19, డిసెంబర్ 2020, శనివారం

మనుచరిత్రలోని ద్విరదగతి రగడ

 రగడలు తెలుగువారి విలక్షణ ఛందస్సులు.

లోగడ వృషభగతి రగడను పరిచయం చేసాను కదా అచ్చతెనుఁగు కావ్యం శృంగారశాకుంతలంలోని వృషభగతిరగడ అన్న టపాలో. ఇప్పుడు అల్లసాని వారి ద్విరదగతి రగడను చెప్పుకుందాం.

రగడలు మాత్రాఛందస్సులు. ఈ ద్విరదగతి లక్షణం ఏమిటంటే రెండేసి పాదాలు ఒక పద్యంగా ఉండే దీనిలో‌ ప్రతిపాదానికి నాలుగేసి పంచమాత్రాగణాలు వాడుతారు. ప్రాసనియమం తప్పనిసరి. పాదం సరిగా మధ్యలో విరిచి యతిమైత్రి పాటిస్తారు.  రగడలకు సాధారణంగా అంత్యప్రాసను పాటిస్తారు.  పాదాంతవిరామం తప్పనిసరిగా పాటించాలి.

ఇకపోతే‌ పంచమాత్రా గణాలు అంటే చెప్పాలి కదా.  సూర్యగణాలూ‌చంద్రగణాలూ ఇంద్రగణాలూ అంటూ సాధారణగణవర్గాలని మర్చిపోండి కాస్సేపు. ఇక్కడ రగడల్లో మాత్రల కొలతే ముఖ్యాతిముఖ్యం. పంచమాత్రా గణం అంటే లఘువు ఒక మాత్రగానూ గురువు రెండు మాత్రలు గానూ‌ లెక్కిస్తూ ఐదు మాత్రల కొలత వచ్చే అక్షరసంపుటి ప్రతిది మంచమాత్రాగణమేను.

కొందరికి ఒక శంక కలుగవచ్చును ద్విరదగతికి నాలుగు పంచమాత్రాగణాలు కలిసి ఒక పాదం అన్నారు కదా. అంటే పాదానికి  5 x 4 = 20 మాత్రలు అని చెప్తే సరిపోతుంది కదా మళ్ళా  5 + 5 + 5 + 5 మాత్రలు అన్నట్లు చెప్పటం ఎందుకూ అని. 

కారణం ఉంది.

ఐదేసి మాత్రల దగ్గర విడిపోవాలి అక్షరాలు.

"రారాజేమయ్యే" అంటే అది కూడా పది మాత్రల ప్రమాణం వచ్చిందా లేదా? "రారాజేమయ్యే రణాంగణంబు వదలి" అంటే చక్కగా ఇరవై మాత్రల ప్రమాణం వచ్చిందా లేదా?

కాని అలా వ్రాయకూడదు. ఇక్కడ ఐదేసి మాత్రల దగ్గర విడగొట్టటం‌ కుదరదు అక్షరాలను కాబట్టి. "రారాజే" అనగానే ఆరు మాత్రలు అయ్యాయి. ఐదవ ఆరవ మాత్రలు కలిసి ఒకే అక్షరంలో ఇరుక్కున్నాయి. అలా కుదరదన్నమాట.

ఎందుకైనా మంచిదని, మనం‌ ఈ‌పంచమాత్రా గణాలను లెక్కించి చూదాం. ఒక్క గురువూ లేకుండా ఒకే ఒక పంచమాత్రాగణం I I I I I అనేది. ఒక గురువును వాడదాం అనుకుంటే ఇంక మూడు లఘువులకే చోటు ఉంటుంది కాబట్టి అలా ఏర్పడే పంచామాత్రా గణాలు [ U I I I,  I U I I,  I I U I,  I I I U ] అనే నాలుగు. రెండు గురువులను వాడుదాం అనుకుంటే ఒక లఘువుకు మాత్రం చోటుంటుంది కాబట్టి అలా ఏర్పడే పంచమాత్రా గణాలు [I U U,  U I U,  U U I] అనే మూడు. మూడు గురువులతో‌ పంచమాత్రా గణాలు రానే రావు. 

ఐతే ఇలా లెక్కకు వచ్చిన పంచమాత్రా గణాల్లో సాధారణంగా I U I I కాని I U U కాని వాడరు. I U అన్న క్రమాన్ని ఎదురునడక అంటారు. దేశిఛందస్సుల్లో ఎదురునడకని సాధారణంగా అంటరానిదిగా చూస్తారు. I U I కూడా ఎదురునడకే కాబట్టి అది చతుర్మాత్రా గణంగా వాడరు అన్నది కూడా గమనించాలి.

ఒక ముఖ్య విషయం ఏమిటంటే రగడపద్యలక్షణంగా రెండుపాదాలే‌ కాని ఎవ్వరూ కేవలం రెండుపాదాల పద్యంగా ఒక రగడను వ్రాసి సరిపెట్టరు. కవులంతా ఒకే‌రగడ ఛందంలో అనేక పద్యాలను ఒక తోరణంలాగా వ్రాసుకుంటూ‌ పోతారు.  మీకు తెలిసే ఉంటుంది ఒక వృత్తాన్ని కూడా ఒక మాలిక లాగా ఎన్ని పాదాలైనా వ్రాయవచ్చునూ‌ అని. ఎవరిదాకానో‌ఎందుకూ పెద్దన గారే పూఁత మెఱుంగులుం బసరుపూఁప బెడంగులుఁ అంటూ ఒక పెద్ద ఉత్పలమాలికను చెప్పారు కదా అని.

ఏమిటయ్యా తేడా ఇక్కడ అంటే ఇలా రగడను పొడుగ్గా వ్రాసుకుంటూ‌ పోయేటప్పుడు ద్విపదకు లాగా రెండేసి పాదాలకు ఒకసారి ప్రాసను మార్చుకోవచ్చును. అదీ‌ సంగతి.

ద్విరదగతి రగడ ఐదేసి మాత్రల చొప్పున పాదంలో నాలుగుసార్లు విరుపుతో ఉంటుంది కాబట్టి ఇది ఖండగతిలో పాడటానికి నప్పుతుంది. అసలు రగడలన్నీ పాడటానికి చాలా బాగుంటాయి. 

రగడల్లో మొదట్లో ప్రాసనియమం కాని అంత్యప్రాసలను కూర్చటం‌ కాని లేదు. కాలక్రమేణ ఇది ఒక పద్దతిగా రూపుదిద్దుకుంది. అలాగే కొందరు పూర్వకవులు తమతమ రగడల్లో ఎదురునడకనూ వాడారు కాని చాలా అరుదు.

మరొక ముఖ్యవిషయం. తెలుగు ఛందస్సుల్లో గణాల దగ్గర పదం విరుగుతూ ఉంటే బాగుంటుంది. అలాగని ప్రతి గణమూ ఒక కొత్తమాటతో ప్రారంభం అయ్యేలా చూడటం దుస్సాధ్యం. కాని వీలైనంత వరకూ ఇది ఒక నియమంలా పాటించాలి. రగడలనే కాదు కందంతో‌ అన్ని రకాల దేశిఛందస్సుల్లోనూ ఇది శ్రధ్దగా పాటిస్తే పద్యాల్లో పఠనీయత పెరుగుతుంది. దేశి ఛందస్సుల ముఖ్యలక్షణమైన గానయోగ్యతను ఇనుమడింప జేస్తుంది.

రగడలకు ప్రాసనియమమూ, అంత్యప్రాసనియమమూ ఉన్నాయని చెప్పుకున్నాం‌ కదా. ఈ రెండు నియమాలూ వదిలి పెట్టి వ్రాయటం‌ అన్న పద్దతి కూడా ఒకటి తప్పకుండా ఉంది. అలా రగడలను వ్రాయటం‌ మంజరి అంటారు. ద్విరదగతి మంజరీ రగడ అంటే ద్విరదగతి రగడనే ప్రాసనూ‌ అంత్య ప్రాసనూ నియమంగా తీసుకోకుండా వ్రాయటం‌ అన్నమాట. మనం ద్విపదలనూ ప్రాసలేకుండా వ్రాస్తున్నప్పుడు వాటిని మంజరీద్విపదలు అంటున్నాం‌ కదా, అలాగే నన్న మాట.

అలాగూ ద్విపదలను కూడా ఇక్కడ ప్రస్తావించాం‌ కాబట్టి ఒక పోలిక చెప్పుకోవాలి. ద్విపదను ద్విరదగతి రగడలో ఇమడ్చవచ్చును సులభంగా. నాలుగు పంచమాత్రాగణాలనూ మనం ద్విరదగతిలో ఉన్న అదనపు మాత్రాగణాలను వదలి పంచమాత్రా ఇంద్రగణాలతో వ్రాయాలి. చివరి పంచమాత్రాగణం మొదట సూర్యగణం కలిసి వచ్చేలా వ్రాయాలి. అంతే సరిపోతుంది. చిత్రం ఏమిటంటే యతిమైత్రి స్థానం కూడా ఏమీ‌ ఇబ్బంది పెట్టదు ఆ ఇమిడిన ద్విపదకూ మనం వ్రాస్తున్న ద్విరదగతికీ కూడా ఒకే చోట యతిమైత్రి స్థానం. బాగుంది కదా.

ఇక పెద్దన్న గారి ద్విరదగతి రగడను చూదాం.

నేర్పుమై నల్లయది  నెఱులఁ దొలుపూఁ దుఱిమె,
దర్పకున కర్పింపఁ దలఁప దెంతటి పెరిమె?

యింతి పావురపురొద యేల వినె? దారజము
వింతయే? విరహిణుల వెతఁ బెట్టు బేరజము;

సురపొన్న క్రొన్ననలు సొచ్చి నలుగడ వెదకు
తఱగ దందుల తావితండంబు క్రొవ్వెదకు;

నఱిమి ననుఁ జివురునకు నగునె కంటక మాడఁ?
జుఱుకు మనె వేఱొక్కచోటఁ గంటక మాడఁ?

గుందములు నీ కొసఁగఁ, గూర్చితిని గైశికము
నిందులకు వెల యడుగ నేల? విడు వైశికము!

చిఱుఁదేంట్ల కొసఁగె గుజ్జెనఁగూళ్ళు గొజ్జంగ,
యెఱుఁగ కది పూ వంద నేల? యిటు రజ్జంగ?

నెదిరింపఁ బోలు నీ వింతి! రతిపతిఁ దెగడఁ
బొదలఁ జిగురులు తుదలఁ బూచి యున్నది పొగడ;

పుడుకు మల్లన గందవొడికి నీ ప్రేంకణము
దడయ కిటు నీకిత్తుఁ దగ రత్నకంకణము;

నెరసి పోఁ జూచెదవు నిలునిలువుమా, కనము,
గురియు తేనెల జీబుకొన్న దంతట వనము;

కా దల్లయది ఫుల్లకంకేళి, పన్నిదము,
మోదు, గోడిన నీదు ముత్యాలజన్నిదము;

ఏటవా లైనయది యీ యరఁటిబాలెంత,
చేటునకె యగు, చూలుచేఁ గలుగు మే లెంత?

నెలఁత! యీ గేదంగి నీకబ్బె బుక్కాము,
చిలుకు నీ పుప్పొళ్ళు చెంచెతల బుక్కాము;

మితిలేని తేనె నామెత చేసె విరవాది,
యితరలతికల మరిగి యేఁగు నది పరవాది;

కలిగొట్లు ప్రాఁకువేడ్కలె నీకుఁ దఱచెదను,
నలినాక్షి! కడిమిగండమున కే వెఱచెదను;

గురువెంద నదె గిలుబుకొనియెఁ బయ్యెరదొంగ,
విరులఁ గరికుంభకుచ! వెరఁజు మై యరఁ గ్రుంగ;

మెరమెరని కొలనిదరి మీలంచు లకుముకులు
మరగె నీకనుదోయి, మాయింపు చకచకలు;

ఏకాంతమని తొలఁగె దెందు నీవటె వేఱు?
చేకొనవె మున్నాడి చెలువ! యీ వటివేరు;

అరిది యీ యేడాకులరఁటి నగుకప్పురము
సరిరాదు దాని కల శశియొడలు కప్పురము;

పాళ కల్లది పోఁకఁ బ్రాఁక బందము దెగియె.
నాళి యది దిగజాఱునట్టి చందము నగియె;

మలయపవనుని బిలిచె మావి బళి! యీ వేళ
మలయు కోవెల పంచమస్వరం బను నీల;

సులభమై దొరకె మంజులవాణి! చంపకము,
చిలువానెఁ బూఁబొదలు, చేరి యిఁక వంపకుము;

చనకుఁ డిఁక దవ్వులకు సఖులార! పువ్వులకు
ననుచు నలరులు గోసి రతివ లల్లన డాసి.

ఈ ద్విరదగతి రగడలో 22పద్యా లున్నాయి. గణాలదగ్గర పదం విరగని తావులు ఈమొత్తం రగడలో లెక్కిస్తే కేవలం 23 మాత్రమే ఉన్నాయి. ప్రతిపద్యంలోనూ ఎనిమిది పంచమాత్రాగణాలు చొప్పున మొత్తం‌ రగడలో 176 గణాలున్నాయి. కేవలం వాటిలో 23మాత్రమే పదం గణారంభం‌ మీదరా లేదంటే నియమభంగం ఐనది 13% గణాలకే. అంటే మీరే గమనించండి పదాలను ఎలా గణాలతో సమన్వయం చేయాలో దేశికవిత్వంలో అన్నది.

యతిమైత్రి స్థానం విషయానికి వస్తే అక్కడ ఎలాగూ‌ గణారంభం ఉంది. ఈ 22పద్యా లున్నాయి కదా వీటిలో‌ కేవలం 6 సందర్బాల్లో మాత్రమే యతిస్థానం పదం మధ్యలోనికి వచ్చింది. అంటే 44పాదాల్లో‌ యతిమైత్రి స్థానం పదారంభంగా లేనిది కేవలం 13.6% సందర్భాల్లోనే.

పాదాంతవిరామం విధిగా పాటించబడిందని గమనించవచ్చును.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.