1, సెప్టెంబర్ 2011, గురువారం

కాలం

గతం తాలూకు స్మృతులేవీ ఘనమైనవిలా లేవు
వర్తమానం స్మృతిపధంలో ముద్రవేసేదిలా లేదు
ఇక భవిష్యత్తును గూర్చి మాట్లాడుకోకపోవటమే మేలు
ఇట్లాంటి జీవితాలను యెందుకు సృష్టిస్తున్నావు నువ్వు
ఇంకా మాట్లాడితే నేనూ నువ్వూ ఒకటే నంటుంటావు
నీకూ ఇలాగే జరుగుతోందా కాలం నువ్వే నిజంచెప్పు
అయినా నా పిచ్చిగాని నీకు కాలమనే దొకటుందా
నిజంగా నువ్వే కాలస్వరూపుడివికదా

బాగుందని తెలిసేలోగా బాల్యం మాయంచేస్తావు
అందమైన యౌవనాన్ని ఆట్టే రోజు లుండ నీవు
బరువులు బాధ్యతలతో బ్రతుకు చితగ్గొట్టి కొట్టి
త్వరలోనే వార్ధక్యం తలకు చుట్టి నవ్వుతావు
కాలం పేరుతో నువ్వు గారడీ చేస్తున్నావు
నువ్వే నేననే నీకు నెరిసిందా తలకాయ
అయినా నా పిచ్చిగాని నీకు కాలమనే దొకటుందా
నిజంగా నువ్వే కాలస్వరూపుడివికదా

వేనవేల సార్లిలా నాతో వినోదిస్తూనే ఉన్నావు
జన్మలెత్తలేక నాకు చాలా విసుగొస్తోంది సుమా
ఇద్దరం ఒకటేనంటూనే యెంతగా ఆడిస్తున్నావు
ఇదెంత ఘోరమో నీకు తెలిసిరావాలంటే
స్వస్వరూపాన్యత్వ కష్ట సంతాపం రుచిచూడు
కష్టతర దేహాలు కొంతకాలం నువ్వు మోసిచూడు
అయినా నా పిచ్చిగాని నీకు కాలమనే దొకటుందా
నిజంగా నువ్వే కాలస్వరూపుడివికదా

2 కామెంట్‌లు:

ఆమోదించిన వ్యాఖ్యలే ప్రచురితం అవుతాయి. తరచుగా పరిశీలించటం వీలు కాదు కాబట్టి అప్పుడప్పుడు వ్యాఖ్యలు కనిపించటం ఆలస్యం కావచ్చును. తరచుగా జవాబులు ఇవ్వటం నాకు వీలు కాదు. ఎక్కువగా చర్చించటం అస్సలు వీలుకాదు.