12, జులై 2012, గురువారం

తెలియ జెప్పి యేమి లాభమో అట్టి వారు తెలియ కున్న నేమి నష్టమో

తెలియ జెప్పి యేమి లాభమో అట్టి వారు 
తెలియ కున్న నేమి నష్టమో కుమతులతో
పలుకు లాడి యేమి కార్యమో ఊరక నిను
పలుచ నేల చేయ వలయునో పని మాలి

వెకిలి వేదాంతముల వెఱ్ఱిమొఱ్ఱి వాగుడుతో
మకిలి పట్టి చివరకు మతిపోయిన జనులకు
వికటబుధ్ధి వదిలించి విమల సత్యమిదియని
ప్రకటించగ యత్నించుట పరమాత్మ నావశమా

సృష్టిచక్రరహస్యము ఛేదించిన వారి వలె
దుష్టమతుల వాగ్వైఖరి తోచు చుండె వారి
కష్టసిధ్దాంతములను కాలదన్ని సత్యమును
స్పష్టపరచ యత్నించుట పరమాత్మ నావశమా

వైషమ్యములను పెంచు వారల దుర్మతముల
దోషములను ద్రుంచు ద్రోవ కానరాదే
రోషము లణగించి రూపించి సత్యమును
భాషించెడు నుపాయమును పరమాత్మ చూపవే


ఈ గీత నేపధ్యం.
గత రెండు రోజులుగా ఒక అకటావికటపు బ్లాగు  సృష్టిచక్రం  అనే దానిలో, గీతాచార్యుడు శ్రీకృష్ణుడు కాదు అంటూ యేమేమో అడ్డదిడ్డంగా వ్రాసారు.  నా‌ అభ్యంతరాలకు తట్టుకోలేక కాబోలు వ్యాఖ్యను పెట్టే అవకాశం నిలిపి వేశారు.
వారు శివపారమ్యం ప్రచారం చేయాలని అసందర్భమైన విష్ణుద్వేషాన్ని వెలిబుచ్చుతున్నారు. వారి వలన చాలా మనస్తాపం కలిగింది. ఈ సృష్టిచక్రం బ్లాగు వారి గందరగోళపు భాష, గందరగోళపు సిధ్ధాంతాలూ కేవలం అమాయకుల్ని పక్కదారి పట్టించటానికి తప్ప యే విషయంలోనూ సవ్యత ప్రామాణికత కనిపించటం లేదు. చాలా ఘోరంగా వ్రాస్తున్నారు.

16 కామెంట్‌లు:

 1. శివాయ విష్ణు రూపాయ - శివరూపాయ విష్ణవే,
  శివస్య హృదయం విష్ణుః - విష్ణో శ్చ హృదయగం శివః

  ఇంతకంటే చెప్పేది ఏమియు లేదు.

  ____________________________________
  Visit http://bookforyou1nly.blogspot.in/
  for books

  రిప్లయితొలగించండి
 2. ఊర్కోండి సార్! ఇదో సారి చూడండి....

  http://truereligiondebate.wordpress.com/

  వీళ్ళు లోపల , వాడు బయట అంతే తేడా....

  పనిలో పనిగా నన్నూ అకటావికటపు మనిషి కింద మీరు ఈపాటికి జమకట్టెయ్యకపోయుంటే, ఇప్పుడు కట్టేసినా ఫర్లేదు - ఎందుకంటే పెద్దోరు కాబట్టి... :) ....

  మరి మీరు జ్యోతిషుల గురించి చెప్పిన మాటలు నేను వినలేదుగా..... :) :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. వంశీగారూ
   ఇక ఊరుకోదలచే యీ గీతం వ్రాసాను గద.
   మిమ్మల్ని అకటావికటపు మనిషి కింద జమ కట్టెయ్యటానికి మీరేమీ బ్రహ్మకుమారీవాళ్ళలాగా blasphemyకి పాల్పడ్డారా యేమిటి.

   తొలగించండి
  2. ఈ రోగులకు రెండే చికిత్సలు పనికొస్తాయండి .....ఒకటి మాటలతో విరుచుకు పడిపోటూ గడ్డి పెడ్డటం, రెండు - అనవసర ప్రచారం ఇవ్వక "ఇగ్నోర్" చెయ్యటం.... మొదటి దానితో దిమ్మ తిరగాలి, రెండో దానితో ఉన్న దిమ్మ అరిగిపోవాలి....అదీ లెక్క....ఏ దండం ఉపయోగించాలన్నది మన చేతిలో పనే....అయితే రెండో దానితో ఉన్న గొడవేమిటంటే గొర్రెలు కొన్ని ఏరు దాతేస్తాయి....అది గొర్రెల ఖర్మ అని సరిపెట్టుకోటమే....నేనైతే మొదటిది ఉపయోగిస్తా.....

   హరహర మహాదేవ - ఎంత మాటనేసారు.....నేనే గనక "బ్లాస్ఫెమీ" కి పాల్పడితే మా గుళ్ళో గణపయ్యకు, హనుమయ్యకు , కార్తికేయుడికి నేను స్వయంగా చేత్తో అలంకారం చేసే భాగ్యం నశించిపోవుగాక....

   అవునండి నిజమే, ప్రతి వారం అభిషేక సమయంలో రుద్రపారాయణమయ్యాకా (గణపయ్యకు / కార్తికేయుడికి) / తైత్తరీయోపనిషత్ పఠించాక (హనుమయ్యకు) - మా గురువుగార్లు శ్రీ సుబ్బారావు గారు , శ్రీ శ్రీరాం గారు విగ్రహాలని తుడవనిచ్చి, ఆ భగవంతుడిని, దయామయుడిని అలంకరించడానికి భాగ్యం కలిగిస్తారు....వారికి ఎంత ఋణపడి ఉన్నానో మాటల్లో చెప్పలేను.....ఇహ మీరన్న బ్లాస్ఫెమీ మాట తీవ్రంగా గాయపరిచేసింది....ఆ ఊహ కూడా నేను తట్టుకోలేను.....స్వస్తి సార్! స్వస్తి.....

   తొలగించండి
  3. వంశీగారూ,

   మిమ్ములను నొప్పించాలని నా ఉద్దేశం యెంతమాత్రం కాదండీ. మీరు బ్లాస్ఫెమీకి పాల్పడేవారు కారనే కదా నేను ప్రస్తావించింది. అందుచేత దయచేసి నొచ్చుకోవద్దని మనవి. శివకేశవవిబేధవాక్యం బ్లాస్ఫెమీ వంటిదన్న ఉద్దేశంతో ప్రస్తావించాను కాని, మిమ్మల్ని నొప్పించేందుకు ప్రయత్నించలేదని దయచేసి అర్థం చేసుకోగలరు.

   మీకు గల దైవసేవాసక్తికి ముగ్ధుడనయ్యాను. అటువంటి అవకాశాలు మీకు కలగటం నిజంగా తమ సుకృతసత్ఫలంగా భావిస్తున్నాను.

   మీ మనస్సుకు నొవ్వు కలిగితే క్షంతవ్యుడనని సవినయంగా మరొకసారి మనవి చేసుకుంటున్నాను.

   తొలగించండి
 3. వారి వాదన తప్పని మీరు అనుకోవడం వరకు బాగుంది. వారి ఆలోచినలను మీరు చీల్చి చెండాడం కూడా బహుపరాక్.

  అయితే మూర్ఖులు, అవివేకి, ప్రేలాపన, వెకిలి వేదాంతం లాంటి పరుష పదజాలం (కొండొకచో వ్యక్తిగతమయిన దూషణ) అవసరమా? తమవంటి పెద్దలు ఆత్మ విమర్శ చేసుకొని అవి మానుకుంటే బాగుంటుందని మనవి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. గొట్టిముక్కలవారూ,

   మీ మాటలతో నేను 100% ఏకీభవిస్తున్నాను. పరుషపదజాలం వాడటం నాకూ సమ్మతం కాదు. మీరుటంకించిన మాటలలో వెకిలి వేదాంతం అనేది మాత్రం వాడాను. అంతకన్న పరుషపదాలే వాడాను 'వెఱ్ఱిమొఱ్ఱి వాగుడు' వగైరా. ఇలా వ్రాయటం నా మతం కాదు గాని ఇది ఒక ప్రత్యేకసందర్భం (exception) అనుకుంటాను.

   అయితే వ్యక్తిగతమయిన దూషణమాత్రం నేను చేయలేదండి, చేయను కూడా.

   మీ అమూల్యమైన సూచన గమనించాను. మీ రన్నట్లే కానివ్వండి. ధన్యవాదాలు.

   తొలగించండి
  2. "మీరుటంకించిన మాటలలో వెకిలి వేదాంతం అనేది మాత్రం వాడాను": మిగిలిన పదాలు మీరు వాడినవే.

   "ఈ మూర్ఖుల ప్రేలాపనలను" వ్యక్తిగత అధిక్షేపణ అవుతుంది. దాని బదులు "ఈ వాదన మూర్ఖంగా ఉంది" అంటే కొంచం బాగుండేదేమో.

   మిమ్మల్ని విమర్శించేటంత వాడిని కాను. అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటున్న మీరు ఆ హుందాతనాన్ని ప్రదర్శించలేదే అన్న బాధతో అన్న మాటలుగా తలచండి.
   ==========================================
   http://srustichakr.blogspot.in/2012/07/blog-post_6536.html

   శ్యామలీయం said...

   > గీతా భగవంతుడు కృష్ణుడు కాదు
   చాలు. చక్కగా బయట పెట్టుకున్నారు మీ‌ విష్ణుద్వేషం.
   గీత అనేది 'భగవతా నారాయణేన స్వయం" అని మీరు యెన్నడూ వినలేదు. లేదా విన దలచు కోలేదు. హరి హరులకు బేధం లేదు. హరిభక్తుడనని హరుని ద్వేషించినా, హరభక్తుడ నని హరిని ద్వేషించినా అధోగతియే.

   ఆశేష ఆంద్ర ప్రజలారా! ఈ మూర్ఖుల ప్రేలాపనలను విన్నారుగా! మీ శ్రేయస్సు కోరి, దూరంగా‌ ఉండండి ఇటువంటి అవివేకమతావలంబులకు. వీలయితే ఓపిక చేసుకొని ఖండించండి.
   July 11, 2012 8:10 AM

   తొలగించండి
  3. గొట్టిముక్కలవారు,
   చక్కగా గమనించారు. "వెకిలి వేదాంతం అనేది మాత్రం వాడాను" అన్నది యీ గీతానికి సంబంధించినది.
   మంచిది. మీరన్నట్లు మరింత శ్రధ్ధవహిస్తాను. మీ అభిమానానికి దన్యవాదాలు.

   తొలగించండి
 4. one my friend is lured by brahmakumaris. now he argues shiva is none other than their daddy (the master of that order). ultimately it is what they want to propagate. their lord shiva is not the vedic shiva but the born and dead human being.

  another kind of attack on vedic dharma.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పురాణపండ వారూ,

   నాదీ మీ భయమే. ఈ బ్రహ్మకుమారీమణులు వైదిక మైన ప్రతీకలకు వక్రభాష్యాలు చెబుతున్నారు. అనవసరవిద్వేషాలకు ప్రాతిపదికలు వేస్తున్నారు. వారు సంఖ్యాబలం తక్కువగా ఉన్నవారు కాబట్టి చాలా మంది పోనిద్దూ అని ఉపేక్ష చేస్తున్నారు. తెలియటం లేదు. ఈ బ్రహ్మకుమారీమణులు గ్రహపాటున సంఖ్యాబలం సంపాదించుకుంటే భవిష్యత్తులో తప్పకుండా సనాతనధర్మావలంబులకు పెద్ద తలనొప్పి అవుతారు. అప్పుడు మొత్తుకుని లాభం ఉంటుందా?

   (ఇటువంటి కుహనా ఆధ్యాత్మిక సంఘాలు మరి కొన్ని కూడా ఉన్నాయి. మా దగ్గర బంధువే ఒక అమ్మాయి రామచంద్ర మిషన్ అట. దానిలో మునిగింది. ఒక రోజు మా యింటికి వచ్చి 'ఎందుకండీ మనవాళ్ళంతా ఇడియట్స్ లాగా బొమ్మలు పెట్టుకుని పూజలు చేస్తారు?' అని విసుక్కుంది. వారి మతంలో చేరితే యీ జన్మలోనే వారి గురువుగారు మోక్షం యిచ్చేస్తారట. అలా మోక్షం సంపాదించుకున్నట్లు యీమెకు సర్టిఫికేట్ కూడా ఇచ్చారట. ఎటు పోతున్నాం మనం? (అన్నట్లు నన్ను కూడా లాగాలని చూసారు!) )

   తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.