23, జులై 2012, సోమవారం

తన్ను తా నెరుగడు తా నేమి యెరుగునో


తన్ను తా నెరుగడు తా నేమి యెరుగునో
మిన్నుముట్ట వాదించు చున్నాడు రామ

చిలుకపలుకుల వలె చింతన పొంతన
తలపోయక శాస్త్రములలోని విషయాలు
పలుమారు వల్లించి  ఫలమేమి పొందేను
తిలకించి చూడడే దివ్యతత్వము నిజము

ఈశ్వరు డెవడంటె యేమేమొ చెబుతాడు 
ఈశ్వారాంకితముగా నేపనియు చేయడు
ఈశ్వరా  నీవె నా కింక దిక్కని యంటాడు
ఈశ్వరు నెరుగడే హృద్దేశమున నిజము

విడిచి పెట్టడు గాని విషయభోగములను
అడుగుచున్నాడు సిగ్గు విడచి మోక్షంబును
కడు దుర్లభ ఫలము కాంక్షించు చున్నాడు
జడుడు వాడెవ్వడో కాడు  వీడే నిజము

2 కామెంట్‌లు:

  1. విడిచి పెట్టడు గాని విషయభోగాలను
    అడుగుతాడు సిగ్గు విడచి మోక్షంబును
    కడు దుర్లభప ఫలము కాశించు చున్నాడు

    జడుడు వాడెవ్వడో కాడు వీడే నిజము

    నిజం చెప్పేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శర్మగారూ, అబధ్ధాలు చెప్పదలుచుకుంటే ఈ శ్యామలీయం బ్లాగు వ్రాయ నవుసరం లేదు కదండీ.

      తొలగించండి

కం. పలుకుడు పలికెడు నెడలను
పలుకుల విలువలకు మురిసి పలికెడు కళలో
నిల గడుగడు నిపుణులు తగ
పలికెడు తెఱగిటుల ననుచు పలుకగ విబుధుల్

(తెలుగులో వ్రాయటానికి అవసరమైతే లేఖిని సహాయం తీసుకోండి. Windows వాడేవారు ప్రముఖ్ IME డౌన్ లోడ్ చేసుకోవచ్చును )

గమనిక: అమోదించబడిన వ్యాఖ్యలు మాత్రమే ప్రచురించబడతాయి. తమ పరిచయం పొందుపరచకపోతే అజ్ఞాతల వ్యాఖ్యలు వెంటనే బుట్టదాఖలు అవుతాయి.