే, డబ్బుకు తప్ప జీవితంలో మరి దేనికీ విలువే లేదన్న ఆధునిక జీవనసత్యాన్ని ఊహ తెలిసినప్పటి నుండి పిల్లలకు ఈకాలంలొ తలిదండ్రులే నూరిపోస్తున్నారు. చివరికి ఇలాంటి వికృత పరిణామాలు ఎదురైతే అందరూ గుండెలు బాదుకుంటూ గోలపెడుతున్నారు!

కొన్ని దశాబ్దాల క్రిందటి సంఘటన ఒకటి గుర్తుకు వస్తున్నది. నేను హైదరాబాదుకు వలసవచ్చిన రోజులవి. అప్పట్లో మా మేనమామ గారింట్లో కొన్నాళ్ళున్నాను. ఆ తరువాత కాలంలో కూడా వారింటికి వెళ్తూనే ఉండేవాడిని. ఒకరోజున ఆయన తన కుమార్తెపైన కోపగించుకుంటుండగా వెళ్ళాను.

ఆ పిల్ల అప్పుడు ఎల్‌కేజీలోనో యూకేజీలోనో ఉంది. స్కూల్లో క్లాస్ మెత్తానికి నాలుగవస్థానంలో వచ్చిందట. అంతక్రిందటి సంవత్సరం మొదటిదానిగా వచ్చిందట. ఇలా చదువులో వెనుకబడిపోతే ఎలా? ఇలా చదివితే పెద్ద జాబ్ ఎలా వస్తుంది, ఎలా దర్జాగా బతుకుతావూ అని ఆ అమ్మాయి మీద అరుస్తూ‌ క్లాస్ తీసుకుంటున్నాడు! ఆ పిల్ల ఈమానవుడికి ఏమయిందో అర్ధం కాక బిక్కమొఖం పెట్టి చూస్తోంది.

ముక్కుపచ్చలారని వయస్సులోనే మనం పిల్లలకి డబ్బు ఎంత ముఖ్యం అంటే దానితరువాతే‌ జీవితం సుమా అని నూరిపోస్తున్నాం. ఆముక్కలు చాలాబాగా వంటబట్టించుకొన్న కొందరు ఆ డబ్బుకోసం ఆ తలిదండ్రులమీదే అఘాయిత్యాలు చేస్తున్నారు మరి. తప్పెవరిది?

ఎప్పుడు ఎరుకలోనికి వచ్చిందో ఇప్పుడు సరిగా గుర్తులేదు కాని మరొక సంఘటన ఇలాంటిదే ఉంది. 

ఒక జంటకు ఇద్దరు పిల్లలు. ఆ భార్యాభర్తలకు ఏమాత్రం సఖ్యత లేదు కాని పిల్లల్ని మాత్రం కళ్ళల్లో పెట్టుకొని పెంచారు. సఖ్యత లేక పోవటం అంటే మరేమీ లేదు భార్యకు చిరుకోపం భర్తకు పెనుకోపం అన్నమాట. చిరుకోపం ఎందుకంటే డాక్టరు తినొద్దయ్యా అన్నవన్నీ తింటాడు ఇంటాయన. నువ్వు తినకూడదుగా అంటూ వండి పెట్టకపోతే ముందు అలుగుతాడు - ఆతరువాత కోపంతో అరుస్తాడు. రోజూ‌ తిండిదగ్గర పేచీలేను.

అన్నట్లు పిల్లలిద్దరికీ పెళ్ళిళ్ళై ఎప్పుడో వెళ్ళిపోయారు. కూతురు సరే సరి, కొడుకు వేరు కాపురం కదా, అదన్నమాట. 

ఒకరోజున కొడుకు వచ్చాడు. ఆలూమగలు సంబరపడ్డారు. కొడుక్కి ఇష్టమైనవి అంటూ‌ ఇంటాయన లిష్టు చదివాడు. వాడికోసం కొంచెం చేస్తానులే అని కసిరింది ఆవిడ. లడాయి మొదలు.

కాని భోజానాలు పూర్తయ్యాక అసలు లడాయి మొదలైంది. ఎలాగూ మీరు నాదగ్గర వచ్చి ఉండవలసిందే కదా రేపోమాపో, అందుకని ఈ ఇల్లూ, కొట్టూ వగైరా అంతా ఇప్పుడే రాసిచ్చేయి అన్నాడు కొడుకు.

అమ్మానాన్నా కుదరదన్నారు. 

అంతే అతడు పట్టుబట్టడం, వాదు పెరగటం జరిగింది.

అసలే కోడలు వచ్చి కొడుకుని నిజంగానే దూరం చేసిందన్న కక్షతో ఉన్న అమ్మ కొంచెం మాట విసిరింది. ఇదంతా నీకు నీ‌ పెళ్ళాం నూరిపోసిందిలే అని.

కొడుకు విచక్షణ కోలుపోయాడు. అమ్మని లాగి లెంపకాయ కొట్టాడు.

అమ్మానాన్నలు మ్రాన్పడిపోయారు.

అమ్మ గ్రుడ్లనీరు కుక్కుకుంది. కాని కొడుకుతో ఏమీ మాట్లాడాలి అనిపించక కాబోలు మౌనంగా ఉండిపోయింది.

తండ్రి రంకెలు వేసాడు. నా యింట్లోంచి బయటకు నడు అంటూ, ఏమేమో అన్నాడు.

కొడుకు కోపంలో తండ్రికి తగ్గ వారసుడేగా. ఊగిపోతూ తండ్రిమీదికి దూకాడు.

తండ్రిమీద చేయి వేసేలోగా ఉన్నట్లుండి విరుచుకొని పడిపోయాడు.

ఎందుకంటే తల్లి చీపురుకట్ట తిరగేసి వాడి తలమీద ఒక్కటిచ్చింది బలంగా! 

ఎంతైనా కన్నప్రేగు కదా. కొడుక్కేమైందో అని ఆలూమగలు లబలబ లాడారు. ఎన్నో ఉపచారాలు చేసారు. అదృష్టవశాత్తూ ఏమీ కాలేదు వాడికి. కొద్దిసేపటికే స్పృహలోనికి వచ్చాడు. అమ్మానాన్నల్ని అనరాని మాటలన్నాడు. మీ అంతుచూస్తాను అని కూడా అన్నాడు. ఆతరువాత తండ్రికి వేలు చూపిస్తూ ఇంటినుండి వెళ్ళిపోయాడు.

సంగతి అంతా తెలిసి ఊళ్ళొనే ఉండే కూతురు అన్నగారి మీద పోలీసులకి ఫిర్యాదు చేసింది. వాడి మీద ఇప్పటికే  రౌడీషీటర్ అన్న బిరుదు ఉంది. మా అమ్మానాన్నలకి ప్రాణాపాయం ఉంది అని. వార్త పేపర్లకి ఎక్కింది.

ఏదో‌ నాదృష్టిలో ఉన్నది ఒకటి వ్రాసాను కాని ఇలాంటి తరచు చూస్తూనే ఉన్నాం.

నాగరికత పేరుతో ఆధునిక విద్యపేరుతో మనం సామాజిక విలువలను ఎప్పుడో ధ్వంసం చేసుకున్నాం. అందుకే ఇటువంటి సంఘటనలు సాధారణం అయిపోయాయి.

వేమన పద్యం ఒకటి గుర్తుకు వస్తున్నది.


తల్లి తండ్రి మీద దయలేని పుత్రుండు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోన చెదలు పుట్టవా గిట్టవా
విశ్వదాభిరామ వినురవేమ


వేమన పద్యాలను ఈరోజుల్లో ఎక్కడా బళ్ళల్లో చెప్పరు. సుమతీ శతకం చెప్పరు. కృష్ణ శతకం చెప్పరాదు. అవన్నీ పాత చింతకాయలు. పనికిరావు నేటి చదువులకి. పసిపిల్లల చేత రైన్ రైన్ గో అవే‌వంటి దౌర్బాగ్యపు రైమ్స్ మాత్రం చెప్పిస్తారు. అదీ చూస్తామంటారా ఇదిగోవీళ్ళకి వాన రావటం ఇష్టం లేదట. చాలా బాగుంది. వానలు పడకపోతే ముద్ద నోటికి ఎలావస్తుందో మరి.

అమ్మానాన్నలనూ, ఆమాటకు వస్తే అందరినీ గౌరవంగా ఎలా చూడాలో ఆదర్శంగా అచరించి చూపిన రాముడి కథను మెచ్చదు నేటి మేథావి గణం. రామాయణం విషభాండం అనో విషవృక్షం అనో చెప్తారు. టీచర్లను ఎలా ఎగతాళీ చెయ్యాలో పాపం స్కూళ్ళల్లో నేర్పటం లేదు కాని అందుకోసం మన సినిమాలవాళ్ళు ప్రతిసినిమాలోనూ తప్పకుండా పాఠాలు చెబుతూనే ఉంటారు.

దిక్కుమాలిన చదువులూ దిక్కుమాలిన నాగరికతాను, అమ్మానాన్నల్ని అవమానించటం మాత్రం బాగా నేర్పుతున్నాయి.

3 కామెంట్‌లు:  1. మీ టపా బాగుంది కానీండి ఆ ఫోటో మాత్రం ఫోటో షాప్ గోల్మాల్ లా వుంది :)    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. కలికాలం:--చెప్పులదండ వేస్తే చెప్పుకున్నాం, పూల దండ వేస్తే చెప్పుకుంటామా?పూజిస్తే చెప్పుకుంటామా? ఈ పత్రికవాడు ఈ వార్త సంచలనం కనక ప్రచురించాడు, మనం చదివాం. అదే పూజించిన వార్త సంచలనం కాదు. పత్రిక వెయ్యదు. వేసినా చదవం.కావలసింది డబ్బు,సంచలనం,ఉత్తేజం. అంతే.
    గత వంద సంవత్సరాలుగా సమాజం మార్పుకు లోనయింది, సహజం, ఇదింతే!మారాలనుకోడం వెర్రితనమే

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.