25, జులై 2012, బుధవారం

పరమపదసోపానపఠము పరచి నామండీ

పరమపదసోపానపఠము  పరచి నామండీ
పరమపురుషుని  చేరుకొనగ వచ్చి యాడండీ

రక్తి గొలిపు ఆట మీరు రండి ఆడండీ
శక్తియుక్తి పరుల కాట చాల సులువండీ
భక్తివైరాగ్యాలు చేతి పాచికలు  సుండీ
ముక్తి  దొరకు దాక ఆట ముందుకే నండీ

అరెరే యీ సర్పములకె అదరి పోకండి
కరచిన ఒక పాము జావ కారి పోకండీ
వెరువకుండ మీరు ముందుకు తరలి  రారండీ
పరమపురుషు చేరు దాక పట్టు బట్టండీ

ముచ్చటైన  ఆట కొరకు ముందు కురకండీ
నిచ్చెనలు మీ రాక కివే నిలచి యున్నాయి
వచ్చి ఆడి  పైకి  పైకి పరుగు తీయండీ
అచ్చమైన పరమపదము నంది మురియండీ

పాము లరిషడ్వర్గములను భావ ముంచండీ
నోము ఫలము లందివచ్చు నిచ్చెనలండీ
భూమి సోపానపఠము బుధ్ధి నెరుగండీ
స్వామి కడకు చేరు దాక సాగిపోరండీ

పరమపురుషుడు రాముడని మరువబోకండీ
హరిని చేరు దాక ఆట నాడవలె నండీ
పరమసులభమైన ఆట వచ్చి ఆడండీ
పరబ్రహ్మపదము చేర త్వరపడాలండీ



ఈ రోజు (7/25/2012) కంది శంకరయ్యగారి బ్లాగు శంకారాభరణం లో పరమపదసోపాన పఠం బొమ్మ యిచ్చి పద్యాలు వ్రాయమని అడిగారు.  నా తోచిన పద్యాలు  వ్రాసాను ఆ బ్లాగులో.   వాటిని శ్యామలీయం బ్లాగులో కూడా ఉంచితే బాగుంటుందని అనిపించింది. కాని తీరా టపా మొదలు పెడుతుండగా పాటగా వచ్చింది. అందు చేత ముందు పాట వ్రాసి క్రింది ఉదయం వ్రాసిన పద్యాలు కూడా ఉంచుతున్నాను.

కం. అరిషడ్వర్గము పాములు
నరుదగు నధ్యాత్మసాధనలు నిచ్చెనలున్
మరి వైరాగ్యము భక్తియు
సరిపడు పావులును నాట జరిగెడు నుర్విన్

కం. నా పావులు మంచివయా
నాపైనను నాకు కలదు నమ్మకము హరీ
నీపై నాన పరమపద
సోపానపఠంబు మీద చూపెద ప్రజ్ఞన్

కం. ఈ నిచ్చెనలును పాములు
నే నెక్కుట దిగుట క్రొత్త యే పరమాత్మా
నా నిశ్ఛయమే పై బరి
లో నుండిన నిన్ను చేర్చు లోలాక్ష హరీ!

కం. నే నిను చేరుటయును మరి
నీ నిశ్చయమనుచు లోన నెరుగుదు గానన్
మానక పాముల నణచుచు
చేనందుచు నిచ్చెనలను చేరెదను హరీ!

కం. ఈ నిచ్చెనలును పాముల
తో నీ పటమెల్ల మాయ తొలగి నశించున్
గాన మహాత్మా చేరక
మానెదనే నిన్ను బుధ్ధిమంతుడ నగుచున్