26, జులై 2012, గురువారం

విన్నవించితిని విషయము లన్నీ చిన్న మాటను దాచకను

విన్నవించితిని విషయము లన్నీ చిన్న మాటను దాచకను
నన్ను కాచుటకు నాస్వామీ నీ కన్నను హితు లెవరున్నారు

చన్న భవములను గావించినవి చిన్నతప్పులో పాపములో
యెన్నగ నేవో పున్నెములో నా కన్నను నీకే యెఱుకగదా 
అన్నియు గలసి తేపతేపకు నన్ను త్రిప్పురా యిల చుట్టూ
మన్నించర నే నలసితిరా బ్రతిమాలుదు రామా బ్రోవరా

సత్వము లేదే సర్వతీర్థములు శ్రధ్ధ మీర సేవించుటకు
తత్వసార విచారము చేయగ చదువును చాలదురా నా దీ
నత్వము నెఱిగిన కరుణామయుడవు నాకేమో నీదయయే
సత్వము తత్వము కావున నన్ను చప్పున రామా బ్రోవరా

తెలిసిన దొకటే నిన్నే నమ్ముట తెలిసీ తెలియని మనసునకు
తెలియని దొకటే మంచి దారిని తీరుగ నడిచే సద్విద్య
తలచుకొంటివా తక్షణమే నా తాపము లన్నీ తీరునయా
కలిసెద నీలో కల్మషముడిగి గ్రక్కున రామా బ్రోవరా


25, జులై 2012, బుధవారం

పరమపదసోపానపఠము పరచి నామండీ

పరమపదసోపానపఠము  పరచి నామండీ
పరమపురుషుని  చేరుకొనగ వచ్చి యాడండీ

రక్తి గొలిపు ఆట మీరు రండి ఆడండీ
శక్తియుక్తి పరుల కాట చాల సులువండీ
భక్తివైరాగ్యాలు చేతి పాచికలు  సుండీ
ముక్తి  దొరకు దాక ఆట ముందుకే నండీ

అరెరే యీ సర్పములకె అదరి పోకండి
కరచిన ఒక పాము జావ కారి పోకండీ
వెరువకుండ మీరు ముందుకు తరలి  రారండీ
పరమపురుషు చేరు దాక పట్టు బట్టండీ

ముచ్చటైన  ఆట కొరకు ముందు కురకండీ
నిచ్చెనలు మీ రాక కివే నిలచి యున్నాయి
వచ్చి ఆడి  పైకి  పైకి పరుగు తీయండీ
అచ్చమైన పరమపదము నంది మురియండీ

పాము లరిషడ్వర్గములను భావ ముంచండీ
నోము ఫలము లందివచ్చు నిచ్చెనలండీ
భూమి సోపానపఠము బుధ్ధి నెరుగండీ
స్వామి కడకు చేరు దాక సాగిపోరండీ

పరమపురుషుడు రాముడని మరువబోకండీ
హరిని చేరు దాక ఆట నాడవలె నండీ
పరమసులభమైన ఆట వచ్చి ఆడండీ
పరబ్రహ్మపదము చేర త్వరపడాలండీఈ రోజు (7/25/2012) కంది శంకరయ్యగారి బ్లాగు శంకారాభరణం లో పరమపదసోపాన పఠం బొమ్మ యిచ్చి పద్యాలు వ్రాయమని అడిగారు.  నా తోచిన పద్యాలు  వ్రాసాను ఆ బ్లాగులో.   వాటిని శ్యామలీయం బ్లాగులో కూడా ఉంచితే బాగుంటుందని అనిపించింది. కాని తీరా టపా మొదలు పెడుతుండగా పాటగా వచ్చింది. అందు చేత ముందు పాట వ్రాసి క్రింది ఉదయం వ్రాసిన పద్యాలు కూడా ఉంచుతున్నాను.

కం. అరిషడ్వర్గము పాములు
నరుదగు నధ్యాత్మసాధనలు నిచ్చెనలున్
మరి వైరాగ్యము భక్తియు
సరిపడు పావులును నాట జరిగెడు నుర్విన్

కం. నా పావులు మంచివయా
నాపైనను నాకు కలదు నమ్మకము హరీ
నీపై నాన పరమపద
సోపానపఠంబు మీద చూపెద ప్రజ్ఞన్

కం. ఈ నిచ్చెనలును పాములు
నే నెక్కుట దిగుట క్రొత్త యే పరమాత్మా
నా నిశ్ఛయమే పై బరి
లో నుండిన నిన్ను చేర్చు లోలాక్ష హరీ!

కం. నే నిను చేరుటయును మరి
నీ నిశ్చయమనుచు లోన నెరుగుదు గానన్
మానక పాముల నణచుచు
చేనందుచు నిచ్చెనలను చేరెదను హరీ!

కం. ఈ నిచ్చెనలును పాముల
తో నీ పటమెల్ల మాయ తొలగి నశించున్
గాన మహాత్మా చేరక
మానెదనే నిన్ను బుధ్ధిమంతుడ నగుచున్

24, జులై 2012, మంగళవారం

ఏ నాడనగా మొదలైనదయా యీ నా దీర్ఘప్రయాణం

ఏ నాడనగా మొదలైనదయా యీ నా దీర్ఘప్రయాణం ఇది
యే నాటికి కడతేరే నయ్యా యెన్నడు నీ దరి చేరుదు నయ్యా

ఎన్నడు జ్ఞప్తికి రానివి యెన్నెన్నో జన్మలు గడచినవి ఇం
కెన్ని జన్మ లీ‌ దీర్ఘప్రయాణం యీశ్వర యెట్లా చేయా లయ్యా

ఏ దారిని పడి వచ్చితినో ఏ దారిన పడి పోవుచుంటినో
ఈ దారుణమగు దీర్ఘప్రయాణం యీశ్వర యిది నా కెందుకయా

ఎంతో దయగల వాడవు నీవని యీశ్వర నేను యెరుగుదును
అంతు లేని యీ దీర్ఘప్రయాణం పంతగించక నిలుపవయా 

ఏ నాడును నిను వేరు భాగ్యములు నేను వేడినది లేదయ్యా
ఈ నా‌ చేసిన దీర్ఘప్రయాణం ఇక నిను కలిసి ముగింతునయా

పగబట్టి యున్నదీ ప్రకృతి నన్ను దిగలాగుచున్నదీ ప్రకృతి

పగబట్టి యున్నదీ ప్రకృతి నన్ను
దిగలాగుచున్నదీ ప్రకృతి

దేహబంధము వీడి దివ్యత్వమున నుండ
నూహ చేసెడివేళ సుడికించుచున్నది
ఐహికవాంఛల నిదే  యెగదోయుచున్నది
స్నేహ హస్తము జాచి చేదుకో రామ

ఈ నశ్వరములపై పోని నా బుధ్ధికి
లేని యాశల నెల్ల తాను  గ్రుచ్చేను
దాని దుందుడుకును పూని నీ వైనను
మానిపించుము నన్ను మన్నించి రామ

నీవు నే నొకటనే నిశ్చయంబున నుండ
కావు నా వాడవని గద్దించు చున్నది
ఏవిధి తొలగింతువో యిట్టి చీకాకును
కావ నీ వే దిక్కు కరుణించు రామ


23, జులై 2012, సోమవారం

మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 5

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం ఇక్కడ చూడండి.)

మూలము: మహత్తత్త్వాంశంబున నహంకారం బగు.

వివరణము: అహంకారం అనేది సమిష్టి అంతఃకరణం యొక్క బేధము.  ఈ అంహంకారానికి మూలమయిన మహత్తత్త్వాన్ని బుధ్ధి అని కుడా వ్యవహరిస్తారు. బ్రహ్మాండ పిండాండాలకు అబేధము. అంటే విశ్వం అనేది మానవ శరీరంలొ ఆరోపణం చేసి చూసినప్పుడు మహత్తత్తమే బుధ్ధి. ఈ బుధ్ధినుండే 'నేను' అనేది ఒక అభిజ్ఞ యేర్పడుతుంది. అదే అహంకారము. ఇలా పిండాండంలో నిరూపణము.  బ్రహ్మాండ పరంగా, పరమాత్మయొక్క వ్యక్తస్వరూపమైనది మహత్తత్త్వం అయితే దానికి అవ్వలిముఖం అవ్యక్తపురుషుడు అంటే మూలప్రకృతిగా భాసిస్తున్న పరమాత్మ. నాణానికి ఇవ్వలిముఖంలాగా ఉండేది నామ రూపాత్మకమైన ప్రకృతి. ఈశ్వరాధిష్టితం బైన  ప్రకృతి అని పూర్వవాక్యంలో చదువుకున్నది మూలప్రకృతి అని గ్రహించండి.

సాంఖ్యకారికలలోని క్రింది శ్లోకాన్ని చూడండి

మూలప్రకృతిరవికృతిర్మహదాద్యాః ప్రకృతివికృతియః సప్త
షోడశకస్తు వికారో న ప్రకృతిర్నవికృతిః పురుషః

మహత్తత్త్వమూ, అహంకారమూ, పంచతన్మాత్రలూ కలిపి మొత్తం యీ ఏడూ ప్రకృతి, వికృతీ కూడా. ఇవి పంచమహాభూతాలకు (వ్యుత్పత్తి)కారణాలు కావటం చేత ప్రకృతి అనీ, మూలప్రకృతికి (పరిణామ)కార్యాలు కావటం వలని వికృతి అనీ తెలుస్తున్నది.   (అవ్యక్త)పురుషుడు అంటే పరమాత్మ. అతడు దేనికీ చెందిన వాదు కాడు. దేనికీ కారణమూ కాడు కార్యమూ కాడు.

ఈ మూలప్రకృతి మరియు ప్రపంచకారణమయిన జడప్రకృతులలో మహత్తత్త్వంనుండి జడప్రకృతి విస్తరించటం మొదలవుతుంది. మొట్టమొదటి విస్తరణతత్వమే అహంకారం అని పిలుస్తారు. అంటే ఇక్కడనుండి నామరూపాలతో కూడిన వ్యవహారం మొదలు అర్ధం.


తన్ను తా నెరుగడు తా నేమి యెరుగునో


తన్ను తా నెరుగడు తా నేమి యెరుగునో
మిన్నుముట్ట వాదించు చున్నాడు రామ

చిలుకపలుకుల వలె చింతన పొంతన
తలపోయక శాస్త్రములలోని విషయాలు
పలుమారు వల్లించి  ఫలమేమి పొందేను
తిలకించి చూడడే దివ్యతత్వము నిజము

ఈశ్వరు డెవడంటె యేమేమొ చెబుతాడు 
ఈశ్వారాంకితముగా నేపనియు చేయడు
ఈశ్వరా  నీవె నా కింక దిక్కని యంటాడు
ఈశ్వరు నెరుగడే హృద్దేశమున నిజము

విడిచి పెట్టడు గాని విషయభోగములను
అడుగుచున్నాడు సిగ్గు విడచి మోక్షంబును
కడు దుర్లభ ఫలము కాంక్షించు చున్నాడు
జడుడు వాడెవ్వడో కాడు  వీడే నిజము

22, జులై 2012, ఆదివారం

సుఖమయ మీ సంసారము నీ‌చూపు సోకిన

సుఖమయ మీ సంసారము నీ చూపు సోకిన
దుఃఖముల పుట్ట యిదే దొరుకక నీ కరుణ

నేరుపు మీరగ విద్యలు నేర్వక రాణించు వారు
తీరుగ విద్యలు నేరిచి తిప్పలు పడు వారు
ధారుణిపై గలరెందరొ దాని వెనుక కారణమన
వారిపై నీ చల్లని చూపులు వాలుటలో బేధమే

నిరక్షరకుక్షు లయ్యును నీపై గురి కల వారు
గురుబోధను బడసి కూడ గురి నిలువని వారు
ధరణిపైన గలరెందరొ దాని వెనుక కారణమన
వారిపై నీ చల్లని చూపులు వాలుటలో బేధమే

అనుపమాన లోకనాథ యనవద్య పామరుడను
నిను నమ్మియుంటి గాని నేనే మెఱుగుదును
మనసున నీ నామమునే మానక స్మరించువాడను
కనుక నీ చల్లని చూపులు కరుణించుము రామ


మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 4

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం ఇక్కడ చూడండి.)

మూలము:ఈశ్వరాధిష్టితం బైన  ప్రకృతి యంశంబున మహత్తత్త్వం బగు. 

వివరణము: ఈశ్వరుడు అన్నా ఈశుడు అన్నా ప్రభువు అని అర్థం. శ్రీమన్నారాయణుడేయీశ్వర శబ్దవాచ్యుడు.ఈ ద్వితీయ స్కంధములోనివే అయిన రెండు పద్యాలను చిత్తగించండి.

మ. వినుమీ యీశ్వరు దృష్టిమార్గమున నావేశింప శంకించి సి
గ్గున సంకోచము నొందు మాయ వలనం గుంఠీభవత్ప్రజ్ఞచే
నను లోకేశ్వరు డంచు మ్రొక్కు మతిహీన వ్రాతముం జూచి నే
ననిశంబున్ నగి ధిక్కరింతు హరి మాయాకృత్యమంచున్ సుతా

కం. ఆ యీశు డనంతుడు హరి
నాయకుఁ డీ భువనములకు నాకున్ నీకున్
మాయకు బ్రాణివ్రాతము
కీ‌ యెడలన్ లేద యీశ్వరత్వము సుతా.

బ్రహ్మగారు నారదమహర్షితో  "కుమారా,  ఈ మాయ అనేది ఉంది చూసావూ, ఇది ఈశ్వరుని దృష్టిని ఆకర్షించటానికి యెంతో సిగ్గుపడి బెరుకు తనంతో‌ ఉంటుంది. ఆట్టే ప్రజ్ఞ లేని వాళ్ళు మందమతులై నన్నే అన్ని లోకాలకూ అధిపతిని అనుకొని మొక్కుతూ‌ ఉంటారు. ఆహా, ఇదంతా ఆ శ్రీహరి మాయాప్రాభావం కదా అని నవ్వుకుంటూ ఉంటాను. వాళ్ళ మొక్కులు అంగీకరించను సుమా. ఆశ్రీహరియే ఈశుడు. తుదీ మొదలూ‌ లేని వాడు.  నీవో నేనో ఆ మాయో మరేదైనా ప్రాణిగానీఈశ్వరత్వం అంటూ ఉండటం అసంభవం." అని అంటున్నారు.

ఈ‌ పద్యాలు ఎందుకు ఉదహరించానంటే ఈశ్వర, ఈశ శబ్దాలసమత్వాన్నీ, ఆ ఈశ్వరుడు శ్రీమన్నారాయణుడే అన్న భాగవత రహస్యాన్నీ‌ వివరించటానికే.

ఇప్పుడు మనకు ఈశ్వరాధిష్టితమైన ప్రకృతి అన్న వ్యవహారానికి శ్రీహరి అధీనం లోని ప్రకృతికి అన్న అర్థం సిధ్ధిస్తున్నది కదా. గత వాక్యానికి వివరణం చెప్పుకుంటూ మనం ఒక గీతా‌శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాం. అది

సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్
కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్

ఈ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ 'నా యొక్క ప్రకృతి'లో అనటం‌ కూడా గమనించాం కదా!

మనకు ప్రకృతికి స్వామి యైన వాడు  శ్రీమన్నారాయణుడు అని స్పష్టం అవుతున్నది.

ఎవరికైనా సందేహం ఉండ వచ్చును, ఇదేమిటీ ఈయన శ్రీకృష్ణునీ, శ్రీమన్నారాయణునీ ఒక్కరే అని వ్యవహరిస్తున్నారూ అని. అవునండి, ఒకరే, శ్రీకృష్ణుడు 'లక్ష్మీపతి రభూత్స్వయం' అని ప్రమాణం.  ఆయన విష్ణువు యొక్క విభూత్యవతారంగానీ,  ఆవేశావతారంగాని, అంశావతారంగానీ కాక స్వయంగా విష్ణువు. దీనికి భాగవతమే ప్రమాణం. అందుకే మనం శ్రీకృష్ణప్రోక్తమైనగీతోపనిషత్తు నుండి ప్రమాణాలు స్వీకరిస్తున్నాము.

ఈశ్వరుడు అనాది అయినట్లే ఆయన అధీనంలో ఉన్న ప్రకృతి కూడా అనాదియే! అది ఆయన విభూతులలో ఒకటే.  ఈ‌ ప్రకృతి అంశం వలన మహత్తత్తం యేర్పదుతోంది.  ఇదీ ప్రస్తుతం మనం వివరణ చెప్పుకుంటున్న వాక్యానికి విశదీకరణ.

ఇదంతా బాగానే ఉంది కాని, ఇంతకూ ఈ‌ మహత్తత్త్వం అంటె యేమిటీ అని ప్రశ్న.

పరమాత్మయొక్క విభూతులలో ముఖ్యమైనది ప్రకృతి. ఈ‌ ప్రకృతి అనేది సమస్తమైన నామరూపాత్మకమైన వ్యవహారాలకూ‌మూలం.అందుకే దానికి వేదాంత పరిభాషలో ప్రధానం అనిపేరు. ఈ ప్రకృతిద్వారా అభివ్యక్తమైన పరమాత్మ స్వరూపానికే మహత్తత్త్వం అనిపేరు. అందుకే శుధ్ధపరబ్రహ్మాన్ని ప్రకృతిలయం చేయకుండా తెలుసుకోవటం సాధ్యం కాదు.

బృహదారణ్యకోపనిషత్తులోని యీ క్రింది గార్గీ యాజ్ఞ్యవల్క్యుల సంవాదలోని మాటలు చూడండి.

గార్గి: యాజ్ఞ్యవల్యా, ద్యులోకానికి పైనా, భూలోకానికి క్రిందా కూడా వ్యాపించి, యీ రెండులోకాల మధ్యనూ వ్యాపించి యున్నట్టిది, భూతము, వర్తమానము, భవిష్యత్తు లాంటి వ్యవహారాలు కలిగినిది దేనిలో పడుగు -పేక లాగా‌కూర్చబడి యుంది?
యాజ్ఞ్యవల్క్యుడు: ఆకాశంలో
గార్గి: ఈ‌ఆకాశాము ఓతప్రోతమై దేనిలో ఉంది?
యాజ్ఞ్యవల్క్యుడు: ఆకాశం అక్షరమునందు ఆధారపడి యుందని బ్రహ్మవేత్తల నిశ్చయం.
గార్గి:  అక్షరం అంటే ఏమిటి?
యాజ్ఞ్యవల్క్యుడు: ఏదైనా వస్తువును తెలుసుకోవాలంటే విశేషణాలూ నామరూపాలూ కావాలి. అక్షరం‌ అనేదానికి యెటువంటి నామరూపాలూ విశేషణాలూ లేవు. సర్వవిశేషణశూన్యమైనది అక్షరం అని తాత్పర్యం. అంటే అక్షరం అనేది పరబ్రహ్మమే.

మనం చర్చించు కుంటున్న గద్యలో ముందు ముందు మహత్తత్వం నుండి ఆకాశం ఉత్పన్నం కావటం చెప్పబడుతుందని గమనిస్తాం.  అందుచేత మహత్తత్త్వం అంటే పరమాత్మ యొక్క వ్యక్తవిభూతి అని గ్రహిస్తే చాలు. 

20, జులై 2012, శుక్రవారం

మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 3

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం ఇక్కడ చూడండి.)

మూలము: నారాయణచరణకమలభక్తిపరాయణత్వంబునం జనినవారు నిజేఛ్ఛావశంబున నిరర్గళగమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నతవైష్ణవపదారూఢులై తేజరిల్లుదురు. 

వివరణము: బ్రహ్మను సేవించి పొందేది ఆకల్పాంతబ్రహ్మలోకనివాసం అని తెలుసుకున్నాం కదా.  తరువాత వాక్యంలో నారాయణ భక్తునికి లభించేది యేమిటో చెప్పుతున్నారు.

శ్రీమన్నారాయణుని సేవించేవారికి బ్రహ్మను సేవించే వారికన్న ఉన్నతమైన స్థితి కలుగుతుంది నిస్సందేహంగా.  అటువంటి విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని అక్షరాలా బ్రద్దలు కొట్టుకుని ఆవలకు వెళ్ళగలుగుతారు!  ఎందుకు అలా వెళ్ళటం? బ్రహ్మాండమంటే సృష్టి.  సమస్తమూ యీ సృష్టి లోనికే వస్తుంది.   సమస్త  చరాచరాలలూ అందులోనివే.  సురగరుడోరగయక్షకిన్నరనరాది సమస్తజీవులూ సృష్టిలోని వారే.   ఇంద్రాది  దేవముఖ్యులేమి, చివరకు బ్రహ్మకూడా.  అయితే విష్ణువు సృష్టికే అధినాధుడు, దానికి ఆవలి వాడు.

సాధారణ సృష్టి చేసేవాడు బ్రహ్మ అయినా, అసలు బ్రహ్మాండాన్నే సృజించేవాడు విష్ణువు.   విష్ణువు బ్రహ్మకే తండ్రి అని తెలుసు కదా! ఈ గీతా శ్లోకం (విభూతియోగం లోనిది) చిత్తగించండి.

న మే విదుః సురగణాః ప్రభవం న మహర్షయః
అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః

ఈ శ్లోకంలో శ్రీకృష్ణపరమాత్మ స్పష్టంగా  అందరికంటే, దేవతలు మునులూ  అందరి కంటే కూడా తానే ప్రధముడనని తన పుట్టువు వీరెవరికీ తెలియదనీ చెబుతున్నారు.

అలాగే
సర్వభూతాని కౌన్తేయ ప్రకృతిం యాన్తి మామికామ్
 కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్

 కల్పం అంతమైనప్పుడు సమస్త భూతములూ  నా యొక్క ప్రకృతిలో లీనమై పోతున్నాయి. తిరిగి వాటిని  మరల కల్పం ప్రారంభంలో నేను సృష్టిస్తున్నాని అని శ్రీకృష్ణపరమాత్మ ఇక్కడ చెప్తున్నారు.

ఈ ప్రమాణాలు చాలు. శ్రీవిష్ణుదేవుడే సమస్తమైన సృష్టికీ మూలాధారం అని తెలుసుకోవటానికి. ఆయన ఈ సృష్టికి ఆవలి వాడే కాని మనలాగా బ్రహ్మాదులలాగా సృష్టిలోని వాడు కాదు.

విష్ణుపదం అంటే విష్ణులోకం (వైకుంఠం) సృష్టికి వెలుపలిది. బ్రహ్మాండంలో చిక్కుకున్న వారికి అందనిది.  విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని పగులకొట్టుకొని ఆ వైకుంఠాన్ని చేరుకుంటారు.    అంతే కాదు వారికి అలా వైకుంఠాన్ని చేరుకుందుకు  ఏ విధమైన అర్గళమూ (అడ్డంకి) ఉండదు.  విష్ణు భక్తులకు ఏ విషయంలోనూ అడ్డంకీ, మరొకరి  అనుమతీ అవసరం లేదు ఏ విషయంలోనూ.  అంతా వారి  ఇఛ్ఛప్రకారమే (యిష్టం మేరకే). అందుచేత శ్రీమన్నారాయణుని చరణకమలాలను సంపూర్ణమైన భక్తితో సేవించి శరీరత్యాగం చేసిన వారు సంతోషంగా యిష్టపూర్వకంగా, యే అడ్డంకీ లేకుండా నారాయణుని నిజధామం అయిన వైకుంఠం చేరుకుంటారు.   ఇదే పరమోన్నతమైన ప్రాప్తిస్థానం - దీనికి మించినది యేదీ లేదు.  అటువంటి పుణ్యధామం చేరుకున్న విష్ణుభక్తులు  ఇతరేతరములైన ఉపాసలచేత తక్కువ స్థాయి లోకాలకు చేరుకున్నవారికి,   అలాగే సృష్టి లోని అన్యులందరికీ తేరి చూడరాని తేజస్సును పొందుతారు.

ఇక్కడ బ్రహ్మపదం చేరుకున్న వాళ్ళకూ విష్ణుపదం చేరుకున్నవాళ్ళకూ తారతమ్యం చూడండి.   బ్రహ్మపదం చేరుకున్న వాళ్ళకు బ్రహ్మతోనే అవసానం.  ఆతరువాత మళ్ళీ సృష్టిచక్రంలోనికి రాక తప్పదు.  కాని  విష్ణుపదం చేరుకున్నవాళ్ళది మహోన్నతమైన స్థితి. శ్రీ మహావిష్ణువుకు చ్యుతి లేదు.  ఆయన అచ్యుతుడని కదా  ప్రతీతి.  అందుచేత ఆయనను చేరుకున్న వాళ్ళకూ చ్యుతి లేదు.  వారికి యీ సృష్టిలోనికి వచ్చే పనే లేదు.   అదే పరమపదం. అదే మోక్షం.  అంటే సృష్టి చక్రం నుండి విడుదల పొందటం.  అంతకు మించి యేమీ లేదు -ఉండే అవకాశమే లేదు.

ఈ వాక్యంలో బ్రహ్మాండం అన్న మాట వాడబడింది. విష్ణుభక్తులు బ్రహ్మాండాన్ని పగులగొట్టుకొని మరీ మోక్షం సాధిస్తారని ప్రతిపాదించబడింది.  అయితే ఈ బ్రహ్మాండం అనేది యెలా ఏర్పడిందనే విషయాన్ని ముందు రాబోయే వాక్యాల్లో వివరించటం జరుగుతుంది.  అందుకే బ్రహ్మాండం అనే మాటకు పెద్దగా వ్యాఖ్యానించటం చేయ లేదు.

19, జులై 2012, గురువారం

మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 2

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం ఇక్కడ చూడండి.)

మూలము:బ్రహ్మాది దేవతా భజనంబునం జనువారు బ్రహ్మజీవితకాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు.

వివరణము: బ్రహ్మాను తదితర దేవతలను పూజించి శరీరత్యాగం చేసిన వారు బ్రహ్మలోకం చేరుకుంటారు. వారు అక్కడ ఆ బ్రహ్మ ఉన్న న్నాళ్ళు స్థిరంగా నివాసం ఉంటారు. ఆ తరువాత వారికి ముక్తి కలుగుతుంది.

ఈ‌వాక్యం సాధకులను, కొంత వేదాంత పరిజ్ఞానం కల వాళ్ళను తప్పకుండా తికమక పెడుతుంది. బ్రహ్మ, ఇంద్రుడు, అగ్ని, సూర్యుడు మొదలయిన పూజ్య దేవతలు ముక్తిని ఇచ్చే వారని చెప్పటం శృతిప్రమాణానికి విరుధ్దం. వారికి ఇష్టకామ్యార్థసిధ్ధిని అనుగ్రహించే సామర్ధ్యమే కాని మోక్షం అనుగ్రహించే సామర్థ్యం ఉందని చెప్పటం చెల్లదు. కాని మనం వివరణం చెప్పుకుంటున్న వాక్యం యొక్క అర్థం మరి వారికి అలా మోక్షం ఇచ్చే సామర్థ్యం ఉందని నొక్కి చెప్పుతున్నట్లుగానే ఉంది.

అసలు పై వాక్యంలోనే కావలసినంత గందరగోళం ఉంది. బ్రహ్మాను గాని తదితర దేవతలలో యెవరిని గాని పూజించిన వారంతా బ్రహ్మలోకం చేరుకుంటారూ అని కదా పై వాక్యం చెబుతోంది? కాని అదెలా సంభవం. ఉదాహరణకు ఇంద్రుని పూజించిన వారు చేరుకోవలసిన ఇంద్రలోకం అంటే స్వర్గం కదా? ఈ గీతాశ్లోకం తిలకించండి:

యాన్తి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాన్తి పితృవ్రతాః
భూతాని యాన్తి భూతేజ్యా యాన్తి మద్యాజినోऽపి మామ్|| 9-25 ||


దేవతలను సేవించువారు దేవలోకములను చేరుకుంటారు.  పితృదేవతలను సేవించే వారు ఆ పితృదేవతల లోకాలను చేరుకుంటారు .  భూతప్రేతపిశాచాలను పూజించే వారికి అట్టి రూపమే కలుగుతుంది . (పరమాత్మ నైన)నన్ను సేవించే భక్తులు నన్నే చేరుకుంటున్నారు.

ఇక్కడ శ్రీకృష్ణపరమాత్మ నన్ను సేవించు భక్తులు నన్నే పొందుచున్నారని చెప్పటం  అంటె వాళ్ళకి తనయందు లీనమై పోయి పునరావృత్తిరహితమైన మోక్షము సిధ్ధింస్తోందని చెప్పారని భావం. ఇతరమైన ఉపాసనలకు దొరుకుచున్న యే స్థానమైనా మోక్షం కాదు కదా.  అలాంటి అన్య దేవతోపాసకులు ఆయా దేవతల లోకాలు చేరి వారివారి యిష్టదేవతలకు గల ఆయువు పర్యంతం వారితో నివసిస్తారని అర్థం.  ఇక క్షుద్రమైన ఉపాసనలకు ఫలితం దారుణంగా ఉంటుంది. వాళ్ళూ అలాగే భూతప్రేతపిశాచాలలాగా అయిపోతారు. యద్భావం తద్భవతి అన్నమాట.

కేవలం పరబ్రహ్మోపాసన వల్లనే మోక్షం వస్తుంది కాని ఇతరత్రా ఉపాసనల వల్ల రాదు గదా.  కేనోపనిషత్తులో ఉన్న యీ మంత్రం చూడండి

సా బ్రహ్మేతి హోవాచ
బ్రహ్మణో వా ఏతత్ విజయే
మహీయధ్వమితి తతో‌ హైవ
విదాఞ్చాకార బ్రహ్మేతి

అప్పుడు హైమవతి "అదే బ్రహ్మము. ఆ బ్రహ్మము వల్లనే మీకు విజయం కలిగింది" అని ఇంద్రునికి స్పష్టం చేసింది. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మమును తెలుసుకున్నాడు.

దీనిని బట్టి ఇంద్రుడు బ్రహ్మము కాదని హైమవతి దయతో బ్రహ్మము గూర్చి చక్కగా తెలుసుకున్నాడనీ తెలిసింది కదా. దీని వలన ఇంద్రోపాసన కాక పరబ్రహ్మోపాసనమే మోక్షం యిచ్చేది అని తెలుస్తోంది.

అందుచేత మన వివరణం చెప్పుకుంటున్న వాక్యం పోతనగారు పొరబాటున వ్రాసారా అనే సందేహం వస్తుంది!

బహుశః ఈ వాక్యం "బ్రహ్మదేవ భజనంబునం జనువారు బ్రహ్మజీవితకాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు" అనిఉండాలేమో?  ప్రస్తుతం‌ కనిపిస్తున్న పాఠం పూర్వమే దొర్లిన లేఖక ప్రమాదమో లేక ఇటీవలి కాలం వారి ముద్రణా ప్రమాదమో కావచ్చునని ఒక అభిప్రాయం స్థిరపదుతోంది.

ఇంతకు ముందు వాక్యంలోనే బ్రహ్మను ఉపాసించేవాళ్ళకి లబించే ప్రయోజనం తెలుసుకున్నాం.  అది మోక్షం కాదు గదా.
దీనిని బట్టి సాక్షాత్తూ బ్రహ్మ అయినా ఇంద్రాది దేవతలు అయినా ముక్తిని ఇచ్చే వాళ్ళు కాదని తెలిసింది కాదా. అలాంటప్పుడు "ముక్తు లగుదురు" అన్న ప్రయోగం కూడా పొసగట్లేదు కదా? ఏ విధంగా అన్వయించటం?

ఇక్కడ "ముక్తు లగుదురు" అన్నది ఆయా లోకాలనుండి, ఆయా దేవతల సమక్షం నుండి విడిపోతారు అని అర్థం చెప్పుకోవాలి. అలా అయితే అంతా సరిగా ఉంటుంది. బ్రహ్మాది దేవతలంతా సృష్టిలోని వారే. కాబట్టి వారికి లయం అయిపోవటం తప్పదు.  అయితే అమిత దీర్ఘాయుర్థాయాలు. అంతే. ఆశ్రయించుకొన్న దేవతే లయం అయిపోయినప్పుడు, ఆశ్రితులైన ఉపాసకులంతాకూడా లయం అయిపోతారు. పునఃసృష్టిలో ఉచ్చితమైన అధికారాలూ అవకాశాలూ గల జన్మలు పొందుతారు. అయినా బ్రహ్మాది దేవతలు అని చెప్పటం పాఠదోషమే. ఎందుకంటే, బ్రహ్మ కంటే యితర దేవత ఆయుఃప్రమాణాలు తక్కువ. పైగా ఇతర దేవతల ప్రసక్తి తెచ్చి అంతా కట్టగట్టుకుని బ్రహ్మలోకాన్నే చేరుస్తారని చెప్పరాదు కూడా.

అలా అన్వయం కుదిరినాక ఈ వాక్యం కేవలం పూర్వవాక్యానికి కొనసాగింపు అనీ‌ విరోధం యేమీ లేదనీ బోధపడుతున్నది.

మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 1

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం   ఇక్కడ  చూడండి. )


మూలము: మఱియు నొక్క విశేషంబు గలదు.

వివరణము:  ప్రస్తుత గద్య భాగం  శ్రీమధ్బాగవతం లోని ద్వితీయస్కంధంలో ఉంది.  పరీక్షిన్మహారాజుకు శుకయోగీంద్రులు భాగవతాన్ని ఉపదేశిస్తున్నారు.  యోగసాధన చేసే విధానం గురించీ ముక్తిని గురించీ ఆయన రాజుకు వివరించిన తరువాత సృష్టిక్రమం గురించీ, విష్ణుభక్తులు ఆ సృష్టి నుండి ముక్తులై  పరమాత్మస్వరూపుడైన విష్ణువులో లీన మయ్యే విధానం గురించీ వివరిస్తున్నారు.

ఇక్కడ  'ఇంకొక విశేషం ఉంది'  అని చెప్పారు గదా? ఆ విశేషం యేమిటో చూద్దాం .  యోగాభ్యాసం చక్కగా చేసి అది ఫలించి సిధ్ధి పొందినవారు బ్రహ్మలోకం చేరుకుంటారు.  అలా బ్రహ్మలోకం చేరిన వారు లోకానుగ్రహం చేయటం కోసం శరీరధారణ చేసి భూమిమీదికి అప్పుడప్పుడు వస్తారు కాని వారికి యేవిధమైన కర్మబంధాలూ ఉండవు. కాబట్టి వారిని ప్రకృతి శరీరధారణకు నిర్బంధించలేదు.  కానీ  యీ సిధ్ధులకు తమదైన ఉనికి ఉండనే ఉంటుంది.  కాబట్టి అది కైవల్యపదం కాదు.  అయితే అటువంటి  కైవల్యం అనబడే పరమాత్మునిలో లీన మయ్యే విశేషమైన వ్యవహారం కూడా ఉంది సుమా కేవలం బ్రహ్మలోకం పొందటమే అత్యున్నతమైన స్థాయి కాదు అని శుక మహర్షుల వారు పరీక్షిత్తుతో అంటున్నారు. అదీ విషయం క్లుప్తంగా.

మూలము: పుణ్యాతిరేకంబున బ్రహ్మలోకగతు లైనవారు కల్పాంతరంబునం బుణ్యతారతమ్యంబుల నధికారవిశేషంబు నొందువార లగుదురు.

వివరణము:  పుణ్యాతిరేకం అంటే అమితమైన పుణ్యం అని అర్థం. పుణ్యతారతమ్యం అంటే ఆ అమితమైన పుణ్యంలో కూడ యెంతో కొంత తర-తమ బేధం ఉంటుంది కదా. ఈ తర, తమ అనేవి ఇంగ్లీషులో  more and most  అనే comparisons.  ఈ లోకంలో మనుష్యుల అర్హతలను బట్టి యెలాగైతే అధికారాలను అప్పగిస్తామూ బ్రహ్మలోకంలో అయినా అలాగే జరుగుతుంది.   బ్రహ్మలోకం చేరుకున్నఈ గొప్ప గొప్ప పుణ్యాత్ములు  అప్పుడు నడుస్తున్న కల్పం పూర్తి కాగానే వారి పుణ్యం యొక్క కొలతను బట్టి తగిన అధికార పదవులు పొందుతారు.  ఇక్కడ కొంతమందికి కల్పం అంటే యెంతకాలం అనే ప్రశ్న రావచ్చును,  కల్పం  అనేది  భారతీయ మైన  కాలమానంలో  ఒక అతిదీర్ఘ మైన సమయం. మనం  ప్రస్తుతం కలి యుగం  నడుస్తోందని చెప్పుకుంటున్నాం  కదా. కృత, త్రేత, ద్వాపర  కలి యుగాలని  యుగాలు నాలుగు. వాటి  ప్రమాణాలు చూడండి.

కృతయుగం    17,28,000 సంవత్సరాలు
త్రేతాయుగం    12,96,000 సంవత్సరాలు
ద్వాపరయుగం   8,64,000 సంవత్సరాలు
కలియుగం      4,32,000 సంవత్సరాలు

నాలుగు  యుగాలనూ‌ కలిపి ఒక మహాయుగం‌ అంటారు. మెత్తం 43,20,000 సంవత్సరా లన్నమాట.  మహాయుగాన్ని  దివ్యయగం అని కూడా అంటారు. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే  అది బ్రహ్మకు  ఒక పగలు. దానినే సర్గము అనీ‌ కల్పము అనీ‌ అంటారు. మరొక 1000 మహాయుగాలు బ్రహ్మకు రాత్రి సమయం. దానినే  ప్రళయం  అంటారు. ఇలా బ్రహ్మకు  ఒక రోజు పూర్తవుతుంది. ఇలాంటి రోజులు  360 గడిస్తే అది బ్రహ్మకు  ఒక సంవత్సరం. బ్రహ్మగారి ఆయుర్దాయం అటువంటి 100 సంవత్సరాలు.  ప్రస్తుతం ఉన్న బ్రహ్మగారికి 50 యేళ్ళు  దాటాయండి, 51వ సంవత్సరంలో  శ్వేతవరాహకల్పం నడుస్తున్నది. ఇప్పుడు కల్పం‌  అనే దాని యొక్క  ప్రమాణం 432,00,00 ,000 సంవత్సరాలు అని  తెలుస్తున్నది  కదా.
 
ఇది నిస్సందేహంగా చాలా పెద్ద కాలమే.  దీన్ని బట్టి అర్థమయ్యేది యేమిటంటే,  యోగాభ్యాసం చక్కగా చేసి జితేంద్రియులైన వారు బోలెడన్ని పుణ్య కార్యాలు చేస్తారు.  వాటి సహాయంతో వారికి బ్రహ్మలోకంలో ఉండే అదృష్టం పడుతుంది.  అదీ యెంతో దీర్ఘకాలం పాటు. ప్రస్తుతం నడుస్తున్న కల్పం ఇంకా యెంత కాలం మిగులి ఉందో అన్నాళ్ళూ వాళ్ళు బ్రహ్మగారి లోకంలో సుఖంగా ఉంటారన్నమాట.  ఆ తరువాత వారికి వారి యోగ్యతల ననుసరించి మంచిమంచి పదవులు వస్తాయి.

ఈ విషయాన్ని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు (అక్షరపరబ్రహ్మ యోగంలో)   ఓ అర్జునా బ్రహ్మలోకంతో సహా అన్నిలోకాలూ, యేది పొందినా, అది పునర్జన్మనిచ్చేదే. నన్ను పొందిన వాళ్ళకు మాత్రం  పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి స్పష్టం చేసాడు.
     ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున
    మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే

కాబట్టి బ్రహ్మలోకం పొందిన మహాయోగులకూ తిరిగి కల్పావసానం కాగానే ఒక జన్మ అనేది కలుగుతుంది.  అయితే వారి పుణ్యఫలానుసారంగా మంచి అధికారయుతమైన జన్మ దొరుకుతుంది.

18, జులై 2012, బుధవారం

శ్రీమదాంధ్రమహాభాగవతాంతర్గత సృష్టిక్రమము (మూలము)

[ శ్రీమదాంధ్రమహాభాగవతము, ద్వితీయస్కంధము. బమ్మెర పోతనామాత్యకవీంద్ర ప్రణీతము.]

మఱియు నొక్క విశేషంబు గలదు.

పుణ్యాతిరేకంబున బ్రహ్మలోకగతు లైనవారు కల్పాంతరంబునం బుణ్యతారతమ్యంబుల నధికారవిశేషంబు నొందువార లగుదురు. (1)

బ్రహ్మాది దేవతా భజనంబునం జనువారు బ్రహ్మజీవితకాలం బెల్ల బ్రహ్మలోకంబున వసియించి ముక్తు లగుదురు. (2)

నారాయణచరణకమలభక్తిపరాయణత్వంబునం జనినవారు నిజేఛ్ఛావశంబున నిరర్గళగమనులై బ్రహ్మాండంబు భేదించి మహోన్నతవైష్ణవపదారూఢులై తేజరిల్లుదురు. (3)

ఈశ్వరాధిష్టితం బైన  ప్రకృతి యంశంబున మహత్తత్త్వం బగు. (4)

మహత్తత్త్వాంశంబున నహంకారం బగు.(5)

అహంకారాంశంబున శబ్దతన్మాత్రం బగు.

శబ్దతన్మాత్రాంశంబున గగనం బగు.

గగనాంశంబున స్పర్శతన్మాత్రం బగు.

స్పర్శతన్మాత్రాంశంబున సమీరణం బగు.

సమీరణాంశంబున రూపతన్మాత్రం బగు.

రూపతన్మాత్రాంశంబు వలన తేజం బగు.

తేజోంశంబున రసతన్మాత్రం బగు.

రసతన్మాత్రాంశంబువలన జలం బగు.

జలాంశంబున గంధతన్మాత్రం బగు.

గంధత్నాంత్రాంశంబున పృధివి యగు.

వాని మేళనంబునం జతుర్దశభువనాత్మకం బైన విరాడ్రూపం బగు.

ఆ రూపంబునకుఁ గోటియోజన విశాలం బైన యండకటాహంబు ప్రధమావారణం బైన పృధివి యగు.
దీనిఁ బంచాశత్కోటివిశాలం బని కొందరు పలుకుదురు.

ఇయ్యావరణంబు మీఁద సలిలజేజస్సమీరగగనాహంకారమహత్తత్త్వంబు లనియెడి యావరణంబులు క్రమంబున నొండొంటికి దశగుణోత్తరాధికంబులై యుండు.

అట్టి యేడింటి మీఁదఁ బ్రకృత్యావరణంబు  మహావ్యాపకం బగు.

బ్రహ్మాండంబు భేదించి వైష్ణవపదారోహణంబు సేయువాడు మెల్లన లింగదేహంబునఁ బృధివ్యాత్మకంబు నొంది 

అట్టి పృధివ్యాత్మకంబున ఘ్రాణంబున గంధంబును
జలాత్మకత్వంబున రసనేంద్రియంబున రసంబును
తేజోరూపకత్వంబున దర్శనంబున రూపంబును
సమీరణాత్మకత్వంబున దేహంబున స్పర్శనంబును
గగనత్మకత్వంబున శ్రవణంబున శబ్దంబును
అతిక్రమించిన

భూతసూక్ష్మేంద్రీయలయస్థానం బైన యహంకారావరణంబున సంప్రాప్తుండై యుండు.

మనోమయంబును దేవమయంబును నైన సాత్త్వికాహంకారగమనంబున మహత్తత్త్వంబు సొచ్చి

గుణత్రయంబున లయించి

ప్రధానంబు నొంది

ప్రధానాత్మకత్వంబున దేహంబును

ఉపాధిపరంపరావస్థానంబునం బ్రకృతిం బాసి

ఆనందమయుండై యానందంబునం బరమాత్మరూపం బైన వాసుదేవబ్రహ్మంబునందు కలయును

అని వెండియు నిట్లనియె.

శ్రీరామ్‌గారు ఈ గద్యసంబధమైన ప్రశ్న ఒకటి వేశారు. వారడిగినది 
శ్యామలీయం గారు, భాగవతం రెండో స్కందం చదువుతున్నాను. అందు లో కొన్ని పదలైతే ఇంతక్రితం విన్నాను కాని, అర్థం స్పష్ట్టంగా తెలియలేదు. 1. ఆ పదాలు దృష్ట్ట, రసం, సత్తు అసత్తు 2. తేజస్సు నుండి రసం,రూపం,స్పర్శం, శబ్ద్దం అనే నాలుగు గుణాలతో పాటు జలం జనించింది. ఇక్కడ రసం అంటే అర్థమేమిటి? 3." మహత్తత్త్వం అంశంతో అహంకారం పుడుతుంది. అహంకార అంశంతో శబ్బతన్మాత్ర పుడుతుంది. శబ్దతన్మాత్ర అంశంతో ఆకాశం పుడుతుంది. ఆకాశ అంశంతో స్పర్శ తన్మాత్రం పుడుతుంది. తేజస్సు అంశం నుండి రసతన్మాత్ర పుడుతుంది, రసతన్మాత్ర అంశమ్నుండి జలం పుడుతుంది. జలాంశం నుండి గంధ తన్మాత్ర పుడుతుంది. గంధ తన్మాత్ర అంశంతో పృధ్వి పుడుతుంది. వీటన్నిటి కలయిక వలన పదునాలుగు భువనాల స్వరూపమైన విరాడృపం ఉద్బవిస్తుంది " పై వాఖ్యంలో మహత్తత్త్వం, తన్మాత్రం ,గంధ తన్మాత్ర అంటే అర్థమేమిటి? Thanks in advance SriRam on గత మెంచి యడిగేది కాదనవు గదా ప్రతిసారి వలె పోయి రమ్మనకు

చాలా మంచి ప్రశ్న. వారు నా‌జవాబు కోసం వేచి యున్నారు.  ఇది చాలా మంచి విషయం. కాబట్టి విపులంగా వ్రాయాలని భావిస్తున్నాను. ప్రస్తుతం పైన మూలపాఠాన్ని ప్రచురించాను.  నా వ్యాఖ్యానాన్ని రాబోయే టపాల్లో వెలువరిస్తాను. నేను కవినో పండితుడనో వేదాంతినో జ్ఞానినో విస్తారంగా గ్రంధావలోకనం చేసిన వాడినో కాదు. నాకీ‌ అర్హతలేమీ లేనే లేవు. అయినా నా శక్తి కొద్దీ ప్రయత్నించా లనుకుంటున్నాను. సాహసమే. పెద్దలు మన్నించి ఆశీర్వదించాలని మనవి. తప్పులేవైనా దొర్లితే పెద్దమనసు చేసుకొని క్షమించగలరనే విశ్వాసంతో, రాబోయే టపాలలో పై గద్యకు యధాశక్తిగా వ్యాఖ్యానం వ్రాస్తాను.

గమనిక: పైని మూలపాఠం నిజానికి యే విరామ చిహ్నాలూ వాక్యావసానాలూ లేకుండా ఒకే పేరాగ్రాఫుగా ముద్రితమై పుస్తకాలలో దర్శన మిస్తుంది.  స్వతంత్రించి చదువరుల సౌలభ్యం కోసం అనేక విభాగాలుగా ఉటంకించాను.

స్వస్తి.

17, జులై 2012, మంగళవారం

తెలిసీ తెలియని వారున్నారు తెలియని వారున్నారు

తెలిసీ తెలియని వారున్నారు తెలియని వారున్నారు
తెలిసిన వారే కనరారే యిక తెలిసే దారే లేదా

తెలియని వారికి నీ వున్నావని తెలియ జెప్ప లేము
తెలిసీ తెలియని వారము మాకు తెలియదు నీ యునికి
తెలిసిన వారిని యడగా లంటె తెలియదు వారెవరో
పలుకవె నిన్ను కనుగొను దారిని పరమాత్మా దయతో

తెలియని వారికి జననమరణములు దేహపు పరిమితులే
తెలిసీ తెలియదు భవసాగరమను దీని విధము మాకు
తెలిసిన వారే దొరుకుట లేదే తెలియ జెప్ప మాకు
కలవరపడు మా కలత దీర్చ నీకన్న దిక్కు గలదె

తెలిసిన వారికి తోడు నీడవై తిరుగు చుండు స్వామీ
తెలియని వారికి తెలిసీ తెలియని తెలివిడి గల మాకు
కల బాధలు వెస తొలగించి యిక కావ వయ్య రామ
తలచు కొన్న నీ‌ వలన గానిది కలదె జగము లందు

16, జులై 2012, సోమవారం

గత మెంచి యడిగేది కాదనవు గదా ప్రతిసారి వలె పోయి రమ్మనకు


గత మెంచి యడిగేది కాదనవు గదా

ప్రతిసారి వలె పోయి రమ్మనకుఅలవాటే కద నీకు అందుకే వేరొక

తలకాయ తగిలింతు తైతక్క లాడర

యిల మీద క్రొత్త కథ వెలయించరా యని

సెలవిత్తు వేమొ మరి చిత్తమొల్లని పనివేప చెట్టు జన్మము పాపఱేని జన్మము

కోపాలసుండైన భూపతి జన్మము

పాపవిదూరయోగివరుడైన జన్మము

ఈ పాట్లు పడు పారు డెత్తినవే గదఅనుభవములు చాలు హాయిగాను తొంటి

ఘనమైన స్వస్థితి కలిగించవయ్య

మనమిర్వురము నొక్కటని పల్కుచునె నను

తనువుల దాల్చగ తరుమకు మయ్య

ముంచ కుండ కురిసే వాన

ముంచ కుండ కురియు వాన మంచి వాన మమ్ము
ముంచెత్తు నీకృప రామ మంచి వాన

పుడమికి గంధపు పూత మొదటి వాన మా
యెడదల మతి మలదు నీదు కరుణ వాన
తడయనేల కురియ వయ్య కరుణ వాన మా
యెడల నీకు  ప్రేమ హెచ్చై  యెగయు గాన

నదుల నీరు నించి బ్రోచు నయ్య వాన మా
మదుల మంచి నించు నీదు కరుణ వాన
మృదులహృదయ కురియ వయ్య కరుణ వాన మా
కధికప్రేమ జూపు వాడ వగుదు గాన 

మెతుకులు పండించు వర్షఋతువు వాన మా
బ్రతుకులు పండించు నీదు కరుణ వాన
సతతము  కురిపించ వయ్య కరుణ వాన మా
కతులప్రేమాస్పదుడగు పతివి గాన


నేను నీ‌ పక్షమున నిలచి వాదులాడేనో

నేను నీ‌ పక్షమున నిలచి వాదులాడేనో
పోనిమ్మని నీవలె కాననటు లుండేనో

చేరి కొలుచుచుండు వారు దూఱి నవ్వుచుండు వారు
సారెకు నిను తలచు వారు నౌర నిన్నెరుగని వారు
వీరందరు గూడ నీదు కారుణికమునకు తగిన
వార లగుచు కానబడుట బాగ విదిత మాయె రామ

జ్ఞానదృష్టి నెఱుగు వారు కాన లేక దిట్టు వారు
లోన నమ్మి నిలుచు వారు లేని శంక లేని వారు
మానక వీరెల్ల నీదు మంచి చూపు నోచు కొనగ
లేనిపోని తాపములకు లోనగు టేమిటికి రామ

వారి వారి ముందు గతికి వారి వారి పధ్ధతులని
మారు పలుకరాని గొప్ప మాట నీవు చెప్పి నావు
దారులన్నియును నీదు ధామమును చేరు గాన
తీరి పోయె వాదు లనుచు తెలియ వచ్చినది రామ

12, జులై 2012, గురువారం

తెలియ జెప్పి యేమి లాభమో అట్టి వారు తెలియ కున్న నేమి నష్టమో

తెలియ జెప్పి యేమి లాభమో అట్టి వారు 
తెలియ కున్న నేమి నష్టమో కుమతులతో
పలుకు లాడి యేమి కార్యమో ఊరక నిను
పలుచ నేల చేయ వలయునో పని మాలి

వెకిలి వేదాంతముల వెఱ్ఱిమొఱ్ఱి వాగుడుతో
మకిలి పట్టి చివరకు మతిపోయిన జనులకు
వికటబుధ్ధి వదిలించి విమల సత్యమిదియని
ప్రకటించగ యత్నించుట పరమాత్మ నావశమా

సృష్టిచక్రరహస్యము ఛేదించిన వారి వలె
దుష్టమతుల వాగ్వైఖరి తోచు చుండె వారి
కష్టసిధ్దాంతములను కాలదన్ని సత్యమును
స్పష్టపరచ యత్నించుట పరమాత్మ నావశమా

వైషమ్యములను పెంచు వారల దుర్మతముల
దోషములను ద్రుంచు ద్రోవ కానరాదే
రోషము లణగించి రూపించి సత్యమును
భాషించెడు నుపాయమును పరమాత్మ చూపవే


ఈ గీత నేపధ్యం.
గత రెండు రోజులుగా ఒక అకటావికటపు బ్లాగు  సృష్టిచక్రం  అనే దానిలో, గీతాచార్యుడు శ్రీకృష్ణుడు కాదు అంటూ యేమేమో అడ్డదిడ్డంగా వ్రాసారు.  నా‌ అభ్యంతరాలకు తట్టుకోలేక కాబోలు వ్యాఖ్యను పెట్టే అవకాశం నిలిపి వేశారు.
వారు శివపారమ్యం ప్రచారం చేయాలని అసందర్భమైన విష్ణుద్వేషాన్ని వెలిబుచ్చుతున్నారు. వారి వలన చాలా మనస్తాపం కలిగింది. ఈ సృష్టిచక్రం బ్లాగు వారి గందరగోళపు భాష, గందరగోళపు సిధ్ధాంతాలూ కేవలం అమాయకుల్ని పక్కదారి పట్టించటానికి తప్ప యే విషయంలోనూ సవ్యత ప్రామాణికత కనిపించటం లేదు. చాలా ఘోరంగా వ్రాస్తున్నారు.

11, జులై 2012, బుధవారం

తోడై యుండెడి వాడు లేడు వేరొకడు

తోడై యుండెడి వాడు లేడు వేరొకడు నే
నేడ బోవుదును మారాడ వేమి రామ

గడచిన జన్మంబుల నడచినట్టి కథలకు
పడిన కష్టంబులకు పరగ సాక్షివి నీవె
ఒడిదుడికుల కావలి యుత్తమం బగు స్థితికి
నడిపించు వారింక నా కెవ్వరున్నారు

ఉన్నది నీ వొక్కడవె యన్న సంగతి నమ్మి
యున్నందు కే ఫలము తిన్నగ నిచ్చితివి
నన్ను తిప్పలు బెట్టుచున్న ప్రకృతిమాయ
నన్నన్న తొలగించకున్నావు న్యాయమా

మనకు బేధము లేని మాట సత్యమె గాని
వినుము దేహభ్రాంతి నను వీడకున్నదే
తనువుల దూరి యిటు దారితప్పిన దాని 
గొనుము నీ ప్రతిబింబమును నీవు గొబ్బున

3, జులై 2012, మంగళవారం

నాకు కలిగితివి గురుడవై తొలిభవము నందునే

చెలికాడ నని నీవు చెప్పుకున్నా నాకు 
కలిగితివి గురుడవై తొలిభవము నందునే
మెలకువతో నీ వెంట మసలుచుందును నేను
కలనైన నీ యానతి కావల చరియించనును

నా సంగతి  నెరిగినట్టి నీ సాంగత్యమును మాని 
మోసకారులను నమ్ము మూర్ఖశిఖామణిని గాను
దోసములా నరవేషము తొడుగుటతోనే మొదలు
నా సద్గురు దేవ యింక నన్ను  రక్షించ రావె

లోకగతి కఠిన మయ్య లోపములే యెంచుచుండు
నా కేమో నీవు దప్ప లోక రీతి యెరుక గాదు
నా కొంచెపు దనము నెరిగి నాపై దయ జూపుదువు
నాకు కలిమి బలిమి గూడ నా సద్గురు దేవ నీవె

మరలమరల పుట్టు చుంటి మరలమరల చచ్చుచుంటి 
తరచు పాపపుణ్యములను దాల్చి యిచట తిరుగుచుంటి
వెరపు గొరపు యీ యాతన విడుచున్నది నీ కృపచే
పరమదయామయ సద్గురు పరమాత్మా ప్రియసఖా

2, జులై 2012, సోమవారం

గురుతు పట్ట లేరు నిన్ను గురుడవని మూఢజనులు

గురుతు పట్ట లేరు నిన్ను గురుడవని మూఢజనులు
తరచుగ టక్కరుల వెంట తిరుగు చుందు రమాయకులు
పరమదయాళో నీవే యరసి రక్షించ వలెను
నరుల కష్టములు తీర్చ నడుము కట్టి దిగవలెను

తామెరుగని శాస్త్రములు తరచుగ వల్లించు వారు
తామాచరించలేని ధర్మము బోధించు వారు
కాముకులు తామసులును స్వాముల వేషములు దాల్చి
యేమార్చుచు తిరుగుదు రిక సామాన్యుల గతి గనవె

ఊరూరా నేడు వెలసినారు స్వామి గురువులు
వారికి గల శిష్యకోటి వ్యాసమహర్షికిని లేదు
వారికి గల కరుణ మహిమ వంటివి నీ వద్ద లేవు
వారి ఆగడముల వలన బాధపడెడు వారి గనవె

గుండెలోన నిలచియున్న నిన్ను గుర్తు పట్ట లేరు
దుండగంపు గురువేషుల ద్రోహ బుధ్ధు లెరుగ లేరు
నిండార కరుణజూపి నీవు బ్రోవవలయు స్వామి
అండగ నీవున్న చాలు అన్ని వేళల జనులకు