22, జులై 2012, ఆదివారం

సుఖమయ మీ సంసారము నీ‌చూపు సోకిన

సుఖమయ మీ సంసారము నీ చూపు సోకిన
దుఃఖముల పుట్ట యిదే దొరుకక నీ కరుణ

నేరుపు మీరగ విద్యలు నేర్వక రాణించు వారు
తీరుగ విద్యలు నేరిచి తిప్పలు పడు వారు
ధారుణిపై గలరెందరొ దాని వెనుక కారణమన
వారిపై నీ చల్లని చూపులు వాలుటలో బేధమే

నిరక్షరకుక్షు లయ్యును నీపై గురి కల వారు
గురుబోధను బడసి కూడ గురి నిలువని వారు
ధరణిపైన గలరెందరొ దాని వెనుక కారణమన
వారిపై నీ చల్లని చూపులు వాలుటలో బేధమే

అనుపమాన లోకనాథ యనవద్య పామరుడను
నిను నమ్మియుంటి గాని నేనే మెఱుగుదును
మనసున నీ నామమునే మానక స్మరించువాడను
కనుక నీ చల్లని చూపులు కరుణించుము రామ


4 కామెంట్‌లు:

  1. నిరక్షర + కుక్షు లయ్యు
    అవునా అండీ!
    అనవరతము బ్రోవుమని మనవి చేయుచుంటిని..
    నా ప్రార్ధన కూడా ఇలాగే ఉంటుంది. అండీ!
    కానీ మనసు విషయ వాంచల పై తప్ప పరమాత్మ పై నిలకడ గా ఉండదు.
    ప్రయత్నంలో పట్టు సాధించడానికి కృషి కూడా చేయాలి కదా! చేయలేను. :(

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మోక్షభూమికలలో మొట్టమొదటిది శుబేఛ్ఛ. అంటే శుభం కలగాలనే కోరిక. ఇక్కడ శుభం అంటే మోక్షమే. మిగతా మోక్షభూమికలకు అధికారం సిధ్ధించటానికోసం ముందు శుభేఛ్ఛ కలగాలి గదా. అది కలిగిన పిమ్మట తక్కిన ఒక్కొక్క భూమికకూ క్రమంగా అధికారం కలుగుతుంది కాని యీ కార్యక్రమం యెంత మెల్లగా జరుగుతుంది యెంత వేగంగా జరుగుతుంది అనేది మనం చేసే సాధన పైన ఆధారపడి ఉంటుంది. అది సాధకుల యొక్క సాధనాక్రమం పైనా సాధనాతీవ్రత పైనా ఆధారపడిన విషయాలు. ఒక్కొకసారి హఠాత్తుగా తీవ్రమైన వైరాగ్యస్థితి కలిగి అతి సద్యోముక్తికి దారి తీయవచ్చు కాని అది చాలా అరుదు. అదంతా వదలి మనం సరైన దిశలోనే ఉన్నామా చేతనైన సాధన చేస్తున్నామా అనేది ముఖ్యం అని గమనించాలి.

      తొలగించండి
    2. అక్షరం ముక్క కూడా రాని యోగసిధ్ధులు కూడా ఉంటారు. విషయలోలుపులైన ఉద్దండ పండితులూ ఉంటారు. నిస్సంగత్వం సిధ్దించాలంటే వైరాగ్యం ముఖ్యం కాని, పాండిత్యం కాదు గదా,

      తొలగించండి
  2. అనవరతము బ్రోవుమని మనవి చేయుచుంటిని

    ననుబ్రోవమని చెప్పవే సీతమ్మతల్లీ! అన్నాడు కదండీ రామదాసు గారు, మనకూ అదే శరణ్యం

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.