30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అలుక

నీవు మోసగాడివని నింద వేశానా
నోటికొచ్చినట్లు నేను నిన్ను తిట్టానా

తోలు బొమ్మల లోన తేపతేపకు దూర్చి
నేలమీద యెగిరించి నువ్వు నవ్వుతావు
అసలు విషయ మేమిటని అడిగానంతే
ఇంత చిన్న మాటకే యెందుకు నీ కలుక

ముమ్మూర్తుల నాలాగే నిన్ను చేశానని
నమ్మబలికి చివుకు బొమ్మ నంటగట్టుతావు
యెందుకిలా చేస్తావని అడిగానంతే
ఇంత చిన్న మాటకే యెందుకు నీ కలుక

నువ్వు నేను ఒకటే నీ ఆనందం కోసం
నవ్వుతూ పదేపదే నే నాడుతాను
కొంటె ప్రశ్నలడిగానని కోపమొచ్చిందా
రెండు చిన్నమాటలంటె యెందుకు నీ కలుక

కల్ల

ఇటు వచ్చుట కల్ల
అటు పోవుట కల్ల
ఇటూ అటూ తిరుగుతుంటా వనేది కల్ల

ఇటనున్నది  నీవే
అటనున్నది  నీవే
ఇటూ అటూ ఉన్న నీకు తిరుగుడు కల్ల

ఈ దేహము నీవా
ఈ దేహము నీదా
ఈ దేహతాదాత్మ్యమే తెలియుము కల్ల

చదివి యెరుగుట కల్ల
తిరిగి తెలియుట కల్ల
ఉపాయముల చేత బ్రహ్మ మెరుగుట కల్ల

నీవు బ్రహ్మము కన్న
వేరు వేరనుచున్న
జాణ ప్రకృతి టక్కులన్ని సర్వము కల్ల

29, సెప్టెంబర్ 2011, గురువారం

సుఖం

తిరుగలిలో పడిన గింజకు
తిరుగుటలో సుఖ మున్నదా
నలుగుటలో సుఖమున్నదా
అని యడిగే నోరున్నదా

చీకటి వెలుగుల లోకమనే
తిరుగలి లో పడిన జీవికి
మెలకువలో సుఖమున్నదా
నిద్దురలో సుఖమున్నదా

పాపపుణ్యముల లోకమనే
తిరుగలి లో పడిన జీవికి
ఉదరముచే సుఖమున్నదా
హృదయముచే సుఖమున్నదా

ఆశనిరాశల లోకమనే
తిరుగలి లో పడిన జీవికి
చేతికంది సుఖమున్నదా
చేయిజారి సుఖమున్నదా

చావు బ్రతుకుల లోకమనే
తిరుగలి లో పడిన జీవికి
వచ్చుటలో సుఖమున్నదా
చచ్చుటలో సుఖమున్నదా

28, సెప్టెంబర్ 2011, బుధవారం

తెర

నీకూ నాకూ నడుమ తెర ఇది
నీవే వేసిన మాయ తెర

తెలియ రానిదీ గడుసు తెర ఇది
తెలివిని మింగే రొంగ తెర

కోపతాపముల కుళ్ళు తెర ఇది
పాపకార్యముల పాడు తెర

మిధ్యాహంకృతి వికృత తెర ఇది
విద్యాగర్వపు వింత తెర

మమతల రూపపు మంచు తెర ఇది
కుమతిని చేసి ముంచు తెర

విజ్ఞానము చెడగొట్టుతెర ఇది
అజ్ఞానము తలకట్టు తెర

అసలెందుకు మన మధ్య తెర ఇది
విసిరివేయ మని వేడెదరా

నీడ

నీడ యెన్నడైనా నిలబడి నడచేనా
నీ నీడను గానా నే నిలబడి లేనా

నీడ యెన్నడైనా నవ్వేనా తుళ్ళేనా
నీ నీడను గానా నేను నవ్వనేర్వనా

నీడ యెన్నడైనా భ్రమపడి తా వగచేనా
నీ నీడను గానా నే దినమూ భ్రమపడనా

నీడ యెన్నడైనా రోషగించి యెగిరేనా
నీ నీడను గానా నేను కోపనుడగానా

నీడ యెన్నడైనా దైన్యము చెందేనా
నీ నీడను గానా నే దీనుడనై లేనా

నీడ యెన్నడైనా నేనున్నా ననుకొనునా
నీ నీడను గానా నేను నేనని అనుకొననా

27, సెప్టెంబర్ 2011, మంగళవారం

ఆట

ఎన్ని సార్లు తెలిపావో నీవు నేను ఒకటని
అన్ని సార్లు మరిచాను అది ఒకటే నిజమని

ఎందుకు ప్రతి సారి ఇలా వేషం కట్టిస్తావు
ఎందుకు ఈ మరపు కూడ తలలో దట్టిస్తావు
వందసార్లు నువ్వు బుధ్ది చెప్పి పంపినా సరే
చిందరవందర చేసేస్తుంది లోకం నీ స్మృతిని

నీ కేమో ఇది లీల ఐతే కావచ్చు కాని
నా కేమో ఇది నిత్యం నరకంగా ఉంది
నీ కేమో నేను కళ్ళ ఎదుటే ఉన్నాను కాని
నా కేమో నువ్వు చాల దూరమై నటులుంది

ఈ ఆట ఎందుకని అడగలేను  నిన్ను
ఈ ఆట ఎన్నటికీ మానబోవు నువ్వు
నీ ఆన స్వస్వరూప జ్ఞానమొక్కటివ్వు
నీ ఆట హాయిగా కొనసాగనివ్వు

21, సెప్టెంబర్ 2011, బుధవారం

తపస్సు

ఎక్కడికో పోయి తపస్సు చేసుకోవాలని యెప్పుడూ అనుకోలేదు
ఎక్కడికి పోయి కళ్ళూ ముక్కూ మూసుకోవడం నిరుపయోగం
బంధుమిత్రుల నుండి యెక్కడికైనా పారిపోవచ్చునేమో
బంధించి బాధించే పంచేంద్రియాలనుండి పారిపోగలనా
ఈ జన్మ చాలించి నేనెగిరి చక్కాపోయినా యివి మాత్రం
పై జన్మలోనూ నా మీద పడి పెత్తనం చేస్తాయి వదలక
ఈ మాయా ప్రపంచం నిజానికి ఒక పెద్ద చిలకల బోను
యేమూలకు పోయి కూర్చున్నా పంజరంలో చిలక బందీయే
ఆ మాత్రానికి అక్కడికీ ఇక్కడికీ పరుగెత్తి సాధించేది లేదు
యేమీ లాభంలేదు గాభరా పడినా యెగిరి గంతులేసినా
ఈ యింద్రియాలని  చితగ్గొట్టి యేమీ కార్యం లేదు యెప్పటికీ
మాయల దెయ్యంలాంటి మనస్సును లొంగదీసుకోవాలి తప్పక
అది కాస్తా దగ్ధబీజం లాగా మాడేటట్లు చెయ్యటమే తపస్సు
అదేదో అడివికిపోయి కాదు అందరి మధ్యనుండే చేయవచ్చు

19, సెప్టెంబర్ 2011, సోమవారం

రాను రాను

రాను రాను నేనూ నీలా తయారవుతున్నా
జ్ఞానమో అజ్ఞానమో నేను జడుణ్ణవుతున్నా

నాదనుకో దగ్గదేదీ నాకగుపడటంలేదు
ఏదీ ఉధ్ధరించదని తెలిసొచ్చిన క్షణంనుండి
ఈ దేహంతో సహా యేదీ నాది కానే కాదు
నాదంటే నాది  నా అస్తిత్వం మాత్రమే

నా లోపల యీ సత్యం మారుమ్రోగుతున్నది
నా చుట్టూ యీ ప్రకృతి నాట్యం చేస్తున్నది
నా ఉనికిని యీ కాలం నిత్యం ప్రశ్నిస్తున్నది
నా అస్తిత్వం నువ్వే సదా నువ్వు మాత్రమే

మనిద్దరం బింబ ప్రతిబింబాలమని తెలిసాక
యితర ద్వంద్వాలన్నీ యిట్టే మాయమయ్యాయి
నేనూ నీవూ ఒకటని నేను తెలుసుకున్నాక
పోనీ చేద్దామన్నాసరే పనే లేక పోయింది

16, సెప్టెంబర్ 2011, శుక్రవారం

వర్తమానం

నాకు గుర్తు కూడా లేని గతం నన్నెందుకు భయపెట్టాలి
నాకేమీ తెలియరాని భవిష్యత్తుకు నేనెందుకు భయపడాలి
నా వర్తమానం మాత్రం నమ్మకంగా నిన్నల్లుకుని నిలబడింది
నా భయమల్లా దాని ధృఢత్వం నిజంగా నమ్మదగ్గదేనా అని
నా భయమల్లా నిన్ను కాలం నానుండి లాక్కోదు కదా అని
నీ దగ్గర యే భయానికీ నిలువ నీడ లేదని విన్నాను
నీ దగ్గర నిలబడి కూడా యెందుకో నేను భయపడుతున్నాను
నా దగ్గర నుండి నీవు నాలుగడుగులటు వేసేసావో
నా దయిన వర్తమానం కూడా నాది కాకుండా పోతుంది
అసలు నువ్వు కదలవద్దు అలా జరుగనియ్య వద్దు
నిన్ను నాతోనే నేమ నిశ్చలంగా కట్టేసుకుంటే
నీ స్వరూపమే యైన కాలం నిలబడి పోతుంది కదా
అప్పుడింక నీకూ నాకూ అస్తమానం వర్తమానమే

14, సెప్టెంబర్ 2011, బుధవారం

తోట

తోట చూపుతానని తీసుకు వచ్చావు
తోటలో నన్ను వదలి తరలి పోయావు

విరి బాలలతోటి నేను ఊసులాడు తుంటే
చిరునవ్వులతో నువ్వు చూస్తూ ఉన్నావు
ఆటలలో నేనేమో అదమరచి ఉంటే
మాటైన చెప్పకుండ మాయమయ్యావు

యేవేవో పళ్ళచెట్ల కెగ బాకుతు నేనుంటే
నీవేమో నా అల్లరి నిలబడి చూస్తున్నావు
తరుశాఖలమీద నేను తిరుగుతున్న వేళ
తరుణం కనిపెట్టి భలే తప్పుకున్నావు

వింతవింతల సృష్టి వినోదాల నెన్నిటినో
చెంతనే ఉండి నీవు చూపిస్తూ ఉన్నావు
నన్ను నేను మరచి తన్మయత్వంలో  ములిగితే
నన్ను వదలి మెల్లగా నడచిపోయావు

12, సెప్టెంబర్ 2011, సోమవారం

బండి


ఐదు గుఱ్ఱాల బండి
అవకతవక బండి
అతికష్టం మీద నేను
తోలు తున్న బండి

అప్పుడప్పుడీ బండి
విరిగి పోతుందండి
అప్పుడేమొ కొత్తబండి
చేతికొస్తుందండి

గుఱ్ఱాలైతె అవేలెండి
భలేగొప్ప బండి
దీన్ని తోలుతుంటె భలే
మజా వస్తుందండి

నేను బండివాడి నండి
యజమాని వేరండి
ఆయనకై వెతుక్కుంటు
బండి తిరుగుతోందండి

ఆనవాళ్ళు తెలుసండి
నేను చూడలేదండి
వెతుక్కుంటు లోకాలన్ని
తిరుగుతున్నా మండి

భలేమొండి గుఱ్ఱాలండి
చెప్పినట్లు వినవండి
నాకే దారి తెలియదని
వాటి కులాసా లెండి

తోలకుంటె యెట్లాగండి
తప్పక చేరాలండి
పెద్దాయన నాకోసం
కాచుకు నున్నాడండి

నీ లీల

అద్దంలో నా బొమ్మ నాకు బాగానే కనిపిస్తోంది
ఇందులో నా లీల అంటూ యేమన్నా ఉందా
నీ విశ్వదర్పణంలో నువ్వు ప్రతిఫలిస్తుంటే
అదేదో నీ లీల అనడం యెందుకో చెప్పు?

విశ్వాన్ని నువ్వు సృష్టించడమే లీల అనుకుందామా
ఈ లీలని నువ్వు యెవరికోసం చేస్తున్నట్లు చెప్పు
నువ్వు తప్ప వేరే యెవరూ నాకు కనబడటం లేదే
సృష్టించడం నీ స్వభావమైతే  లీల యెలా అవుతుంది

అందుకే నిన్ను నీవు  నన్నుగా కల్పిచుకొన్నావా
అందంగా విశ్వవినోద క్రీడను మొదలు పెట్టావా
ఇప్పుడర్ధమౌ తున్నది నీ లీల యేమిటో నాకు
ఇన్నాళ్ళూ నేనంటూ ఉన్నాననుకుంటున్నాను

11, సెప్టెంబర్ 2011, ఆదివారం

పూజ

తొలుత నీవు మహద్రూప కలిగించితి వాకసమును
వెలుగు లీను తారకలను విరజిమ్మితి వాకసమున
ధగధగల జాబిల్లిని తగిలించితి వాకసమున
వెలుగుముద్ద సూర్యుడిని వెలయించితి వాకసమున
గ్రహమండలి నతనిచుట్టు కల్పించితి వాకసమున
వాటిలోన వసుధ నీ నివాసమాయె నాకసమున

వివధ నదులు సాగరములు వెలయింవితి వాదరమున
భూధరముల పంక్తులు భువి వెలయించితి వాదరమున
మృగజాతులు వనసీమలు వెలయించితి వాదరమున
మృదులలతావితానములు వెలయించితి వాదరమున
పూవులు తుమ్మెదలు పుడమి వెలయించితి వాదరమున
బిలబిలాక్షి కువకువలను వెలయించితి వాదరమున

అందమైన పుడమిని నీ వడుగిడితివి నా రూపున
యగయుగాలుగా నిచ్చట నిలచినావు నా రూపున
జగము నేలుకొను చుంటివి సంతసమున నా రూపున
నీవే నేను నేనే నీవై యున్న ఘనుడ నారూపున
నున్న నిన్ను కొలుచు ప్రకృతి నిలచిపొమ్ము నారూపున
ముందు ముందు కూడ నీవు నిలచిపొమ్ము నారూపున

మానసమే మహితపీఠ మగునుగాక నీ పూజకు
మనసుచేయు ఊహలెల్ల మంత్రములే నీ పూజకు
కనుల వెలుగు లనవరతము హారతులగు నీ పూజకు
వివధకర్మ ఫలము లెల్ల నైవేద్యము నీ పూజకు
నడకలెల్ల నిరంతరము నాట్యసేవ నీ పూజకు
గాన సేవ రసనా విన్యాస మెల్ల నీ పూజకు

10, సెప్టెంబర్ 2011, శనివారం

వెడలిపోదువా

ఈ బడలిన యొడలినుండి యింక వెడలిపోదువా
రేబవళ్ళు నీ తలపే మరి రేగుచున్నదీ మేన

పిలచితినో లేదో నా బీద యింటిలో నీవు
కొలువైతివి రేపొమాపొ కదలిపోవనా

పదిలముగా నిన్నునిలిపి పరవశించిన గుడిని
వదిలిపోవ నుంటివా వడలినదని సదయ నీవు

యీ నీ గుడి పూజారిని యేమి చేయనుంటివో
పోనీ నీ పూజకునై వేరు గుడిని చూపెదవో

యేల నశ్వరాలయముల జొచ్చి నిన్ను సేవించుట
నీలోకము చేరి సదా నిన్ను గొలుచు కొందునయా

9, సెప్టెంబర్ 2011, శుక్రవారం

మాటలాడనీ

మరల మరల నీతో నన్ను మాటలాడనీ ప్రభూ
మరల మరల ఊసులాడి పులకరించనీ నన్ను

 రేపనునది కలదొ లేదొ నీ పాటలు పాడి మురియ
ఈ పూటే పరవశింవి నిన్ను పాడనీ ప్రభూ

అప్పుడపుడు నిన్నమరచి అపరాదము చేసితనే
తప్పులెన్నక నా చిత్తపు తహతహ నీవెరుగవే

అందరు నీ వారలే అందువు   కానిమ్ము సామి
వందనాలు నీవె దిక్కు మనవి ఆలకించవే

8, సెప్టెంబర్ 2011, గురువారం

బ్రహ్మము

కాదన రాదిది బ్రహ్మము
గగనమె -బ్రహ్మము బ్రహ్మము
పొరబడకుము కా దన్యము
కాదన రాదిది బ్రహ్మము
అన్నిట నాకాశము నిండియున్నది
బ్రహ్మమె అన్నిట నిండియుండునది
గగనము తానే బ్రహ్మము
కాదన రాదిది బ్రహ్మము

కాదన రాదిది బ్రహ్మమ
అనిలమె - బ్రహ్మము బ్రహ్మము
పొరబడకుము కా దన్యము
కాదన రాదిది బ్రహ్మము
అన్నిట అనిలము వ్యాప్తిగల్గినది
బ్రహ్మమె అన్నిట  వ్యాప్తిగల్గినది
అనిలము తానే బ్రహ్మము
కాదన రాదిది బ్రహ్మము

కాదన రాదిది బ్రహ్మము
అనలమె - బ్రహ్మము బ్రహ్మము
పొరబడకుము కా దన్యము
కాదన రాదిది బ్రహ్మము
సర్వగ్రాహియై యుండు ననలము
బ్రహ్మమె సర్వగ్రాహియైనది
అనలము తానే బ్రహ్మము
కాదన రాదిది బ్రహ్మము

కాదన రాదిది బ్రహ్మము
జలమే - బ్రహ్మము బ్రహ్మము
పొరబడకుము కా దన్యము
కాదన రాదిది బ్రహ్మము
జలమన్నిటిని శుధ్ధిచేయును
బ్రహ్మమె సర్వశుధ్ధమైనది
జలమది తానే బ్రహ్మము
కాదన రాదిది బ్రహ్మము

కాదన రాదిది బ్రహ్మము
ధరణియె - బ్రహ్మము బ్రహ్మము
పొరబడకుము కా దన్యము
కాదన రాదిది బ్రహ్మము
ధరణియె స్వయముగ అన్నమైనది
బ్రహ్మమె  అన్నము నమృతమైనది
వసుమతి తానే బ్రహ్మము
కాదన రాదిది బ్రహ్మము

కాదన రాదయా బ్రహ్మము
బ్రహ్మ మెరిగిన వాడే బ్రహ్మము
పొరబడకుము కా దన్యము
రూపము దాల్చిన బ్రహ్మము
పంచభూతములు బ్రహ్మరూపములు
భూతములందున బ్రహ్మ మెరిగిన
మనుజుడు తానే బ్రహ్మము
కాదన రాదయా బ్రహ్మము

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

నేను

నేను నీవను మా ట నేను మానెడుదాక
నేను నీవను రెండు లీనమెట్లగునయ్య

మానెదననుకొందు మానితిననుకొందు
మానితి నేనన్న మాటయే దొసగాయె

నేను నీవను టెల్ల నీ మాయ యేగాని
నేనన లేనని నిజము నిశ్చయమాయె

నేను నేననకుండ నేలపై నొకపూట
యేని గడచుట కల్ల  యేమిచేయుదును

అన్నియెరిగిన వాడ వేమియుపాయంబు
పన్నెదవో దీన బంధో రక్షించవె

1, సెప్టెంబర్ 2011, గురువారం

కాలం

గతం తాలూకు స్మృతులేవీ ఘనమైనవిలా లేవు
వర్తమానం స్మృతిపధంలో ముద్రవేసేదిలా లేదు
ఇక భవిష్యత్తును గూర్చి మాట్లాడుకోకపోవటమే మేలు
ఇట్లాంటి జీవితాలను యెందుకు సృష్టిస్తున్నావు నువ్వు
ఇంకా మాట్లాడితే నేనూ నువ్వూ ఒకటే నంటుంటావు
నీకూ ఇలాగే జరుగుతోందా కాలం నువ్వే నిజంచెప్పు
అయినా నా పిచ్చిగాని నీకు కాలమనే దొకటుందా
నిజంగా నువ్వే కాలస్వరూపుడివికదా

బాగుందని తెలిసేలోగా బాల్యం మాయంచేస్తావు
అందమైన యౌవనాన్ని ఆట్టే రోజు లుండ నీవు
బరువులు బాధ్యతలతో బ్రతుకు చితగ్గొట్టి కొట్టి
త్వరలోనే వార్ధక్యం తలకు చుట్టి నవ్వుతావు
కాలం పేరుతో నువ్వు గారడీ చేస్తున్నావు
నువ్వే నేననే నీకు నెరిసిందా తలకాయ
అయినా నా పిచ్చిగాని నీకు కాలమనే దొకటుందా
నిజంగా నువ్వే కాలస్వరూపుడివికదా

వేనవేల సార్లిలా నాతో వినోదిస్తూనే ఉన్నావు
జన్మలెత్తలేక నాకు చాలా విసుగొస్తోంది సుమా
ఇద్దరం ఒకటేనంటూనే యెంతగా ఆడిస్తున్నావు
ఇదెంత ఘోరమో నీకు తెలిసిరావాలంటే
స్వస్వరూపాన్యత్వ కష్ట సంతాపం రుచిచూడు
కష్టతర దేహాలు కొంతకాలం నువ్వు మోసిచూడు
అయినా నా పిచ్చిగాని నీకు కాలమనే దొకటుందా
నిజంగా నువ్వే కాలస్వరూపుడివికదా