14, డిసెంబర్ 2020, సోమవారం

నీ ఘనత చెప్ప తరము కాదు శివలింగమా

శివలింగమా ఓ శివలింగమా
నీ ఘనత చెప్ప తరము కాదు శివలింగమా

మారేడు చెట్టు కింద శివలింగమా
ఆ - చెట్టు దెంత భాగ్యమే శివలింగమా
అది - పత్రిపూజ చేసెనే శివలింగమా
అది - నిత్యపూజ చేసెనే శివలింగమా
ఏ  - ఆశలేని పూజచేసె శివలింగమా
దాని -  కింక జన్మ మున్నదా శివలింగమా
అది - మోక్షమునే పొందునే శివలింగమా

చెట్టు కింద పుట్టలో శివలింగమా
ఆ - పుట్టదెంత భాగ్యమే శివలింగమా
అది  - ఉరగహారముల లిచ్చె శివలింగమా
ఆ  - పాములా భాగ్యమేమి శివలింగమా
వాటి -  కింక జన్మమున్నదా శివలింగమా
అవి - -మోక్షమునే పొందునే శివలింగమా
ఆ - పుట్ట కట్టె చీమలెన్నొ శివలింగమా
అవి - మోక్షమునే పొందునే శివలింగమా

గొల్లపడుచు గూటిలో శివలింగమా
ఆ  - పడుచుదెంత భాగ్యమే శివలింగమా
అది - నీకిన్ని పాలుపోసె శివలింగమా
ఏ - మంత్రాల పూజలనూ శివలింగమా
అది -  యెరుగనే యెరుగదే శివలింగమా
అది - -మనసారా పాలుపోసె శివలింగమా
ఆ - పడుచు కింక జన్మమేది శివలింగమా
అది - మోక్షమునే పొందునే శివలింగమా

పుట్టనే పెళ్ళగించి శివలింగమా
ఒకడు - పాములను వెళ్ళగొట్టె శివలింగమా
వాడు - మారేడు చెట్టెక్కెను శివలింగమా
పత్రి - నెత్తుకొని పోయెనే శివలింగమా
వాడు -  శివపూజకు పత్రినమ్మె శివలింగమా
వాడి -  దెంతెంత పాపమే శివలింగమా
వాడు -  మోక్షమునకు దూరమే శివలింగమా
వాడి - భార్య గొల్లపడుచు శివలింగమా
వాడి - పాపమే మెరుగదాయె శివలింగమా

అంతలోన నేమాయె శివలింగమా
ఆ - పాపమెల్ల పోయెనే శివలింగమా
వాడు -పత్రి కోయుచుండగా శివలింగమా
కొంత - జారి నీపైన పడెనె శివలింగమా
వాడు - పూజ చేసి నట్లాయె శివలింగమా
దాని - పుణ్య మింతనరాదే శివలింగమా
వాడి - పాపమెల్ల పోయెనే శివలింగమా
వాడు - మోక్షమునే పొందునే శివలింగమా

మరల పుట్ట పెరిగెనే శివలింగమా
ఆ - పాము లన్ని చేరెనే శివలింగమా
అ - చెట్టు పత్రి పూజించే శివలింగమా
అ - గొల్లభామ పూజించే శివలింగమా
కడు - మంచిపూజ లిట్టివే శివలింగమా
అవి - మంచి చేయు పూజలే శివలింగమా
అ - సహజమైన పూజలకు శివలింగమా
నీవు - మెచ్చి ముక్తి నిత్తువే శివలింగమా

4 కామెంట్‌లు:

  1. ఈ రోజుతో‌ కార్తీకమాసం ముగుస్తున్నది. కాకతాళీయంగా ఈ శివలింగస్తుతి పాట వచ్చింది.

    రిప్లయితొలగించండి
  2. కాకతాళియంగా వ్రాసిన లోతైన భావంతోనే ఉన్నది శివస్తుతి
    మొత్తంగా...కార్తీక మాసంలో మంచి శివస్తుతి అందించావు.
    పాఠకులకు.వ్రాసిన నీకు నూ అందరికి శుభం.పుణ్యం దక్కుతాయి ఈ శివస్తుతి తో

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.