23, డిసెంబర్ 2020, బుధవారం

ఆడరో‌పాడరో అప్సరో‌గణము (అన్నమయ్య కీర్తన, సవ్యాఖ్యానం)

ఆడరో పాడరో అప్సరోగణము
వీడెము లిందరో విభవము నేఁడు

కమలారమణుని కళ్యాణమునకు
తమి నదె గరుడధ్వజ మెసగె
తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు
గమనించరో దివిఁగల దేవతలు

వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని
బలసి అంకురార్పణ మదివో
కలగొన నిచ్చేరు గంధాక్షత లవే
చెలఁగి గైకొనరొ శ్రీవైష్ణవులు

బడి శ్రీవేంకటపతికి శ్రీసతికి
అడరిన తలఁబా లందె నిదె
నడఁచీ బరుషలు నానా ముఖముల
ముడుపులు చదువరొ ముయిగా నరులు  

 

అన్నమయ్య చెప్పిన పెండ్లిపాట ఇది. లక్ష్మీవిభుని పెండ్లికి అన్నమయ్య చెప్పిన పాట. ఈ కీర్తన శృంగారసంకీర్తనాల్లోనిది. కాని నిజానికి ఇది ఒక అధ్యాత్మికసంకీర్తనం ఇది 22వ సంపుటంలో 1216వ రేకు పైన ఉన్న సంకీర్తన. ఈ అన్నమాచార్యుల సంకీర్తనకు మంగళకౌసిక రాగం అని ఇచ్చారు. ఈరాగం‌ ప్రచారంలో లేదు. బాలకృష్ణప్రసాద్ గారు దీనిని రామక్రియా రాగంలో పాడారు.



ఈ పాట పల్లవిలో‌ అడరో‌పాడరో అప్సరోగణము అన్నారు. ఈ అప్సరసలను గురించి నాటకాలా సినీమాల పుణ్యమా అని సమాజంలో తక్కువస్థాయి అభిప్రాయం‌ కనిపిస్తుంది. అది పొరపాటు. దేవతలు దివ్యదేహులు. మనవంటి పాంచబౌతికమైన దేహాలూ అభిరుచులూ ఉన్నవారు కారు. అప్సరసలు అందరూ విశ్వచైతన్యానికి వివిధరకములైన ప్రతీకలు. 

పురూరవుడి కథ అని ఒకటుంది. ఆయన ఊర్వశిని కాంక్షిస్తాడు. సరే కొంత కథ నడుస్తుంది. ఆవిడ వెళ్ళిపోతే మరలా రమ్మని కోరుతాడు. అదొక కథ. ఆమె వస్తుంది.ఆ ఊర్వశీపురూరవులు ఒక కొండమీద విహరిస్తుండగా ఆమె అంటుంది "రాజా, ఇక్కడ ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించిన నరసింహస్వామి వారు వెలసి ఉన్నారు. మరుగై ఉన్నారు. వెదుకుదాం పద" అని అలా చెప్పి ఆరాజు చేత నరసింసస్వామిని అన్వేషింప జేసి ఆఅ సింహాచలం అప్పన్నను నరలోకానికి అందిస్తుంది. పురూరవుణ్ణి తరింప జేస్తుంది. ఆయన భౌతికవ్యామోహాలను వదలలేక పోతుంటే ఆయనకు బ్రహ్మవిద్యను ఉపదేశిస్తుంది. ఇదిగో అప్సరసలు ఇలాంటి వారు.

ఇటువంటి అచ్చరో గణం అంతా దేవుడి పెళ్ళికి వచ్చారట. మీరంతా దేవుడి కోసం ఆడండి ఆయన కీర్తిని పాడండి అన్నమయ్య పురికొల్పుతున్నారు.

దేవుడి పెళ్ళికి అందరూ‌ పెద్దలే. ఎందరెందరో మహానుభావులు. నరలోకంలోని శ్రీవైష్ణవులు. స్వర్గం నుండి దేవతానీకం ఇతరలోకాలనుండి మహాత్ములు ఎందరెందరో కుతూహలంతో ఉత్సాహంగా వచ్చారు. అందరికీ ఈ వైభవం జరుగుతున్న సమయంలో తాంబూలాలనిచ్చి ఆహ్వానించండీ అని అన్నమయ్య చెప్తున్నారు. ఎవరికీ? అప్సరసలకే లెండి. వారంతా అక్కడ పేరంట్రాండ్రు. పెళ్ళిపెద్దలు.

ఇక్కడ అన్నమయ్య చెప్పిన పెండ్లి హడావుడి విశేషాలు చూదాం.

  • కమలారమణుని కళ్యాణమునకు తమి నదె గరుడధ్వజ మెసగె 
  • తెమలుచు మ్రోసెను దివ్యదుందుభులు 
  • వెలయగ లక్ష్మీవిభుని పెండ్లికిని బలసి అంకురార్పణ మదివో 
  • కలగొన నిచ్చేరు గంధాక్షతలు 
  • బడి శ్రీవేంకటపతికి శ్రీసతికి అడరిన తలబా లందె నిదె 
  • నడచీ పరుషలు నానా ముఖముల   అన్న

అన్నమయ్య ఏ దైవతాన్ని ఉద్దేశించి సంకీర్తనం చేసినా ఆ దైవతం తరుమలకు రావలసిందే, వేంకటేశముద్ర వేయించుకోవలసిందేను.

ఇక్కడ పెండ్లి ఎవరిదయ్యా అంటే  ఆ విషయం చివరి చరణంలో చెప్తున్నారు శ్రీవేంకటపతికి శ్రీసతికి పెండ్లి అని. మొదటి చరణంలో ఆయన్ను కమలారమణుడు అంటున్నారు.

ఆయన అప్పటికే కమల అంటే లక్ష్మీదేవికి భర్త అని చెప్పనే చెప్తున్నారు కదా మరలా చివరన శ్రీవేంకటపతికి శ్రీసతికి పెండ్లి అంటారేం, ఎన్నిసార్లు చేస్తారూ‌ పెండ్లి అని అడగకండి.

భగవంతుడి కళ్యాళం లోకకళ్యాణం. అందుకే గుళ్ళల్లో దేవుడి పెళ్ళి చేసినప్పుడు మాంగల్యాధారణం మంత్రంలో చిన్న మార్పుతో చెప్తారు గమనించండి. సాధారణంగా ఆమంత్రంలో వరుడి చేత మమజీవన హేతునా అని చెప్పిస్తారు. వరుడి జీవనానికి అప్పటి నుండి ఈ వస్తున్న భార్యయే అధారహేతువు అని అ వరుడే స్వయంగా చెప్పుకుంటున్నాడన్న మాట. కాని దేవుడి పెళ్ళిలో ఆ ముక్కని మార్చి లోకరక్షణ హేతునా అని చెప్పిస్తారు.

అంటే ఏమన్న మాట? 

దేవుడి పెళ్ళి లోకరక్షణార్ధం. అది లోకకళ్యాణహేతువు.

అందుచేత భక్తులు గుళ్ళల్లో యథాశక్తి లోకసంగ్రహార్ధం దైవకళ్యాణం జరిపించి పుణ్యం‌ మూటకట్టుకుంటారు.

గుళ్ళల్లో అనే ఏముంది, శక్తి ఉంటే సందర్భం కుదిరితే ఇళ్ళదగ్గరా దైవకళ్యాణమహోత్సవం జరిపించవచ్చు.

చేయించిన వారికి పుణ్యం.

దర్శించిన వారిదీ పుణ్యం.

ఇలా దైవకళ్యాణం భక్తిగా చేయటం అనేది వేదోక్తమే, ఆగమోక్తమే.

అటువంటి లోకకళ్యాణార్ధం జరుగుతున్న వేంకటేశ్వర స్వరూపుడైన శ్రీమహావిష్ణువునకూ పద్మావతీ అమ్మవారి రూపంలో ఉన్న శ్రీలక్ష్మీ అమ్మవారికీ జరుగుతున్న కళ్యాణం యొక్క వైభవాన్ని అన్నమయ్య కీర్తిస్తున్నాడు.

కమలారమణుని కళ్యాణము, లక్ష్మీవిభుని పెండ్లి అని మరలా  శ్రీవేంకటపతికి శ్రీసతికి అనీ‌ పదేపదే‌ చెప్పటంకేవలం భక్త్యావేశాన్ని సూచించటం.భక్తిసాహిత్యంలో అందుకే పునరుక్తి దోషం లేదు. కళ్ళకు కట్టినట్లు చెప్పటంలో ఆ సంతోషాన్ని వ్యక్తం చేయటానికి అదే సంగతిని వివిధాలుగా చెప్పటం అన్నది సహజం. అది బాగుంటుంది కూడా.

అ వేంకటేశ్వర ప్రభువు కళ్యాణంలో గరుడధ్వజం ఎత్తారు అని చెప్పారు. అ సందర్భంలో సర్వం‌ ప్రతిధ్వనించేలా దేవదుందుభులు మ్రోగాయట. ఈదేవదుందుభులు అనటంలో ఒక విశేషం ఉంది. మన వద్ద ఉన్న దుందుభులు ఐతే ఎవరో పని కట్టుకొని వాయించాలి. వాటంతట అవి ఎందుకు మ్రోగుతాయీ - మ్రోగవు కదా. అందుకే ఇవి దేవదుందుభులు అనటం. ఒక మహావిశేషం జరుగుతున్నప్పుడు ఆ దేవలోకపు దుందుభులు వాటంతట అవే బ్రహ్మాండమైన శబ్దాలతో మ్రోగుతాయి. అలా ఇప్పుడు మ్రోగుతున్నాయి. జరుగుతున్నది దేవుడి పెళ్ళి ఐతే మ్రోగవా మరి?

ఓ దేవతలారా, మీ‌లోకంలో ఉన్న దుందుభులు విశ్వం మారుమ్రోగేలా ఉరుముతున్నాయి వింటున్నారా గమనిస్తున్నారా దేవుడి పెళ్ళి వేదుకనూ అని అన్నమయ్య హెచ్చరిస్తున్నారు.

పూర్వం జరాసంధుడి దుర్గం మీద రెండు అద్భుతమైన దుందుభులు ఉండేవి. ఎవరైనా శత్రుభావంలో కోటలోనికి వస్తున్నట్లైతే అవి రెండూ‌ వాటంతట అవే‌ భీకరంగా మ్రోగేవి. రెండు ఉండటంలో ఒక గడుసుతనం ఉంది. మీరు ఒకదాన్ని పగలకొట్టగానే ఎలాగో అలా ఆ రెండోది ఈలోగా అల్లరి చేస్తుంది. రెండూ ఒకసారి పదకవేస్తే తప్ప నగరంలోనికి హెచ్చరిక వెళ్ళకుండా అపలేం‌ కదా. అందుకని శత్రువులకు కోటలో దూరటం దుస్సాధ్యంగా ఉండేది. 

ఐతే‌ శ్రీకృష్ణపరమాత్మ దీనికి విరుగుడు చేసాడు. ఆయన సూచన మేరకు భీముడు ఆ రెండు దుందుభుల మీదకీ ఒక్కసారిగా దూకాడు. అవి రెండూ‌పచ్చడి అయ్యాయి ఒకేసారి. జరాసంధుడికి శత్రువుల రాక తెలియ లేదు.

మానవలోకం లోనే రెండు వాటంతట అవే‌ మ్రోగే దుందుభులు అంటూ ఉన్నాయి కదా, ఏదో విశేషంగా ఐనా, మరి దేవలోకంలో వాటంతట అవి మోగవా ఏమి?

అదిగో మ్రోగుతున్నాయి మీ దుందుభులు గమనించారా? దేవుడి పెళ్ళి అని అన్నమయ్య హెచ్చరించాడన్న మాట.

పెళ్ళిలో అంకురార్పణం అని చేస్తారు. లోకవ్యవహారంలో అంకురార్పణం అంటాం కాని అసలైన పేరు అంకురారోపణం. పెండ్లి కుమార్తె చేత పాలికలలో నవధాన్యాలను మొలకలుగా నాటిస్తారు. ఇలా అంకురములను (విత్తనాలను)  పాలికలలో ఆరోపించటం (నాటటం) కాబట్టి ఇది అంకురారోపణం. జనం నోటిలో ఈమాట క్రమంగా అంకురార్పణం అయింది. ఇదీ  బాగానే అర్ధవంతంగానే ఉంది. అంకురములను ప్రకృతికి (మొక్కలుగా ఎదిగెందుకు) అర్పించటం  కాబట్టి అంకురార్పణం అన్నది సబబైన మాటయే అవుతున్నది.

అంకురాలను మొలవేయటం ఎందుకూ అంటే‌ ప్రాణులకు ఆధారం అన్నం. దీనిని ఉపనిషత్తుల భాషలో రయి అని కూడా అంటారు. ఇప్పుడు ఇద్దరు, కాని మున్ముందు వీరు వంశాభివృధ్ధి చేస్తారు. అందరికీ అన్నం‌ కావాలి. అన్నానికి మూలమైన అంకురాలను ప్రకృతికి అర్పించి పూజించటం అన్నది ఇక్కడ ఆచారంలోని అంతరార్ధం.

అదిగో‌ అంకురార్పణ మహోత్సవం జరుగుతోంది. అందరికీ గంధపుష్పాక్షతలను ఇస్తున్నారు. విష్ణుభక్తులు అందరూ అందుకోండి అని అన్నమయ్య దైవకళ్యాణానికి ఇచ్చేసిన భక్తవైష్ణవులను ఆహ్వానిస్తున్నాడు.

పెళ్ళిలో తలంబ్రాల తంతు వచ్చింది. 

అసలు సిసలు తంతు ఐన జీలకర్రా బెల్లం కార్యక్రమానికీ, అతి ముఖ్యమైన తంతు ఐన మాంగళ్యధారణకీ కన్నా ఈ తలంబ్రాలకి విశేషమైన స్పందన ఉంటుంది. వధూవరుల నుండీ, ఆహూతుల నుండీ‌ కూడా. మిగతావి వైదికమైన కార్యక్రమాల్లో భాగం మాత్రమే ఐనా తలంబ్రాలు మాత్రం గొప్పవినోదం. అందరికీ కూడా.

ఈవినోదం దర్శించటానికి భక్తులు తహతహ లాడుతున్నారు. నడిచీ‌ పరుషలు నానా ముఖముల అంటే అన్ని దిక్కులనుండీ భక్తసమూహాలు కదలి వస్తున్నారని మనకి చెప్తున్నారు.

చూసారు కదా ఓ‌నరులారా, భక్తులారా, ఇంక ముడుపులు సమర్పించుకోండయ్యా అంటున్నారు అన్నమయ్య గారు. ఇక్కడ ఆచార్యుల వారి ముయిగా అన్నారు. ఈ‌పదం ఇప్పుడు వాడుకలో లేదు కాబట్టి అర్ధం స్పష్టత లేదు. వేరొక కీర్తనలో ముట్టినదెల్లా ముయి పట్టినదెల్లా బంగారు అంటారు. మరొక కీర్తనలో ముట్టితేనే ముయిముచ్చటలూ అంటారు. దీనిని బట్టి ముయిగా అంటే చక్కగా వంటి అర్ధం తీసుకోవాలి అనిపిస్తున్నది.


8 కామెంట్‌లు:

  1. కీర్తన సొగసుగా ఉంది, మీ వ్యాఖ్యానమూ అంత చక్కగా ఉంది. ఎంతయినా అన్నమయ్య కదా.

    // "చెలఁగి గైకొనరొ శ్రీవైష్ణవులు" // .... ఈ మాట నాకు నచ్చలేదండి. ఆ కళ్యాణం భక్తులందరికి కూడా పండగే కదా. మరి శ్రీవైష్ణవులు ఏమిటి, స్మార్తులు ఏమిటి, అసలు గంధాక్షతలు తీసుకోవడానికి కులంతో పనేముంది, "బ్రహ్మమొక్కడే" లాంటి కీర్తన వ్రాసిన అన్నమయ్య గారు ఇక్కడ ఇలా అనడమేమిటి ఆశ్చర్యం ? తను (నియోగి కుటుంబంలో పుట్టి పెరిగినా) వైష్ణవం స్వీకరించాడు సరే, వెంకటేశ్వరుడిని కూడా వైష్ణవదైవం అన్నట్లు పరిమితం చేస్తూ చూపించడం ఎందుకు? కాస్త నిరుత్సాహం కలగజేసింది. అన్నమయ్య గారి కవిహృదయం ఏమిటో మరి?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అన్నమయ్య గారిది కొంత తీవ్రవైష్ణవం.వ్యాఖ్యనారంభంలోనే అన్నమయ్య ఏదేవుణ్నైనా వేంకటేశముద్రతోనే చూస్తాడని. అయన కీర్తనల్లో కొండొకచో శైవతిరస్కారం, శివతిరస్కారమూ కూడా మీకు కనిపిస్తాయి.
      అదీ‌కాక, భక్తికవిత్వంలో ఏదేవుణ్ణి స్తుతిస్తుంటే ఆయనే పరమాత్ముడూ, సృష్టిస్థితిలయకారకుడూ అని చెప్పటం ఆదేవుడే సమానాధికవర్జితుడూ‌ అని చెప్పటం‌ సాధారణమే. అంతరార్ధం ఏమిటంటే సృష్టిస్థితిలయకారకుడూ, సమానాధికవర్జితుడూ‌ ఐన పరమాత్మను భక్తుడు అస్వరూపంలో దర్శిస్తున్నాడనే - పరమాత్మ అటువంటి వాడూ అని చెప్పటమే.

      ఇక్కడ శ్రీవైష్ణవులు అంటే విష్ణుపారమ్యాన్ని చూసే భక్తశిఖామణులు అని చెప్పుకుంటే సరిపోతుంది.

      శైవులూ తమతమ స్తోత్రాల్లో ఇలాగే అంటారు కదా, "శూలిభక్తాళి దుశ్శీలముల్ గన్న మేలు కాఁ గైకొనుమీ‌ బసవన్న" అని

      ఆదిశంకరులు శ్రీరామకర్ణామృతంలో రాముణ్ణి పరమాత్మ అనీ, శివానందలహరిలో అలాగే శివుణ్ణీ, సౌందర్యలహరిలో అమ్మవారినీ అదేవిధంగా చెప్పారు కదా.అంతె ఒకే పరమాత్మను భిన్నభిన్నమైన తత్త్వాలుగా దర్శిస్తున్నా వర్ణించేది పరబ్రహ్మతత్త్వాన్నే - అది అటువంటి పారమ్యాన్ని కలిగి ఉన్నది అనే. అతే స్వవచోఖండనాదులు ఏమీ లేవండి.

      తొలగించండి
  2. పెద్దలు శ్రీనరసింహరావుగారి సందేహం సమంజసమే ,
    // "చెలఁగి గైకొనరొ శ్రీవైష్ణవులు" // .... ఈ మాట నాకు నచ్చలేదండి. ఆ కళ్యాణం భక్తులందరికి కూడా పండగే కదా. మరి శ్రీవైష్ణవులు ఏమిటి, స్మార్తులు ఏమిటి, అసలు గంధాక్షతలు తీసుకోవడానికి కులంతో పనేముంది, "బ్రహ్మమొక్కడే" లాంటి కీర్తన వ్రాసిన అన్నమయ్య గారు ఇక్కడ ఇలా అనడమేమిటి ఆశ్చర్యం ?
    నిజమే , అన్నమయ్యలాంటి సమదృష్టి గలిగిన అభ్యుదయవాది ఇలా రాసుండకూడదు .
    మన స్థూలదృష్టి కలా అనిపిస్తూండవచ్చు . కానీ ,
    వీడు వైష్ణవుడు , వీడు శైవుడు అనే విభిన్నభావాతీతుడు
    అన్నమయ్య . వారికి జగమంతా శ్రీవైష్ణవులే . జగమంతా
    వీరశైవులే . ఈ విభాగాలూ , అడ్డుగోడలూ మనకు .
    విష్ణు శబ్దానికి అంతటనూ వ్యాపించియుండునదని అర్థం .
    ఇక్కడ శ్రీవైష్ణవులంటే సర్వజగత్తూ .
    ఆ సంకీర్తనాచార్యులకు కులం మతం జాతి అనే అడ్డుగోడలు
    లేవు .


    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాజారావు గారు, అన్నమాచార్యులకు కులం మతం జాతి అనే అడ్డుగోడలులేవని అనుకోవచ్చునండీ స్థూలదృష్టితో. కాని వారు అద్వైత నిందనూ చేసారు, కొన్ని కీర్తనల్లో శివనిందనూ కూడా చేసారని గమనించవచ్చును. ఇప్పుడు ఆ కీర్తనలను చూపమంటే దానికి శ్రమపడాలి - 29 సంపుటాలను తిరుగవేయాలి కదా. వీలువెంబడి చూపటానికి యత్నిస్తాను.

      తొలగించండి

    2. మహా ప్రభువులారా !

      తవ్వకాలంటూ చేస్తే ఏకత్వాన్ని ప్రబోధించే వాటి మీద దృష్టి పెట్టండి. మళ్లీ పాత రగడలను వెలిదీయుటేలా ! శైవ వైష్ణవ నాటి భేదాలను తీసుకొచ్చి మళ్లీ డిష్యూ‌ం డిష్యూం లేలా ?



      ఇట్లు
      విన్నపాల
      జిలేబి

      తొలగించండి
    3. అబ్బే, జిలేబీ కాలుపెట్ట కుండా డిష్యుండిష్యూంలా! పప్పులేని పులగమా!

      తొలగించండి
  3. అన్నమయ్య వేంకటేశ్వరుని ఒక కీర్తనలో .....
    "కొలుతురు మిము వైష్ణవులు కూరిమితో విష్ణుఁడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం బనుచు తలఁతురు మిము శైవులు తగిన భక్తి శివుఁడనుచు అలరి పొగడుదురు కాపాలికులు ఆదిభైరవుఁడనుచు
    సరినెన్ను దురు శాక్తే యులు శక్తి రూపుడనుచు "
    ----- దీనినిబట్టి , తాను విశిష్టాద్వైతావలంబి యైననూ,
    వివాద రహితుడే ఐయుండ నగును .

    రిప్లయితొలగించండి
  4. ఈ తత్వవిచారమంతా మాబోటి పామరులకేలా? అర్ధం కూడా కాదు.

    అన్నమయ్య గారికి చెప్పేటంతడి వాడిని కాను లెండి కానీ ... రమణీయంగా ఉన్న సదరు కీర్తనలో "శ్రీవైష్ణవులు" అనే మాట దగ్గరకొచ్చేసరికి పంటి క్రింద రాయి లాగా తగలడం వలనా, దాని బదులు భక్తులందరు అనుండవచ్చు కదా అనిన్నూ ఒక సందేహం కలిగింది, అంతే సుమండీ.

    నా మిత్రులలో శ్రీవైష్ణవులు కూడా ఉన్నారు, ఇబ్బందేం లేదు. ఏ "తవ్వకాలూ" చేపట్టే ఉద్దేశమూ ఏ కోశానా లేదు.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.