2, జులై 2012, సోమవారం

గురుతు పట్ట లేరు నిన్ను గురుడవని మూఢజనులు

గురుతు పట్ట లేరు నిన్ను గురుడవని మూఢజనులు
తరచుగ టక్కరుల వెంట తిరుగు చుందు రమాయకులు
పరమదయాళో నీవే యరసి రక్షించ వలెను
నరుల కష్టములు తీర్చ నడుము కట్టి దిగవలెను

తామెరుగని శాస్త్రములు తరచుగ వల్లించు వారు
తామాచరించలేని ధర్మము బోధించు వారు
కాముకులు తామసులును స్వాముల వేషములు దాల్చి
యేమార్చుచు తిరుగుదు రిక సామాన్యుల గతి గనవె

ఊరూరా నేడు వెలసినారు స్వామి గురువులు
వారికి గల శిష్యకోటి వ్యాసమహర్షికిని లేదు
వారికి గల కరుణ మహిమ వంటివి నీ వద్ద లేవు
వారి ఆగడముల వలన బాధపడెడు వారి గనవె

గుండెలోన నిలచియున్న నిన్ను గుర్తు పట్ట లేరు
దుండగంపు గురువేషుల ద్రోహ బుధ్ధు లెరుగ లేరు
నిండార కరుణజూపి నీవు బ్రోవవలయు స్వామి
అండగ నీవున్న చాలు అన్ని వేళల జనులకు

1 కామెంట్‌:

  1. గురుపూర్ణిమ సందర్భంగా
    వ్రాసినది చాలా చక్కగా ఉందండి..
    నిజమైన గురువు ఎవరో ఈ రోజుల్లో గుర్తించడం కష్టమేనండి
    మీకు ఈ సందర్భంగా శుభాభినందనలు...
    @శ్రీ

    రిప్లయితొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.