23, జులై 2012, సోమవారం

మహాభాగవతాంతర్గతసృష్టిక్రమం వివరణము - 5

(వివరణము యొక్క లంకెలతో సహా సృష్టిక్రమం పూర్తి పాఠం ఇక్కడ చూడండి.)

మూలము: మహత్తత్త్వాంశంబున నహంకారం బగు.

వివరణము: అహంకారం అనేది సమిష్టి అంతఃకరణం యొక్క బేధము.  ఈ అంహంకారానికి మూలమయిన మహత్తత్త్వాన్ని బుధ్ధి అని కుడా వ్యవహరిస్తారు. బ్రహ్మాండ పిండాండాలకు అబేధము. అంటే విశ్వం అనేది మానవ శరీరంలొ ఆరోపణం చేసి చూసినప్పుడు మహత్తత్తమే బుధ్ధి. ఈ బుధ్ధినుండే 'నేను' అనేది ఒక అభిజ్ఞ యేర్పడుతుంది. అదే అహంకారము. ఇలా పిండాండంలో నిరూపణము.  బ్రహ్మాండ పరంగా, పరమాత్మయొక్క వ్యక్తస్వరూపమైనది మహత్తత్త్వం అయితే దానికి అవ్వలిముఖం అవ్యక్తపురుషుడు అంటే మూలప్రకృతిగా భాసిస్తున్న పరమాత్మ. నాణానికి ఇవ్వలిముఖంలాగా ఉండేది నామ రూపాత్మకమైన ప్రకృతి. ఈశ్వరాధిష్టితం బైన  ప్రకృతి అని పూర్వవాక్యంలో చదువుకున్నది మూలప్రకృతి అని గ్రహించండి.

సాంఖ్యకారికలలోని క్రింది శ్లోకాన్ని చూడండి

మూలప్రకృతిరవికృతిర్మహదాద్యాః ప్రకృతివికృతియః సప్త
షోడశకస్తు వికారో న ప్రకృతిర్నవికృతిః పురుషః

మహత్తత్త్వమూ, అహంకారమూ, పంచతన్మాత్రలూ కలిపి మొత్తం యీ ఏడూ ప్రకృతి, వికృతీ కూడా. ఇవి పంచమహాభూతాలకు (వ్యుత్పత్తి)కారణాలు కావటం చేత ప్రకృతి అనీ, మూలప్రకృతికి (పరిణామ)కార్యాలు కావటం వలని వికృతి అనీ తెలుస్తున్నది.   (అవ్యక్త)పురుషుడు అంటే పరమాత్మ. అతడు దేనికీ చెందిన వాదు కాడు. దేనికీ కారణమూ కాడు కార్యమూ కాడు.

ఈ మూలప్రకృతి మరియు ప్రపంచకారణమయిన జడప్రకృతులలో మహత్తత్త్వంనుండి జడప్రకృతి విస్తరించటం మొదలవుతుంది. మొట్టమొదటి విస్తరణతత్వమే అహంకారం అని పిలుస్తారు. అంటే ఇక్కడనుండి నామరూపాలతో కూడిన వ్యవహారం మొదలు అర్ధం.


1 కామెంట్‌:

  1. ఈ మూలప్రకృతి మరియు ప్రపంచకారణమయిన జడప్రకృతులలో మహత్తత్త్వంనుండి జడప్రకృతి విస్తరించటం మొదలవుతుంది. మొట్టమొదటి విస్తరణతత్వమే అహంకారం అని పిలుస్తారు. అంటే ఇక్కడనుండి నామరూపాలతో కూడిన వ్యవహారం మొదలు అర్ధం.

    దయ చేసి మరి కొంచం వివరించండి, అర్ధం చెసుకోలేకపోయా.

    రిప్లయితొలగించండి

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.