19, జులై 2012, గురువారం

మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 1

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం   ఇక్కడ  చూడండి. )


మూలము: మఱియు నొక్క విశేషంబు గలదు.

వివరణము:  ప్రస్తుత గద్య భాగం  శ్రీమధ్బాగవతం లోని ద్వితీయస్కంధంలో ఉంది.  పరీక్షిన్మహారాజుకు శుకయోగీంద్రులు భాగవతాన్ని ఉపదేశిస్తున్నారు.  యోగసాధన చేసే విధానం గురించీ ముక్తిని గురించీ ఆయన రాజుకు వివరించిన తరువాత సృష్టిక్రమం గురించీ, విష్ణుభక్తులు ఆ సృష్టి నుండి ముక్తులై  పరమాత్మస్వరూపుడైన విష్ణువులో లీన మయ్యే విధానం గురించీ వివరిస్తున్నారు.

ఇక్కడ  'ఇంకొక విశేషం ఉంది'  అని చెప్పారు గదా? ఆ విశేషం యేమిటో చూద్దాం .  యోగాభ్యాసం చక్కగా చేసి అది ఫలించి సిధ్ధి పొందినవారు బ్రహ్మలోకం చేరుకుంటారు.  అలా బ్రహ్మలోకం చేరిన వారు లోకానుగ్రహం చేయటం కోసం శరీరధారణ చేసి భూమిమీదికి అప్పుడప్పుడు వస్తారు కాని వారికి యేవిధమైన కర్మబంధాలూ ఉండవు. కాబట్టి వారిని ప్రకృతి శరీరధారణకు నిర్బంధించలేదు.  కానీ  యీ సిధ్ధులకు తమదైన ఉనికి ఉండనే ఉంటుంది.  కాబట్టి అది కైవల్యపదం కాదు.  అయితే అటువంటి  కైవల్యం అనబడే పరమాత్మునిలో లీన మయ్యే విశేషమైన వ్యవహారం కూడా ఉంది సుమా కేవలం బ్రహ్మలోకం పొందటమే అత్యున్నతమైన స్థాయి కాదు అని శుక మహర్షుల వారు పరీక్షిత్తుతో అంటున్నారు. అదీ విషయం క్లుప్తంగా.

మూలము: పుణ్యాతిరేకంబున బ్రహ్మలోకగతు లైనవారు కల్పాంతరంబునం బుణ్యతారతమ్యంబుల నధికారవిశేషంబు నొందువార లగుదురు.

వివరణము:  పుణ్యాతిరేకం అంటే అమితమైన పుణ్యం అని అర్థం. పుణ్యతారతమ్యం అంటే ఆ అమితమైన పుణ్యంలో కూడ యెంతో కొంత తర-తమ బేధం ఉంటుంది కదా. ఈ తర, తమ అనేవి ఇంగ్లీషులో  more and most  అనే comparisons.  ఈ లోకంలో మనుష్యుల అర్హతలను బట్టి యెలాగైతే అధికారాలను అప్పగిస్తామూ బ్రహ్మలోకంలో అయినా అలాగే జరుగుతుంది.   బ్రహ్మలోకం చేరుకున్నఈ గొప్ప గొప్ప పుణ్యాత్ములు  అప్పుడు నడుస్తున్న కల్పం పూర్తి కాగానే వారి పుణ్యం యొక్క కొలతను బట్టి తగిన అధికార పదవులు పొందుతారు.  ఇక్కడ కొంతమందికి కల్పం అంటే యెంతకాలం అనే ప్రశ్న రావచ్చును,  కల్పం  అనేది  భారతీయ మైన  కాలమానంలో  ఒక అతిదీర్ఘ మైన సమయం. మనం  ప్రస్తుతం కలి యుగం  నడుస్తోందని చెప్పుకుంటున్నాం  కదా. కృత, త్రేత, ద్వాపర  కలి యుగాలని  యుగాలు నాలుగు. వాటి  ప్రమాణాలు చూడండి.

కృతయుగం    17,28,000 సంవత్సరాలు
త్రేతాయుగం    12,96,000 సంవత్సరాలు
ద్వాపరయుగం   8,64,000 సంవత్సరాలు
కలియుగం      4,32,000 సంవత్సరాలు

నాలుగు  యుగాలనూ‌ కలిపి ఒక మహాయుగం‌ అంటారు. మెత్తం 43,20,000 సంవత్సరా లన్నమాట.  మహాయుగాన్ని  దివ్యయగం అని కూడా అంటారు. ఇలాంటి మహాయుగాలు 1000 గడిస్తే  అది బ్రహ్మకు  ఒక పగలు. దానినే సర్గము అనీ‌ కల్పము అనీ‌ అంటారు. మరొక 1000 మహాయుగాలు బ్రహ్మకు రాత్రి సమయం. దానినే  ప్రళయం  అంటారు. ఇలా బ్రహ్మకు  ఒక రోజు పూర్తవుతుంది. ఇలాంటి రోజులు  360 గడిస్తే అది బ్రహ్మకు  ఒక సంవత్సరం. బ్రహ్మగారి ఆయుర్దాయం అటువంటి 100 సంవత్సరాలు.  ప్రస్తుతం ఉన్న బ్రహ్మగారికి 50 యేళ్ళు  దాటాయండి, 51వ సంవత్సరంలో  శ్వేతవరాహకల్పం నడుస్తున్నది. ఇప్పుడు కల్పం‌  అనే దాని యొక్క  ప్రమాణం 432,00,00 ,000 సంవత్సరాలు అని  తెలుస్తున్నది  కదా.
 
ఇది నిస్సందేహంగా చాలా పెద్ద కాలమే.  దీన్ని బట్టి అర్థమయ్యేది యేమిటంటే,  యోగాభ్యాసం చక్కగా చేసి జితేంద్రియులైన వారు బోలెడన్ని పుణ్య కార్యాలు చేస్తారు.  వాటి సహాయంతో వారికి బ్రహ్మలోకంలో ఉండే అదృష్టం పడుతుంది.  అదీ యెంతో దీర్ఘకాలం పాటు. ప్రస్తుతం నడుస్తున్న కల్పం ఇంకా యెంత కాలం మిగులి ఉందో అన్నాళ్ళూ వాళ్ళు బ్రహ్మగారి లోకంలో సుఖంగా ఉంటారన్నమాట.  ఆ తరువాత వారికి వారి యోగ్యతల ననుసరించి మంచిమంచి పదవులు వస్తాయి.

ఈ విషయాన్ని శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణభగవానుడు (అక్షరపరబ్రహ్మ యోగంలో)   ఓ అర్జునా బ్రహ్మలోకంతో సహా అన్నిలోకాలూ, యేది పొందినా, అది పునర్జన్మనిచ్చేదే. నన్ను పొందిన వాళ్ళకు మాత్రం  పునర్జన్మ అనేది ఉండదు అని చెప్పి స్పష్టం చేసాడు.
     ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోऽర్జున
    మాముపేత్య తు కౌన్తేయ పునర్జన్మ న విద్యతే

కాబట్టి బ్రహ్మలోకం పొందిన మహాయోగులకూ తిరిగి కల్పావసానం కాగానే ఒక జన్మ అనేది కలుగుతుంది.  అయితే వారి పుణ్యఫలానుసారంగా మంచి అధికారయుతమైన జన్మ దొరుకుతుంది.